మనిషిలోని సాధారణ శ్వాసక్రియ నిమిషానికి 15 నుండి 18 సార్లు ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ సార్లు శ్వాసక్రియ జరుపుతుంటే శ్వాస వదలటం బాగా ఇబ్బంది...
మనిషిలోని సాధారణ శ్వాసక్రియ నిమిషానికి 15 నుండి 18 సార్లు ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ సార్లు శ్వాసక్రియ జరుపుతుంటే శ్వాస వదలటం బాగా ఇబ్బందిగా ఉంటే వ్యాధిగా గుర్తించాలి. ఈ వ్యాధినే ఆస్తమా లేదా ఉబ్బసం అంటారు.
యోగ చికిత్స ద్వారా ఆస్తమాను పూర్తిగా నివారించవచ్చు. సంపూర్ణ వ్యాధి నిర్మూలన కోసం యోగాసనాలు, ప్రాణాయామం మాత్రమే సరిపోదు. వీటితోపాటు ధ్యానం, శుద్ధి క్రియలు, ముద్రలు, సరైన జీవనవిధానం, సకారాత్మక ఆలోచనలు చేయడం వంటి వాటివలన మాత్రమే సంపూర్ణ వ్యాధి నిర్మూలనం జరుగుతుంది.
యోగ చికిత్స :
ఈ క్రింది యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, క్రియలు, ముద్రలు అభ్యాసం చేయడం ద్వారా ఆస్తమాను నివారించవచ్చు.
యోగాసనాలు :
1. అర్థ కటి చక్రాసన్
ఇది కూడా నిలబడి చేసే ఆసనమే.
స్థితి : నిటారుగా నిలబడి ఉండాలి. రెండు పాదాలు కలిపి ఉంచాలి, రెండు చేతులు శరీరానికి పక్కనే కిందకు చాపి ఉంచాలి. చూపు ముందుకు.
1.కుడి చేతిని సాచి పైకి ఎత్తాలి. భుజం చెవికి తగులుతూ ఉంటుంది. ఈ స్థితిలో చేయి పైకి లాగి ఉంచాలి.
2.నడుము పై భాగాన్ని నెమ్మదిగా ఎడమవైపుకు వీలైనంత వంచాలి. నడుముతో పాటు పైకి ఎత్తిన చేయి కూడా వంగుతుంది. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
3.నడుమును సాధారణ స్థితికి తేవాలి. నిటారుగా ఉండే ప్రయత్నం చేయాలి. పైకెత్తిన చేయి అలాగే ఉంటుంది.
4.పైకెత్తిన కుడిచేతిని కిందకు దించుతూ స్థితికి రావాలి. విశ్రాంతి పొందాలి. ఇదే విధంగా ఎడమచేతితో ప్రారంభించి, కుడివైపుకు వంగుతూ చేయాలి.
లాభాలు : వెన్నెముక సాగుతుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది, తుంటి కీళ్ళు బలపడతాయి. నడుము చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది. మలబద్ధకం వదులుతుంది.
అర్థ చక్రాసన్
2. అర్థ చక్రాసన్
ఇది నిలబడి చేసే ఆసనం.
స్థితి : నిటారుగా నిలబడి ఉండాలి. రెండు పాదాలు కలిపి ఉంచాలి, రెండు చేతులు శరీరానికి పక్కనే కిందకు చాపి ఉంచాలి. చూపు ముందుకు.
1.రెండు చేతులను నడుముకు వెనుక వైపున పిరుదుల పైన ఉంచాలి. నడుం వద్ద అరచేతు లతో పట్టి ఉంచి, చేతివేళ్ళు ముందుకు చాపాలి.
2.తల, మెడ, నడుము వెనక్కి వంచాలి. మోకాళ్ళు వంచరాదు. శరీర భారం పిరుదులపై ఉన్న చేతులపై పడుతుంది. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
3.తల, మెడ, నడుము ముందుకు తెచ్చి నిటారుగా ఉంచాలి.
4.చేతుల్ని కిందికి తెచ్చి స్థితికి రావాలి. విశ్రాంతి పొందాలి.
లాభాలు : వెన్నెముకలోని నరాలు వదులయి, సులువుగా వంగే స్థితి వస్తుంది. తలలోకి రక్తప్రసరణ వృద్ధి అవుతుంది. మెడ కండరాలు దృఢమవుతాయి. ఛాతి మరియు భుజములను విశాలపరుచును.
సూచన : గుండె వ్యాధులు కలవారు, తల తిరుగు బాధలు ఉన్నవారు, ఇటీవల కడుపుకు శస్త్రచికిత్స చేయించుకున్నవారు ఈ ఆసన వేయరాదు.
వృక్షాసన్
3. వృక్షాసన్
స్థితి : నిటారుగా నిలబడి ఉండాలి. రెండు పాదాలు కలిపి ఉంచాలి, రెండు చేతులు శరీరానికి పక్కనే కిందకు చాపి ఉంచాలి. చూపు ముందుకు.
1.ఎడమ పాదం ఎత్తి కుడి తొడ పైన ఉంచాలి.
2.రెండు చేతులు నిటారుగా పైకెత్తాలి. రెండు అరచేతులను సాచి పైకెత్తి నమస్కార స్థితిలో ఉంచాలి. ఒక కాలిపై నిలబడి ఉంటాము. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
4.రెండు చేతులు క్రిందికి దించుతూ 1 వ స్థితికి రావాలి.
5.కుడి తొడపై ఉన్న ఎడమ కాలిని కిందకు తెస్తూ, స్థితికి వచ్చి విశ్రాంతి పొందాలి. ఇదేవిధంగా కుడి కాలితో ప్రారంభించి చేయాలి.
లాభాలు : చేతి కండరాలు, కాలి కండరాలు బలపడతాయి. పిరుదులలోని, పొట్టలోని కొవ్వు తగ్గుతుంది. మానసిక నిశ్చలత వస్తుంది. బి.పి.కి మంచిది.
వీరభద్రాసన్
4. వీరభద్రాసన్
ఇది నిలబడి అభ్యాసం చేసే ఆసనం.
స్థితి : నిటారుగా నిలబడి ఉండాలి. రెండు పాదాలు కలిపి ఉంచాలి, రెండు చేతులు శరీరానికి పక్కనే కిందకు చాపి ఉంచాలి. చూపు ముందుకు.
1.రెండు కాళ్ళ మధ్య దూరం పెంచాలి. చేతులను భుజాలకు సమానంగా చాపాలి. చూపు ముందుకు.
2.కుడి పాదాన్ని కుడివైపుకు తొంభై డిగ్రీలు తిప్పుతూ కుడివైపుకు తిరగాలి. రెండు చేతులను పైకెత్తి నమస్కార స్థితిలో ఉంచాలి.
3.కుడి మోకాలిని ముందుకు నెడుతూ, కాలు కింద నుండి మోకాలు వరకు లంబంగా ఉంచుతూ కాలిపై వంగాలి.
4.తలను పైకెత్తి నమస్కారాన్ని చూడాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
5.తల కిందకు దించాలి.
6.కాళ్ళు నిటారుగా చేయాలి.
7.ఎడమవైపుకు తిరగాలి.
8.చేతులు శరీరం పక్క నుండి కిందకు దించాలి.
9.కాళ్ళు దగ్గరకు చేర్చి స్థితికి వచ్చి విశ్రాంతి పొందాలి.
లాభాలు : భుజాలు, వీపు, మెడ వదులవు తాయి. తొడ, పిక్క, చీలమండలకు బలం వస్తుంది. ఛాతీకి నిండుగా శ్వాస అందుతుంది. కదలకుండా పని చేసేవారికి ఉపయోగం. నడుములోని అనవసర కొవ్వు కరుగుతుంది.
సూచన : బి.పి., గుండె వ్యాధులున్న వారు ఈ ఆసనం వేయరాదు.
త్రికోణాసన్
5. త్రికోణాసన్
స్థితి : నిటారుగా నిలబడి ఉండాలి. రెండు పాదాలు కలిపి ఉంచాలి, రెండు చేతులు శరీరానికి పక్కనే కిందకు చాపి ఉంచాలి. చూపు ముందుకు.
1.ఎగురుతూ లేదా రెండు పాదాలను రెండు పక్కలకు జరుపుతూ రెండు పాదాల మధ్య ఒక మీటరు దూరము పెంచాలి. రెండు చేతులను ప్రక్కలకు, నేలకు సమాంతరంగా ఉంచాలి. అరచేతులు కిందకు.
2.కుడిపక్కకు వంగుతూ కుడిచేతి వేళ్ళను కుడి పాదము వేళ్ళకు తాకించాలి. వంగే సమయంలో ఎడమ చేయి పైకి ఎత్తి, సాచి ఉంచాలి. మెడ, తలను పైకి తిప్పి ఎడమచేతి వేళ్ళను చూడాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
3.రెండు చేతుల్ని భూమికి సమాంతరంగా తెస్తూ 1వ స్థితికి రావాలి.
4.కాళ్ళు దగ్గరకు, చేతులను క్రిందికి తెచ్చి (స్థితికి) విశ్రాంతి తీసుకోవాలి.
ఇదేవిధంగా ఎడమ వైపుకు వంగుతూ చేయాలి.
లాభాలు : మొత్తం శరీరం సాగుతుంది, వెన్ను కండరాలు సాగుతాయి. తొడలు, భుజాలు, రొమ్ము, కాలేయం, ప్లీహం, మూత్రపిండాలకు శక్తి వస్తుంది. పిరుదులు, నడుములోని కొవ్వు తగ్గుతుంది. చక్కెర, బిపి, శ్వాసకోశ, మూత్ర సంబంధ వ్యాధులు, మలబద్ధకం తగ్గుతాయి.
సూచన : మెడ, వెన్ను నొప్పి ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి.
వజ్రాసన్
6. వజ్రాసన్
ఇది కూర్చుని అభ్యాసం చేసే ఆసనం.
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1.కుడి కాలును మడిచి కుడి తొడ క్రింద ఉంచాలి. మడిమ వెనుకకు చూస్తుంది.
2.ఎడమ కాలును కూడా మడిచి, ఎడమ తొడ క్రిందకు తేవాలి. ఈ స్థితిలో రెండు కాళ్ళ మడిమలపై కూర్చుంటాము.
3.రెండు చేతులు తొడలపై పెట్టాలి. ఈ స్థితిలో శరీరం నిటారుగా అవుతుంది.
4.ఎడమకాలును ఎడమ తొడ కింద నుండి నెమ్మదిగా తీసి ముందుకు చాపాలి.
5.కుడికాలును కూడా కుడి తొడ నుండి నెమ్మదిగా తీసి ముందుకు చాపాలి. విశ్రాంతి పొందాలి.
లాభాలు : వెన్నుముకను నిటారుగా చేయడం వలన బద్ధకం వదులుతుంది. మడిమలు, పిక్క కండరాలలో నొప్పులు తగ్గుతాయి. పాదాల కండరాలు వదులయి, పాదాలు వంగలేని స్థితి నివారణ అవుతుంది. తిన్న తరువాత కూడా వేసే ఏకైక ఆసనం వజ్రాసనం.
ఉష్ట్రాసన్
7. ఉష్ట్రాసన్
ఇది కూడా కూర్చుని అభ్యాసం చేసే ఆసనమే.
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1.కుడికాలిని వంచి, పాదాన్ని పిరుదుల కిందకి తేవాలి.
2.ఎడమకాలిని వంచి, పాదాన్ని పిరుదుల కిందికి తెచ్చి వజ్రాసన స్థితిలో ఉండాలి.
3.శరీరాన్ని నిటారు చేస్తూ మోకాళ్ళపై నిలబడాలి.
4.శ్వాస వదులుతూ, నెమ్మదిగా వెనక్కి వంగుతూ, అరచేతులతో వెనుక ఉన్న పాదాలని పట్టుకోవాలి. దృష్టి వెనక్కు ఉంటుంది. మోకాళ్ళు దగ్గరగానే ఉండాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో ఒక నిముషం వరకు ఉండే ప్రయత్నం చేయాలి.
5.నెమ్మదిగా చేతులు వెనక్కి తీసుకుని మోకాళ్ళపై నిటారుగా నిలబడాలి.
6.మడిమలపై కూర్చుని, వజ్రాసన స్థితిలోకి రావాలి.
7.ఎడమకాలిని ముందుకు చాచాలి.
8.కుడికాలిని ముందుకి చాచి, స్థితిలోకి వచ్చి విశ్రాంతి పొందాలి.
లాభాలు : ఈ ఆసనం వలన వెన్నెముకకు శక్తీ, మెదడుకి రక్తప్రసరణ అందుతుంది. మోకాళ్ళకు బలం వస్తుంది. నడుంనొప్పి తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం కలుగుతుంది.
సూచన : ఆరునెలల లోపల ఛాతి, ఉదరభాగము శస్త్ర చికిత్స చేయించుకున్నవారు, హెర్నియా ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.
మత్స్యాసన్
8. మత్స్యాసన్
ఇది కూడా కూర్చుని అభ్యాసం చేసే ఆసనమే.
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1.పద్మాసనం భంగిమలో వలె రెండు కాళ్ళను ఒకదాని తొడలపైకి మరొక దానిని తేవాలి.
2.ఆ స్థితిలో వెనక్కు వాలి నేలపై పడుకోవాలి.
3.అరచేతులు నేలపై అదుముతూ, తల, ఛాతీ పైకి లేపాలి. ఈ స్థితిలో వెన్ను విల్లులా అవుతుంది.
4.చేతులు నేలపై నుంచి తీసి చూపుడు వేళ్ళతో కాలిబొటన వ్రేళ్ళను కొక్కెంలా చుట్టి పట్టుకోవాలి. మోచేతులు నేలకు ఆని ఉంటాయి. శరీర బరువు మోచేతులపై పడుతుంది. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
5.కాలి వేళ్ళను వదిలి, చేతులను నేలపై మోపి, వాటి ఆధారంగా ఛాతీని, తలను నేలకు దించాలి.
6.వెనక్కు వాలి పడుకున్న స్థితి నుండి లేచి కూర్చోవాలి. కాళ్ళు పద్మాసన భంగిమలోనే ఉంటాయి.
7.పద్మాసన భంగిమ నుండి కాళ్ళను విడదీసి, ముందుకు చాపి, విశ్రాంతి పొందాలి. ఇదే విధంగా రెండవ కాలితో ప్రారంభించి చేయాలి.
లాభాలు : మెదడుకు రక్తప్రసరణ జరిగి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుంది. శరీరం, మనసు చాలా తేలికవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
సూచన : శరీరం బరువు వెన్ను, మెడపై కాకుండా మోచేతులపై ఉంచాలి. రక్తపోటు వున్నవారు ఈ ఆసనం చేయరాదు.
సింహాసన్
9. సింహాసన్
ఇది కూడా కూర్చుని అభ్యాసం చేసే ఆసనమే.
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1.పద్మాసనం భంగిమలో వలె రెండు కాళ్ళను ఒకదాని తొడలపైకి మరొక దానిని తేవాలి.
2.మోకాళ్ళపై లేచి, ముందుకు వంగి, చేతులు నేలకు ఆనించి ఉండాలి. శరీరం బరువు మోకాళ్ళు, చేతులపై పడుతుంది.
3.తల ముందుకు తెస్తూ, నాలుక బయటకు తెచ్చి, కళ్ళతో భయంకరంగా చూస్తూ, సింహం గాండ్రించినట్లుగా అరవాలి. ఇదే సింహాసనం.
4.నాలుక, కళ్ళు, తల సరిచేసుకుని, వెనక్కు లేచి, పద్మాసన భంగిమలో కూర్చోవాలి.
5.పద్మాసన భంగిమ నుండి కాళ్ళను విడదీసి, ముందుకు చాపి, విశ్రాంతి పొందాలి. ఇదే విధంగా రెండవ కాలితో ప్రారంభించి చేయాలి.
లాభాలు : తల నాడులు, కళ్ళు, నోటి, దవడల కండరాలు, నాలుక, కొండ నాలుక ఉత్తేజిత మవుతాయి. జూ2 పూర్తిగా బయటకు పోవటం వలన హాయిగా ఉంటుంది.
గోముఖాసన్
10. గోముఖాసన్
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1.కుడి కాలిని వంచి ఎడమ తొడకు పక్కన ఉంచాలి.
2.ఎడమ కాలిని వంచి కుడికాలి కింద నుండి తెచ్చి, తొడ ప్రక్కకు పెట్టాలి. అప్పుడు ఎడమ కాలిపై కుడి తొడ వస్తుంది.
3.ఎడమ చేతిని పైనుంచి వీపు మీదకు తీసుకోవాలి.
4.కుడిచేతిని క్రిందనుండి వీపు మీదకు తీసుకొని ఎడమచేతి వ్రేళ్ళతో కుడి చేతి వేళ్ళని కలపాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
5.తరువాత వరుసగా కుడి చేయి, ఎడమ చేయి, ఎడమ కాలు, కుడి కాలు వెనక్కు తెచ్చి స్థితిలోకి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. ఇదే విధంగా ఎడమ కాలితో ప్రారంభించి చేయాలి.
లాభాలు : మధుమేహం, వీపు నొప్పి, మూత్ర పిండాల వ్యాధి తగ్గుతాయి.
అర్థమత్స్యేంద్రాసన్
11. అర్థమత్స్యేంద్రాసన్
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1.కుడి మోకాలుని వంచి, పాదాన్ని ఎడమ పిరుదు కింద ఉంచాలి.
2.ఎడమపాదాన్ని కుడి తొడకు పక్కగా ఉంచాలి.
3.కుడిచేతిని ఎడమ మోకాలికి వెలుపల, ఛాతీకి మోకాలికి మధ్యకు తీసుకు వచ్చి, ఎడమకాలి బొటన వ్రేలిని పట్టుకోవాలి. కుడి భుజం ఎడమ మోకాలికి వెలుపల ఉంచాలి.
4.ఎడమచేతిని వీపు వెనుక నుంచి తీసుకువచ్చి, కుడి తొడను ముట్టుకోవాలి. ఎడమ భుజంపై నుంచి వెనక్కి చూస్తూ ఉండాలి. నడుము పై భాగాన్ని నిటారుగా ఉంచాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
5.ఎడమ చేతిని వదిలి, మామూలుగా శరీరానికి ఎడమవైపుకు తేవాలి.
6.కుడి చేతిని వదిలి, మామూలుగా శరీరానికి కుడివైపుకు తేవాలి. శరీరం ముందుకు తిరుగుతుంది.
7.ఎడమకాలిని కుడి తొడపై నుండి తీసి, ముందుకు చాపాలి.
8.కుడికాలిని కూడా మామూలుగా తీసుకుని స్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి.
లాభాలు : వెన్నెముక నరాలకు జీవం అందించి, శక్తి నిస్తుంది. కాలేయానికి మర్దన కలిగించి బాగా పనిచేయిస్తుంది. మలబద్ధకం, చక్కెర వ్యాధి, మూత్రపిండ వ్యాధులు తగ్గుతాయి.
సూచన : హెర్నియా ఉన్న వారు ఈ ఆసనం చేయరాదు.
పశ్చిమోత్తానాసన్
12. పశ్చిమోత్తానాసన్
ఇది కూడా కూర్చుని అభ్యాసం చేసే ఆసనమే.
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1.శ్వాస పీలుస్తూ రెండు చేతులను చాపి పైకెత్తాలి. భుజాలు చెవులకు తాకుతాయి. నడుం నుండి పైభాగం పైకి నిటారుగా ఉంటుంది.
2.శ్వాస వదులుతూ, చేతులతో సహా నడుం పైభాగం వంచుతూ పూర్తిగా చాచి ఉన్న కాళ్ళమీదకు కిందకు వంగాలి. చేతులు నేలకు సమాంతరంగా చాపాలి.
3.చేతి వేళ్ళతో కాళ్ళ బొటన వేళ్ళని పట్టుకుని ఇంకాస్త ముందుకు వంగాలి. వీపును సాగదీయాలి. నుదురు మోకాళ్ళను తాకాలి. మోకాళ్ళు వంచరాదు. శ్వాస సాధారణంగా ఉంటుంది. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో ఒక నిముషం వరకు ఉండే ప్రయత్నం చేయాలి.
4.చేతులని విడిచి, చేతులతో సహా నడుం పైభాగాన్ని పెకెత్తి నిటారుగా రావాలి.
5.శ్వాస వదులుతూ, చేతుల్ని కిందికి దించుతూ, స్థితిలోకి వచ్చి విశ్రాంతి పొందాలి.
లాభాలు : కాలేయం, జఠరగ్రంథి లకు శక్తి వస్తుంది. పొట్ట భాగం దృఢమవుతుంది. అజీర్ణం, మలబద్ధకం, పుంసత్వ సమస్యలు, మొలలు నివారణ అవుతాయి. సుషుప్తావస్థలోని ఆధ్యాత్మిక శక్తులు మేల్కొంటాయి.
సూచన : రక్తపోటు, నడుంనొప్పి స్పాండిలైటిస్ ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.
వక్రాసన్
13. వక్రాసన్
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1.కుడికాలుని వంచి, కుడిపాదాన్ని చాచివున్న ఎడమ మోకాలి పక్కన ఉంచాలి.
2.శరీరాన్ని కుడివైపు తిప్పుతూ, ఎడమచేతిని కుడి మోకాలి పక్కగా పెట్టి కుడి మోకాలి బొటనవ్రేలు పట్టుకోవాలి. కుడిచేతిని వీపు వెనుక ఉంచి, అరచేతిని నేలకు అదిమి ఉంచాలి, కుడివైపు చూడాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. సాధారణ శ్వాస తీస్తూ ఒక నిమిషం వరకు ఈ స్థితిలో ఉండే ప్రయత్నం చేయాలి.
3.ఎడమ చేతిని వదిలి, మామూలుగా శరీరానికి ఎడమవైపుకు తేవాలి.
4.కుడికాలిని కూడా మామూలుగా తీసుకుని స్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి.
ఇదేవిధంగా రెండో వైపున చేయాలి.
లాభాలు : వెన్నెముకకూ, కాలేయానికి, చిన్న ప్రేవులకూ, జీర్ణ గ్రంథులకూ శక్తినిస్తుంది. మలబద్ధకం, చక్కెర వ్యాధి, మూత్ర పిండాల వ్యాధి, కాలేయానికి సంబంధించిన జబ్బులూ, నడుము కండరాల నొప్పి, తుంటి కీళ్ళ నొప్పులు పోతాయి.
సూచన : హెర్నియా ఉన్న వారు ఈ ఆసనం చేయరాదు.
భుజంగాసన్
14. భుజంగాసన్
స్థితి : మెత్తటి దుప్పటిపై బోర్లా పడుకుని చేతులు సాధారణంగా శరీరం పక్కనే చాచి ఉంచాలి. కాళ్ళు కూడా చాపి, పక్కపక్కనే ఉంటాయి.
1.రెండు చేతులనూ వంచి, అరచేతులను పక్కటెముకల పక్కన ఉంచాలి.
2.నెమ్మదిగా తలను, ఛాతిని కొద్దిగా పైకిలేపి ఉంచాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
3.ఛాతి, తలను కిందికి తెచ్చి, గడ్డాన్ని నేలకు ఆనించాలి.
4.చేతుల్ని చాచి, స్థితికి రావాలి. కాళ్ళ మధ్య దూరం పెంచి విశ్రాంతి పొందాలి.
లాభాలు : మెడ కండరాలు, వెన్నునరాలు వదులయి, బలంగా అవుతాయి. మెడ, వీపు నొప్పి, జీర్ణవ్యాధులు, పొట్టలోని కొవ్వు తగ్గుతాయి.
సూచన : హెర్నియా, రక్తపోటు వున్నవారు ఈ ఆసనం వేయరాదు.
శవాసన్
15. శవాసన్ లేదా అమృతాసన్
మెత్తటి దుప్పటిపై వెల్లకిలా పడుకుని, కళ్ళు మూసుకుని, కాళ్ళు, చేతులూ దూరంగా ఉంచి శవం మాదిరిగా ఉంచాలి. తలను ఒక పక్కకు వాలి ఉండాలి. శరీరంలోని అన్ని అవయవాలను శిథిలం (స్పర్శ లేని స్థితి) చేయాలి. దీర్ఘ శ్వాస, నిశ్వాసలు చేస్తూ ఉండాలి. నిద్ర పోకూడదు. ఈ ఆసనంలో 10 నుండి 30 నిముషాల వరకు ఉండవచ్చు. అన్ని ఆసనాలు చేసిన తరువాత చివరిలో ఈ ఆసనం వేయాలి.
లాభాలు : శవాసన్ లేదా అమృతాసన్ అని పిలిచే ఈ ఆసనంలో శరీరానికి, మనస్సుకు మంచి విశ్రాంతి లభిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలు తేలికవుతాయి. మనస్సు తేలికవుతుంది. రక్తప్రసరణ, గుండె కొట్టుకునే వేగం బాగా తగ్గుతుంది. అన్ని అవయవాలకు చక్కటి విశ్రాంతి లభించి, కొత్త శక్తిని సంతరించుకుంటాయి. వత్తిడితో వచ్చే అధిక రక్తపోటు, తలపోటు వంటివి ఉపశమిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే శరీరానికి అమృతం లభిస్తే ఎంత హాయిగా ఉంటుందో ఈ ఆసనం వేసిన తరువాత అంత హాయిగా, తేలికగా ఉంటుంది. అందుకే దీనిని అమృతాసన్ అని కూడా అంటారు. ఈ ఆసనాన్ని అన్ని వయసుల వారు, అందరూ చేయవచ్చు.
గమనిక : పైన సూచించిన అన్ని ఆసనాలు మొదటి రోజునే చేయరాదు. రెండు మూడు రోజులకు ఒక ఆసనం పెంచుకుంటూ పోవాలి. ఇది నిరంతర ప్రక్రియ. జీవితాంతం చేస్తే ఉన్న వ్యాధులు నివారణ అవడమే కాక, వ్యాధులు రాని స్థితి కూడా పొందవచ్చు. కాబట్టి నిదానంగానే చేయాలి.
మరొక విషయం ఏంటంటే, వ్యాయామం ప్రారంభంలోనే ఈ యోగాసనాలు వేయరాదు. యోగాసనాలు చేయడానికి ముందుగా శరీరాన్ని సిద్ధం చేయాలి. అందుకు ముందుగా సూక్ష్మ వ్యాయామం, శిథిలీకరణ వ్యాయామం చేయాలి. కొన్ని సూర్యనమస్కారాలు కూడా చేయాలి. ఈ ప్రక్రియను ప్రతిరోజూ పాటించాల్సిందే.
గమనిక : పైన సూచించిన అన్ని ఆసనాలు చేయబోయే ముందు కొన్ని రోజుల పాటు సూక్ష్మవ్యాయామం, సూర్యనమస్కారాలు చేయాలి. దీనివలన ఆసనాలు వేయడానికి శరీరం తగిన విధంగా సిద్ధమవుతుంది. అలాగే మొదటి రోజునే అన్ని ఆసనాలు చేయరాదు. రెండు మూడు రోజులకు ఒక ఆసనం పెంచుకుంటూ పోవాలి.
ప్రాణాయామం :
1. సూర్య అనులోమ, విలోమ
2. చంద్ర అనులోమ, విలోమ
3. కపాల భాతి
4. విభాగీయ శ్వాసక్రియ
5. నాడీ శుద్ధి ప్రాణాయామం
6. భ్రామరి
ధ్యానం :
1. నాద అనుసంధాన
2. ఓం కార ధ్యానం
క్రియలు :
1. జల నేతి
2. సూత్ర నేతి
3. వమన ధౌతి
ముద్రలు :
1. సూర్య ముద్ర
2. విపరీత కరణి ముద్ర
గమనిక : పైన సూచించిన యోగ సాధన అంతా మొదట యోగ గురువు పర్యవేక్షణలోనే ప్రారంభిం చాలి. ఇలా నెల లేదా రెండు నెలలు యోగ సాధన చేసిన తరువాత యోగ గురువు అనుమతితో సొంతంగా అభ్యాసం చేయవచ్చు.
Why is June 21 yoga day?, ఎందుకు జూన్ 21 యోగా రోజు? International Day of Yoga
Why is June 21 yoga day?, ఎందుకు జూన్ 21 యోగా రోజు? International Day of Yoga
Good information
ReplyDeleteGood 👍 explained 👏
ReplyDeleteFor example in certain people this genital inconveniences will be obvious plainly upon entering the world. On a similar note, for other people, this condition might show up obviously male or female anyway the inner attributes of sex for instance the chromosomes are not solely male or female. https://www.giantbomb.com/profile/fortismedicalbi/about-me/
ReplyDelete