అరుంధతి భాగవత పురాణాన్ననుసరించి కర్గమ, దేవహుతి దంపతులకు జన్మించిన తొమ్మండుగురు కుమార్తెలలో అరుంధతి ఎనిమిదవది. ఆమె పరాశరుడికి నాయనమ...
అరుంధతి
భాగవత పురాణాన్ననుసరించి కర్గమ, దేవహుతి దంపతులకు జన్మించిన తొమ్మండుగురు కుమార్తెలలో అరుంధతి ఎనిమిదవది. ఆమె పరాశరుడికి నాయనమ్మ. వ్యాసుడికి తాతమ్మ. ఆమె గత జన్మలో బ్రహ్మమానస పుత్రికయైన సంధ్య అని శివపురాణం చెబుతున్నది. వశిష్టుడి సూచన ప్రకారం సంధ్య పవిత్రతను సాధించడానికై శివుణ్ణి గురించి తపస్సు చేసి మెప్పించింది. మేధాతిథి చేస్తున్న యాగాగ్నిలోకి ఆత్మార్పణ చేసుకోవలసిందిగా శివుడు ఆమెకు చెప్పగానే ఆమె అలాగే చేస్తుంది.
తర్వాత ఆమె మేధాతిథికి కుమార్తెగా జన్మించి వశిష్టుణ్ణి వివాహమాడింది. కొన్ని పురాణాలు ఆమెను కశ్యపుని పుత్రికగా, నారద, పర్వతుల సోదరిగా చెప్పాయి. నారదుడు ఆమెను వశిష్టుడికిచ్చి వివాహం జరిపినట్లు తెలిపాయి. ఆమె తపస్విని అని, సప్తర్పులకు సైతం తత్వబోధ చేస్తుండేదని మహాభారతం తెలియజేస్తున్నది. అగ్నిదేవుడి భార్యయైన స్వాహా దేవి ఆరుగురు ఋషిపత్నుల రూపాలను ధరించిందిగాని అరుంధతి రూపం ధరించలేకపోయింది.
ఒకసారి 12 సంవత్సరాల పాటు వర్షాలు కురవక సప్తర్షులకు కందమూలాలు, ఫలాలు లభించక బాధపడుతుంటే అరుంధతి శివుణ్ణి ప్రసన్నం చేసుకొని వానలు కురిసేలా చేసింది. ఆమె పాతివ్రత్యం, పవిత్రత సాటిలేనివని మహాభారతం చెబుతున్నది. వాల్మీకి రామాయణం ప్రకారం ఆమెకు నూరుగురు పుత్రులు జన్మించారు. కాని విశ్వామిత్రుడి శాపంతో వారంతా మరణించారు. ఆపైన ఆమెకు శక్తి అనే పుత్రుడు జన్మించాడు. మరికొంత కాలానికి సుయజ్ఞుడనే కుమారుడు జన్మించి వశిష్టాశ్రమంలో శ్రీరాముడితోబాటు విద్యాభ్యాసం చేశాడు. శక్తి, చిత్రకేతుడు అనే వారితో సహా ఆమెకు ఎనిమిదిమంది పుత్రులున్నట్లు మరికొన్ని గ్రంథాలలో వుంది. ఆమె గురించి మరికొన్ని విశేషాలు ఇలా వున్నాయి.
వశిష్టుడు వివాహమాడదలచి తగిన కన్యకై వెదుకుతూ ఇసుకనిస్తాను, దీనినెవరైనా వండిపెట్టగలవారున్నారా అని అడిగాడు. ఎవరూ బదులివ్వలేదు. కాని ఒక మాలపల్లెలో ఒక కన్య నేను వండి పెడతానన్నది, ఆమెయే అరుంధతి. ఆమె ఇసుక పుచ్చుకుని పాత్రలో పోసి భగవంతుణ్ణి ప్రార్థించింది. అది ఉడికి అన్నమైంది, వశిష్టుడు నిన్ను వివాహమాడిన తర్వాతనే నీ అన్నము తింటాననీ, ఆమె తల్లిదండ్రుల అనుమతితో ఆమెను వివాహం చేసుకున్నాడు.
ఒకసారి వశిష్ఠుడు ఆమె చేతికి తన కమండలాన్నిచ్చి నేను తిరిగివచ్చే వరకు దీనిని చూస్తూవుండమని చెప్పాడు. ఆమె దానిని తదేక దృష్టితో చూడసాగింది. ఏండ్లు గడిచినా వశిష్టుడు తిరిగి రాలేదు. ఆమె కమండలం నుండి దృష్టి మరల్చలేదు. ఆ ఏకాగ్రతకు లోకం గజగజ వణికింది. బ్రహ్మాదులు వచ్చి చూపుమరలించవలసిందిగా ఆమెను కోరారు. కాని ఆమె వినిపించుకోలేదు. అప్పుడు వారు వశిష్ఠుణ్ణి తీసుకువచ్చారు. వశిష్టుడు వచ్చిన తర్వాతనే ఆమె చూపు మరలించింది.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments