Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

లాలా లజపతరాయ్ జీవితం -Lala LajpatRai life in Telugu

అమాయక పౌరుల మీద దాడులకు దిగే ప్రభుత్వానికి నాగరిక ప్రభుత్వమని చెప్పుకునే హక్కు లేదు. అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవు కూడా!’....


అమాయక పౌరుల మీద దాడులకు దిగే ప్రభుత్వానికి నాగరిక ప్రభుత్వమని చెప్పుకునే హక్కు లేదు. అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవు కూడా!’. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో పంజాబ్‌ సింహమంటూ కీర్తి పొందిన లాలా లజపతిరాయ్‌ ఒక సందర్భంలో అన్నమాటలివి. ఆ మాటలు ఆయన కన్నుమూసిన రెండు దశాబ్దాలకు నిజమయ్యాయి. 1928లో జేమ్స్‌ ఏ స్కాట్‌ అనే బ్రిటిష్‌ పోలీసు ఉన్నతాధికారి విచక్షణ రహితంగా కొట్టిన లాఠీ దెబ్బలతో కన్నుమూసిన లాలా లజపతిరాయ్‌ ఆ క్షణంలో మరొక శాపం కూడా ఇచ్చారు. ‘ఇవాళ నా గుండెల మీద పడిన లాఠీ దెబ్బలు బ్రిటిష్‌ సామ్రాజ్య శవపేటికకి చివరిగా కొట్టిన మేకులవుతాయి.’  లాల్‌ పాల్‌ బాల్‌ త్రయంలో ఒకరిగా భారతదేశ చరిత్రలో లజపతిరాయ్‌కి ఖ్యాతి ఉంది. లాల్‌ అంటే లజపతిరాయ్‌. బెంగాల్‌ విభజన సమయంలో ఆ మహానుభావులు ముగ్గురూ జాతిని కదిలించిన తీరును బట్టి అలా పిలవడం పరిపాటి. కానీ లజపతిరాయ్‌కి అంతకు మించిన ఘనత ఎంతో ఉంది. ఆయన బహుముఖ ప్రజ్ఞశాలి. లజపతిరాయ్‌ ఉద్యమకారుడు. అతివాదుల వైపు మొగ్గినవారాయన. గొప్ప మేధావి, రచయిత, సంస్కర్త. కార్మికోద్యమ నిర్మాత. ముస్లింల పట్ల ఆయన వ్యక్తం చేసిన భావాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి. భారతదేశ విభజన అనే చారిత్రక అంశాన్ని పరిశీలించిన వారు ఆయనది సంకుచిత దృష్టి కాదనీ, దూరదృష్టి అనీ ఓ ముగింపునకు రాక తప్పదు. 1946, 1947 రక్తపాతం, ఇతర రాజకీయ పరిణామాల సమయంలో చాలామంది నాటి నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలకి లజపతిరాయ్‌ అప్పుడు చెప్పిన మాటలు ఆసరా అయ్యాయనిపిస్తాయి కూడా.

లజపతిరాయ్‌ (జనవరి 28, 1865– నవంబర్‌ 17, 1928) పంజాబ్‌లోని దుఢికె అనే చోట పుట్టారు. తండ్రి రాధాకిషన్, తల్లి గులాబ్‌దేవి. రాధాకిషన్‌ ఉర్దూ, పర్షియన్‌ బోధించే పాఠశాల ఉపాధ్యాయుడు. చాలామంది బిడ్డల మీద తండ్రి ప్రభావం ఉన్నట్టే, చిన్నారి లజపతిరాయ్‌ మీద రాధాకిషన్‌ ప్రభావమే ఉండేది. అంటే ఇస్లాం ప్రభావమే. రాధాకిషన్‌ సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌ ఖాన్‌కు వీరాభిమాని. అహమ్మద్‌ ఖాన్‌ భారతీయ ముస్లిం సమాజ సంస్కరణకి తోడ్పడిన వారు. అయితే ఆ సంస్కరణ ఇస్లాం పరిధిని దాటని సంస్కరణ.  ముస్లింలు జాతీయ కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.ఇంగ్లిష్‌ జాతి భారత్‌ను వీడిపోయిందంటే భారతీయ ముస్లింలు హిందువుల పాలన కిందకి రావలసి వస్తుందంటూ ప్రచారం ఆరంభించినవారిలో ఆయన కూడా ఒకరు. ఆయన అభిప్రాయాలను, రచనలను రాధాకిషన్‌ అభిమానించేవారు. అందుకే  మతం మారకపోయినా ఇస్లాంను ఆరాధిస్తూ ఉండేవారు. తండ్రి ప్రభావమే బాల లజపతిరాయ్‌ మీద ఉంది. తల్లి గులాబ్‌దేవి మీద సిక్కు మత ప్రభావం ఉండేది. ఇలా రెండు వేర్వేరు మతాల ప్రభావాల మధ్యన హిందువుగానే ఎదిగినవారు లజపతి. తండ్రి ఎక్కడికి బదలీ అయితే అక్కడే లజపతిరాయ్‌ ప్రాథమిక విద్య సాగింది. ఇదంతా పంజాబ్, లాహోర్, నేటి హరియాణా ప్రాంతాలలో సాగింది. 1880లో ఆయన లాహోర్‌లోని ప్రభుత్వం న్యాయ కళాశాలలో చేరారు. ఇక్కడే లాలా హన్స్‌రాజ్, పండిత్‌ గురుదత్‌లతో పరిచయం ఏర్పడింది. వీరంతా అప్పటికే ఆర్య సమాజ్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. అప్పుడప్పుడే లజపతిరాయ్‌కి ఆర్య సమాజ్‌ మీద ఆసక్తి ఏర్పడుతోంది. కానీ ఆయన 1881లో బ్రహ్మ సమాజ్‌లో చేరారు. అందుకు కారణం తన తండ్రి ఆప్తమిత్రుడు పండిత్‌ శివనారాయణ్‌ అగ్నిహోత్రి. అటు మిత్రుల ద్వారా ఆర్య సమాజ్‌ ప్రభావం, ఇటు అగ్నిహోత్రి ద్వారా బ్రహ్మ సమాజ్‌ ప్రభావం కలసి లజపతిరాయ్‌ మీద ఉన్న ఇస్లాం ప్రభావాన్ని పలచబారేలా చేశాయి. బ్రహ్మ సమాజ్‌లో ఉన్న మూడు వర్గాలు, వాటి వివాదాలు లజపతిని పూర్తిగా ఆర్యసమాజ్‌ వైపు తిరిగిపోయేటట్టు చేశాయి. కానీ తండ్రి దయానంద బోధనలను ఇష్టపడేవారు కాదు. అయినప్పటికీ ఆర్య సమాజ్‌ను లజపతిరాయ్‌ ఎన్నుకున్నారు.  నిజానికి తాను ఆర్య సమాజ్‌ను అభిమానించినది అందులో కనిపించే మత సంస్కరణ, మత కోణాల నుంచి కాదనీ, అది ప్రబోధించిన జాతీయ దృక్పథంతోనే అనీ ఒక సందర్భలో చెప్పుకున్నారు కూడా. 1886లో ఆయన ప్లీడర్‌ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆ సంవత్సరమే ఎంతో ప్రతిష్టాత్మకమైన దయానంద ఆంగ్లో వేదిక్‌  పాఠశాలను కూడా స్థాపించారు. లాహోర్‌లో ఆరంభమైన ఈ పాఠశాల ఉద్దేశం సంప్రదాయక భారతీయ విద్యా వ్యాప్తి. ఆ సమయంలోనే హిస్సార్, లాహోర్‌లలో లజపతిరాయ్‌ మంచి న్యాయవాదిగా కూడా పేర్గాంచారు. బాగా ఆర్జించారు.  సామాజిక సేవ కోసం లాహోర్‌లోనే 20వ శతాబ్దం ఆరంభంలో భారతజాతి పునర్నిర్మాణ ఉద్దేశంతో ఆయనే సర్వెంట్స్‌ ఆఫ్‌ పీపుల్‌ సొసైటీని నెలకొల్పారు. ఆర్య సమాజ్, దయానంద బోధనలు లపజతిరాయ్‌లో అంత త్వరగా, అంత పెద్ద మార్పును తెచ్చాయి.
లజపతిరాయ్‌ రాజకీయ చింతన పూర్తిగా దయానంద, ఆర్య సమాజ్‌ ఆశయాలకు అనుగుణంగా ఎదిగినట్టు కనిపిస్తుంది. మొదట ఆయన ఇటలీ ఏకీకరణ ఉద్యమకారులు మేజినీ, గారిబాల్డీలను ఆరాధించారు. మితవాదుల నాయకత్వంలో సాగుతున్న జాతీయ కాంగ్రెస్‌ పోరాటంలో జాతీయ ప్రయోజనాలు పక్కకి జరిగిపోతున్నాయని ఆనాడు అభిప్రాయపడిన వారిలో లజపతిరాయ్‌ ఒకరు. మొదట హిందువులు ఐక్యమై, తరువాత బ్రిటిష్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నది కూడా ఆయన అభిప్రాయంగా ఉండేది. తరువాతి కాలాలలో హిందూమహాసభకు, మదన్‌మోహన మాలవీయకు దగ్గర కావడానికి దోహదం చేసినవి కూడా ఈ అభిప్రాయాలే. 1897లో ఆయన ఆరంభించిన హిందూ రిలీఫ్‌ మూవ్‌మెంట్‌ను చూసినా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. కరువు కాటకాలకు బాధితులైన భారతీయులను ఆదుకోవడంతో పాటు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నిస్సహాయిలుగా ఉండిపోతున్న భారతీయులు క్రైస్తవ మిషనరీల అదుపులోకి పోకుండా చూడడమే ఈ ఉద్యమం ఆశయం. మత సంస్కరణలు, వాటి లోతుపాతుల గురించి లజపతి ముందు నుంచి బాగా ఆలోచించారు. అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం కోణం నుంచి ఆయన భారతదేశాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు. అయినాగానీ,  భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావం, అందుకు సంబంధించిన ఆర్భాటాలేవీ కూడా లజపతిరాయ్‌కి పెద్దగా తెలియవు. ఆయన ప్లీడర్‌ చదువు పూర్తి చేయడానికి ఒక సంవత్సరం ముందు జాతీయ కాంగ్రెస్‌ బొంబాయిలో ఆవిర్భవించింది.  అప్పుడు లజపతిరాయ్‌ తండ్రి రోహ్‌తక్‌లో పని చేస్తున్నారు. తండ్రి దగ్గరే లజపతి రాయ్‌ ఉండేవారు. న్యాయవాద వృత్తిని ప్రారంభించిన రెండేళ్ల తరువాత 1888, 89 సంవత్సరాలలో ఆయన మొదటిసారి అలహాబాద్, బొంబాయిలలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సభలకు హాజరయ్యారు. హిస్సార్‌ నుంచి వెళ్లిన నలుగురు ప్రతినిధుల బృందంలో ఆయన కూడా ఒకరు. అందుకు లజపతిరాయ్‌ చాలా గర్వించారు కూడా. కానీ ఆయనకు కాంగ్రెస్‌ పోరాట పంథా గొప్పగా అనిపించలేదు. బొంబాయి సభలు ఆయనను నిరాశ పరిచనట్టు కూడా అనిపిస్తుంది. ‘కాంగ్రెస్‌ నాయకులు దేశ ప్రయోజనాల కంటే తమ కీర్తిప్రతిష్టలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అలా అని ఆయన కాంగ్రెస్‌కూ,  ఆ సంస్ధ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉద్యమానికీ దూరం కాలేదు. బెంగాల్‌ విభజనోద్యమానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన నిర్వహించిన పాత్రే ఇందుకు నిదర్శనం.
బెంగాల్‌ విభజనోద్యమం అంటే, గాంధీజీ రాక మునుపు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగిన పెద్ద ప్రజా ఉద్యమం. ఇందులో బెంగాల్‌ నుంచి అరవింద్‌ ఘోష్, బిపిన్‌చంద్ర పాల్, మహరాష్ట్ర నుంచి బాలగంగాధర్‌ తిలక్, పంజాబ్‌ నుంచి లాలాజీ కీలక నేతలుగా అవతరించారు. ఇంకా రవీంద్రనాథ్‌ టాగోర్, చిత్తరంజన్‌దాస్, సోదరి నివేదిత వంటివారు ఎందరో ఈ ఉద్యమంలో పనిచేశారు. ఈ ఉద్యమంలో స్వదేశీ ఉద్యమం చాలా కీలకమైనది. ఇందులో ఎక్కువ పాత్ర లజపతిరాయ్‌దే. స్వదేశీ ఉద్యమంలో భాగమే జాతీయ విద్య. జాతీయ కళాశాలల ఏర్పాటు కూడా అందులో భాగమే. అలా లజపతిరాయ్‌ లాహోర్‌లో జాతీయ కళాశాలను ఏర్పాటు చేశారు. అందులోనే భగత్‌సింగ్‌ చదువుకున్నారు. బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమం లేదా వందేమాతరం ఉద్యమం సాగుతూ ఉండగానే పంజాబ్‌లో భూశాసన చట్టం అమలులోకి వచ్చింది. 1907లో ప్రభుత్వం రుద్దిన ఈ చట్టం ప్రకారం పంట పొలాలకు ఉపయోగించుకునే నీటికి చేయవలసిన చెల్లింపులు పెరిగాయి. ల్యాండ్‌ రెవెన్యూ పెంపు పేరుతో రైతులను వేధించడం మొదలైంది. ఈ భూశాసనానికి వ్యతిరేకంగా ఇండియన్‌ పేట్రియాట్స్‌ అసోసియేషన్‌ ఉద్యమాన్ని నిర్వహించింది. ఈ సంస్థ నాయకుడు అజిత్‌ సింగ్‌. ఈయన భగత్‌సింగ్‌ పినతండ్రి. ఈ ఉద్యమనేతగా అజిత్‌సింగ్‌ పేరు వినపడినప్పటికీ వెన్నెముక లజపతిరాయేనని అంటారు. ఆ సంస్థ సభ ఎక్కడ జరిగినా వక్త లజపతిరాయే. దీనితో లజపతిరాయ్‌నీ, అజిత్‌సింగ్‌నీ ప్రభుత్వం ప్రవాస శిక్ష విధించి మాండలేకు పంపింది. బ్రిటిష్‌ ప్రభుత్వం ఎలాంటి విచారణ జరపకుండానే ఇంతటి కఠిన శిక్ష విధించింది. దీనితో ఇంగ్లండ్‌ పార్లమెంట్‌లోని ప్రతినిధుల సభలో గందరగోళం జరిగింది. విధిలేక భారత్‌లోని బ్రిటిష్‌ ప్రభువులు ఆ ఇద్దరినీ విడుదల చేశారు. 
1913లో కరాచీలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సభలు భారతీయుల దుస్థితిని విదేశాలలో ప్రచారం చేయడానికి ఇద్దరు ప్రతినిధులను ఎన్నుకున్నది. ఆ ఇద్దరు లజపతిరాయ్, మహమ్మదలీ జిన్నా. 1914లో లజపతిరాయ్‌ న్యాయవాద వృత్తికి స్వస్తి పలికి పూర్తిగా స్వాతంత్య్రోద్యమంలోకి దూకారు. ఆ సంవత్సరమే ఇంగ్లండ్‌ వెళ్లి అక్కడ అనేక సభలలో ప్రసంగించారు. అక్కడ నుంచి అమెరికా వెళ్లారు. అక్కడ ఉండగానే మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. ఆరేళ్ల వరకు భారత్‌ తిరిగి రావడానికి అనుమతి దొరకలేదు. అమెరికాలో ఉండగానే ఆయన కొన్ని రచనలు చేశారు.  రచయితగా కూడా లజపతిరాయ్‌ కృషి చెప్పుకోదగినది. ఆర్యసమాజ్, యంగ్‌ ఇండియా, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఇండియా,  అన్‌హ్యాపీ ఇండియా, ది స్టోరీ ఆఫ్‌ మై డిపోర్టేషన్, భారత్‌కు ఇంగ్లండ్‌ రుణం వంటి పుస్తకాలు రాశారాయన. తన అభిమాన హీరోలు జోసెఫ్‌ మ్యాజినీ, గారిబాల్డి, దయానంద సరస్వతిల జీవిత చరిత్రలు కూడా లజపతిరాయ్‌ రాశారు.   1919లో మొత్తానికి లాల్‌జీ భారతదేశానికి తిరిగి రావడానికి అనుమతి దొరికింది. ఆ మరుసటి సంవత్సరమే వచ్చారు. అప్పటికి భారత రాజకీయ వాతావరణం మొత్తం మారిపోయింది. గాంధీ యుగం ఆరంభమైంది. అయితే గాంధీజీ ఉద్యమాలన్నింటినీ లజపతిరాయ్‌ సమర్థించలేదు.ఉదాహరణకి శాసనోల్లంఘన. అప్పుడే జరిగిన జలియన్‌వాలా దురంతానికి నిరసనగా లజపతిరాయ్‌ పంజాబ్‌ అంతటా భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కానీ గాంధీకీ, మహమ్మదలీ జిన్నాకీ మధ్య పోటీ పెరిగిపోయింది. అంటే హిందువులు, ముస్లింలు, భారత స్వాతంత్య్రోద్యమం అనే అంశం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్న కాలమంది. నిజానికి భారతీయ ముస్లింలు, స్వాతంత్య్రం సమరం అనే అంశం మీద  లజపతిరాయ్‌కి స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన వాటిని దాచుకోలేదు కూడా.
డిసెంబర్‌ 14, 1923న ‘ది ట్రిబ్యూన్‌’ పత్రికకు ఆయన రాసిన వ్యాసం ఇందుకు నిదర్శనం. అందులో లజపతిరాయ్, ‘హిందువులు, ముస్లింలు కలసి బ్రిటిష్‌ వారి మీద పోరాడడంలో అనేక సమస్యలున్నాయనీ, ముస్లిం ఇండియా, హిందూ స్టేట్‌ ఇండియాగా విభజించాల’ని ప్రతిపాదించారు.   1927లో సైమన్‌ కమిషన్‌ భారతదేశానికి వచ్చింది. అందులో ఒక్క భారతీయుడైనా లేనందుకు నిరసనగా ఉద్యమం ఆరంభమైంది. ఇందులోనూ లాల్‌జీ కీలక పాత్ర వహించారు. సైమన్‌ కమిషన్‌ను బహిష్కరించాలంటూ పంజాబ్‌ అసెంబ్లీలో ఆయన పెట్టిన తీర్మానం కూడా కొద్ది తేడాతోనే అయినా గెలిచింది. ఇది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అక్టోబర్‌ 30, 1928న ఆ కమిషన్‌ లాహోర్‌ వచ్చింది. గాంధీజీ ఆశయం మేరకే అయినా లాల్‌జీ కూడా అహింసతో, మౌనంగా సైమన్‌ వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలా మౌనంగా ఉద్యమిస్తున్న వారిపైన కూడా లాఠీ చార్జికి ఆదేశించాడు పోలీసు సూపరింటెండెంట్‌ జేమ్స్‌ ఏ స్కాట్‌. తను స్వయంగా లాల్‌జీ మీద దాడి చేశాడు. లాల్‌జీ ఛాతీ మీద స్కాట్‌ కొట్టిన లాఠీ దెబ్బలు చాలా తీవ్రమైనవి. ఆ దెబ్బలతోనే లాల్‌జీ నవంబర్‌ 17న చనిపోయారు. ఇందుకు చంద్రశేఖర్‌ ఆజాద్‌ నాయకత్వంలో భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ తదితరులు ప్రతీకారం తీసుకోవాలని కోరుకున్నారు. కానీ స్కాట్‌ని చంపాలని అనుకుని జాన్‌ పి. సాండర్స్‌ అనే మరొక అధికారిని కాల్చి చంపారు.  లజపతిరాయ్‌ ఆలోచనా విధానంలో మార్పులు ఎలా ఉన్నా ఆయన ప్రధానంగా మానవతావాది. అందుకు ఈ ఉల్లేఖనే సాక్ష్యం. ‘భారతీయ పత్రికలని శాసించే అధికారమే నాకు ఉంటే, ఈ మూడు శీర్షికలు మొదటి పేజీలో ఉండాలని చెబుతాను. పసివాళ్లకి పాలు, తినడానికి పెద్దలకు తిండి, అందరికీ విద్య..’
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Source: Sakshi News

1 comment

  1. ఇలాంటి ధేశభక్తులైన హిందూ నేతల జీవిత చరిత్ర ఈ నాటి సెక్యులర్ ప్రభుత్వాలను నడిపే నాయకులు వారిని సమర్థిస్తున్నవారు చదివి ఆకలింపు చేసుకుంటే ఈ ధేశానికి పట్టిన దుర్గతి కొంతనైన తగ్గుతుంది అని నా భావన

    ReplyDelete