ఒకప్పుడు భారతదేశం లో అందరూ వనవాసులు, గిరి వాసులే, తరువాతి కాలంలో ఏదైతేనేమి పట్టణాలు, నగరాలు, మహనగరాలు వెలిశాయి... గ్రామ వాసులూ ఉన్నార...
ఒకప్పుడు భారతదేశం లో అందరూ వనవాసులు, గిరి వాసులే, తరువాతి కాలంలో ఏదైతేనేమి పట్టణాలు, నగరాలు, మహనగరాలు వెలిశాయి... గ్రామ వాసులూ ఉన్నారు. పరిణామ క్రమంలో పాశ్చాత్య సంస్కృతి భారతదేశం లో పెరగడం వలన అవసరాలు పెరిగాయి, కొన్ని చోట్ల అడవులను అవసరం మేరకు కాకుండా అక్రమంగా నరకడము ప్రారంభం చేశారు.
మన తెలుగు రాష్ట్రాలలో కూడా చూస్తుంటాము. ఎర్రచందనం తారాస్తాయి లో అక్రమంగా తరలిపోతుంది. అలాగే జార్ఖండ్ పూర్తి గా అటవీ సంపద మొత్తం దోపిడీ కి గురవుతున్న సందర్భంలో ఒక మహిళ తన భర్త సహాయం తో వన సురక్ష సమితి ఏర్పాటు చేసింది ఆమెకు 2019 పద్మశ్రీ వరించింది. భారతీయులు ప్రకృతి పోషకులు మాత్రమే ప్రకృతి శోషకులు కాదు అని నిరూపించింది. జమున తుడు ఆమె గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
జమున తుడు బాల్యం నుంచి పచ్చదనం నడుమ పెరిగింది. ఒడిశాలోని రాయ్‌రంగాపూర్ ఆమె స్వస్థలం. తండ్రి వ్యవసాయదారుడు. తన తోబుట్టువులతో కలిసి వ్యవసాయపనుల్లో తండ్రికి సహాయపడేది. 18ఏళ్లు దాటాక జార్ఖండ్‌లోని మతుర్కంకు చెందిన మాన్‌సింగ్‌తో వివాహం జరిగింది. ఆయన గుత్తేదారు. గ్రామాల్లో ఇళ్లు నిర్మించేవారు. పెళ్లైన మర్నాడు అత్తయ్య, ఆడపడుచుతో కలిసి మతుర్కంలోని అడవిని చూడటానికి వెళ్లింది. దానిని అటవీ మాఫియా, దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు.50 హెక్టార్ల విస్తీర్ణంలోని ఆ అడవి ప్రాంతం టేకు చెట్లకు పేరుగాంచింది. అప్పుడే గ్రామంలోని మహిళలందరిని ఏకం చేసి వన సురక్ష సమితి ఏర్పాటు చేయాలని నిశ్చయించుకుంది. మాఫియాను ఎదురించడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని గ్రామస్థుల్లో నింపడానికి చాలా కష్టపడింది. కొన్ని నెలల తరవాత 32 మంది మహిళా సైన్యంతో కలిసి గొడ్డలి, బాణాల్లాంటివి పట్టుకొని మాఫియాను ఎదురించడానికి వెళ్లింది. చివరకు అడవిని ధ్వంసం చేసే చాలా మందిపై వాళ్లు కేసులు పెట్టించగలిగారు.
తరువాత ఎంతో మంది నేరస్థులను జైలుకు పంపారు. ప్రస్తుతం మూడు వందల గ్రామాల్లో వనసురక్ష సమితులు పని చేస్తున్నాయి. ఈ మహిళా సైన్యంలో దాదాపుగా పది వేల మంది వరకు సభ్యులుగా ఉన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా వనాల పరిరక్షణకు పాటుపడుతున్నారు. ఓసారి ఆమె ఇంటిని దుండగులు కొల్లగొట్టారు. ఆమె, ఆమె భర్తపై రాళ్లతో దాడి చేశారు. ఈమె ధైర్యసాహసాలను చూసి చాలా మంది లేడీ టార్జాన్ అని అంటారు. పచ్చదనం కోసం ప్రాణాలకు తెగించి పాటుపడుతున్నందుకు భారత ప్రభుత్వం జమునకు పద్మశ్రీని ప్రకటించింది.
No comments