Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

యాబయి ఆరు ఆవులు అకాల మరణం-కారకులెవరు-savecows

యాబయి ఆరు ఆవులు అకాల మరణం పాలు కావడం హృదయ విదారకమైన దుర్ఘటన. ఒకచోట ఈ గోవుల మృతకళేబరాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దారుణ దృశ్యం ఆవిష్కృతం కావడ...

cattle dead
యాబయి ఆరు ఆవులు అకాల మరణం పాలు కావడం హృదయ విదారకమైన దుర్ఘటన. ఒకచోట ఈ గోవుల మృతకళేబరాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దారుణ దృశ్యం ఆవిష్కృతం కావడానికి కారణం వ్యవసాయం విష రసాయనగ్రస్తమై ఉండడం. క్రిమిసంహారక రసాయనాలు నిండిన గడ్డిని మేసిన ఆవులు తక్షణం ప్రాణాలను కోల్పోవడం కృత్రిమ వ్యవసాయం కల్పిస్తున్న వైపరీత్యాలకు పరాకాష్ఠ. గుంటూరు జిల్లా గురజాల మండలంలోని అంబాపురం వద్ద ఆదివారం రాత్రి జొన్న చేనులోని ‘ఉంగడి గడ్డి’ని వందల ఆవులు మేశాయట. తెల్లవారేసరికి యాబయి ఆరు ఆవులను ఘోర మృత్యువు మేసేసింది. ఇరవై ఒక్క ఆవులకు వైద్య చికిత్స అందడంతో అవి బతికాయి. మిగిలిన గోవులు ఇంకా చికిత్స పొందుతున్నాయట! పంటల మీద చల్లుతున్న క్రిమిసంహార పదార్థాలు, విష రసాయనాలు నెమ్మదిగా మానవులకు, జంతువులకు హాని కలిగిస్తుండడం నడుస్తున్న విషాదం. ‘ఎండోసల్ఫాన్’ వంటి క్రిమినాశక రసాయనాల ప్రభావానికి గురైన పంటలను భోంచేయడం వల్ల జనం చిత్రవిచిత్ర శారీరక,మానసిక వ్యాధులకు గురవుతున్నారన్నది నిర్ధారిత వాస్తవం. క్రిమిసంహారక రసాయన ప్రభావితమైన పంటలను, గడ్డిని మేయడం వల్ల పశువులు కూడ క్రమంగా వ్యాధిగ్రస్తవౌతున్నాయి. మానవుల కంటె జంతువులకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో కొద్దిపాటి విష రసాయనాలు పశువుల కడుపులలో చేరినప్పటికీ అవి జీర్ణమైపోతున్నాయి. ఆవులు, గోసంతతి ప్రాణులు నగరాలలో, పట్టణాలలో ‘ప్లాస్టిక్’ పదార్థాలను మేస్తున్నాయి. కొన్ని నెలలు లేదా సంవత్సరాల తరువాత ఈ ‘ప్లాస్టిక్’ ఈ ప్రాణుల పొట్టలలో పేరుకొనిపోయి అవి రోగగ్రస్తం అవుతున్నాయి, మరణిస్తున్నాయి. కానీ, అంబాపురం వద్ద జొన్న చేలలో పొంచి ఉండిన విష రసాయన మృత్యువు ఇన్ని ఆవులను తక్షణం కబళించడం విస్మయకరం. అంత భారీ మోతాదులో ‘హెచ్‌ఎన్‌సి’ అన్న రసాయన విషం గడ్డిలో కలిసి ఉండడం అంతుపట్టని వ్యవహారం. మరణించిన ఆవుల కడుపులో అవి జీర్ణం చేసుకోలేనంత మోతాదులో రసాయన విషం -సైనేడ్- ఉందని వైద్యులు నిర్ధారించారట! అంత భారీ ‘పరిమాణం’లో ఆ గడ్డిలో రసాయన విషం ఎందుకు కలిసింది? ఎవరు కలిపారు? అన్న ప్రశ్నలకు సమాధానం లభించవలసి ఉంది. క్రిమిసంహారక మందులను ‘పిచికారీ’ చేసిన తరువాత ఆ పంటలను పశువులు మేయకుండా రైతులు సహజంగానే జాగ్రత్తలు తీసుకుంటారు. జొన్నచేను మధ్య పెరిగి ఉండిన గడ్డిపై క్రిమిసంహారక రసాయనాలను అంత భారీ పరిమాణంలో ఎవరు పిచికారీ చేశారో?
తెలంగాణకు చెందిన ఈ ఆవుల యజమాని మేపుకొనడం కోసం ఈ మందను గుంటూరు జిల్లాకు తోలుకొని వెళ్లాడట. అంబాపురం నుండి స్వస్థలానికి ఆవులను తోలుకొని వెడుతుండగా ‘తేలుకుట్ల’ గ్రామం వద్ద జొన్న చేనులో ఉన్న గడ్డిని ఈ ఆవులు మేశాయి. లేత జొన్న మొక్కలు తిన్నట్టయితే పశువులు అస్వస్థతకు గురఅవుతాయి. ఇలా ‘నాము’ ఎక్కిన పశువులకు తక్షణ చికిత్స జరపడం కూడ రైతులకు, గోపాలురకు తెలిసిన విద్య! ఈ ఆవులు గడ్డిని మాత్రమే మేసి ఉండినట్టయితే ‘నామెక్కే’ ప్రమాదం లేదు. అది లేత జొన్న చేను అయి ఉండినట్టయితే అందులో పశువులు మేయడానికి పొలం యజమాని అంగీకరించడు. ఆవుల కాపరి కూడ లేత జొన్న మొక్కలను మేయనీయడు. ఆవులను యజమాని దొంగతనంగా ఆ పొలంలోకి తోలలేదు. కోసిన జొన్న చేనులో పెరిగిన గడ్డిని ఈ ఆవులు మేశాయి. లేత జొన్న మొక్కలను తినలేదు. గడ్డిపై పనికిరాని రసాయన విషాలను ఎవరైనా నిర్లక్ష్యంగా పారపోసి ఉండవచ్చు! గడ్డితోపాటు భారీ మోతాదులో రసాయన విషం ఆవుల పొట్టలోకి చేరడానికి బహుశా ఈ నిర్లక్ష్యం కారణం కావచ్చు! యజమాని ఆ పొలంలో పశుగ్రాసం కోసం గడ్డిని పెంచుతూ ఉండినట్టయితే ఆవులు అక్కడ మేయడానికి అనుమతించి ఉండడు. నిర్లక్ష్యంగా గడ్డిలో పారబోసిన రసాయన విషం ఆవులను హతమార్చింది.. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోవుల యజమానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవచ్చు. ఇది తాత్కాలిక పరిష్కారం. విస్తరించిపోయి వ్యవస్థీకృతమైన కృత్రిమ వ్యవసాయాన్ని తొలగించి, సంప్రదాయ సేంద్రియ వ్యవసాయం మళ్లీ మొదలుకావడం దీర్ఘకాల పరిష్కారం!
ఆవుల సంఖ్య, గోసంతతి సంఖ్య, గోజాతుల సంఖ్య తగ్గిపోవడం, సంప్రదాయ వ్యవసాయం అంతరించిపోవడం పరస్పరం ముడిపడిన విపరిణామాలు. ‘గవాధార’- ఆవు, ఎద్దు ప్రాతిపదికగా- వ్యవసాయం జరిగిన సమయంలో కృత్రిమమైన రసాయన ఎఱువుల అవసరం రాలేదు, క్రిమి సంహాకారక విషాలు అనివార్యం కాలేదు. శతాబ్దుల తరబడి విదేశీయ జిహాదీలు, ఐరోపా హంతకులు మన దేశంలో గోసంతతిని చంపి తినడం వల్ల స్వతంత్ర భారతదేశంలో కూడ గోహనన ప్రవృత్తి కొనసాగుతోంది. భావదాస్యం కొనసాగుతోంది. గోమాంసం తినడానికి కాక, విదేశాలకు గోమాంసాన్ని ఎగుమతి చేయడం కోసం ఆవుల వధ కొనసాగడంతో గోసంతతి గ్రామాలలో అంతరించింది. ఆవుపేడను, ఆవు పంచితాన్ని ఎఱువుగా ఉపయోగించి వ్యవసాయం చేసిన వారు- నేడు అవి దొరకకపోవడంతో- కృత్రిమ విషాలను ఎఱువులుగా వాడుతున్నారు. గోమయం, గోమూత్రం వానపాములను పెంచి భూమిని నిరంతరం పరిపుష్టం చేశాయి, కృత్రిమ రసాయనాలు భూమిని నిర్జీవం చేశాయి. నిర్జీవం అవుతున్న భూమిని తాత్కాలికంగా సారవంతం చేయడానికై మరింతగా రసాయన విషపుటెఱువులను వాడుతున్నారు. ఒకప్పటి స్వచ్ఛ భారతం కాలుష్య వలయంగా మారింది. ఈ కాలుష్యం నుండి రకరకాల క్రిమికీటకాలు కొత్తకొత్తవి పుట్టుకొచ్చి పంటలను నమిలి మింగేస్తున్నాయి. ఈ క్రిమి కీటకాలను చంపడానికి విష రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. ఈ విష రసాయనాలు క్రిమికీటకాలను మాత్రమేకాక జీవ జాలాన్ని మొత్తం క్రమంగా హరిస్తుండడం కాలుష్య భారతం కథ. గురజాలలో జరిగిన గోహననం ఇందుకు సరికొత్త నిదర్శనం. పదిహేనేళ్ల క్రితం వరంగల్లు జిల్లాలో పత్తి ఆకులను తిన్న గొర్రెలు అకాల మరణం పాలుకావడం బహుశా ఇప్పుడు గుర్తులేదు..
దేశవ్యాప్తంగా ‘గోజప మహాయజ్ఞం’ జరుగుతోంది. ఈనెల పదిహేనవ తేదీవరకు జరిగే ఈ కార్యక్రమంలో లక్షలమంది ప్రతిరోజూ ‘గోరక్షణ’ లక్ష్యంగా ‘‘ఓం శ్రీసురభ్యైనమః’’అని జపిస్తున్నారు. యాబయి ఆరు ఆవులు ఒకేసారి మృత్యువును పొందడం పెద్ద అపశ్రుతి! సేంద్రియ వ్యవసాయ పునరుద్ధరణ విస్తరిస్తేనే ‘స్వచ్ఛ్భారత్’ మళ్లీ అవతరించగలదు. ఈ ‘స్వచ్ఛాగ్రహం’ గోపరిరక్షణ వల్లనే వ్యవసాయ రంగంలో విజయవంతం కాగలదు.

No comments