వాసుదేవ బలవంత్ ఫడ్కే ( 4 నవంబర్ 1845 -17 ఫిబ్రవరి 1883) స్వతంత్ర యోధుడు. ఆయన వ్యవసాయ కుటుంబానికి చెందిన వాడు. వీరి కుటుంబం అత్యంత ద...
వాసుదేవ బలవంత్ ఫడ్కే ( 4 నవంబర్ 1845 -17 ఫిబ్రవరి 1883) స్వతంత్ర యోధుడు. ఆయన వ్యవసాయ కుటుంబానికి చెందిన వాడు. వీరి కుటుంబం అత్యంత దురవస్థ అనుభవిస్తూ ఉండేది. స్వరాజ్య సాధనే పరిస్థితులు మెరుగు పరుచుకుందుకు మార్గమని ఫడ్కే తలచారు.1876 -77 సంవత్సరంలో మహారాష్ట్రలో అత్యంత భయంకరమైన కరువు తాండవించింది. వేలకొలది ప్రజలు ఆకలితో అలమటిస్తూ మరణించారు.
మరోపక్క ఆ పంటను చేజిక్కించుకున్న తెల్లదొరలు, మరణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇది వాసుదేవ్ బలవంత్ ఫడ్కే భరించలేకపోయారు. అతని మనసు కుతకుత లాడింది. మహారాష్ట్రలోని కోలీలు ,భీల్ లు, ధంగారులు తెగల వారిని కూడగట్టుకొని ఒక తిరుగుబాటు సేనను తయారుచేసి దానికి " రామొషి" అని పేరు పెట్టారు. వారంతా ఏకమై బ్రిటిష్ పరిపాలన అంతం చేయడానికి సాయుధ పోరాటాన్ని సాగించారు. మొట్ట మొదట వీరు ధనవంతులైన బ్రిటిష్ వ్యాపారవేత్తల పై దాడులకు పూనుకున్నారు.
ఇలా సాయుధపోరాటానికి అవసరమైన ధనం సంపాదించడానికి ప్రయత్నించారు. ఫడ్కే తన డైరీలో "ఈ దేశ ప్రజలందరూ నాలాగా భరతమాత ముద్దుబిడ్డలే. వారంతా అలమటిస్తూంటే, ఏమీ పట్టనట్టుగా జీవించడమనే ఊహే నాకు భయంకరమైనది. వారికి స్వతంత్రం ఇవ్వడం కోసం, అవసరం అయితే నా జీవితాన్ని త్యాగం చేస్తాను" అని రాసుకున్నారు. ఫడ్కే ఉద్యమ ప్రభావం చూసి బ్రిటిష్ ప్రభుత్వం చాలా ఇరకాటంలో పడింది. ఫడ్కేను పట్టుకునేందుకు వలను పన్నారు. బొంబాయి ప్రభుత్వ గవర్నర్ అయిన సర్ రిచర్డ్ టెంపుల్ ఫడ్కేను చంపిన లేక బంధించిన వారికి 5వేల రూపాయల బహుమతిని ప్రకటించారు. దీనికి జవాబుగా బొంబాయి గవర్నర్ సర్ రిచర్జ్ టెంపుల్ తలను తెచ్చిన వారికి పదివేల బహుమతి ఇస్తానని మరో ప్రకటన చేశాడు ఫడ్కే. ఫడ్కేను పట్టుకునేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను వేగవంతం చేసింది.
నిజాం ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం రెండూ ఫడ్కేను పట్టుకునేందుకు వెంటాడుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఫడ్కే నిజాం రాజ్యానికి చేరుకున్నాడు . ఒక రోజు మొత్తం పరిగెడుతూనే ఉండడం వల్ల చాలా అలసిపోయి ఉన్న ఫడ్కేకు జ్వరం కూడా వచ్చింది. హైదరాబాదులోని కలాడిగిన తాలూకాలోని ఒక పల్లెటూరికి చేరారు. విశ్రాంతి కోసం దేవి మందిరంలో పడుకున్నారు. జ్వరంతో సృహతప్పిన స్థితిలో ఉన్నారు. అతనిని వెంటాడుతూ బ్రిటిష్ ఆర్మీ మేజర్ డయనిల్ అక్కడికి చేరుకున్నాడు. తన బలగాలను అక్కడ మోహరించి, ఫడ్కే గుండెలపై తంతూ, మెడ మీద కాలు పెట్టి ఫడ్కే, ఇప్పుడు నీకు ఏం కావాలి అని అడిగాడు.
నీతో యుద్ధం చేద్దామనుకుంటున్నాను అని సమాధానం చెప్పాడు ఫడ్కే. కానీ అందుకు ఒప్పుకోని డానియల్ అతనికి బేడీలు వేసి పూనా తీసుకొని వెళ్ళాడు. ఫడ్కేను అక్కడ నుంచి ఆడిన్ కారాగారానికి తరలించారు. కానీ ఫడ్కే 13తేది ఫిబ్రవరి 1883 న అక్కడ నుంచి తప్పించుకున్నారు. అయితే ఆ తరువాత అతి కొద్ది కాలంలోనే తిరిగి పట్టుబడ్డారు. అప్పుడు వాసుదేవ్ బలవంత్ ఫడ్కే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష కారణంగా 17 ఫిబ్రవరి 1883 న ఫడ్కే తన తుది శ్వాస విడిచారు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments