రామకృష్ణ పరమహంస : బెంగాలు ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన సిద్ధపురుషులలో ఒకడు. గృహస్టు అయి ఉండి కూడా బ్రహ్మచర్య దీక్షలో భార్యను సాక్షాత్త...
రామకృష్ణ పరమహంస : బెంగాలు ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన సిద్ధపురుషులలో ఒకడు. గృహస్టు అయి ఉండి కూడా బ్రహ్మచర్య దీక్షలో భార్యను సాక్షాత్తు జగన్మాతగా ఆరాధించి వైరాగ్యాన్ని పొందిన సన్న్యాసీ. మేధావి, తర్కశీలి అయిన వివేకానందుడితని శిష్యుడే. రామకృష్ణుడు క్రీ.శ. 1836 ఫిబ్రవరి 18న (ఫిబ్రవరి 17 అని కొందరు) క్షుధిరాముడు, చంద్రమదేవి దంపతులకు కామార్చకూర్ గ్రామమున జన్మించాడు.జన్మనామము గదాధరుడు, ముద్దుగా గదాయ్ అని పిలిచేవారు. బాల్యం నుండే భగవద్భక్తిలో లీనమై ఉండేవాడు.
కోల్కతా సమీపంలో దక్షిణేశ్వరమున గల కాళికాదేవి మందిరంలో తన 17వ యేటా పూజారిగా పనిచేయుచున్న గదాధరుని జీవితం నెమ్మదినెమ్మదిగా కాళీమయమైంది. కాళికా భక్తునిగా మారిపోయాడు. సిద్ధపురుషుడైన తోతాపురి రామకృష్ణుని గురువు, తోతాపురి రామకృష్ణునకు వేదాంత సంబంధమైన జ్ఞానాన్ని ప్రసాదించి సన్న్యాస దీక్షనిచ్చాడు. రామకృష్ణుడు జ్ఞాన సాధనతో బాటు తాంత్రిక సాధన కూడా చేశాడు. అప్పటి నుండే ఆయన పరమహంస అయి రామకృష్ణ పరమహంసగా లోకప్రసిద్ది చెందాడు.
రామకృష్ణుడు అన్నీ సంప్రదాయాల పద్దతుల లోను సాధన చేశాడు. క్రైస్తవ మహమ్మదీయ పద్దతులలో గూడ సాధన చేశాడు. తన అనుభవంతో ఈ సంప్రదాయ పద్ధతులనన్నిటినీ నిష్కర్షగా పరిశీలించిన తరువాత అన్ని మతాలు పరమేశ్వరుని చేరేందుకు వేర్వేరు మార్గాలు మాత్రమే. మౌలికంగా వాటి మధ్య శత్రుత్వమేమీ లేదు. అని ప్రపంచానికి బోధించాడు. తననాశ్రయించిన వారికి భక్తిని గరపుతుండేవాడు. భావపూరితంగా సరళమైన వ్యవహార దృష్టాంతాలతో ఆయన బోధిస్తుంటే ప్రజల హృదయాలపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. ఆ రోజుల్లో బెంగాలు ప్రాంతంలోని వాదోపవాదాలు చేయగల బుద్ధిజీవులు, నాస్తికవాదులు మరియు పాశ్చాత్య సంస్కృతిపట్ల వ్యామోహితులై అనుకరించే ప్రవృత్తిగల వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతుండేది. రామకృష్ణుని ఆధ్యాత్మిక బోధనలు వాటికి అడ్డుకట్ట వేశాయి.
అనేకమంది మేధావులు, దూరదేశాల నుండి కూడ వారి దర్శనానికై వస్తుండేవారు. వారి శిష్యరికం చేసేవారు. వారి శిష్యులు రామకృష్ణ మిషన్ అనే పేరుతో ఒక సంస్థనే ప్రారంభించి దానిద్వారా వారి దివ్యోపదేశములను ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. నిస్వార్ధభక్తితో దేవిని ఉపాసిస్తూ జగన్మాతను సాక్షాత్కరించుకుని ప్రతి మానవునిలో భగవంతుడున్నాడు. కాబట్టి మానవసేవే మాధవసేవ అని బోధించారు. భగవంతుని సేవలో కాలం గడపుమని, మనస్సులను లగ్నం చేయుమని, దుష్టులకు దూరంగా ఉండుమని శిష్యులకు బోధించాడు. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను సందేహాలను అందరికీ అనుభవంలోకి వచ్చే రీతిలో చిన్నచిన్న కథల రూపంలో నివృత్తి చేస్తుండేవారు.
నేను - నాది అనే అహంకారపు తెరను తొలగించుకొమ్మని చెప్పారు. రామకృష్ణుడు నరేంద్రునకు భవిష్యత్తులో చేయవలసిన మహాకార్యమునకు కావలసిన శిక్షణనిచ్చాడు. తన యావచ్చక్తిని అతనికి ధారపోశాడు. రామకృష్ణుడు భావసమాధితో బాహ్య స్మృతిని కోల్పోయేవాడు. నిర్వికల్ప సమాధిని పొందేవాడు. పరమహంస స్పర్శ, గంగాజల స్పర్శ పాపహారిణి అని ప్రజలు భావించేవారు. వీరు స్వయంగా మరుగుదొడ్లను శుభ్రంచేసి ఆ పనితో లోకోపకారం చేసే పాకీవాళ్లను కూడ మనం మనసారా ప్రేమించగలగాలి అని ఉపదేశించారు. 1886 ఆగష్టు 16న రామకృష్ణులు నిర్యాణం చెందారు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments