ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ పట్టణానికి కాస్త దూరంలో ఉండే ఖజూరీ జదునాథ్ సింగ్ సొంతూరు. ఆయన తండ్రి పేద రైతు. చదువు నాలుగో తరగతిలోనే...
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ పట్టణానికి కాస్త దూరంలో ఉండే ఖజూరీ జదునాథ్ సింగ్ సొంతూరు. ఆయన తండ్రి పేద రైతు. చదువు నాలుగో తరగతిలోనే ఆగిపోయింది. ఆగింది. స్కూలు చదువే, బతుకు చదువు కాదు. తండ్రితో పాటు తలకి పాగా చుట్టి, లుంగీ ఎగకట్టి పొలంలో దిగాడు. తనువు పొలంలో ఉన్నా మనసు ముందు మంచు కొండలు, అందమైన లోయలు, పరవళ్లు తొక్కే నదులు కనిపించేవి. దూరతీరాలు బొమ్మకట్టేవి, పొలం పనులయ్యాక వ్యాయామశాలకి వెళ్లేవాడు. సాధన శరీరానికి బిగువునిచ్చింది. కష్టం కండలకు నునుపు నిచ్చింది. ఎత్తిన బరువులు ఛాతీ ఎత్తుగా ఉప్పొంగేలా చేశాయి. సాయంత్రం అయ్యేసరికి బజరంగ్ బలీ ముందు కూర్చోవాలి. భజనలు చేయాలి. ఒళ్లు మరిచిపోవాలి. మనసులో పెళ్లి, సంసారం వంటి ఊహలు వచ్చేవే కావు. అతని భక్తిని, నిష్టని చూసి అంతా హనుమాన్ భక్త బాల బ్రహ్మచారి అనేవారు.
జదునాథ్ సింగ్ పుట్టింది 21 నవంబర్ 1916, తండ్రి బీర్బల్ సింగ్ రాథోడ్, తల్లి జమునా కవర్. వీరి ఎనిమిది మంది సంతానంలో మూడోవాడు జదునాథ్. ఇరవై ఒక్క ఏళ్లు వచ్చేసరికి సైన్యంలో చేరాడు. రెండో ప్రపంచ యుద్ధంలో బర్మా (నేటి మయన్మార్) లో యుద్ధం చేశాడు. పోరాట పటిమను చూసి నాయక్గా ప్రమోషన్ ఇచ్చారు. కొంత కాలానికి లాన్స్నాయక్ అయ్యాడు.
జదునాథ్ సింగ్లో ఒక యోగి, ఒక సైనికుడు ఉండేవారు. నిజానికి ఖజూరీలో పుట్టినప్పటి నుంచి, పొలాల్లో సేద్యం కోసం స్వేదం చిందించినప్పటి నుంచి, సుదూర బర్మాలో యుద్ధం చేసే దాకా అనుక్షణం తపిస్తున్న ఆ క్షణం రానే వచ్చింది.
జమ్మూ కశ్మీరను కబళించేందుకు పాకిస్తాన్ పన్నాగం పన్నింది. జమ్మూలోని నౌషెరా సెక్టర్లో బ్రిగేడియర్ మహ్మద్ ఉస్మాన్ నాయకత్వంలో మన సేనలు మొహరించాయి. జమ్మూ కశ్మీర్ ను కబళించేందుకు శత్రువు వచ్చే ప్రతి చోటా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అలా నౌషెరాకి ఉత్తరాన ఉన్న టైస్థర్ లోని పోస్టు జదునాథకి అప్పగించారు.
అది 6 ఫిబ్రవరి 1948. ఉదయం 6.40
పాకిస్తానీ దాడి మొదలైంది. పెద్ద సంఖ్యలో పాకిస్తానీలు యుద్ధం ప్రారంభించారు, పొగమంచు పాకిస్తానికి అనుకూలంగా మారింది. వారు మన చెక్ పోస్ట్ కి చేరువగా వచ్చారు. 27వ దళానికి నాయకత్వం వహిస్తున్న జదునాథ్ అత్యంత అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి ఒకటి కాదు, రెండు దాడులను తిప్పికొట్టారు.
మూడో దాడి ప్రారంభమైంది. కాని ఇక్కడే అసలు కథ మొదలైంది.
మూడో దాడి ముగిసే సమయానికి జదునాథ్ దళంలోని 27 మందిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. లేదా అత్యంత తీవ్రంగా గాయపడ్డారు. సెక్షన్ కమాండర్గా జదునాథ్ అత్యద్భుత నాయకత్వాన్ని ప్రదర్శించి, ఆఖరి ఊపిరి వరకూ పోరాడేలా దళాన్ని ప్రోత్సహించాడు, దాదాపు ఒకరోజు పాటు శత్రువును నిలువరించాడు. చివరికి ఈ పోరాటంలో జదునాథ్ ఒక్కడే మిగిలాడు. ఒక్కడే చివరి వరకూ పోరాడాడు.
జదునాథ్ వీరోచిత పోరాటం వల్ల ఆ ప్రాంతం పాకిస్తాన్ చేజిక్కలేదు. తెల్లవారేసరికి బ్రిగేడియర్ ఉస్మాన్ సైన్య బలగాలతో వచ్చాడు. పాకిస్తాన్ తోక ముడిచింది. నౌషెరాలో పాగా వేయాలన్న వారి పథకం విఫలమైంది.
చివరకు జదునాథ్ తలపై, ఛాతీపై గాయాలతో వీరమరణం పొందాడు. కాని చేతిలో తుపాకీని మాత్రం వదలలేదు. మరణానంతరం ఆయనకు పరమ వీర చక్ర ప్రదానం చేసి దేశం తనను తాను గౌరవించుకుంది. షాజహానిపూర్ లోని క్రీడా ప్రాంగణానికి పరమవీర చక్ర లాన్స్.. నాయక్ జదునాథ్ సింగ్ పేరు పెట్టుకున్నారు ప్రజలు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments