కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్ప రాజకీయ అవకాశ వాదానికి జీవన రూపం. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నది దాదాపు రెండేళ్లుగా జరుగుత...
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్ప రాజకీయ అవకాశ వాదానికి జీవన రూపం. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నది దాదాపు రెండేళ్లుగా జరుగుతున్న ప్రచారం. ఈ ప్రచారాన్ని ఆయనే స్వయంగా ప్రారంభించాడు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బలపరిచాడు. వచ్చే మే పనె్నండవ తేదీన పోలింగ్ జరుగనున్న కర్నాటక శాసనసభ ఎన్నికలలో‘్భజపా’ విజయం సాధించినట్టయితే యెడియూరప్ప మూడవసారి ముఖ్యమంత్రి కావడం అనివార్యమైన పరిణామమన్నది జరుగుతున్న ప్రచారం. 2008లో ‘్భజపా’ శాసనసభ ఎన్నికలలో గెలిచింది, యెడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ప్రభుత్వ భూములను బొక్కేసిన వారిలో యెడియూరప్ప కుటుంబ సభ్యులు కూడ ఉన్నట్టు కర్నాటక లోకాయుక్త ప్రాథమికంగా నిర్ధారించడంతో 2011 జూలై 31వ తేదీన ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. 2007లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన యెడియూరప్ప ఎనిమిది రోజుల తరువాత రాజీనామా చేయవలసి వచ్చింది. ‘లౌకిక జనతాదళ్’ నాయకుడు, మరో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి గౌడ చేసిన నమ్మక ద్రోహం ఇందుకు కారణం. ‘భాజపా’ 2006లో ఈ ‘లౌకిక జనతాదళ్’తో జట్టుకట్టింది. అంతవరకు కాంగ్రెస్‌తో జతకట్టి ఉండిన ‘లౌకిక జనతాదళ్’ ఫిరాయించింది. ధరమ్‌సింగ్ ముఖ్యమంత్రిత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. కుమారస్వామి మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవగౌడ తనయుడు. ధరమ్‌సింగ్ ప్రభుత్వానికి మద్దతును కొనసాగించాలని దేవగౌడ భావించాడు. అయినప్పటికీ ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో కుమారస్వామి కాంగ్రెస్ కూటమి నుంచి ఫిరాయించాడు. 2006 జనవరి నుంచి ఇరవై నెలలు కుమారస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగాలని, ఆ తరువాత ముఖ్యమంత్రి పదవిని ‘భాజపా’ నాయకుడు యెడియూరప్పకు అప్పగించాలని ఉభయుల మధ్య ఒప్పందం కుదిరింది. ‘ఒప్పందం’ మేరకు 2007 అక్టోబర్‌లో యెడియూరప్పకు పదవిని అప్పగించవలసిన ‘గౌడ’ మాట తప్పాడు, రాజీనామా చేయకుండా మొండికెత్తాడు. ‘భాజపా’ అందువల్ల ప్రభుత్వం నుంచి వైదొలగింది. దాదాపు నెల రోజులపాటు ప్రతిష్టంభన ఏర్పడిన తరువాత యెడియూరప్పను ముఖ్యమంత్రిని చేయడానికి కుమారస్వామి అంగీకరించాడు. కానీ యెడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనిమిది రోజులకే కుమారస్వామి నాయకత్వంలోని లౌకిక జనతా పార్టీ మాట మార్చింది, యెడియూరప్ప ప్రభుత్వం పతనమైంది..
ఇలా మొదటిసారి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు ప్రజల సహానుభూతిని సంపాదించుకున్న యెడియూరప్ప రెండవసారి రాజీనామా చేసినప్పుడు అపకీర్తిని మూటకట్టుకున్నాడు. ఈ అపకీర్తికి కారణం అవినీతి, రాజకీయ అవకాశవాదం. ఆయన ఆర్థికపరమైన అవినీతి ధ్రువపడలేదు, రాజకీయ అవకాశ వాదం ధ్రువపడింది. 2007లో కుమారస్వామి, లౌకిక జనతాదళ్ చేసిన నమ్మకద్రోహం వల్ల వోటర్లలో ‘భాజపా’ పట్ల ఆదరణ పెరిగింది. 2008 శాసనసభ ఎన్నికలలో భాజపా సాధించిన విజయానికి ఇది నేపథ్యం. కానీ ఐదేళ్లలో యెడియూరప్ప ముఖ్యమంత్రిగాను, మాజీ ముఖ్యమంత్రిగాను ప్రవర్తించిన తీరు ‘భాజపా’ను అప్రతిష్టపాలు చేసింది, చులకన చేసింది. 2013లో జరిగిన కర్నాటక శాసనసభ ఎన్నికలలో ‘భాజపా’ ఘోర పరాజయం పాలుకావడానికి ఇదీ కారణం! యెడియూరప్ప ‘‘రానురాను రాగి తేలిపోవడం’ 2008-2013 సంవత్సరాల మధ్య నడచిన చరిత్ర. గాలి ‘బళ్లారి’ సోదరుల ముఠావారు యెడియూరప్ప ప్రభుత్వంపై 2009 నవంబర్‌లో ఎదురు తిరిగారు. గాలి కరుణాకరరెడ్డిని, గాలి జనార్దన రెడ్డిని ‘భాజపా’ అధిష్ఠానం పార్టీనుంచి బహిష్కరించలేదు, అవినీతిపరులైన ఆ ముఠావారిని కాళ్లావేళ్లా పడింది. ‘గాలి’ముఠా వారు శాసనసభ్యులను బస్సులలో, విమానాలలో ఎక్కించుకొని ఇతర రాష్ట్రాలలో ఊరేగించారు. చివరికి యెడియూరప్ప బహిరంగంగా ఏడవలసి వచ్చింది. సంస్థాగత అనుశాసనం అడుగంటిపోయింది. ఇలా ‘అడుగంటి’పోవడంతో యెడియూరప్ప 2010 నవంబర్‌లో స్వయంగా ‘భాజపా’ అధిష్ఠానంపై ఎదురు తిరిగాడు. భూములను బొక్కిన అవినీతి బహిర్గతమైన వెంటనే రాజీనామా చేయాలని ‘అధిష్ఠానం’ జారీచేసిన ఆదేశాన్ని యెడియూరప్ప పాటించలేదు. ‘కర్నాటక ప్రాంగణ అభివృద్ధి మండలి’- కర్నాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డ్- కెఐఏడిబి-వారు యెడియూరప్ప కొడుకులకు, కూతురుకు, చెల్లెళ్లకు, బంధువులకు కోట్ల రూపాయల విలువైన భూములను అక్రమంగా కట్టపెట్టారన్నది ఆరోపణ! ఆ ఆరోపణలను విచారించడం న్యాయస్థానాలు తీర్పులు చెప్పడం వేరే సంగతి. కానీ ఆయన అధిష్ఠానానికి ఎదురు తిరగడం ప్రధానమైన అంశం. ముఖ్యమంత్రి పదవి ఉన్నంతవరకు అనుశాసన నిబద్ధత.. పదవిని వదలమనగానే అనుశాసనానికి స్వస్తి.. ఇదీ రాజకీయ అవకాశవాదం!
ఆరు నెలల తరువాత- లోకాయుక్త అభశంసించాక యెడియూరప్ప వెంటనే గద్దె దిగలేదు. దిగక తప్పని స్థితి ఏర్పడడంతో అధిష్ఠానం నుంచి హిరణ్యాక్ష వరాలను కోరాడు. ఈ ‘వరాల’ను అధిష్ఠానం ప్రసాదించవలసి రావడం సంస్థాగత అనుశాసనానికి మరణ శాసనం. పదవి ఉన్నన్నినాళ్లు ‘రాజకీయ నైతిక నిబద్ధత’, ‘సంస్థాగత అనుశాసనం’ ‘వైయక్తిక హితం కంటె సమష్టి హితానికి ప్రాధాన్యం ఇవ్వడం’, ‘సైద్ధాంతిక నిబద్ధత’వంటి నినాదాలతో జనాన్ని హోరెత్తించిన యెడు యూరప్ప పదవి పోగానే బజారుకెక్కిన తీరు ‘్భజపా’ చరిత్రలో విస్మయకర ఘట్టం! పదవిని వదలినప్పటి నుంచి 2012 నవంబర్‌లో పార్టీని వదలివెళ్లేవరకూ యెడుయూరప్ప ప్రదర్శించిన నిర్లజ్జపూరిత బహిరంగ విన్యాసాలు ఆయన నిజమైన ప్రవృత్తికి చెఱగని నిదర్శనాలు! తన రాజీనామా తరువాత అప్పటి పంచాయతీరాజ్ మంత్రి జగదీశ్ చిమిడి షెట్టర్ ముఖ్యమంత్రి కాకుండా యెడ్‌యూరప్ప నిరోధించగలిగాడు, షెట్టర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే తన ‘అసంఖ్యాక’ అనుచరులతో పార్టీ నుంచి నిష్క్రమిస్తానన్నది ఆయన బెదిరింపు. అందువల్ల సదానంద గౌడ ముఖ్యమంత్రి అయ్యాడు. సరళ స్వభావుడు, వినమ్ర వర్తనుడు అయిన సదానంద గౌడను పదవి నుంచి తొలగించాలని యెడియూరప్ప రెండునెలలు గడవకముందే అధిష్ఠానంపై ఒత్తిడి పెంచాడు. ఈ ఒత్తిడికి సైతం ‘భాజపా’ అధిష్ఠానం లొంగడం ఆయన దురహంకారం మరింత పెరగడానికి దోహదం చేసింది. ఏడాది గడవకముందే సదానంద గౌడ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి రావడంతో ‘భాజపా’ ప్రజలలో మరింత చులకనైంది. 2012 జూలైలో ‘యెడి’వారి మద్దతుతో జగదీశ్ చిమిడి షెట్టర్ ముఖ్యమంత్రి అయ్యాడు. అయినప్పటికీ తనకు దక్కని పదవి పార్టీలో మరెవ్వరికీ దక్కరాదన్న లక్ష్యంతో యెడియూరప్ప మద్యం మత్తెక్కిన మర్కటం వలె చిందులు తొక్కాడు, ‘భాజపా’ కేంద్రీయ నాయకులను బహిరంగంగా నిందించాడు. కాంగ్రెస్‌కు చెందిన సోనియగాంధీని ఆయన పొగడడం పరాకాష్ఠ. చివరికి 2012 నవంబర్‌లో ‘్భజపా’ నుంచి నిష్క్రమించాడు, ‘కర్నాటక జనతాపార్టీ’ని స్థాపించాడు. 2013 శాసనసభ ఎన్నికలలో ‘కర్నాటక జనతాపార్టీ’ నామరూపాలు లేకుండా నశించిపోయింది.
రాజకీయ జీవన శ్వాసను పునరుద్ధరించుకొనడానికి యెడియూరప్ప 2014 జనవరిలో మళ్లీ ‘భాజపా’లో చేరాడు. తనకు పదవులు వద్దన్నాడు, ‘భాజపా’ను మళ్లీ అధికారంలోకి తేవడం తన లక్ష్యమన్నాడు. ‘గుదిబండ’లా యెడియూరప్ప మళ్లీ తగులుకున్నాడన్నది ఈ నాలుగేళ్లలో నిర్ధారణ జరిగిన నిజం. తాను ముఖ్యమంత్రి పదవికి సహజ అభ్యర్థినన్నది 2016నుంచి ఆయన చేస్తున్న ప్రచారం. ‘భాజపా’ అధిష్ఠానం ఆమోదించడమే అంతుపట్టని రహస్యం.
No comments