భారతీయ భాషల్లోనే ప్రాథమిక విద్యాభ్యాసం ప్రభుత్వాన్ని కోరుతూ ఆర్‌ఎస్‌ఎస్ తీర్మానం నాగ్‌పుర్: దేశంలో ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలో ...
భారతీయ భాషల్లోనే ప్రాథమిక విద్యాభ్యాసం
ప్రభుత్వాన్ని కోరుతూ ఆర్‌ఎస్‌ఎస్ తీర్మానం
నాగ్‌పుర్: దేశంలో ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలో లేదా ఏదైనా భారతీయ భాషలోనే జరిగేలా ప్రభుత్వం విధానాన్ని రూపొందించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శనివారం కోరింది. అఖిల భారతీయ ప్రతినిధి సభ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన కీలక త్రైవార్షిక సమావేశాల్లో ఈమేరకు తీర్మానం చేసింది. నీట్, యూపీఎస్సీ పరీక్షలను భారతీయ భాషల్లో ప్రారంభించడాన్ని స్వాగతించిన ఆర్‌ఎస్‌ఎస్ - వైద్య, ఇంజినీరింగ్ సహా అన్ని ఉన్నత విద్య ప్రవేశపరీక్షలనూ ప్రాంతీయ భాషల్లో కూడా రాసుకునే వీలు కల్పించాలని సూచించింది. ‘‘భారతీయ భాషలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బోధన మాధ్యమం, పుస్తకాలు కూడా ప్రాంతీయ భాషల్లో దొరకాలి. దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్య స్థానిక భాషల్లోనే సాగేలా తల్లిదండ్రులు తమ మనోభావాలను మార్చుకోవాలి. అన్ని ప్రభుత్వ, న్యాయపరమైన వ్యవహారాలన్నీ ప్రాంతీయభాషల్లో జరిగేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. నియామకాలు, పదోన్నతులు వంటివాటిలోనూ ప్రాధాన్యం ఇవ్వాలి. చాలామేర స్థానిక భాషలు, మాండలికాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. వాటిని కాపాడుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు చేపట్టాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు.. దైనందిన అవసరాల్లోనూ స్వయంసేవక్‌లు సహా, సమాజంలోని అందరూ మాతృభాషలోనే సంభాషించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆయా భాషల్లోని సాహిత్యాన్ని చదవడం, సేకరించే సంప్రదాయాలను పెంపొందించడం చేయాల్సిన అవసరం ఉంది.’’ అని తీర్మానంలో పేర్కొంది. అయితే వైవిధ్యభరితమైన విజ్ఞాన సముపార్జనకు గాను ప్రపంచంలోని ఇతర భాషలను నేర్చుకోవడం పట్ల ఆర్‌ఎస్‌ఎస్ సానుకూలత వ్యక్తం చేసింది. బహుభాషా సంస్తృతి ఉన్న మన దేశంలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ భయ్యాజీ జోషీ ఎన్నిక
ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శిగా భయ్యాజీ జోషి శనివారం తిరిగి ఎన్నికయ్యారు. ఆయన మరో మూడేళ్లపాటు (2021 దాకా) ఈ పదవిలో కొనసాగుతారు. 2009 నుంచీ భయ్యాజీ జోషీ ఈ పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శనివారం జరిగిన ఎన్నికలో భయ్యాజీ జోషి ఎన్నికైనట్లు ఆరెస్సెస్ ప్రచార ప్రముఖ్ మన్మోహన్ వైద్య విలేకరులకు తెలిపారు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments