జననం: ఆగష్టు 2,1876- మచిలీపట్నం. మరణం: జూలై 4,1963- విజయవాడ. పింగళి...
జననం: ఆగష్టు 2,1876- మచిలీపట్నం. మరణం: జూలై 4,1963- విజయవాడ.
పింగళి వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న ప్రస్తుత మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు గ్రామములో హనుమంతరాయుడు మరియు వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించాడు. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్ధి. ప్రాథమిక విద్య చల్లపల్లి లోను, మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలలోనూ అభ్యసించాడు. ఉన్నత పాఠశాల పూర్తిచేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయుటకు కొలంబో వెళ్లాడు.
ఉద్యమాలలో పాత్ర 19 ఏళ్ల వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికా లో జరుగుతున్న బోయర్ యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశాడు. గాంధీతో వెంకయ్యకు యేర్పడిన ఈ సాన్నిహిత్యం అర్ధశతాబ్దం పాటు నిలిచింది.
అభిమాన విషయం ఆనాటి నుండి జాతీయ జెండా ఎలా ఉండాలనే సమస్యనే తన అభిమాన విషయంగా పెట్టుకొని, దాని గురించి దేశంలో ప్రచారం ప్రారంభించాడు. 1913 నుండి ప్రతీ కాంగ్రెస్ సమావేశానికి హాజరై, నాయకులందరితోనూ జాతీయ పతాక రూపకల్పన గురించి చర్చలు జరిపాడు. 1916 లో "భారతదేశానికొక జాతీయ జెండా " అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించాడు. ఈ గ్రంథానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన కేంద్రమంత్రి సర్ బి.ఎన్.శర్మ ఉత్తేజకరమైన పీఠిక రాసి, వెలయించాడు. అప్పట్లో వెంకయ్య బందరు జాతీయ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసేవాడు. ఆనాడు అతను చిత్రించిన పతాకమే నేటి త్రివర్ణ జాతీయ జెండాగా రూపొందింది.
త్రివర్ణ పతాక ఆవిష్కరణ 1916 లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. 1919 లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. 1921 లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముని సూచించిన ప్రకారంగానే, ఒక జెండాను సమకూర్చాడు వెంకయ్య. అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు, సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించాడు.
గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణపతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే. మన జాతీయ పతాకం ఒక ఆంధ్రుని ద్వారా రూపొందడం ఆంధ్రులందరికీ గర్వకారణమైన విషయం. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించాడు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింప చేస్తుందన్నారు. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారత దేశం, సత్యాహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం.
1947, జూలై 22 వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ , మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం...! వృద్ధాప్యంలో ఆర్థిక బాధలు ఆయనను చుట్టుముట్టాయి. మిలటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగరులో ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో ఆయన గుడిసె వేసుకొని దారిద్ర్య జీవితాన్ని గడపవలసి వచ్చింది. ఆయన ఏనాడూ ఏ పదవినీ ఆశించలేదు. కాని ఆయన నిస్వార్థ సేవను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం. మన జాతికొక కేతనాన్ని నిర్మించాడాయన. ఇతర దేశాలలో జాతీయ పతాక నిర్మాతలను ఆ ప్రభుత్వాలు ఎంతగానో గౌరవిస్తాయి. వారికి కావలసిన వసతులను ప్రభుత్వాలే ఉచితంగా సమకూరుస్తాయి. మన ప్రభుత్వం వెంకయ్యని గుర్తించకపోవటం శోచనీయం, జాతీయపతాకాన్ని గురించి ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో, మన పతాక నిర్మాత ఒక తెలుగువాడు అని వ్రాశారే కాని, వెంకయ్య పేరుని సూచించకపోవడం విచారకరం.
తెలుగువారు తమ వారిని గౌరవించటంలో ఏనాడూ ముందంజవేయలేదు. జీవితాంతం దేశం కొరకు స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా మొహం వాచి నానా అగచాట్లు పడినట్లు ' త్రివేణి ' సంపాదకులు డా. భావరాజు నరసింహారావుగారు పేర్కొన్నారు. అంతిమదశలో విజయవాడలో డా. కె.ఎల్.రావు, డా.టి.విఎస్.చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు మున్నగు పెద్దలు 15-1-1963 న వెంకయ్య గారిని సత్కరించి వారికి కొంత నిధిని అందించారు. ఆ సత్కారం తరువాత ఆరు నెలలకే [1963],[జూలై 4]న వెంకయ్య దివంగతుడయ్యాడు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments