వీరనారి రాణి దుర్గావతి (1524-1564) రాణి దుర్గావతి ధైర్య, సౌశీల్యాలకు పెట్టింది పేరు. ఆమె రాజపుత్ర రాకుమారి. 1524 అక్టోబరు 5న బుందేల...
వీరనారి రాణి దుర్గావతి (1524-1564)
రాణి దుర్గావతి ధైర్య, సౌశీల్యాలకు పెట్టింది పేరు. ఆమె రాజపుత్ర రాకుమారి. 1524 అక్టోబరు 5న బుందేల్ఖండ్ రాజు కీరపాలిసింగ్ కు కుమార్తెగా కలింజర్ కోటలో జన్మించింది, దుర్గావతి 1542 గరామాండ్గా పాలకుడైన సంగ్రామ్ షా జ్యేష్ఠ కుమారుడైన గోండీరాజు దల్పతిషాను వివాహమాడింది. వివాహానంతరం గోండ్లు అయిన దలపతిషా, దుర్గావతి బుందేల్ ఖండ్ కు చెందిన చందేలా వంశీకులతో మైత్రి చేసుకొని 1545లో షేర్షా సూరి కలింజర్ ను ముట్టడించినప్పుడు గట్టి ప్రతిఘటన నిచ్చారు. షేర్షా గెలిచినప్పటికీ ప్రమాదవశాత్తు జరిగిన తుపాకి మందు ప్రేలుడులో మరణించాడు.
అదే సంవత్సరం దుర్గావతికి వీరనారాయణ్ అనే కుమారుడు జన్మించాడు. తరువాత ఐదేళ్ళకే 1550లో దల్పతిషా మరణించగా వీరనారాయణ్ పసివాడైనందున దుర్గావతి రాజ్యాధికారం చేపట్టింది. దీవాన్ బేవ్హర్ అధర్ సింహ, మాన్రాకూర్ అనే మంత్రి దుర్గావతి సమర్ధపాలన జరపడంలో చేదోడు వాదోడుగా వుండేవారు. ఆమె తన రాజధానిని సింగౌరీఘర్ కోట నుంచి ఛైరాఘర్ కోటకు మార్చింది. అరణ్యాలతోనిండిన సాత్పురా పర్వత ప్రాంతాల్లో వ్యాపించివున్న తన సంస్థానమంతటా వ్యూహాత్మకంగా ఎన్నో చిన్నచిన్న కోటలను నిర్మించింది. షేర్షా మరణానంతరం సుజాత్ఖాన్ మాళ్వాను ఆక్రమించుకున్నాడు.
అతని తర్వాత 1556లో అతని కుమారుడు బాజ్బహదూర్ వచ్చాడు. అతని రాజ్యానికి తూర్పున దుర్గావతి రాజ్యమున్నది. స్త్రీయేగదా అన్న భావంతో అతడు ఆమెరాజ్యంపై దండెత్తాడు. కాని దుర్గావతి అతనిని పారద్రోలింది. ఈ విజయంతో ఆమె తన ప్రజల నుంచి అపారమైన ఆదరాభిమానాలను చూరగొన్నది. అక్బర్ సేనాధిపతియైన అసఫ్ఖాన్ 1562లో రేవా రాజ్యాన్ని జయించిన మీదట దుర్గావతి రాజ్యం మాండ్గా పై కన్నేశాడు. ఆమె రాజ్యానికి ఇరు ప్రక్కలవున్న రేవా, మాళ్వాలు మొఘలుల పాలనలోకి వచ్చాయి. అసఫ్ఖాన్ మాండ్లను ఆక్రమించదలచినట్లు దుర్గావతికి తెలియడంతో ఆమె తన శక్తినంతా ప్రయోగించి దానిని రక్షించాలని నిర్ణయించుకుంది.
మొఘలుల సైనికశక్తి ఎంతో అధికమని ఆమెకు దివాన్ చెప్పినా వాళ్ళకు లొంగి అవమానకరంగా జీవించడం కంటే గౌరవంగా మరణించడమే మంచిదని చెప్పింది. యుద్ధంలో ఆమె సేనాధిపతి అర్జున్దాస్ మరణించడంతో తానే స్వయంగా సేనలకు నేతృత్వం వహించాలని నిశ్చయించింది. శత్రువులు లోయలోకి ప్రవేశించగానే రాణి సైనికులు వారిపై దాడిచేశారు. ఇరుపక్షాల్లో కొందరు మరణించారు, ఈ యుద్ధంలో దుర్గావతి గెలిచింది. ఆమె మొఘల సైన్యాన్ని తరిమికొట్టింది.1564లో దుర్గావతి రాజ్యంపై మళ్ళీ దాడిచేయాలని అసఫ్ఖాన్ నిర్ణయించాడు.
అచల్ పూర్ (మహారాష్ట్ర) వద్ద దాడిచేశాడు. రాణి తన సలహాదారులతో తన వ్యూహాన్ని సమీక్షించింది. రాత్రివేళ శత్రువులపై దాడి చేసి వాళ్ళను బలహీనపరుద్దామని ఆమె సూచిస్తే సలహాదారులు అంగీకరించలేదు. తెల్లవారే సరికి అసఫ్ఖాన్ పెద్ద తుపాకులు తెప్పించాడు. రాణి ఏనుగునెక్కి యుద్దానికి వచ్చింది. ఆమె కుమారుడు వీరనారాయణ్ కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నాడు.
మూడుసార్లు మొఘల్ సేనను వెనక్కు నెట్టాడు. కాని చివరకు గాయపడ్డాడు. రాణికూడా బాణాలవల్ల గాయపడి స్పృహ కోల్పోయింది. స్పృహ తర్వాత ఓటమి తప్పదని గ్రహించింది. యుద్దరంగం విడిచి తప్పించుకోవలసిందిగా మావటివాడు సూచించాడు. కానీ ఆమె అందుకు అంగీకరించక ఒక చురకత్తితో తనను తాను పొడుచుకొని యుద్ధ రంగంలోనే మరణించింది. ఈ సంఘటన 1564 జూన్ 24న జరిగింది. సాహసోపేతురాలైన దుర్గావతి మొఘలుల మహాశక్తికి తలవంచే ఆలోచన ఎన్నడూ రానీయక తుదిశ్వాస వరకూ వారితో పోరాడింది.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
Great**Queen**
ReplyDelete