భారతదేశంలో నదుల అనుసంధానం గురించి మొట్టమొదట ప్రస్తావన చేసిన రైతు బాంధవుడు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపకర్త కీ.శే. డా|| కానూరి లక్ష్మ...
భారతదేశంలో నదుల అనుసంధానం గురించి మొట్టమొదట ప్రస్తావన చేసిన రైతు బాంధవుడు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపకర్త కీ.శే. డా|| కానూరి లక్ష్మణరావు.
నీటి పారుదల, విద్యుత్ రంగాలలో మనదేశానికి దిశానిర్దేశం చేసి మౌలిక వసతుల కల్పనలో తన మేధోశక్తిని భారతమాతకు ధారపోసిన మహాను భావుడాయన. అంతటి గొప్ప వ్యక్తి తెలుగువాడు కావడం మనందరికి గర్వకారణం.
కె.ఎల్. రావు కృష్ణా జిల్లా కంకిపాడులోని ఓ మధ్యతరగతి కుటుంబంలో 1902 జూలై 15న జన్మించారు. తొమ్మిది సంవత్సరాల వయసులోనే తండ్రికాలం చేశారు. చిన్నప్పుడు ఆటలాడుతూ గాయపడి ఒక కంటి చూపును కోల్పోయాడు లక్ష్మణరావు. ఒక కంటితోనే తన చదువును కొనసాగించారు.
కె.ఎల్. రావు ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంటర్మీడి యేట్ పూర్తి చేశారు. మద్రాసు యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. తర్వాత మాస్టర్స్ పూర్తి చేసిన ఆయన 1939లో యుకెలోని బర్మింగ్¬మ్ యూనివర్సిటీలో పిహెచ్‌డి పట్టా పొందారు. బర్మాలోని రంగూన్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు.
లక్ష్మణరావు పిహెచ్‌డి పూర్తి అయిన తర్వాత యుకెలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలో ‘స్ట్రెక్చరల్ ఇంజనీరింగ్, రీ ఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ సైన్స్’ అనే పుస్తకాన్ని రాశారు.ఆ తర్వాత యుకె నుంచి ఇండియాకి తిరిగి వచ్చి మద్రాసు ప్రభుత్వంలో డిజైన్ ఇంజనీరుగా పనిచేశారు. 1930లో ఆయన విద్యుత్ కమిషన్‌లో డిజైన్స్ డైరెక్టర్‌గా బాధ్యత నిర్వహించారు. 1954లో ప్రధాన ఇంజనీర్‌గా ప్రమోషన్ పొందారు.విజయవాడ నియోజకవర్గం నుంచి పార్లమెంటు మెంబరుగా మూడుసార్లు ఎన్నికయ్యారు. 1963లో కేంద్ర నీటి పారుదల, విద్యుత్ శాఖల మంత్రిగా కూడా సేవలందించారు.
లక్ష్మణరావు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో అనేక జలవిద్యుత్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. కృష్ణా నదిపై కేవలం తాపీ పనివారితోనే, అతి తక్కువ యంత్ర సహాయంతో నిర్మించిన నాగార్జునసాగర్ డ్యామ్ మొదలు నుంచి తుది రూపం వచ్చే వరకూ శ్రమించిన మేధావి కె.ఎల్.రావు.
నెహ్రు, లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ క్యాబినెట్‌లలో పనిచేసిన అరుదైన గౌరవం దక్కిన ఇంజనీర్ ఆయన. లక్ష్మణరావుకు 1963లో పద్మభూషణ్ సత్కారం లభించింది. ఆయన సేవలకు మెచ్చి 2006లో గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు కె.ఎల్. రావు ప్రాజెక్టుగా నామకరణం చేశారు.
కృష్ణా డెల్టాలో నీటి లభ్యత, ప్రజలు విద్యుత్ అవసరాలతో ఎన్నడూ సతమతమవకుండా ఉండేలా ఆలోచించి, ఎన్నో సమస్యలను అధిగమించి, అసాధ్యమనుకున్న ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేసిన ఘనత డా|| కె.ఎల్. రావు సొంతం. అంతేకాదు యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆశించిన నాయకుల్లో ఈయన ముందుంటారు. ఎవరితోనైనా పార్టీలకు అతీతంగా వ్యవహరించే వారు.
నిజాం పాలనలో నాగార్జునసాగర్ డ్యామ్‌కు సర్వే జరిపించి కేవలం ఎడమ కాలువ మాత్రమే రూపకల్పన చేశారు. స్వాతంత్య్రం అనంతరం కుడికాలువను కూడా నాగార్జునసాగర్ డ్యామ్ కల్పనతో జత చేసి కృషి పరివాహక ప్రాంతమంతా స్వయంగా పర్యటన చేసి నకిరేకల్ ప్రాంతంలో ఎడమ కాలువకు, కుడి కాలువకు అవకాశం ఉంటుందని గుర్తించి ఖోస్లా కమిటీని ఒప్పించి నీటిని నెల్లూరు, మద్రాసు వరకు తరలించవచ్చని ఒప్పించారు. ఖోస్లా కమిటీకి సమర్పించిన లేఖల్లో నదుల అనుసంధానం వలన కలిగే లాభాల గురించి విస్తృతంగా చర్చించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు సహజంగా ఏర్పడిన కొండరాళ్ళ ఆధారంగా నిర్మించిన డ్యామ్ కావడంతో ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. డా.కె.ఎల్. రావు ఈ ప్రాజెక్టు కొరకు స్థలం వెతుకుతున్న సమయంలో నల్గొండ జిల్లాకు చెందిన కొంతమంది కమ్యూనిస్టుల నుంచి ఆయనకు ప్రమాదం ఉందని ప్రభుత్వం భావించి ఆయనకు సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.
డా|| కె.ఎల్. రావు కమ్యూనిస్టుల గురించి మాట్లాడుతూ ‘సమస్యలను పరిష్కరించడానికి కమ్యూనిస్టులు ఏ ప్రయత్నం చేయరు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమైతేనే వారి బాధలను అర్థం చేసుకొని వారి సమస్యలకు పరిష్కారం సాధించగలం. మరి కమ్యూనిస్టులు ఒక్క సమస్యకు కూడా సమాధానం కనుగొన్నట్టు కనిపించడం లేదు. కమ్యూనిస్టు పార్టీ మరి ఆ విధంగా ముందుకెళ్తోందా? ఆ ఆలోచన వీళ్లకెప్పుడు వస్తుందో’ అని పలు సందర్భాలలో ప్రస్తావించారు.
నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణ సమయంలో బయటపడిన బుద్ధిజం అవశేషాలతో మ్యూజియం నిర్మాణం చేయాలని ఆయన చాలా ప్రయత్నించారు. మన భారతీయ పరిచయాన్ని మనం మరవకూడదు. మనోగతం మనకు ఆత్మ విశ్వాసాన్నిస్తుందని ఆయన రాసిన ఓ లేఖ ద్వారా తెలుస్తోంది.
లక్ష్మణరావు డ్యామ్ నిర్మాణంలో భాగంగా ఫైలన్‌లను నిర్మించే సమయంలో నెలకొనే అనేక సమస్యల గురించి విస్తృతంగా ప్రస్తావించారు. డ్యామ్ నిలకడ కేవలం అక్కడ వాడే పరికరాలు, వస్తువులను బట్టి కాకుండా నీటి పరివాహక రీతులను అధ్యయనం చేసే జియాలజిస్టులతో సమావేశాలు ఏర్పాటు చేసి గోదావరి నదిపై నిర్మించిన కడెం డ్యామ్, యూఎస్ లోని కొన్ని డ్యామ్‌లపై అధ్యయనం చేసి తన అభిప్రాయాలను క్రోడీకరించి ప్రస్తావన పత్రాలు ప్రకటించారు. 1983లోనే లక్ష్మణరావు పోలవరం ప్రాజెక్టు వల్ల కలిగే ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను హెచ్చరించారు.
డా|| కానూరి లక్ష్మణరావు విగ్రహాన్ని దుర్గాఘాట్ వద్ద ప్రతిష్ఠించారు. ఈయన మన దేశానికి అందించిన సేవల గురించి నేటి తరం యువతకు తెలిసేలా చేసే బాధ్యత అన్ని ఇంజనీరింగ్ కళాశాలల మీద ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జాతి సేవకుడైన డా|| కానూరి లక్ష్మణరావును యువతరానికి స్ఫూర్తిగా గుర్తించి ఆయన జన్మదినాన్ని అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఘనంగా జరుపుతారని ఆశిద్దాం!
– జి.ఎల్.ఎన్. మూర్తి
మా నిప్పుబాబొప్పుకోదు సార్. ఆంధ్రలో 420 నదుల్ని అనుసంధానం చేస్తానంటే ప్రజలు చాల్లే పొమ్మన్నారు
ReplyDelete