Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్తీకరణ అవసరం ఏమిటి? -జిడి శర్మ - about jammu kashmir in telugu

1951లో రాజ్యాంగ సభ ఏర్పడిన నాటి నుంచి జమ్ము ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతూనే ఉంది. జనాభా ప్రకారం కాకుండా రాష్ట్ర అసెంబ్లీలో ఇక్కడ నుంచి ...

1951లో రాజ్యాంగ సభ ఏర్పడిన నాటి నుంచి జమ్ము ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతూనే ఉంది. జనాభా ప్రకారం కాకుండా రాష్ట్ర అసెంబ్లీలో ఇక్కడ నుంచి తక్కువ మంది ప్రజాప్రతినిధులకు స్థానం కేటాయించారు. అందువల్ల ఈ లోటును సవరించడానికి జమ్ము కాశ్మీర్ పునర్వ్యవస్థికరణ తప్పనిసరి అంటున్నారు జమ్ము కాశ్మీర్ హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జీడి శర్మ.
మహారాజ రంజిత్ సింగ్ మరణం తరువాత చిన్నాభిన్నమైన ఆయన సామ్రాజ్యం నుంచి 19వ శతాబ్దంలో మహారాజ గులాబ్ సింగ్ ఒక కొత్త రాజ్యాన్ని నిలబెట్టారు. పరాక్రమవంతుడైన ఆ డోగ్ర రాజు మంచి పాలకుడు కూడా. ఆయనను సామ్రాట్ విక్రమాదిత్య, అశోక చక్రవర్తులతో పోల్చవచ్చును. వారిలాగానే గులాబ్ సింగ్ కూడా తన సామ్రాజ్యాన్ని అన్ని వైపులకు విస్తరించారు. అన్ని కులాలు, జాతులతో కూడిన డోగ్రాలను ఏకీకృతం చేసి వారిలో పోరాట స్ఫూర్తిని రగిలించారు. ఆయన రాజ్యంలో అన్ని మతాలు, భాషలు, ప్రాంతాలకు చెందినవారు ఉండేవారు. జమ్ము, కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను ఒక రాజ్యంగా ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఆయన ఏర్పరచిన రాజ్యం 1947లో విభజన వరకు నిలచిఉంది. ఈ రాజ్యం ఎంత పెద్దగా ఉందంటే, ప్రపంచంలోని 111 స్వతంత్ర దేశాల కంటే విస్తీర్ణం ఎక్కువగా ఉండేది. ఒకప్పటి బ్రిటిష్ పంజాబ్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలు, రష్యా, చైనా, టిబెట్ వరకు విస్తరించింది. గులాబ్ సింగ్ మునిమనవడైన రాజ హరి సింగ్ కాలానికి ఈ రాజ్యం 2లక్షల 22వేల 236 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండేది. బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం మిగిలిన దేశవాసులకు వరమైతే జమ్మూకాశ్మీర్ లోని డోగ్రాలకు మాత్రం శాపంగా పరిణమించింది.
మహారాజా హరిసింగ్ కాలంలో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం, అలాగే 1981, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా ఈ విధంగా ఉంది:

జమ్ము ప్రాంతంలో 382002 ఓటర్లు ఎక్కువ ఉండడం వల్ల రాష్ట్ర రాజ్యాంగం లోని పరిచ్ఛేదం 50 ప్రకారం జమ్మూకాశ్మీర్ ప్రజాప్రతినిది చట్టం పరిచ్ఛేదం 4 కింద అదనంగా ఒక పార్లమెంట్ స్థానం ఏర్పాటు చేయాలి. అలాగే జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలో కూడా స్థానాలు పెంచాలి.
రాష్ట్ర రెజెంట్ గా వ్యవహరించిన డా. కరణ్ సింగ్ 1951, ఏప్రిల్ 20న రాజ్యాంగ సభను (రాష్ట్ర రాజ్యాంగాన్ని రూపొందించడానికి)ఏర్పరచారు. ఆ ప్రకటనలో జమ్ము కాశ్మీర్ కు 75 నియోజకవర్గాలు, పాకిస్థాన్ దురాక్రమణలో ఉన్న జమ్ము కాశ్మీర్ ప్రాంతం కోసం మరో 25 నియోజకవర్గాలు పేర్కొన్నారు.
1951, అక్టోబర్ 31న రాజ్యాంగ సభ మొట్టమొదటి సమావేశం జరిగింది. అప్పుడు రాష్ట్ర ప్రధాని షేక్ అబ్దుల్లా. ఈ సభను 1939లో రాజా హరిసింగ్ ఏర్పాటుచేసిన రాజ్యాంగం కింద రూపొందించారు. పాకిస్థాన్ దురాక్రమణ తరువాత అధికారిక జనాభా లెక్కలు ఏవి లేకపోయిన షేక్ అబ్దుల్లా మహారాజా హరిసింగ్ ను సంప్రతదించకుండానే 75 నియోజకవర్గాలను ప్రకటించాడు. అంతేకాదు వాటిలో 43 స్థానాలను కాశ్మీర్ ప్రాంతానికి, 30 జమ్మూకు, 2 లడఖ్ కు కేటాయిస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడు. షేక్ అబ్దుల్లా నిరంకుశ, ఏకపక్ష నిర్ణయాలను `ప్రజా పరిషద్’ అనే ఏకైక పార్టీ మాత్రమే వ్యతిరేకించేది. ఎన్నికల్లో షేక్ అబ్దుల్లా 75 నియోజక వర్గాలను చేజిక్కించుకున్నాడు. `అలాంటి విజయాన్ని నిరంకుశుడైన పాలకుడు కూడా సాధించలేడు’ అని యుసెఫ్ కొర్బెల్ తన `డేంజర్ ఇన్ కాశ్మీర్’అనే పుస్తకంలోని 222వ పేజీలో వ్యాఖ్యానించాడు. ఆ విధంగా కాశ్మీర్ ప్రాంతానికి మిగిలిన రెండు ప్రాంతాల కంటే ఎక్కువ స్థానాలు కేటాయించడం ద్వారా రాష్ట్ర వ్యవహారాలపై పట్టు సంపాదించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మహారాజా హరిసింగ్ ను తొలగించడం షేక్ అబ్దుల్లా వ్యూహం.
1947 దేశవిభజన అల్లకల్లోలం తరువాత జమ్ములోని సగం ప్రాంతంలో, కాశ్మీర్ లోని ముజాఫరాబాద్ నుంచి పూర్తిగా, బారాముల్లా నుంచి చాలభాగం హిందూ జనాభా తగ్గిపోవడంతో 1951 ఎన్నికలు అస్తవ్యస్తంగా అయ్యాయి. హిందువులను స్థానికులే పెద్ద ఎత్తున హతమారిస్తే, పాకిస్థాన్ సైన్యం మిగిలిన పని చేసింది. కాశ్మీర్ ప్రాంతంలో హిందువులు స్థిరపడకుండా షేక్ అబ్దుల్లా ప్రభుత్వం అన్నీ జాగ్రత్తలు తీసుకుంది. వారిని జమ్మూకు తరిమివేసింది. అలాగే జమ్ము ప్రాంతంలోని ముస్లిములు కూడా సమానమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామటుకు పాకిస్థాన్ కు వలసపోయారు. మొత్తానికి సరైన ఓటర్లు ఎవరు అని స్వతంత్ర సంస్థ నిర్ణయించి, నిర్ధారించిన ఓటర్ల జాబితా ఏది లేనేలేకుండా ఎన్నికలు జరిగిపోయాయి.
1957 అసెంబ్లీ ఎన్నిలు స్థానిక ఎన్నికల సంఘం నిర్వహించింది. అప్పుడు బక్షి గులాం మహమ్మద్ రాష్ట్ర ప్రధాని. ఆ ఎన్నికల్లో ప్రజా పరిషద్ 17 చోట్ల నామినేషన్ వేసినా కేవలం 5 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఎన్నికల నిర్వహణలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. బ్యాలెట్ బాక్స్ లు సరిగా లేవని, పడిన ఓట్లు తరువాత తారుమారు అయ్యాయని విశ్వసనీయ సమాచారం.
1960లో మాత్రమే భారత ఎన్నికల సంఘం పరిధిని జమ్మూకాశ్మీర్ కు విస్తరించారు. అప్పటివరకూ 1951, 1957 ఎన్నికలు స్థానిక ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషనర్ ద్వారానే జరిగాయి . 1967కు ముందు జమ్ము కాశ్మీర్ నుంచి లోక్ సభకు కొందరు సభ్యులను నామినేట్ చేసేవారు. 1962 ఎన్నికలు భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగాయి. 1962, 1977 ఎన్నికల్లో జమ్ము ప్రాంతానికి అదనంగా మరో రెండు స్థానాలు లభించడంతో మొత్తం స్థానాల సంఖ్య 32కు పెరిగింది. కాశ్మీర్ లో ఒక స్థానం తగ్గి మొత్తం స్థానాలు 42 అయ్యాయి.
1981లో జనాభా లెక్కల సేకరణ జరిగినప్పుడు షేక్ అబ్దుల్లా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తప్పనిసరి పరిస్థితిలో ఆయన పునర్ విభజన కమిషన్ ను ఏర్పాటు చేశాడు. అందులో జమ్ము కాశ్మీర్ మాజీ న్యాయమూర్తి వజీర్ జానకి నాథ్ ఛైర్మన్ గా, జస్టిస్ జలాల్ ఉద్ దిన్, ఎస్ ఎల్ శక్దర్ సభ్యులుగా ఉన్నారు. వజీర్ పదవీకాలం ముగియడంతో జలాలుద్దీన్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. కానీ నివేదిక ఏది సమర్పించకుండానే అతను 1991లో పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత జస్టిస్ కే.కె గుప్తాను ఛైర్మన్ గా నియమించారు. ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న ఆ రోజుల్లో కాశ్మీర్ లోయకు చెందిన కొద్దిమంది ముస్లిం సభ్యులు ఉగ్రవాదుల బెదిరింపులకు భయపడి రాజీనామా చేశారు.
చివరికి అనేక సంవత్సరాల నాటకీయ పరిణామాల తరువాత 1995 ఏప్రిల్ 27న నియోజకవర్గాల పునర్ విభజన నివేదిక వెలువడింది. కాశ్మీర్ లో 46 నియోజకవర్గాలు, జమ్మూలో 37, లడఖ్ లో 4 నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత 2002లో (ఫరూక్ అబ్దుల్లా హయాంలో) జమ్ము కాశ్మీర్ రాజ్యాంగంలోని పరిచ్ఛేదం 47ను సవరించడంతో నియోజకవర్గాల పునర్ విభజన 2026 సంవత్సరం వరకు చేయడానికి వీలు లేకుండా పోయింది. దీని వల్ల జమ్ము ప్రాంతానికి జరిగిన అన్యాయం అలాగే మిగిలిపోయింది.
దీని మూలంగా జమ్ము ప్రజలకు 2031లో జనాభా లెక్కల సేకరణ జరిగి, పునర్ విభజన కమిషన్ ఏర్పాటు అయ్యేవరకు కాశ్మీర్ తో సమానమైన ఓటింగ్ హక్కులు లభించే అవకాశం లేకుండాపోయింది.
జమ్మూకాశ్మీర్ ప్రజా ప్రాతినిధ్య చట్టం, జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం లోని పరిచ్ఛేదం 47(3) ల సవరణను సవాలు చేస్తూ జె కె ఎన్ పి పి అనే రాజకీయ పార్టీ హైకోర్ట్ లో ప్రజా వ్యాజ్యాన్ని సమర్పించింది. కానీ ఆ పిటిషన్ ను కోర్ట్ కొట్టివేసింది.
నియోజక వర్గాల సరిహద్దులను మార్చకుండా నిషేధం విధించడం వల్ల రాజ్యాంగం ఏర్పరచిన ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలుగుతుందన్న పిటిషనర్ వాదనతో కోర్టు ఏకీభవించలేదు.
దీనితో పిటిషనర్ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. కానీ సుప్రీం కోర్ట్ కూడా పిటిషన్ ను కొట్టివేసింది. జనాభా లెక్కల సేకరణ జరిగినప్పటికీ నియోజకవర్గాల పునర్ విభజన చేయకుండా జమ్ము కాశ్మీర్ ప్రాతినిధ్య చట్టం లోని పరిచ్ఛేదం 3, జమ్మూకాశ్మీర్ రాజ్యాంగంలోని పరిచ్ఛేదం 47(3)లను సవరించడాన్ని ఈ పిటిషన్ సవాలు చేసింది. 2001 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్ విభజన జరపకపోవడం వల్ల, అందుకు వీలుకలిగించే విధంగా పునర్ విభజన కమిటీని ఏర్పాటుచేయకపోవడం వల్ల ఎన్నికలు ప్రజప్రాతినిధ్యాన్ని సరైన విధంగా ప్రతిఫలించడం లేదని పిటిషనర్ వాదించారు.
అలాగే జమ్ము ప్రాంతంలోని 37 నియోజకవర్గాల్లో కొన్ని ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి కేటాయించారు. కానీ కాశ్మీర్ లోని 46 నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా వారికి కేటాయించలేదన్న విషయాన్ని కూడా పిటిషన్ దారు కోర్ట్ దృష్టికి తెచ్చారు. 35 ఏళ్లపాటు ఈ రిజర్వ్ స్థానాలను మార్చడానికి వీలులేదనే నిబంధన కూడా తెచ్చారని ఈ విషయాలను పరిశీలించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కానీ కోర్ట్ ఈ పిటిషన్ ను కూడా తిరస్కరించింది. మొత్తానికి జమ్మూ ప్రజల గురించి సరైన సమాచారం, చట్టపరమైన విషయాలు కోర్ట్ పరిశీలనకు రానేలేదు.
రెండు ప్రాంతాల జనాభా గురించి కచ్చితమైన లెక్కలు ఏవి లేకుండానే 1951లో శాసన సభ ఏర్పాటు జరిగిపోయింది. దీనితో అప్పటి నుంచి జమ్మూ ప్రజలకు అన్యాయం జరుగుతూనే ఉంది. అలాగే కాశ్మీర్ నుంచి తరలివచ్చిన 3.5 లక్షల మంది హిందువులు, అలాగే 1990లో ఉగ్రవాదం వల్ల ఈ ప్రాంతాన్ని వదిలిపోయిన హిందువుల సంఖ్యను పునర్ విభజన కమిషన్ లెక్కలోకి తీసుకోలేదు. అలాగే ప్రజాప్రాతినిధ్య చట్టం లోని పరిచ్ఛేదం 4లో పేర్కొన్న మిగిలిన అంశాలను కూడా కమిషన్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీనితో కమిషన్ నివేదిక మొదటి నుంచి చివరి దాకా తప్పులతడకగా తయారయింది.
జమ్మూ ప్రాంతంలో మతప్రాతిపదికన కేటాయించిన ఓట్లు, అలాగే నివాసం ఆధారంగా కేటాయించిన ఓట్ల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. మొత్తం రాష్ట్రంలో హిందువులు మైనారిటీ అయితే జమ్మూలో మాత్రం మెజారిటీ. వారి మైనారిటీ హోదాను పరిరక్షించకుండా వారి ఓట్లు తగ్గించేశారు. జమ్మూ లోని గాంధీనగర్, తూర్పు నియోజకవర్గం, కాశ్మీర్ లోని శ్రీనగర్ లోని నియోజకవర్గాల పోలికను తీసుకుంటే అసలు విషయం అర్ధమవుతుంది. శ్రీనగర్ లోని నియోజక వర్గాలలో ఓటర్ల సంఖ్య గాంధీనగర్ లోని ఓటర్ల సంఖ్య కంటే 45,062 తక్కువ. అలాగే జమ్మూ తూర్పు నియోజకవర్గం కూడా అంతే. కానీ నియోజకవర్గాల సంఖ్య, ఎమ్మెల్యే స్థానాల సంఖ్య చూస్తే జమ్మూలో తక్కువ, కాశ్మీర్ లో ఎక్కువ! ఇది రాజ్యాంగపు పీఠిక పౌరులందరికి కల్పిస్తున్న సమాన హక్కులకు విరుద్ధం. కనుక రాజ్యాంగపరంగా జమ్మూ ప్రజలకు ఎక్కువ స్థానాలు లభించాలి. ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే తమ తమ రాజ్యాంగాలను సవరించుకునే అధికారం రాష్ట్ర శాసన సభకు, అలాగే పార్లమెంట్ కు ఉంటాయి. అయితే ఆ సవరణ ప్రాధమిక హక్కులకు భంగకరంగా ఉండకూడదు. కానీ రాష్ట్ర అసెంబ్లీ ఎలాంటి సహేతుకమైన కారణం, వివరణ లేకుండా భారత రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులకు భంగం కలిగిస్తూ సవరణలకు పాల్పడింది. కాబట్టి రాజ్యాంగంలోని 368వ అధికరణ కింద అలాంటి సవరణలు చేయడానికి వీలులేదు. ప్రజాస్వామ్య రాజ్యంలో రాజ్యాంగానిదే ప్రధమ స్థానం. రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులను న్యాయస్థానాలు సంరక్షించాలి.
(రచయిత జమ్మూకాశ్మీర్ మాజీ న్యాయమూర్తి, భారత ప్రభుత్వం మత సామరస్య జాతీయ ఫౌండేషన్ నిర్వహణ కౌన్సిల్ సభ్యులు)
సేకరణ: విశ్వ సంవాదకేంద్ర తెలంగాణ

No comments