Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అస్సాం గురించి తెలుసా? - About Assam in Telugu

శేఖర్‌ గుప్త ఒక సుప్రసిద్ధ జర్నలిస్టు. ఆయన చాలా కాలం అసొమ్‌లో విలేఖరిగా పనిచేశారు. ఆయనకు ఢిల్లీ నుంచి అస్సాం కి ట్రాన్స్‌ఫర్‌ అయినప్పుడు ...

Image result for assam
శేఖర్‌ గుప్త ఒక సుప్రసిద్ధ జర్నలిస్టు. ఆయన చాలా కాలం అసొమ్‌లో విలేఖరిగా పనిచేశారు. ఆయనకు ఢిల్లీ నుంచి అస్సాం కి ట్రాన్స్‌ఫర్‌ అయినప్పుడు ఆయనకు పత్రిక ఆఫీసు క్లర్కు ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్లు చేతికిచ్చింది. ఇస్తూ ఇస్తూ ఆమె ఒక ప్రశ్న వేసింది.
"శేఖర్‌....మీకు జీతం ఎలా పంపించాలి. డాలర్ల రూపంలో పంపాలా లేక యెన్‌ల రూపంలో పంపాలా?"
నిర్ఘాంత పోవడం శేఖర్‌ గుప్త వంతైంది. అస్సాం భారతదేశంలో అంతర్భాగం. దేశ పటంలో అస్సాం కనిపిస్తుంది. కానీ దాని గురించి చాలా మందికి తెలియదు. దేశ పటంలోనైతే అస్సాం కనిపిస్తుంది. కానీ జన మానస పటంలో అస్సాం లేనే లేదు. అదేదో విదేశమన్న భావన తెలియకుండానే గూడు కట్టుకుంది.
ఈ ఘటనను శేఖర్‌ అస్సాంపై తాను వ్రాసిన "అస్సాం - ఎ వేలీ డివైడెడ్‌" అన్న పుస్తకం ముందు మాటలో పేర్కొన్నారు.
చాలా రోజుల క్రితం మాట!
చౌధురీ చరణ్‌ సింగ్‌ ఒక సారి కేంద్ర హోం శాఖ సెక్రటరీని పిలిచి "ఇండియా మ్యాపులో ఈ మిజోరాం ఎక్కడుందో కాస్త చూపించు" అని అడిగారట.
చరణ్‌ సింగ్‌ అంటే ఆషామాషీ వ్యక్తి కాదు. ఆయన దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. 1977 ప్రాంతంలో దేశానికి హోం మంత్రిగా పనిచేశారు. ఆయన లోక్‌దళ్‌ అనే పార్టీకి అధ్యక్షులుగానూ, దేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. 1980 ప్రాంతంలో 28 రోజులు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే ఆయన పార్లమెంటులో తన మెజారిటీ నిరూపించుకోకుండానే రాజీనామా చేశారు. అంతే కాదు. చరణ్‌ సింగ్‌ రాజకీయంగా ఏనాడూ ఓటమి చెందని అరుదైన రాజకీయ వేత్త. అటల్‌బిహారీ వాజ్‌పేయీ అయినా ఒకటి రెండు ఎన్నికల్లో ఓడిపోయారేమో కానీ ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పత్‌ నుంచి పోటీ చేసిన ప్రతీ సారీ చరణ్‌సింగ్‌ గెలుపొందుతూనే వచ్చారు.
దాదాపు భారత భాగ్య విధాత అయినంత పని చేసిన చౌధురీ చరణ్‌సింగ్‌కి మిజోరాం ఎక్కడుందో తెలియదు.
ఈ రెండు సంఘటనల సారాంశం ఒక్కటే! ఆఫీసు క్లర్కు నుంచి అత్యున్నత పదవిని అలంకరించిన వ్యక్తి దాకా చాలా మందికి అస్సాం గురించి తెలియదు. ఈశాన్య భారత దేశం గురించి తెలియదు. వారి మనసులోని భారత్‌ చిత్రపటం కోల్‌కతాలోనో, మరీ బేరమాడితే డార్జిలింగ్‌ దగ్గరనో ఆగిపోతుంది. ఆ తరువాత అలీపూర్‌ ద్వార్‌ అన్న ఊరు వస్తుంది. అది దాటితే అస్సాం మొదలవుతుంది. అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, త్రిపుర, మణిపూర్‌లు మన ఈశాన్య భారతదేశంలో ఉంటాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం దేవతా స్థానం. ఈశుడు కొలువుంటాడు కాబట్టే అది ఈశాన్యం! మన దేశపు దేవతా స్థానం లాంటి ఈశాన్య భారతంలోని రాష్ట్రాల పేర్లు, వాటి రాజధానుల పేర్లు, అక్కడి జీవన విధానం గురించి మన దేశంలో చాలా మందికి తెలియనే తెలియదు.
మణిపూర్‌, నాగాలండ్‌ నుంచి వచ్చిన వారికి కాసింగ చప్పిడి ముక్కు ఉంటుంది. చిన్న చిన్న కళ్లుంటాయి. వాళ్లని చూస్తే బాగా చదువుకున్న వారు కూడా "ఒకేయ్‌...చైనా వాడురోయ్‌" అని అప్రయత్నంగానే అనేస్తారు.
"ఈశాన్య భారత దేశంలో మనుషులు ఏం తింటారు? వారు కుక్కల్నీ, పాముల్నీ తింటారా? వాళ్లు బట్టలు వేసుకుంటారా?" ఇది అత్యంత మామూలుగా వచ్చే ప్రశ్న!!
తెలతెల్లవారుతూండగానే వేడి వేడిగా మన గొంతు దిగే గరమ్‌గరమ్‌ చాయ్‌లో 90 శాతం అస్సాం నుంచే వస్తుంది.
ఆఫీసుకు వెళ్లేందుకు మనం కిక్‌ కొట్టగానే స్టార్టయే మోటర్‌సైకిల్‌లోని ఇంధనం అస్సాం నుంచే వస్తుంది.
దేశం యావత్తూ వెయ్యేళ్లు ముస్లిం ఆక్రమణదారుల దాడులకు లోనైంది. అలాంటిది...ఒక సారి కాదు....రెండు సార్లు కాదు....పదిహేడు సార్లు ఖిల్జీలనుంచి మొగల్‌ల దాకా దాడులు చేసినా తిప్పికొట్టగలిగిన ఏకైక రాష్ట్రం అస్సాం. అప్పట్లో అస్సాం అంటే మొత్తం ఈశాన్య భారతమే!!
మన దేశంలో అన్ని ప్రాంతాలకన్నా చిట్ట చివర బ్రిటిషర్ల పాలన కిందకి వెళ్లింది కూడా ఈశాన్య భారతమే. మణిపూర్‌ అయితే 1890 వరకూ బ్రిటిషర్ల అధీనంలో లేదు.
బ్రిటిషర్ల పాలనను కూలదోసేందుకు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నేతృత్వంలోని ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఆంగ్ల సైనికులతో ప్రత్యక్ష యుద్ధానికి దిగిన చోటు ఎక్కడుంది. మణిపూర్‌లో. మణిపూర్‌లోని మొయిరాంగ్‌ అనే చోట భీషణమైన యుద్ధం చెలరేగింది.
మన దేశంలో చైనాలో తయారైన వస్తువులను పూర్తిగా నిషేధించిన రాష్ట్రం ఎక్కడుంది? అది ఈశాన్య భారతంలోనే ఉంది. దాని పేరు అనుణాచల్‌ ప్రదేశ్‌!!
తమాషా ఏమిటంటే ఈశాన్య భారతం గురించి తెలియనిది బాగా చదువుకున్న వాళ్లకే. డిగ్రీలు, పిజీలు చేసిన వారికే అమెరికా పొరుగింటిలా, ఈశాన్య భారతదేశం పొరుగుదేశంలా కనిపిస్తుంది.
కానీ హిమాలయాల గుహల్లో తపస్సు చేసుకునే సాధువులకు, సన్యాసులకు మాత్రం ఈశాన్య భారత దేశం గురించి చాలా బాగా తెలుసు. సంక్రాంతి సమయంలో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొండ కోనల్లో ఉండే బ్రహ్మ కుండానికి వారు తీర్థయాత్ర చేస్తారు. అక్కడ పరశురామ్‌ కుండ్‌ మేళా జరుగుతుంది. ఉత్తరాదిలోని పలు గ్రామాల నుంచి శ్రద్ధాళువులు అక్కడికి వెళ్తారు. వారికి పరశురామ్‌ కుండ్‌ లేదా బ్రహ్మ కుండ్‌ గురించి తెలుసు.
దేశంలో 51 శక్తిపీఠాలున్నాయి. వాటిలో ఒక పీఠం కామాఖ్య పీఠం. ఆ కామాఖ్య మందిరాన్ని దర్శించేందుకు దేశం నలుమూలలనుంచి భక్తులు తరలి వస్తారు. ఏడాదికో సారి ఏడు రోజుల పాటూ కామాఖ్య అమ్మవారికి ఋతుస్రావం అవుతుందని భక్తుల విశ్వాసం. అప్పుడు మందిరం వద్ద పెద్ద మేళా జరుగుతుంది. దేశం నలుమూలలనుంచి తంత్ర సాధకులు, సాధువులు, మహాత్ములు అక్కడకి చేరి సాధన చేస్తారు. కామాఖ్యా మందిరం గువహటిలో ఉంది. గువహటి అస్సాంలో ఉంది. ఈ సాధువులకు, భక్తులకు అస్సాం మ్యాపు అక్కర్లేదు. క్యాలెండర్‌ చూడనక్కర్లేదు.
బాగా చదువుకున్నారని మనం భావించే వారికి ఈశాన్య భారతం గురించి తెలియదు. కానీ సెల్‌ఫోన్లు, టీవీలూ అంటే తెలియని సాధువులకు ఈశాన్య భారతం గురించి చాలా బాగా తెలుసు.
ఇదే ఈశాన్య భారతపు దురదృష్టం. కాదు కాదు...యావద్భారతదేశపు దురదృష్టం. చదవేస్తే ఉన్నమతి పోవడం అంటే ఇదేనేమో.
యుగాలుగా కొనసాగుతున్న నాభినాళ సంబంధాన్ని గుర్తించలేని ఆధునిక భారత దేశపు దౌర్భాగ్యం చూస్తే మనసు వికలమైపోతుంది. అమెరికా గురించి, ఇంగ్లండ్‌లలో అణువణువూ తెలిసిన చాలా మందికి అస్సాం గురించి, మణిపూర్‌ గురించి, అరుణాచల్‌ ప్రదేశ్‌ గురించి తెలియదంటే ఏమనుకోవాలి?
ఇంకా విడ్డూరం ఏమిటంటే...ఈశాన్య భారత దేశం మనది కాదని మిగతా దేశంలో చాలామంది అనుకుంటూ ఉంటే, మొత్తం భారత దేశం మాదని ఈశాన్య భారత దేశంలో అత్యధికులు ఇప్పటికీ అనుకుంటూనే ఉన్నారు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment