సహకారం ‘సంఘర్షణ’గా మారుతుండడం రాజకీయ పక్షాల ‘సమాఖ్య కూటమి’- ఫెడరల్ ఫ్రంట్-కి విచిత్రమైన నేపథ్యం. ఈ ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటు పేరుతో వివిధ...
సహకారం ‘సంఘర్షణ’గా మారుతుండడం రాజకీయ పక్షాల ‘సమాఖ్య కూటమి’- ఫెడరల్ ఫ్రంట్-కి విచిత్రమైన నేపథ్యం. ఈ ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటు పేరుతో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమై ఉన్న ‘జాతీయ రాజకీయ పక్షాల’ అధినేతలు గొప్ప హడావుడి చేస్తున్నారు. ఈ హడావుడికి, ఆర్భాటానికి మాధ్యమాలలో- ప్రధానంగా దృశ్య మాధ్యమాలలో జరిగిపోతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఫలానా రాష్ట్ర ముఖ్యమంత్రి మరో ముఖ్యమంత్రిని కలసి మాట్లాడడం, కలసి విందు భోజనం చేయడం అపూర్వ, అపురూప, సంచలనాత్మక, సంభ్రమ పూర్వక పరిణామంగా మాధ్యమ మహాశయులు ప్రచారం చేస్తున్నారు. విందు భోజనాల్లో ఏయే పదార్థాలను వడ్డించారన్న వివరాలు సైతం వెల్లడవుతున్నాయి. ఈ మహా సమాచారాన్ని ‘మొదట వెల్లడిస్తున్నది మేము.. మేమే..!’ అన్న అక్షర మాలికను దృశ్య మాధ్యమ స్రవంతి- టెలివిజన్ చానల్-లో నిత్యం, నిరంతరం ప్రదర్శించడానికి ‘సమాఖ్య కూటమి’ చర్చలు దోహదం చేస్తున్నాయి. దాదాపు ప్రతి ‘స్రవంతి’-చానల్- వారు ఈ ‘మొదట వెల్లడిస్తున్నది మేమే..’ అన్న పోటీలో విజేతలు కావడానికి గత రెండు, మూడు, నాలుగు వారాలుగా ఫెడరల్ ఫ్రంట్ ఆవిర్భావపు ఆర్భాటం గొప్పగా దోహదం చేస్తోంది. ఈ ఫ్రంట్ స్వరూప స్వభావాల గురించి, ఎవరు కూటమికి అధినాయకుడు లేదా అధినాయకురాలు అవుతారన్న ఉత్కంఠ భరిత పరిణామం గురించి కథనాలు, కథలు, కల్పనలు, ఊహాగానాలు దినదినం ఊపందుకుంటున్నాయి. ‘సమాఖ్య కూటమి’ ఇంకా అవతరించనే లేదు. కాని ‘కూటమి’ స్ఫూర్తికి విరుద్ధమైన పరిణామాలు సైతం అప్పుడే జరిగిపోతున్నాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీకి వచ్చి, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీతో చర్చలు జరిపి బయటికి వచ్చినప్పటి దృశ్యం ఆవిష్కృతం కావడం ఈ పరిణామ వైరుధ్యం. మాజీ కేంద్రమంత్రులు యశ్వంత సిన్హా, అరుణ్ శౌరి, మహానటుడు శత్రుఘ్న సిన్హా ప్రస్తుతం ఏ రాజకీయ పక్షంలో ఉన్నారనే సందేహాన్ని కూడ మమతా దీదీ ఢిల్లీ పర్యటన రేకెత్తించింది. ఎందుకంటే ఈ ముగ్గురు మహా నాయకులు ఢిల్లీలోని తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి మమతతో చర్చలు జరిపారు. ఆమె పక్కన నిలబడి ‘్ఫటో’ తీయించుకున్నారు. గంభీరమైన కార్యక్రమంలో కొంత హాస్యం కూడ ఉండాలి మరి! ‘ఊళ్లో పెళ్లి జరిగితే ఉడుతలు ఉయ్యాలలూగినట్టు’ అన్నది కేవలం సామెత కాదు..
సహకార ‘సమాఖ్య’ సిద్ధాంతం- కోఆపరేటివ్ ఫెడరలిజమ్- గురించి కొనే్నళ్లుగా గొప్ప ప్రచారం జరిగింది. మనది సమాఖ్య రాజ్యాంగ వ్యవస్థ. ‘సమాఖ్య’ అనడంలోనే ‘సహకారం’ అందులో నిహితమై ఉంది. అందువల్ల మళ్లీ ‘సహకారం’ అన్న విశేషణాన్ని ‘సమాఖ్య’కు జోడించడం పదాల ఆర్భాటం, వాగాడంబరం. కాని కేంద్ర ప్రభుత్వంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉన్న చనువు కొద్దీ ఈ పదజాలం పుట్టుకొచ్చింది. అంతేకాదు, వివిధ ప్రాంతాల మధ్య నీటి తగాదాలు, సరిహద్దు తగాదాలు దశాబ్దుల సమాఖ్యను సంఘర్షణ మయం చేశాయి. ‘సహకారం’ ప్రధానం. సంఘర్షణ తొలగాలి- అన్న ఆకాంక్షతో కూడ ‘సహకార సమాఖ్య’ పదజాలం పుట్టుకొచ్చింది. ఏమైనప్పటికీ కేంద్ర, రాష్ట్రాల మధ్య ఇప్పుడు మళ్లీ సంఘర్షణ మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం మత ప్రాతిపదికపై కల్పించదలచిన ‘ఆరక్షణల’- రిజర్వేషన్స్-కు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ‘ప్రత్యేక తరగతి హోదా’- స్పెషల్ కేటగిరీ స్టేటస్-ను కేంద్రం కల్పించలేదు. ఇలా దేశంలోని మరిన్ని రాష్ట్రాల ‘ప్రాంతీయ ఆకాంక్షలకు భంగం వాటిల్లడం’ గురించి ప్రచారం జరుగుతోంది. ఈ ‘ప్రాంతీయ ఆకాంక్షలు’ రాజ్యాంగ బద్ధమని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు విశ్వసిస్తున్నట్టయితే- వాటిని నెరవేర్చుకొనేందుకు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. కాని అలా జరగడం లేదు. ఎందుకంటె ‘ప్రాంతీయ ఆకాంక్షల’ వెనుక నుండి ప్రాంతీయ రాజకీయ నాయకుల రాజకీయ లక్ష్యాలు నిరంతరం నిక్కి చూస్తున్నాయి. అందువల్లనే కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల గల వ్యతిరేకత కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకుల పట్ల వ్యతిరేకతగా మారింది. ‘సంఘర్షణ’కు ఇదీ కారణం. ఫెడరల్ ఫ్రంట్ కలను ప్రాంతీయ నాయకులు మళ్లీ కంటుండడానికి ఇదీ నేపథ్యం.
ప్రాంతీయ రాజకీయ పక్షాలు కలసికట్టుగా జాతీయ స్థాయిలో ఏర్పరచ దలచిన కూటమి ‘ఫెడరల్ ఫ్రంట్’. జాతీయ పక్షాలు, తమది జాతీయ పక్షమని ప్రచారం చేసుకుంటున్న ప్రాంతీయ పక్షాలు ఈ ‘ప్రాంతీయ పక్షాల కూటమి’లో చేరగలవా? చేరడం వల్ల తమ ‘జాతీయమైన హోదా’కు భంగకరం కదా! అఖిలేశ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీ, లాలూ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్, హెచ్‌డీ దెవగౌడ నేతృత్వంలోని లౌకిక జనతాదళ్, శరద్ పవార్‌కు చెందిన జాతీయతా కాంగ్రెస్ పార్టీ వంటివి ఒక్కొక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితమై ఉన్నాయి. కానీ ఈ పార్టీల నేతలు తమది జాతీయ స్థాయి పక్షమన్న భ్రాంతికి గురై ఉన్నారు. లేదా అలా అభినయిస్తున్నారు. ఈ పార్టీలు చేరితే ‘ఫెడరల్ ఫ్రంట్’ ఫెడరల్ ఫ్రంట్‌గా ఉంటుందా? లేక మరో నేషనల్ ఫ్రంట్‌గా మారుతుందా? ఇలాంటి పార్టీలు లేకుండా ఏర్పడితే ‘కొత్త కూటమి’కి ఐదారు రాష్ట్రాలలో తప్ప దేశంలో ఉనికి ఉండదు. తమిళనాడు ప్రాంతీయపక్ష బాహుళ్యానికి ఆలవాలం. ఈ పక్షాలన్నింటినీ ‘ఫెడరల్ ఫ్రంట్’లో ఇమడ్చడం అసంభవం. తమిళనాడులోని ఏ ద్రవిడ పార్టీని ఏ సిద్ధాంతం ప్రాతిపదికగా ఫెడరల్ ఫ్రంట్‌లో చేర్చుకుంటారు?
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీపై బహుశా లోలోపల మండిపడి ఉంటాడు. ఝార్‌ఖండ్ మాజీ సీఎం, ఝార్‌ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు హేమంత్ సోరేన్‌తో కేసీఆర్ హైదరాబాద్‌లో చర్చలు జరిపిన సమయంలోనే మమత ఢిల్లీలో సోనియా గాంధీతో మంతనాలు సాగించింది. ఈనెల మూడవ తేదీన కేసీఆర్ చేసిన ‘మూడవ కూటమి’ ప్రతిపాదన ప్రస్తుతం నడుస్తున్న ‘ఫెడరల్ ఫ్రంట్’ అవతరణ ప్రక్రియకు శ్రీకారం. భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీలకు విరుద్ధంగా మూడవ కూటమిని ఏర్పాటు చేయడం కేసీఆర్ లక్ష్యం. దీన్ని వెంటనే ఆమోదించింది బెంగాల్ ముఖ్యమంత్రి మమత. కేసీఆర్ వెంటనే కోల్‌కతకు వెళ్లి ఆమెతో చర్చలు జరిపివచ్చాడు. కానీ ఇప్పుడు మమత కాంగ్రెస్‌తో కూడిన ‘్భజపా వ్యతిరేక కూటమి’ని ఏర్పాటు చేయడం తన లక్ష్యమని ప్రకటించింది. తెరాస అధినేత దీన్ని అంగీకరిస్తాడా? మమతను ‘ఫెడరల్ ఫ్రంట్’ నుంచి తొలగిస్తాడా?
No comments