విప్లవ వీరుడు శివరాం రాజగురు అందరిలోకి చాలా భిన్నం, ఆయన జీవితంలో ఎన్నో సందర్భాలు, అతని అంతఃశక్తికి, త్యాగానికి పరాకాష్ట. మరణదండన విధ...
విప్లవ వీరుడు శివరాం రాజగురు అందరిలోకి చాలా భిన్నం, ఆయన జీవితంలో ఎన్నో సందర్భాలు, అతని అంతఃశక్తికి, త్యాగానికి పరాకాష్ట.
మరణదండన విధించబడిన ఖైదీ ముందు ఒక స్త్రీ నిలబడి ఉంది. అతని చిన్న వయసు వాడు, 5.5 అడుగుల, చామనచాయలో ఉన్న సాధారణమైన వ్యక్తి. `నీ సోదరి కోసం ఒక ఉపకారం చేస్తావా?’ అని అడిగింది ఆమె, అతను చిరునవ్వుతో `తప్పకుండా అక్కా, ఏమిటో చెప్పు’ అన్నాడు. `నీ గాయాల మచ్చలు చూపిస్తావా?’ అంది.
1930లో ఇదే రోజున, ముగ్గురు విప్లవయోధులు భారతమాత కోసం అమరులయ్యారు. భగత్ సింగ్, సుఖ్దేవ్ థాపర్ మిగతా ఇద్దరు, వారిలో రాజగురుకి ప్రజాకర్షణ తక్కువ. కానీ ఆయన జీవితంలో ఎన్నో సందర్భాలు, అంతఃశక్తికి, త్యాగానికి పరాకాష్ట.
బ్రిటిష్ పోలీసు అధికారి జాన్ సాండర్స్.ను అంతం చేసి, లాలా లాజపత్ రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాక, భగత్ సింగ్ దొర వేషంలో, మరొక విప్లవకారుని భార్య దుర్గావతి దొరసాని వేషంలో తప్పించుకున్నపుడు, రాజగురు సేవకుడి వేషంలో వారి సామాన్లు మోస్తూ రైలు ఎక్కాడు. ప్రతి చిన్న విషయoలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ, భగత్ సింగ్ దుర్గావతి ఎంత చెప్పినా వినకుండా, ఆనాటి కాలoలో సేవకుని లాగానే టాయిలెట్ పక్కనే పడుకునేవాడు. రాజగురు మంచి నైపుణ్యం కల వస్తాదే కాక, తర్క శాస్త్రం, లహు సిద్ధాంత కౌముది చదువుకున్న సంస్కృత పండితుడు కూడా.
కాశీలో సంస్కృతంలో `ఉత్తమ’ పట్టా అందుకునే లోపు, విప్లవోద్యమం పట్ల రాజగురు ఆకర్షితుడయాడు. వీరసావర్కర్ సోదరుడు బాబారావుసావర్కర్.ని కలిసిన తరువాత అతను విప్లవమార్గం ఎంచుకున్నాడు. యువకులను శారీరకంగా మానసికంగా ధృడంగా తయారు చేసే `హనుమాన్ ప్రసారక్ మండల్’ లో చేరాడు. అతని శారీరక శక్తి, స్నేహశీలత వల్ల ఎంతోమంది స్నేహితులు ఏర్పడ్డారు. ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు కేశవ్ బలిరాం హెడ్గెవార్ తో కూడా రాజగురుకి ఇక్కడే పరిచయం అయింది.
ప్రముఖ విప్లవవీరుడు చంద్రశేఖర్ఆజాద్.ను కలిసిన తరువాత, రాజగురు హిందూస్తాన్ విప్లవ సైన్యంలో చేరాడు, అదే తరువాత హిందూస్తాన్ సామ్యవాద రిపబ్లికన్ సైన్యం (HSRA)గా మార్పు చెందింది. బ్రిటిషువారు మతపరమైన హింసను ప్రేరేపించడం వీరు పూర్తిగా వ్యతిరేకించేవారు. ప్రముఖ జాతీయవాది, భారత స్వాతంత్రోద్యమoలో అమరుడైన అష్ఫాకుల్లా ఖాన్ కూడా ఇందులో సభ్యుడే. మతవిద్వేషాలు వీరు సహించేవారు కాదు. చంద్రశేఖర్ఆజాద్ రాజగురుకి అప్పజెప్పిన మొదటి పని, ఢిల్లీలో హస్సన్ నిజామీ అనే మత విద్వేషవాదిని అంతం చేయడo, రాజగురు తుపాకి గురి తప్పకపోయినా, నిజామీ మామగారైన సోమాలీని, నిజామీ అనుకుని చంపాడు.
17 డిసెంబర్ 1928 తేదీన, లాలా లాజపత్ రాయ్ మరణానికి కారకుడైన జేమ్స్ స్కాట్ట్ ను విప్లవకారులు చంపదలుచుకున్నా, రాజగురు సహాయకుడు జైగోపాల్ పొరపాటుగా ఇంకొక పోలీసు అధికారి జాన్ సాండర్స్.ని చూపించి సైగ చేయగా, మరొకసారి గురి సరిపోయినా, లక్ష్యం నెరవేరలేదు. మరునాడు, విప్లవకారులు జరిగినదానికి విచారం వ్యక్తపరుస్తూ, వేరొకరిని చంపినా, అతను కూడా `ఆన్యాయమైన క్రూర వ్యవస్థ’ లో భాగమే అని ప్రకటన ఇచ్చారు. రాజగురు తమాషాగా తలకి గురిపెడితే చాతికి తగిలింది అన్నారు.
ఇతర విప్లవకారుల మాదిరిగా రాజగురుకి శారీరక ఆకర్షణ లేకపోవచ్చు, అతనే ఆ విషయం వేళాకోళం చేస్తుండేవాడు. ఒకసారి అతను ఓక అందమైన యువతి చిత్రం గోడకి వేళ్ళాడదీస్తే, అతను లేనప్పుడు ఆజాద్ ఆ చిత్రాన్ని చిoపేసాడు. అది చూసాక, వాళ్ళిద్దరి మధ్య వేడి చర్చ జరిగింది, ఉపయోగం లేని సౌందర్యం అవసరం లేదని ఆజాద్ అన్నాడు, అప్పుడు రాజగురు తాజ్మహల్ కూడా ధ్వంసం చేస్తావా అని అడిగితే, చేయగలిగితే చేస్తాను అని ఆజాద్ జవాబిచ్చాడు. రాజగురు మౌనంగా ఉండిపోయి తరువాత మెల్లిగా అన్నాడు `ప్రపంచాన్ని అందంగా చక్కగా తయారు చేయాలని అనుకుంటున్నాము, అందమైన వస్తువులని నాశనం చేయడం వలన అది జరగదు’ అన్నాడు. ఆజాద్ తన కోపానికి పశ్చాత్తాపపడి, తన ఉద్దేశం కూడా అది కాదని, దేశ స్వాతంత్ర్యo కోసం విప్లవకారులు తదేక దీక్షతో పనిచేయాలని చెప్పడమే అని అన్నాడు.
అసెంబ్లీ బాంబు సంఘటనలో 7 ఏప్రిల్1929 తేదీన భగత్ సింగ్ అరెస్ట్ అయాడు, తనూ వెంట వస్తానని రాజగురు పట్టుబట్టాడు, అయితే భగత్ సింగ్ ఒప్పుకోలేదు. 15ఏప్రిల్ తేదీన జరిగిన రైడ్ లో సుఖదేవ్ కూడా అరెస్ట్ అయాడు. రాజగురు కాశి వదిలేసి అమరావతి, నాగపూర్ మరియు వార్ధా ప్రాంతాల్లో తిరుగుతూ ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త దగ్గర సురక్షితంగా ఉన్నాడు, అపుడే డా.హెడ్గెవార్ ని కూడా కలుసుకున్నాడు. అప్పుడప్పుడు భోజనానికి అతను తన సోదరుడి ఇంటికి వెళ్తుండేవాడు, అక్కడ వాళ్ళ అమ్మ ఒకసారి అతని దగ్గర తుపాకి చూసి, అది ఒక `పండితుడి దగ్గర ఉండదగిన వస్తువా’ అని అడిగింది. అపుడు రాజగురు వృద్దురాలైన తన తల్లితో నిజాయితీగా ఓపికగా ఇలా అన్నాడు.
`దేశం, ధర్మం ప్రమాదంలో పడితే, అపుడు అస్త్ర శస్త్రాలు అవసరం అవుతాయి. బ్రిటీషువారు మన మీద అనేక దాడులు చేస్తున్నారు, అవమానిస్తున్నారు. మనము అర్ధిoచినంతమాత్రాన, వాళ్ళు ఆ పనులు మానుకోరు. ఒకసారి విష్ణు సహస్రనామo గుర్తు చేసుకుంటే, దానిలో విష్ణువు ఒక నామం `సర్వప్రహరణాయుద్ధ’ అంటే ఎప్పుడూ అస్త్రాలతో అలంకరించబడిన వాడు అని’
ముగ్గురు విప్లవయోధుల్లో భగత్ సింగ్ అందరినీ ఆకట్టుకునే వాక్చాతుర్యం ఉన్నవాడు. అయితే ఎక్కువ మౌనంగా ఉన్నా, అందరి ఆలోచనా సరళిపై రాజగురు ప్రభావం చాలా ఉండేది. వీర్ సావర్కర్ `హిందూ పద్ పాదషాహి’ పుస్తకం నుంచి భగత్ సింగ్ కొన్ని వాక్యాలను ఉల్లేఖిoచాడని, భగత్ సింగ్ `జైలు నోట్బుక్’ అధ్యయనం చేసిన మాల్విoదర్జిత్ సింగ్ మరియు హరీష్ జైన్ తెలియచేసారు.
భగత్ సింగ్ వ్రాసుకున్న కొన్ని వీర్ సావర్కర్ వ్యాఖ్యలు:
ప్రత్యక్షంగా లేక పరోక్షంగా కాని, సహేతుకంగా ఆలోచించిన తరువాత, విజయానికి తప్పనిసరిగా త్యాగం అవసరం అయినప్పుడే, ఆ త్యాగానికి విలువ గౌరవం. విజయానికి బాట వేయలేని త్యాగం, ఆత్మహత్యతో సమానం, దీనికి మరాఠా యుద్ధరీతిలో స్థానం లేదు.
ధర్మ మార్గంలో జరిపే సంఘర్షణ- క్రూరత్వాన్ని, నియంతృత్వాన్ని నిర్వీర్యం చేయగలుగుతుంది, మరింత హాని జరగకుండా నివారించగలుగుతుంది, విజయాన్ని అందించగలుగుతుంది; అది ఎటువంటి ప్రతిఘటనలేని బలిదానం కన్నా ఎంతో మిన్న.
మతమార్పిడి కన్నా మరణం మేలు …..(అప్పటి హిందువుల నినాదం అది)
అయితే రామదాస్ లేచి నిలబడి ఇలా పిలుపునిచ్చాడు. మతమార్పిడి కన్నా మరణం మేలు అనేది బాగానే ఉన్నా, మతమార్పిడి జరగకుండా, చంపబడకుండా బ్రతకడం ఇంకా మేలు. అదీ హింసాత్మక శక్తులను ఓడించి హతమార్చాలి. అవసరం వస్తే చావడానికి వేనుకాడము, కాని ధర్మ పోరాటంలో విజయం సాధించడానికి చేసే యుద్ధంలోనే అది జరగాలి.
రచయితలు సింగ్ మరియు జైన్ అభిప్రాయం ప్రకారం, సావర్కర్ గారి రచనలు భగత్ సింగ్ ను ఎంతగానో ప్రభావితం చేసి స్ఫూర్తినిచ్చి ఉంటాయి. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్.ల ఇచ్చాపూర్వక బలిదానం వారి భావావేశాల ఫలితం కాదు; అది దేశ ప్రజలను ఉత్తేజ పరిచి, భారత స్వాతంత్ర్య సమరంలో వారిని క్రియాశీలక కార్యాచరణ వైపు నడిపించడానికి, ఆ ఉత్తమ సందేశం ఇవ్వడానికి వారెంచుకున్న మార్గం త్యాగం. పోలీస్ దాడుల్లో సుఖదేవ్ వద్ద కూడా సావర్కర్ హిందుత్వ గ్రంథం `హిందూ పద్ పాదషాహి’ లభించింది, ఇది HRSA విప్లవకారుల పుస్తకాల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. విప్లవకారుల పైన రాజగురు ప్రభావం మరువలేము.
30 సెప్టెంబర్ 1929 తేదిన పోలీస్ డిఎస్పి సయ్యద్ అహ్మద్ షా రాజగురుని అరెస్ట్ చేసాడు. మరణశిక్షకై ఎదురుచూస్తూ జైల్లో ఉండికూడా రాజగురు తన హాస్యధోరణి మానలేదు. రాజగురు జైల్లో చేసిన నిరాహారదీక్ష తరువాత, దీక్ష విరమిoపచేయడానికి పాలు తీసుకెళ్ళిన భగత్ సింగ్, రాజగురుతో `నన్ను దాటి వెళ్లిపోదామనుకున్నావా, అబ్బాయ్?’ అని అడిగాడు. రాజగురు సమాధానం అందరికి నవ్వు తెప్పించింది, `నీకన్నా ముందే వెళ్లి నీకు ఒక గది ఏర్పాటు చేద్దామనుకున్నాను, కానీ ఈ ప్రయాణంలో కూడా నీకు నా సేవలు అవసరమేమో అనిపిస్తోoది’.
విప్లవ వర్గాల్లో ఈ గాయపు మచ్చలు ప్రసిద్ధమైనవి. పోలీసులు విప్లవకారులను పెట్టే చిత్రహిoసల గురించి చంద్రశేఖర్ ఆజాద్ చెప్పగా విన్న రాజగురు తట్టుకోలేక, ఎవరూ చూడకుండా వంటింట్లో పట్టకారుని ఎర్రగా కాల్చి ఛాతి మీద ఏడు సార్లు వాతలు పెట్టుకుని కూడా మౌనంగా ఉండిపోయాడు. చాలా రోజుల తర్వాత గాయాలు బొబ్బలేక్కి, నిద్రలో నొప్పితో మూలుగుతుంటే చంద్రశేఖర్ ఆజాద్ చూసాడు. స్వాతంత్రోద్యమoలో పాల్గొన్న మరొక గొప్ప విప్లవకారిణి సుశీలా దీదీ, జైల్లో రాజగురుని చూడడానికి వచ్చి, ఆ గాయాల గురించి అడుగగా, వెలిగే ముఖంతో ఆ విప్లవ యోధుడు ఆ మచ్చలని ఆమెకి చూపించాడు.
– అరవిందన్ నీలకందన్
Source: Swarajya, విశ్వ సంవాదకేంద్ర తెలంగాణ
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments