పరమవీరచక్ర ప్రతి సైనికుడికీ ఒక బంగారుకల. నిరుపమాన శౌర్య, అద్భుత సాహసం, సర్వస్వార్పణ చేసే తెగువ, రాజీలేని దేశభక్తి.... వీటన్నిటికీ చెరగని ...
పరమవీరచక్ర ప్రతి సైనికుడికీ ఒక బంగారుకల. నిరుపమాన శౌర్య, అద్భుత సాహసం, సర్వస్వార్పణ చేసే తెగువ, రాజీలేని దేశభక్తి.... వీటన్నిటికీ చెరగని చిహ్నం పరమవీరచక్ర.
మూడున్నర సెంటీమీటర్ల వ్యాసం ఉన్న ఈ కంచుపతకం, దానికి అల్లుకున్న 32 మి.మీ ఊదారంగు రిబ్బన్ - ఇది ఛాతీ మీద అలంకరించుకోవాలన్నదే ప్రతి వీరజవాను కల.
అలాంటి పరమవీరచక్ర పతకానికి రూపకల్పన చేసింది ఒక విదేశీ మహిళ.
ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ పౌరసత్వాన్ని పొంది, పరదేశంలోనే అయినవాళ్లు, ఆస్తిపాస్తులు ఉంటూ అరువుభారతీయతను చూపించే మహిళ కాదు ఆమె. పుట్టింది ఎక్కడో స్విట్జర్లాండ్ లో అయినా కట్టుబొట్టు, జీవన వ్యవహారాలన్నిటా అణువణువునా భారతీయత నిండిన వ్యక్తి ఆమె. మరాఠీ, సంస్కృత భాషల్లో అద్భుత ప్రావీణ్యం ఆమె సొంతం.
ఆమె పేరు ఇవా వాన్ మే డిమారోస్ , ఆ పేరు ఆమె పుట్టిన స్విట్జర్లాండ్ లో ఎవరికీ తెలియదు. కానీ సావిత్రీ బాయ్ ఖానోలికర్ అని అడగండి. మన దేశంలో పాతతరం వారు కొద్దిమందికి తెలుస్తుంది. ఆమె వ్రాసిన సెయింట్స్ ఆఫ్ మహారాష్ట్ర అన్న పుస్తకం (భారతీయ విద్యాభవన్ ప్రచురణ) బహుళ ప్రజాదరణ పొందింది. వేలాది ప్రతులు అమ్ముడైంది.
ఈవా జులై 20. 1913 న స్విట్జర్లాండ్ లోని న్యూ చాటెల్ లో జన్మించింది. తండ్రి హంగేరియన్. ఆయన పేరు ఆండ్రీ డీ మాడే. తల్లి రష్యన్. పేరు మార్తె హెజ్డ్ జెల్డ్. తల్లి చిన్నప్పుడే పోయింది. దానితో ఈవా మనసు ఆధ్యాత్మికం వైపు మరలింది. గంటలు గంటలు సముద్రం ఒడ్డున గడిపేది. అలలు తల్లి వక్షస్థలంగా, ఇసుక తిన్నెలు తల్లి ఒడిలా అనిపించేది. క్రమేపీ ఆమె ధ్యాస భారతీయ ఆధ్యాత్మికత వైపు మరలింది.
ఈ సమయంలోనే ఇంగ్లండ్ లోని సాండ్ హర్ట్స్ లో సైనిక శిక్షణ పొందుతూ సెలవులు గడిపేందుకు వచ్చిన భారత సైనికాధికారి విక్రమ్ ఖానోలికర్ తో ఆమెకి పరిచయం అయింది. పరిచయం ప్రేమగా మారింది. అది జరిగింది 1929లో.
1932 లో ఆమె జెనీవా వదలి భారత్ కి వచ్చేసింది. ఈవా తండ్రి దీన్ని వ్యతిరేకించాడు. కానీ ఆమె పట్టుదల ముందు ఆయన పంతం నిలబడలేదు.
ఈవా, విక్రమ్ లు లక్నోలో స్థిరపడ్డారు.
అక్కడే వారిద్దరికీ వివాహం అయింది. పెళ్లితో ఈవా పదహారణాల భారతీయ వనితగా మారిపోయింది.
ఆమె పేరు సావిత్రిబాయి ఖానోలికర్ అయింది.
ఇక్కడి భాషను, కట్టుబొట్టు, రీతి రివాజుల్ని నేర్చుకుంది. పురాణ, శాస్త్రాదులను అధ్యయనం చేసింది. మరాఠీ, సంస్కృతాలను అవుపోసన పట్టింది. శ్రీరామకృష్ణ వేదాంతాశ్రమానికి సన్నిహితురాలై పలు సేవా కార్యక్రమాలను నిర్వహించింది. దేశ విభజన సమయంలో మహిళా శరణార్ధుల కోసం పలు సేవా శిబిరాలను కూడా నిర్వహించింది.
సప్త సముద్రాలకవతల నుంచి మన దేశానికి వచ్చిన సావిత్రీబాయి పరమవీరచక్ర పతకాన్ని రూపొందించిన వైనం కూడా చాలా ఆసక్తిదాయకం.
మేజర్ జనరల్ విక్రమ్ ఖానోలికర్ కి మేజర్ జనరల్ హీరాలాల్ అటల్ కి మంచి స్నేహం ఉండేది. 1948 ప్రాంతాల్లో భారతీయ సైన్యానికి సర్వోత్తమ పోరాటపటిమకి ప్రతీకగా ఇచ్చేందుకు పరమవీర చక్ర అన్న పతకాన్ని రూపొందించే బాధ్యత అటల్ పై బడింది. ఆ పతకం ఎలా ఉండాలన్న విషయంలో ఆయన తర్జన భర్జనలు పడుతూ ఉండేవారు. మన ప్రాచీన భారతీయ సంస్కృతి, సభ్యత, గౌరవోజ్వల పరంపరలకు పరమవీర చక్ర ప్రతీకగా ఉండాలని ఆయన పదేపదే అంటూండేవారు. ఈ విషయంలో ఆయన విక్రమ్, సావిత్రీబాయిలతో పలుమార్లు చర్చలు జరిపేవారు.
పురాణయుగంలో వృత్రాసురుడిని వధించేందుకు మహర్షి ధధీచి తన వెన్నెముకనే ఆయుధంగా చేసుకొమ్మని దేవతలకు తన శరీరాన్ని ఇచ్చేశాడు. ఆ వెన్నెముకే వజ్రాయుధం అయింది. అలా వజ్రాయుధం అద్భుత త్యాగానికి, అసమాన పౌరుషానికి, అజేయ శక్తికి ప్రతీక. సావిత్రీబాయి అదే విషయాన్ని హీరాలాల్ అటల్ కి చెప్పింది. అంతే కాకుండా టిబెటన్ సాహిత్యంలో లభించే వజ్రాయుధం నమూనాని కూడా ఆయనకు చూపించింది.
భగవతీ ప్రసాదంగా ఛత్రపతి శివాజీకి లభించిన పవిత్ర భవానీ ఖడ్గం హైందవీ రాజ్యస్థాపనకి దోహదం చేసింది.
నాలుగు వజ్రాయుధాలు, ఇరువైపులా భవానీ ఖడ్గాలు, మధ్యలో అశోకచిహ్నం ఉండేలా పరమవీర చక్రను రూపొందించారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే మొట్టమొదటి పరమవీరచక్ర సావిత్రీబాయికి వరుసకు అల్లుడయ్యే మేజర్ సోమనాథ శర్మకే దక్కింది.
1947 లో కశ్మీర్ లో పాక్ చొరబాటుదారులను ప్రతిఘటిస్తూ పరమోన్నత త్యాగం చేసిన మేజర్ శర్మ సోదరుడు విక్రమ్, సావిత్రీబాయిల కుమార్తెను వివాహం చేసుకున్నారు.
తరువాత కాలంలో సావిత్రీబాయి సైనికులు, వారి కుటుంబసభ్యుల సంక్షేమంపై దృష్టి సారించింది. సైనికుల భార్యల సంక్షేమం కోసం నారీ ఉపకార్ సేన అన్న సంస్థను స్థాపించింది. దేశ రాజధానిలో సమాజసేవాకార్యక్రమాల్లో తనదైన విశిష్టస్థానాన్ని సంపాదించుకుంది.
1952 లో విక్రమ్ చనిపోవడంతో సావిత్రీబాయి ఒంటరిదైపోయింది. ఆమె పూర్తిగా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లిపోయింది. శ్రీరామకృష్ణ పరమహంసనే తన పరమగురువుగా భావించి, నిత్యం ధ్యానంలో మునిగిపోయింది.
No comments