ఇటీవల ఒక వివాహానికి హాజరయ్యాను. అతిధులను ఆహ్వానిస్తూ చాలా పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. భోజనాల్లో ప్రతివారికీ అరలీటరు మంచినీళ్ళ సీసా ఇచ్చారు. ...
ఇటీవల ఒక వివాహానికి హాజరయ్యాను. అతిధులను ఆహ్వానిస్తూ చాలా పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. భోజనాల్లో ప్రతివారికీ అరలీటరు మంచినీళ్ళ సీసా ఇచ్చారు. కొద్దిమంది మాత్రమే పూర్తిగా ఆ నీటిని తాగారు. ఎక్కువమంది కొన్ని నీళ్ళను బాటిల్ లోనే వదిలేశారు. మరికొద్దిమంది ఆ బాటిల్ నీళ్ళతోనే చేతులు కడుక్కున్నారు. రెండు రకాల స్వీట్లను ప్లాస్టిక్ కప్పులో ఇచ్చి అందులో ప్లాస్టిక్ స్పూన్ పెట్టారు. ఈ ప్లాస్టిక్ కప్పు, స్పూను, మంచినీళ్ళ బాటిల్ ఆ తరువాత చెత్త లోకి వెళ్ళిపోయాయి.
నిశ్చితార్ధం, సంగీత్, ఆ తరువాత పెళ్లి కార్యక్రమం, అనంతరం రిసెప్షన్ .... ఇలా కనీసం ఒక పెళ్ళికి నాలుగైదు కార్యక్రమాలు ఉంటున్నాయి. ఇన్ని వేలమంది కలయికలలో జరిగే ప్లాస్టిక్, తగరం లాంటి భూమిలో కరగని వస్తువులను వృధాగా వాడటం చాలా ఎక్కువగా ఉంటోంది.
గ్రీన్ మ్యారేజ్ ఎలా చేసుకోవచ్చో ఒక బెంగుళూరు డాక్టరమ్మ గారు తమ కుమారుడి పెళ్లి చేసిన విధానం whatsapp లో ఈమధ్యే చూశాం. ఆవిడ స్టీలు ప్లేట్లు, స్టీలు గ్లాసులు చక్కగా శుభ్రం చేయించి అతిధులకు భోజనం, మంచినీళ్ళు వడ్డించారు. ప్లేట్లు, చేతులు తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ వాడకుండా ప్రతివారికీ ఒక గుడ్డ నాప్కీన్ ఇచ్చారు. భోజనం అయి చేతులు తుడుచుకున్న తరువాత వాటన్నింటినీ వెయ్యడానికి ఒక అట్టపెట్టెను పెట్టి దానిపైన ‘వాడిన నాప్కిన్ల కోసం’ అని రాశారు. ఈ నాప్కిన్లను ఉతికించి మరొకసారి వేరే కార్యక్రమానికి వాడుకోవచ్చు. ప్రవేశ ద్వారం డెకరేషన్ గాని, స్టేజీ డెకరేషన్ కి గాని భూమిలో కలవని వాటిని ఎక్కడా వాడలేదు.
*మనందరం ‘Green Functions’ని ప్రోత్సహించి తీరాల్సిందే. అందుకోసం* -
1. ఆహ్వానం తెలిపే ఫ్లెక్సీ బోర్డు వద్దు. దాని బదులు గుడ్డ బ్యానర్ రాయిస్తే చాలు.
2. ప్లాస్టిక్ గ్లాసుల బదులు స్టీలు గ్లాసులు వాడదాం. ప్లాస్టిక్ బాటిల్స్ వద్దు. ఒకొక్క ఫంక్షన్ లో కొన్ని వేల ప్లాస్టిక్ బాటిల్స్ వాడకం జరుగుతోంది.
3. తగరపు విస్తరాకులు, థర్మోకోల్ విస్తరాకులు, ప్లాస్టిక్ కోటింగ్ విస్తరాకుల బదులు స్టీలు ప్లేట్లు, అరిటాకులు, కుట్టిన విస్తరాకులు వాడదాం.
4. స్వీట్స్ ఇవ్వడానికి ప్లాస్టిక్ కప్పులు ఇవ్వవద్దు.
5. ఐస్ క్రీం తినడానికి, స్వీట్స్ కి గాని ప్లాస్టిక్ స్పూన్స్ ఇవ్వవద్దు.
6. పన్నుపుల్లలు ప్లాస్టిక్ వాటికి బదులు చెక్కతో చేసినవి వాడదాం.
7. కిళ్ళీలను అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తే ప్లాస్టిక్ కవర్లో పెట్టే అవసరం ఉండదు.
8. బహుమతులకు పైన రేపర్లు కూడా కాగితంవే వాడదాం. తగరం రేపర్లు వద్దు.
9. చేతులు కడగటానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఎలాగూ ఉంటున్నాయి కనుక తాగడానికి ఉపయోగించే నీళ్ళతో చేతులు కడగవద్దు.
*నాకు తోచిన కొన్ని ఆలోచనలను మీ ముందు ఉంచాను. వీటిని మరింత విస్తృతపరచవలసిందిగాను, ప్రజల్లోకి ప్రభావశీలంగా తీసుకువెళ్ళడానికి సలహాలను కోరుచున్నాను*.
-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
No comments