ఆదిహిందూ ఉద్యమ నిర్మాత శ్రీ భాగ్యరెడ్డివర్మ మాదరి భాగయ్య, 22మే 1888వ తేదీన పంచముల కుటుంబంలో రంగమాంబ, వెంకయ్య దంపతులకు హైదరాబాద్లో...
ఆదిహిందూ ఉద్యమ నిర్మాత శ్రీ భాగ్యరెడ్డివర్మ
మాదరి భాగయ్య, 22మే 1888వ తేదీన పంచముల కుటుంబంలో రంగమాంబ,వెంకయ్య దంపతులకు హైదరాబాద్లో జన్మించాడు. భాగయ్యను కులగురువు భాగ్యరెడ్డి గా నామకరణం చేశాడు. భాగ్యరెడ్డి 1906వ సంవత్సరంలో జగన్ మిత్ర మండలి ని స్థాపించి బాలబాలికలకు విద్యానీతులు నేర్పడం, శుభాశుభ కార్యక్రమాల సందర్భంగా మద్యమాంసముల వినియోగం లేకుండునట్లు ప్రచారము, బాలికలను దేవదాసీలుగాచేసే దుష్టసంప్రదాయాన్ని రూపుమాపడం, బాల్యవివాహముల నిషేధం వంటి సమాజసంస్కరణ కార్యక్రమాలను చేపట్టాడు. ఆయన స్వయంగా కులాంతర వివాహాన్ని చేసుకున్నాడు.
1910వ సంవత్సరంలో హరిజనులలో ధార్మిక, నైతిక ప్రచారము కొరకు ప్రచారిణీ సభను ప్రారంభించాడు.ఆనాడు పాఠశాలల్లో హరిజన విద్యార్థులకు ప్రవేశము లభించేది కాదు. వారిలో చదువుకోవాలన్న కోరికా లేదు, అవకాశాలు అంతంత మాత్రమే. హరిజనులలో విద్యావశ్యకతను గుర్తించి 1910వ సంవత్సరంలో ఈసామియబజారు లోని జగన్ మిత్ర మండలి ఆధ్వర్యంలో మొదటి ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాడు. తర్వాత కొద్దికాలానికి 2600 మంది విద్యార్థులతో 26 పాఠశాలలయ్యాయి.
1917 నవంబరు 4,5,6 తేదీలో బెజవాడలో ఆంధ్రప్రాంత ప్రథమ పంచముల సదస్సు భాగ్యరెడ్డి అధ్యక్షతన జరిగింది. గూడూరు రామచంద్రరావు పంతులు, అయ్యదేవర కాళేశ్వర రావు, వేమూరి రాంజీరావుపంతులు వంటి అగ్రవర్ణాలకు చెందిన సామాజిక కార్యకర్తలు ఈ సభల్లో పాల్గొన్నారు. 1917 డిసెంబరు 15న కలకత్తాలో అఖిలభారత హిందూ సంస్కరణ సభ జరిగింది. ఆ కార్యక్రమంలో గాంధీజీ పాల్గొన్నారు. ఆ సభలో భాగ్యరెడ్డివర్మ చేసిన ప్రసంగం అందరిన్ని ఆకట్టుకుంది. 1922 మార్చి 29,30,31 తేదీలలో అఖిలభారత ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్ సభలు హైద్రాబాద్లో జరిగాయి.
దేశం నలుమూలలనుండి వేలాదిమంది ప్రతినిధులు పాల్గొన్నారు. భాగ్యరెడ్డివర్మ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. జాతీయ అధ్యక్షులుగా జస్టిస్ రాయ్ సీ.బాలముకుంద్ ఎన్నుకోబడ్డారు. ఈ మహాసభల్లో పండిత కేశవరావు, సేథోలార్జీ మేఘీజీజైన్, ప్రొఫెసర్ నారాయణ గోవింద వెల్లింకర్, పండిత రాఘవేంద్రరావు శర్మ, ఆర్. ఈ, రిపోర్టర్ టి.ధనకోటిపర్శ వంటి ప్రముఖులు మూడవరోజు సభలో ప్రసంగించారు. సభలలో కబీరు, తులసీదాస్, నానక్, రామానుజాచార్య, లింగాయత్ సంప్రదాయములకు చెందిన 25 భజన మండళ్ళు భజన గీతాలు పాడి సభలలో పాల్గొన్న ప్రతినిధులను ఉత్తేజితులను చేసారు.
ఆదిహిందువులలో వారసత్వంగా వస్తున్న చేతికళల నైపుణ్యాన్ని ప్రజలందరికీ తెల్పడానికి 1925లో ఆదిహిందూ చేతి వృత్తుల వస్తుప్రదర్శనను వర్మ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను చూచిన కుర్తాకోటి శంకరాచార్య ఎంతో ఆనందపడి ఉత్తమ కళాకారులకు సర్టిఫికెట్లను, ఐహుమానాలను వారి చేతుల మీదుగా అందచేశారు. ఆదిహిందువులలో గల వివిధ ఉపకులాలను ఒకే వేదికపైకి తెస్తూ, 1931లో జూలై 10వ తేదీన ఆదిహిందూ ధార్మిక సమ్మేళనం ఎమ్ఎల్ ఆదేయ్య అధ్యక్షతన జరిపించాడు.
ఆ సభలలో వివిధ ఉపకులాలకు చెందిన ఆదిహిందూ నాయకులు ఎస్. లక్ష్మీపతి, గోకుల చెన్నయ్య, సార్జంట్ మేజర్ దుర్గయ్య, ఎస్. ఆర్. సేవక్ దాస్, సోడే పెంటయ్య, గంట ఇస్తారి, మెట్టి వెంకట్రావు వంటి ప్రముఖులు పాల్గొన్నారు. 1930 మార్చి 3,4,5 తేదిలో మెదక్ జిల్లా జోగిపేటలో ప్రథమ ఆంధ్ర మహాసభ సురవరం ప్రతాపరెడ్డి (గోలకొండ దినపత్రిక సంపాదకులు) అధ్యక్షతన జరిగింది. 1931లో భాగ్యనగర్ పక్ష పత్రికను, 1937లో ఆదిహిందూ మాసపత్రికను వర్మ ప్రారంభించారు. అవిశ్రాంతమైన కార్యకలాపాలు, కారణంగా వర్మ క్షయవ్యాధికి గురై తీవ్ర అస్వస్థతతో 18 ఫిబ్రవరి 1939న తనువు చాలించారు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments