యుగాల క్రితం ఓ భక్తుడిని "ఏమోయ్...ఎప్పుడూ నా రాముడు...నా రాముడు అంటావు కదా! ఆ రాముడెక్కడ ఉన్నాడు? నీలో ఉన్నాడా" అని వెటకారం చేశ...
యుగాల క్రితం ఓ భక్తుడిని "ఏమోయ్...ఎప్పుడూ నా రాముడు...నా రాముడు అంటావు కదా! ఆ రాముడెక్కడ ఉన్నాడు? నీలో ఉన్నాడా" అని వెటకారం చేశాడు. ఆయన మారు మాట్లాడకుండా తన గుండెను చీల్చి, అందులో కొలువై ఉన్న సీతారామలక్ష్మణుల్ని చూపించాడట.
నూటపద్ధెనిమిదేళ్ల క్రితం కొద్దిమంది పెద్దమనుషులు ఓ వర్గాన్ని "మీకు రాముడి గుడిలో ప్రవేశమే లేదు. అసలు మీరెవరూ రామనామాన్ని సైతం ఉచ్చరించకూడదు" అని నిబంధనలు పెట్టారు.
ఆ ప్రజలు వాదవివాదాల్లోకి దిగకుండా, ఒళ్లంతా రామనామాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకున్నారు. శరీరంలో అంగుణమైనా, అణుమాత్రమైనా రామనామాంకితం కాకుండా లేదు. ఆఖరికి అరచేతిమీద కూడా రామనామమే! చివరికి రామనామం పైన మాదే కాపీరైట్ అని విర్రవీగిన పెద్దమనుషులు సైతం ఈ వర్గాన్ని రామనామీలు అని సంబోధించడం మొదలుపెట్టారు.
త్రేతాయుగపు భక్తుడు రామభక్త హనుమాన్ అయితే, ఈ కలియుగ భక్తులు రామనామీలు అయ్యారు.
ఈ రామనామీ తెగ ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలోని బిలాస్‌పూర్, రాజ్‌గఢ్, రాయపూర్ జిల్లాల్లో మహానది ఒడ్డున ఉన్న గ్రామాల్లో ఉంటారు. వీరి జనాభా దాదాపు అయిదు లక్షల వరకూ ఉంటుంది.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం లెక్కల ప్రకారం వీరిని షెడ్యూల్డు కులాలకు చెందిన వారిగా పరిగణిస్తారు.
బ్రిటిష్ యుగంలో కులదురహంకారం పెచ్చుమీరిన రోజుల్లో అగ్రవర్ణాలమని చెప్పుకునే వారు కొందరు ఈ వర్గంపై నిషేధాలు విధించారు. అయితే 1894 ప్రాంతంలో రాయగఢ్ జిల్లాలోని ఛపారా గ్రామానికి చెందిన పరశురాం అనే వ్యక్తికి రాముడే కనిపించి, మీ శరీరం అంతా రామమయం చేసుకొమ్మని, నిరంతరం త్రికరణ శుద్ధిగా రామనామాన్నే జపించమని మార్గదర్శనం చేశాడు.
ఆ తరువాత నుంచి పరశురాం రామనామీ అయ్యాడు.
ఊరూరా తిరిగి రామనామాన్ని ప్రచారం చేయనారంభించాడు. గుండెలోతుల్లోంచి వెల్లువై పెల్లుబికిన రామభక్తి ఆ నిర్భాగ్యులను రామనామ సంపదల సౌభాగ్యులుగా మార్చేసింది. రామనామం ఒక మహోద్యమమైపోయింది.
పాపం చిన్న బుద్ధుల పెద్దలకు ఈ రామనామీల భక్తి నచ్చలేదు. వారి మూఢభక్తికి రామనామీల గాఢభక్తి అర్ధం కాలేదు. బ్రిటిష్ అధికారులకు అర్జీలు పెట్టుకున్నారు. ఆఖరికి రాయపూర్ హైకోర్టు తలుపులు సైతం తట్టారు. ఏళ్ల తరబడి వాజ్యం నడిచింది.
చిట్టచివరికి 1911లో హైకోర్టు రామనామాన్ని ఉచ్చరించడమే కాదు, పచ్చబొట్టుగా పొడిపించుకునే హక్కూ అధికారం అందరికీ ఉన్నాయని, అంతే కాక నుదురు, చేతులు, కాళ్లు, ఆఖరికి కావాలంటే నాలుకపై కూడా రామనామపు పచ్చబొట్టు పొడిపించుకోవచ్చునని తీర్పు చెప్పింది.
అప్పట్నుంచీ రామనామీలు నిరాటంకంగా తమ తనువుల్నే రామకోటి పుస్తకాలుగా మార్చేసుకున్నారు. నడిచే రామకోటి కావాలంటే ఒళ్లంతా సూదులు పొడిపించుకోవడమే. అదీ ఒక రోజు...రెండు రోజులు కాదు...ఏకబిగిన పద్ధెనిమిది రోజులపాటూ ఒక తపస్సులా తనువంతా రామమయం చేసేసుకుంటారు.
అందుకే ఈ రామనామీలు తోటి రామనామీలను పరమభక్తులుగా భావించి ఆతిథ్యం ఇస్తారు.
ఊరూపేరూ తెలియనక్కర్లేదు, పచ్చబొట్లే పరిచయం. "రాం రాం" అన్న పలకరింపులు చాలు ఆత్మీయులైపోవడానికి. రామనామీల ఒంటిపైనుండే శాలువలూ రామనామాంకితమైనవే. వాటిపై రామనామాల్ని అద్దకం చేస్తారు. దీనికి 18 రోజులు పడుతుంది.
రామనామీల దేవాలయాలూ ప్రత్యేకమైనవే. అందులో విగ్రహాలేవీ ఉండవు. కేవలం రామనామం ఉంటుంది.
రామనామీలు చిన్నబుద్ధుల పెద్దవారికి చెంపదెబ్బల్లాంటి వారు.
అంతేకాదు...దేవుడు అందరి సొత్తూ అని చెప్పే పరమ భాగవతోత్తములు వారు.
అంతకన్నా ముఖ్యంగా గుడిలోకి రావద్దన్న సాకును చూపి మతం మారేవారి, మార్చేవారి డొల్లతనాన్ని ఈ రామనామీలు సవాలు చేస్తున్నారు. వారికివే నా "జైశ్రీరామ్"లు.
గాల క్రితం ఓ భక్తుడిని "ఏమోయ్...ఎప్పుడూ నా రాముడు...నా రాముడు అంటావు కదా! ఆ రాముడెక్కడ ఉన్నాడు? నీలో ఉన్నాడా" అని వెటకారం చేశాడు. ఆయన మారు మాట్లాడకుండా తన గుండెను చీల్చి,
No comments