భారతదేశ చరిత్రలో మేలిరత్నం శివాజీ. ఈ రోజుకూ ఆయన వీరోచిత పోరాట స్ఫూర్తి ఈ దేశాన్ని రగిలిస్తూనే ఉంది. గత కాలంలోని భారతీయుల యుద్ధ వైఫల్యా...
భారతదేశ చరిత్రలో మేలిరత్నం శివాజీ. ఈ రోజుకూ ఆయన వీరోచిత పోరాట స్ఫూర్తి ఈ దేశాన్ని రగిలిస్తూనే ఉంది. గత కాలంలోని భారతీయుల యుద్ధ వైఫల్యాలను క్షుణ్ణంగా పరిశీలించి కొత్త తరహా గెరిల్లా యుద్ధాన్ని, పోరాట వ్యూహాల్ని సిద్ధం చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ. హిందూ సామ్రాజ్య దినోత్సవం జరిపి హిందూ హృదయ సామ్రాట్‌గా మన్ననలందుకొంటున్న మహాయోధుడు ఛత్రపతి. అలాంటి మహనీయుని జీవితంపై ఎందరో పరిశోధనలు చేసారు. కొందరు ఆయన చరిత్రను కళంకపరిచి పిడికెడు అక్షరాల్లో బంధించాలని ప్రయత్నమూ చేసారు. దేశద్రోహులకు ముచ్చెమటలు పట్టించే జాతీయతా స్ఫూర్తిని శివాజీ ఈ దేశానికి అందించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలా స్ఫూర్తి పొందినవారు ఎక్కువ శివాజీని ఒక పోరాట యోధుడైన హైందవ చక్రవర్తిగా చూస్తారు. కానీ ఆయనో గొప్ప సుపరిపాలకుడన్న సంగతిని విస్మరిస్తారు.
ఈ రెండు కోణాలను సమగ్రంగా చూపించే దర్పణంగా మనకు మాన్య అనిల్ మాధవ్ దవే ‘శివాజీ- స్వరాజ్యం నుండి సురాజ్యం దాకా’ అన్న పుస్తకం ద్వారా అందించారు. అనిల్ మాధవ్ దవే గొప్ప జాతీయవాది, దేశభక్తుడు. 2014లో కొన్నాళ్లు ఎన్డీయే ప్రభుత్వంలో ఉండి ఆకస్మికంగా మరణించారు. దశాదిక గ్రంథకర్త అయిన మాధవ్‌దవే శివాజీ పోరాట స్ఫూర్తిని, సుపరి పాలనాదక్షతను అందించారు. ఛత్రపతి పాలనా మంత్రాగాన్ని, యంత్రాంగాన్ని కొత్తకోణంలో చూపించి జాతీయవాద రాజకీయాలకు సరికొత్త బాటను అందించే ప్రయత్నం చేసారు.
ఈ పుస్తకానికి పూవుకు తావి అబ్బినట్లుగా మాధవ్‌జీ బాగా ఇష్టపడే భారత ప్రధాని నరేంద్రమోదీ ముందుమాట రాసి మరింత వన్నె తెచ్చారు. శివాజీ రాజనీతి వ్యూహాలు మార్గదర్శకంగా, ప్రేరణా స్రోతస్సుగా పనిచేస్తాయని చెప్పారు. బహుశా శివాజీ సుపరిపాలనా వ్యూహాలు మాధవ్‌జీ చెప్పినట్లు ముందే మోదీని ప్రభావితం చేసి ఉండవచ్చు. అందుకే ఈ రోజు భారత జాతీయ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కాయి. 238 పుటలున్న ఈ గ్రంథంలో శివాజీ నమ్మకం, నిర్భీతి, ఆర్థికమంత్రిత్వ శాఖ, గృహ మంత్రిత్వశాఖ, వ్యవసాయ మంత్రిత్వశాఖ, చట్టం, న్యాయ వ్యవహారాలు – వరకు అనే విషయాలను గుదిగుచ్చారు. ఛత్రపతి శివాజీని గురించి స్వామి వివేకానంద అభిప్రాయంతో మొదలైన ఈ పుస్తకం ఆమూలాగ్రం అనేక కొత్త విషయాలతోపాటు మాధవ్‌జీ సమగ్ర పీఠికతో మరింత చక్కని ఆకృతి తెచ్చారు.
‘ఒక నాయకుడు సాధించిన విజయాల మూల్యాంకనంతోపాటు, వారి పరాజయాల మూల్యాంకన కూడా సాధ్యమైన మేరకు చేయాలి. నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నాయకుడి నిజమైన మూల్యాంకన ఆయన పదవిని వదిలేసిన తరువాతే జరుగుతుందని తెలిస్తే, ఆ నాయకుడు తన బాధ్యత విషయంలో మరింత జాగరూకతతో వ్యవహరిస్తాడు.’ – ఈ ఒక్క వాక్యం చాలు ఈ పుస్తకంలోని విషయం ఎంత రాజనీతి ప్రబోధకంగా ఉందో తెలుసు కోవడానికి..! అంతేకాదు మాధవ్‌జీ ఎంత నిబద్ధుడైన జాతీయవాదో అంత గొప్ప పర్యావరణ ప్రేమికుడు. తనకు నచ్చిన అనేక అంశాలను శివాజీ జీవితం లోంచి, ఆధునిక భారతంలో నుండి అధ్యయనం చేసి అందించారు. అకుంఠిత దేశభక్తితో సాగిన ఈ అధ్యయనం – అనుశీలనం జాతీయ భావాలున్న, రాజకీయాల ఆలోచనలున్న ప్రతివారు చదివి తీరాల్సిందే. శివాజీ కాలం నుండి ఈ రోజు వరకున్న సుపరిపాలన రహస్యాలను గణాంకాలతో పాటు అందించి ఆధునిక భారతాన్ని అవలోకనం చేసి అక్షరాకృతి చేసారు.
శివాజీ నుండి బ్రిటిషువాళ్ల మీదుగా నేటి వరకు అనేక రంగాల్లో మనం ఎదుర్కొంటున్న సవాళ్లను దర్శించిన మాధవ్‌జీ ధన్యులు.
శివాజీ
స్వరాజ్యం నుండి సురాజ్యం దాకా…
రచన : అనిల్ మాధవ్‌దవే
పుటలు : 238, వెల : రూ.200/-
ప్రతులకు : సాహిత్యనికేతన్, బర్కత్‌పురా,
హైదరాబాద్ – 500 027
ఫోన్ : 040-27563236
సాహిత్యనికేతన్, గవర్నర్‌పేట,
విజయవాడ – 500 020
సెల్ : 9440643348
No comments