Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అసలు ఎన్నార్సీ నేపథ్యం ఏమిటి - అస్సాం ఉద్యమం- What is NRC, Why NRC

అరబ్బు వాడు, ఒంటె ఎడారిలో ఒక రాత్రి మజిలీ చేశారు. రాత్రి అయ్యే కొద్దీ చలి పెరిగింది. లోపల నిప్పు రాజేసుకుని అరబ్బు వాడు చలి కాచుకుంటున్నాడ...

అరబ్బు వాడు, ఒంటె ఎడారిలో ఒక రాత్రి మజిలీ చేశారు. రాత్రి అయ్యే కొద్దీ చలి పెరిగింది. లోపల నిప్పు రాజేసుకుని అరబ్బు వాడు చలి కాచుకుంటున్నాడు. ఒంటె వెచ్చదనం కోసం గుడారంలోకి తల దూర్చింది. అరబ్బు వాడు పట్టించుకోలేదు. తల తరువాత మెడ దూర్చింది. ‘పోనీలే.. చలిగా ఉందేమో’ అనుకుని అరబ్బు వాడు ఒక పక్కకి జరిగాడు. ఒంటె ముందుకాళ్లు, మొండెం గుడారంలోకి దూర్చింది. మన వాడు ఇంకొంచెం పక్కకి ఒదిగాడు. ఒంటె మొత్తం లోపలకి వచ్చేసింది. మన వాడు గుడారం వదిలి బయటకి వచ్చేశాడు. బయట చలికి గజగజవణుకుతూ ఉండిపోయాడు.
అసొంలో గత ఏడు దశాబ్దాలుగా జరుగుతున్నది ఇదే. ఒంటెకు బదులు బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారుడు అని, అరబ్బు వాడికి బదులు అసొం స్థానికులు అనకుంటే చాలు. అసొం సమస్య అర్థమైపోతుంది.
అసొం రాష్ట్రంలో పౌరుల జాతీయ జాబితా (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ – ఎన్నార్సీ) పై చెలరేగుతున్న అనవసర వివాదం కుహనా సెక్యులర్‌ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోతున్నాయో చెప్పక చెబుతుంది. విదేశీ అక్రమ చొరబాటు దారులను ఏరివేయడం విషయంలో రెండో ఆలోచనకు తావుండరాదు. ప్రపంచంలో ఏ దేశమూ అక్రమ చొరబాటుదారులను సహించదు. తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, తన జనాభాకు ఉన్న హక్కులను కాపాడుకోవడం, అక్రమ చొరబాటుదారులను నిరోధించడం ప్రతి ప్రభుత్వపు పరమ కర్తవం. అసొంలో రాష్ట్ర ప్రభుత్వం ఇదే చేస్తోంది. జాతీయ పౌరుల జాబితా దీని కోసమే తయారవుతోంది. కానీ బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులను ఓటుబ్యాంకులుగా లెక్కలేసుకునే వారు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.
ఎన్నార్సీ అంటే ఏమిటి ?
ఎన్నార్సీ అంటే నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్‌ లేదా జాతీయ పౌరుల జాబితా. అసొంలో నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. దీని లక్ష్యం స్వదేశీయులకు భద్రత కల్పించడం, అక్రమ చొరబాటుదారులను గుర్తించి, ఏరివేయడం. కానీ ఈ (ఎన్నార్సీ) విషయంలో కుహనా సెక్యులర్‌ శక్తులు రగడ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. బంగ్లాదేశీ అక్రమ చొరబాటు దారులను ఓటుబ్యాంకులుగా పరిగణించే వారు, వారి ఆధారంగా తమ రాజకీయాలు చేస్తున్న వారు మాత్రమే ఎన్నార్సీ ని వ్యతిరేకిస్తున్నారు. అసొంలో విదేశీ చొరబాటుదారుల గుర్తింపు దగ్గరే ఈ రాజకీయ శక్తులు వివాదాలు సష్టిస్తున్నాయి. సమస్యను కేవలం హిందూ-ముస్లిం కోణం నుంచే చూడటం సరైనది కాదు. ముస్లిం బంగ్లాదేశీ చొరబాటుదారులను, భారతీయ ముస్లింలను ఒకే గాట కట్టేందుకు ప్రయత్నించడం భారతీయ ముస్లింలకు ఘోర అన్యాయం చేసినట్టుగానే భావించాలి.
చరిత్రాత్మక అసొం ఒప్పందంలో భాగంగా 1971 మార్చి 24 తరువాత అసొంలోకి వచ్చిన వారిని గుర్తించి, వారిని పంపించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది ఉంది. దీనికోసం 1951లో రూపొందించిన జాతీయ పౌరుల జాబితా (ఎన్నార్సీ) ని సంస్కరించి అప్‌డేట్‌ చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఎన్నార్సీ ని సంస్కరించి, అప్‌డేట్‌ చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాబట్టి ఇప్పుడు పౌరుల జాబితా సవరణ రాజ్యాంగ బద్ధమైనది మాత్రమే కాదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరుగుతోంది. అంతకుమించి ఇదొక చారిత్రిక అవసరం.
ఎన్నార్సీ ఎలా రూపొందింది ?
అసొంలోని బీజేపీ ప్రభుత్వం రెండు విడతలుగా పౌరుల జాబితా ముసాయిదాను వెలువరించింది. మొదటి జాబితా జనవరి 1, 2018 న వెలువరించింది. రెండవ జాబితా జులై చివరి వారంలో వెలువరించింది. ఈ జాబితా తయారీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 32 ఎన్నార్సీ కేంద్రాలను తెరిచింది. ఆన్‌లైన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి నోటీసులు ఇచ్చింది. తమ పౌరసత్వాన్ని ధ్రువీకరించే పత్రాలను సమర్పించమని కోరింది. ఈ విధంగా దాదాపు 3.29 కోట్ల మంది ప్రజలు తమ వద్దనున్న పౌరసత్వ ఆధారాలను సమర్పించారు. దాని ఆధారంగా చాలామందిని ప్రభుత్వం వివరణ కోరింది. ఆ తరువాత 2.89 కోట్ల మందితో కూడిన తుది ముసాయిదా జాబితాను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 40 లక్షల మందికి చోటు దక్కలేదు. వీరందరికీ తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు మళ్లీ అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఇందులో 2.40 లక్షల మందిని ”డీ” ఓటర్లు లేదా డౌట్‌ ఫుల్‌ ఓటర్లుగా గుర్తించారు. అంటే వారు ఈ జాబితా తయారీ సమయంలో అందుబాటులో లేరు. వారు తమ ఊళ్లకు తిరిగివచ్చి, పత్రాలను సమర్పిస్తే వారి పేర్లు జాబితాలో చేర్చుతారు. మిగతా వారు ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్‌ 30 వరకూ తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించాలి. వాటిని పరిశీలించిన తరువాత, వారు తమ పౌరసత్వాన్ని నిరూపించు కోలేకపోతే చొరబాటుదారులుగా పరిగణిస్తారు.
అసలు ఎన్నార్సీ నేపథ్యం ఏమిటి ?
ఎన్నార్సీ గురించి తెలుసుకునే ముందు అసలు అసొం, ఈశాన్య భారతంలో బంగ్లాదేశీ అక్రమ చొరబాటు గురించి తెలుసుకోవాలి. 1896లో అసొంలో భయంకరమైన భూకంపం వచ్చింది. అసొం జనాభా నాలుగింట ఒక వంతుకు పడిపోయింది. అంతమంది భూకంపానికి బలైపోయారు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి జనాభా తగ్గడంతో పన్నుల నుంచి వచ్చే ఆదాయం పడిపోయింది. దీంతో వారు జనసాంద్రత ఉన్న తూర్పు బెంగాల్‌ (ఇప్పటి బంగ్లాదేశ్‌) నుంచి అసొంలోకి వలసలను ప్రోత్సహించారు. అప్పట్లో ”గ్రో మోర్‌ ఫుడ్‌” ఉద్యమం పేరిట తూర్పు బెంగాల్‌ ముస్లింలకు అసొంలో ఎక్కడికైనా వెళ్లేందుకు ”ఫ్యామిలీ టికెట్‌” ను ఇచ్చారు. అంటే మొత్తం కుటుంబానికి ఒకే టికెట్‌. అదీ ఇష్టం వచ్చిన చోటకు వెళ్లేందుకు. వెళ్లినచోట వారికి ప్రభుత్వం భూమిని ఇచ్చింది. 1911 జనాభా లెక్కల నాటికి అసొంలో తూర్పు బెంగాల్‌ ముస్లింల జనాభా గణనీయంగా పెరిగింది. ఇది చూసి కొందరు బ్రిటిష్‌ అధికారులే ఆందోళన చెందారు. ”గ్రో మోర్‌ ఫుడ్‌” ఉద్యమం ”గ్రో మోర్‌ ముస్లిమ్స్‌” గా మారిపోయిందని వారు వ్యాఖ్యానించారు. 1931 నాటికి పశ్చిమ, దక్షిణ అసొంలలో తూర్పు బెంగాల్‌ వలసదారుల జనాభా పుట్టగొడుగుల్లా పెరిగింది. ఆ జనాభా లెక్కల కమీషనర్‌ ఎఫ్‌సి ములన్‌ ”మరో అరవై ఏళ్లలో అస్సాం స్థానికులు ఒక్క శివసాగర్‌ జిల్లాలో మాత్రమే మెజారిటీలో ఉండగలరు. మిగతా అన్ని చోట్లా తూర్పు బెంగాల్‌ వలసదార్లదే జనాధిక్యం” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. 1939 నాటికి సర్‌ సాదుల్లా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన కాలంలో వలసలకు అడ్డూ అదుపూ లేకుండా పోయాయి. అప్పట్లో వలసదారులు
”ఊపరే అల్లా
నీచే సాదుల్లా
చలో రే భాయ్‌ ఓ సాలా
జా కరే అల్లా”
(పైన అల్లా ఉన్నాడు. కింద సాదుల్లా ఉన్నాడు. పదండి తమ్ముళ్లూ బావలూ.. అల్లా ఏం చేస్తే అదే జరుగుతుంది) అని పాటలు పాడుకుంటూ అసొం లోకి వచ్చేశారు. స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే స్వాతంత్య్రానికి పూర్వం తూర్పు బెంగాల్‌ నుంచి వలసలు ఒక పథకం ప్రకారం జరిగాయి. దీనివల్ల దేశ విభజన నాటికే జనాభా పరమైన అసమతౌల్యాలు తలెత్తాయి. దేశ విభజన నాటికే అసొంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాలు ముస్లిం జనాధిక్య ప్రాంతాలుగా మారిపోయాయి. అప్పట్లో అసొం సహా మొత్తం ఈశాన్య భారతాన్ని తూర్పు పాకిస్తాన్‌లో అంతర్భాగంగా చేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరిగింది కూడా. అసొంను ”సీ” గ్రూప్‌లో తూర్పు బెంగాల్‌తో కలిపి ఉంచారు. అంటే దేశ విభజన జరిగినప్పుడు సీ గ్రూప్‌ తూర్పు పాకిస్తాన్‌గా మారుతుంది. ఈ కుట్రను భగ్నం చేసేందుకే క్విట్టిండియా ఉద్యమ సమయంలో దేశంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసినా, అసొం ప్రభుత్వాధినేత భారతరత్న గోపీనాథ్‌ బోర్డొలోయ్‌ గాంధీగారి, కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశాలను ధిక్కరించి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. ఆయన తూర్పు బెంగాల్‌ను, అసొంను ఒకే గాటన కట్టడాన్ని గట్టిగా వ్యతిరేకించిన కారణంగానే అసొం, మిగతా ఈశాన్య రాష్ట్రాలు భారత్‌తో ఉండిపోయాయి. అప్పటికీ ముస్లిం జనాధిక్యత వల్ల సిల్హట్‌ జిల్లా తూర్పు పాకిస్తాన్‌లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో బెంగాలీ ముస్లింలు ఒక నినాదం ఇస్తూండేవారు. ‘సిల్హట్‌ నిలామ్‌ గణ వోటే.. అసొం నిబో లాఠీర్‌ చోటే’ (సిల్హట్‌ను ఓట్ల సాయంతో గెలుచుకున్నాం. మిగతా అసొంను లాఠీల సాయంతో గెలుచుకుంటాం) – ఇదీ ఆ నినాదం. తొలి ప్రధాని పండిత్‌ నెహ్రూ కూడా అసొంలో అక్రమ చొరబాట్లు జరుగుతున్నాయని అంగీకరించారు. అసొంలో అయిదు లక్షల మంది అక్రమ చొరబాటుదారులు ఉన్నారని ఆయన స్వయంగా లోక్‌సభలో ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే దేశ విభజన అనంతరం అప్పటి గోపీనాథ్‌ బోర్డొలోయ్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో అసొం పౌరుల జాబితాను తయారు చేయాలని సంకల్పించింది. గోపీనాథ్‌ బొర్డోలోయ్‌ 1950లో మరణించిన తరువాత, బిష్ణు రామ్‌ మేధీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హయాంలో నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ 1951లో విడుదల అయింది. దీనిద్వారా స్థానికులను, స్వదేశీయులను గుర్తించవచ్చు. చొరబాటుదారులను గుర్తించి, వారిని బహిష్కరించవచ్చు.
ఓటు రాజకీయాలతో చొరబాటుదార్లకు పెద్దపీట
కానీ ఓటు బ్యాంక్‌ రాజకీయాలు అలవాటైన కుహనా సెక్యులరిస్టు పార్టీలు చొరబాటుదారులకు ఎర్ర తివాచీ పరచడం, వారికి రేషన్‌ కార్డు ఇప్పించడం, ఓటరు గుర్తింపు కార్డు దయచేయిం చడం వంటివి నిరాఘాటంగా చేస్తూ వచ్చాయి. ఈ ఓటర్లను ఓటు బ్యాంకులుగా ఆరాధించడం, వారికి అనుకూలంగా విధానాలను రూపొందించడం నిర్లజ్జగా సాగుతూ వచ్చింది. నిజానికి ఎన్నార్సీని ఎప్పటికప్పుడు సవరించాలి. అప్‌డేట్‌ చేయాలి. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఓటుబ్యాంకు రాజకీయాల్లో పడి ఈ పనిని పక్కన పెట్టాయి. ఫలితంగా ఇప్పుడు అసొంలోని ఆరేడు జిల్లాలు బంగ్లాదేశీ ముస్లిం జనాధిక్య జిల్లాలుగా మారిపోయాయి. 126 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 30 స్థానాల్లో కేవలం బంగ్లాదేశీ మూలానికి చెందిన వారు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే పరిస్థితి ఉంది.
1965 సమయంలో అప్పటి ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి, ¬ంమంత్రి గుల్జారీలాల్‌ నందాలు పాకిస్తాన్‌ నుంచి చొరబాటును నిరోధించేందుకు ‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్‌ఫిల్ట్రేషన్‌ ఫ్రమ్‌ పాకిస్తాన్‌ చట్టాన్ని’ అమలులోకి తెచ్చారు. ఇది చాలా సమర్థవంతంగా పనిచేసింది. కానీ 1968 ప్రాంతంలో బిమలా ప్రసాద్‌ చలిహా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇద్దరు మంత్రులు – ఫకద్దీన్‌ అలీ అహ్మద్‌ (ఈయన అనంతర కాలంలో రాష్ట్రపతి అయ్యారు), మొయినుల్‌ హక్‌ చౌదరిల ఒత్తిడితో ఈ చట్టాన్ని నీరుగార్చారు. ఫలితంగా మళ్లీ అక్రమ చొరబాట్లు పెరిగాయి.
దేశ విభజన తరువాత తూర్పు బెంగాల్‌ తూర్పు పాకిస్తాన్‌గా, 1971 భారత-పాక్‌ యుద్ధం తరువాత బంగ్లాదేశ్‌గా మారింది. 1971 సమయంలో పాకిస్తాన్‌ సేన అత్యాచారాల ఫలితంగా లక్షలాది మంది శరణార్థులు అసొం, బెంగాల్‌లలో ప్రవేశించారు. ఫలితంగా 1971 భారత-పాక్‌ యుద్ధం జరిగింది. ఆ తరువాత బంగ్లాదేశ్‌ ఏర్పడింది. కానీ చొరబాటు తగ్గలేదు. బంగ్లాదేశ్‌లోని కొందరు మేధావులు బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న జనాభాకు చోటు చాలదు
కాబట్టి, భారత్‌లోని భూములను ఆక్రమించుకోక తప్పదనికూడా వాదిస్తారు. దీనిని వారు హిట్లర్‌ ప్రతిపాదించిన లెబెన్‌ స్రామ్‌ (లివింగ్‌ స్పేస్‌) సిద్ధాంతం ఆధారంగా సమర్ధిస్తున్నారు.
చరిత్రాత్మక అసొం ఉద్యమం
1977లో అసొంలో లోకసభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో దరంగ్‌ లోకసభ నియోజకవర్గం నుంచి గెలిచిన హీరాలాల్‌ పట్వారీ కొన్ని నెలలకే చనిపోయారు. దీనితో 1978లో అక్కడ ఉప ఎన్నిక జరపవలసి వచ్చింది. ఏడాదిలోపు ఒక్క దరంగ్‌ నియోజకవర్గంలోనే 78 వేలమంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. దీంతో అసొం ప్రజలు అక్రమ చొరబాట్ల విషయంలో అప్రమత్తమయ్యారు. 1979 నుంచి 1985 వరకూ అసొంలో చరిత్రాత్మక మైన ఉద్యమం జరిగింది. అక్రమ చొరబాట్లకు వ్యతిరేకంగా ప్రపంచ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని ఉద్యమం జరిగింది. ఆ ఒప్పందం చివరికి 1985 ఆగస్టు 15 నాటి అసొం ఒప్పందానికి దారితీసింది. బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదార్ల ఏరివేత, దాని కోసం ఎన్నార్సీ తయారీ ఈ ఒప్పందం వల్లే అవసరమౌతాయి.
ఎన్నార్సీ పై ఎందుకింత రగడ ?
తమాషా ఏమిటంటే ఎన్నార్సీపై కాంగ్రెస్‌, తణమూల్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు గొంతు చించుకుని గగ్గోలుపెడుతున్నారు. పార్లమెంట్లో అల్లరి చేస్తున్నారు. మమతా బెనర్జీ వంటి వారు అంతర్గత యుద్ధం గురించి, రక్తపుటేరులు పారించడం గురించి మాట్లాడుతున్నారు. కానీ అసొంలో ఎలాంటి గడబిడ లేదు. గందరగోళం లేదు. ఒక్కచోట కూడా అల్లర్లు జరగలేదు. అసొంలో కాంగ్రెస్‌ నేత తరుణ్‌ గొగోయ్‌ ఎన్నార్సీని స్వాగతించారు. ఇది చాలా అవసరమని పేర్కొన్నారు.
నిజానికి ఒక్క అసొంలోనే దాదాపు 80 లక్షల మంది బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులున్నారని కాంగ్రెస్‌, బీజేపీ యేతర ప్రభుత్వాలే పలుమార్లు పార్లమెంటులో ప్రకటించాయి. ఈ విషయాన్ని కమ్యూనిస్టు నేత, ఒకప్పటి హోం మంత్రి ఇంద్రజిత్‌ గుప్త స్వయంగా లోకసభలోనే ప్రకటించారు. సీపీఎం నేత, ఒకప్పటి బెంగాల్‌ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య బంగ్లాదేశీ అక్రమ చొరబాటు దారుల విషయంలో ప్రశ్నలు లేవనెత్తారు. వీరిని అరికట్టడంలో అప్పటి కాంగ్రెస్‌ పాలిత కేంద్ర ప్రభుత్వం విఫలమౌతోందని ఆయన విమర్శించారు. 2005లో మమతా బెనర్జీ ఈ విషయంలో పార్లమెంటును దద్దరిల్ల చేశారు. ఇప్పుడు ఆ పార్టీలు, వర్గాలే దీనిపై పార్లమెంటులో గందరగోళం చేస్తున్నారు. ముఖ్యంగా మమతా బెనర్జీ రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నారు. నిజానికి ఎన్నార్సీ జాబితా విడుదలైన తరువాత నుంచి ఆమె అసొం బెంగాల్‌ సరిహద్దుల్లో బంగ్లాదేశీలు రాకుండా గస్తీని కట్టుదిట్టం చేశారు. ఒకవైపు ఇలా చేస్తూనే మరోవైపు ఎన్నార్సీ వల్ల ముస్లింలకు నష్టం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు. కాంగ్రెస్‌ కూడా అసొంలో ఎన్నార్సీని సమర్థిస్తోంది. జాతీయ స్థాయిలో మాత్రం అల్లరి చేస్తోంది.
చట్టసభలో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా ఈ కుహనా సెక్యులర్‌ శక్తులకు దీటైన సమాధానం ఇచ్చారు. భారతదేశం ధర్మసత్రం కాదని, నలభై లక్షల మంది చొరబాటుదారుల కోసం జాతీయ వనరులను ఖర్చుచేయాలన్న వాదనను ఆయన గట్టిగా ఖండించారు. నిజానికి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఓట్ల రాజకీయాల్లో పడి చేయలేకపోయిన పనిని బీజేపీ ప్రభుత్వం ధైర్యంతో, పట్టుదలతో చేస్తోందని అన్నారు.
అక్రమ చొరబాటు అసొంకి మాత్రమే పరిమితమైనది కాదు. అది నాగాలాండ్‌, మిజోరాం, మణిపూర్‌, మేఘాలయలకు పాకింది. ఈ విషయంలో జనరల్‌ ఎస్‌ కె సిన్హా అసొం గవర్నర్‌గా ఉన్న కాలంలో ఒక ప్రత్యేక నివేదికను అప్పటి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. బెంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌ లలోనూ చొరబాటుదారులు గణనీయంగా ఉన్నారు. బంగ్లాదేశీయుల అక్రమ చొరబాటు ఒక జాతీయ సమస్య. ఈ విషయంలో చిల్లర రాజకీయాలు తగవు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీకి తావుండకూడదు. కేవలం గుప్పెడు ఓట్ల కోసం రాజకీయాలు చేయడం దేశద్రోహమే అవుతుంది.
సైప్రస్‌ నుంచి పాఠం నేర్చుకుందామా ?
సైప్రస్‌ చాలా చిన్న ద్వీపం. ఉత్తరాన గ్రీస్‌, దక్షిణాన టర్కీ ఉన్న దేశం. గ్రీక్‌ మూలానికి చెందిన సైప్రియాట్లు ఆ దేశం మూలనివాసులు. క్రమేపీ పేదరికంలో కొట్టుమిట్టాడుతూ యూరప్‌ దేశపు రోగిగా పేరొందిన టర్కీ నుంచి కూలీలు సైప్రస్‌కి వలస రావడం ప్రారంభించారు. వారి పట్ల గ్రీక్‌ సైప్రియాట్లు జాలి చూపించారు. పని కల్పించారు. నెమ్మదినెమ్మదిగా వారిని టర్కిష్‌ సైప్రియాట్లు అనడం ప్రారంభించారు. వారికి ఓటు హక్కులు కల్పించారు. క్రమేపీ దేశంలో దక్షిణాది ప్రాంతమంతా టర్కీ సైప్రియాట్ల పరమైపోయింది. చివరికి దేశ రాజధాని నట్ట నడుమ కంచె వేసి ఒక భాగాన్ని వలసవచ్చిన టర్కిష్‌ సైప్రియాట్లు కబ్జా చేసుకున్నారు. ఈ రోజు ఐక్యరాజ్య సమితి శాంతి సేన దేశ రాజధానిలో కంచెకి కాపలా కాస్తోంది. అచ్చు ఒంటె, అరబ్బు వాడి కథలా ఉంది కదూ! ఇదే పరిస్థితి నేడు అస్సాంలో ఉంది. రేపు బెంగాల్‌లో జరగబోతోంది. ఎల్లుండి ఝార్ఖండ్‌, బిహార్‌లలో రానుంది. సమయం ఉండగానే మేల్కొనాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అందుకే ఎన్నార్సీ ఒక జాతీయ అవశ్యకత. విదేశీయులను గుర్తించి ఏరివేయాల్సిన అవసరం ఉంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments