ప్రస్తుత కాలంలో థైరాయిడ్ సమస్య రోజు రోజుకి పెరుగుతోంది. థైరాయిడ్ గ్రంథి హర్మోన్స్ (T3 ,T4) ను విడుదల చేస్తుంది. ఈ హర్మోన్స్ శరీరంలోన...
ప్రస్తుత కాలంలో థైరాయిడ్ సమస్య రోజు రోజుకి పెరుగుతోంది.థైరాయిడ్ గ్రంథి హర్మోన్స్ (T3 ,T4) ను విడుదల చేస్తుంది. ఈ హర్మోన్స్ శరీరంలోని అనేక జీవ రసాయన చర్యలు జరగటంలో కీలక పాత్ర పోషిస్తాయి. థైరాయిడ్ గ్రంథి హర్మోన్స్ స్రవించటం ఎక్కువ, తక్కువలు అవటాన్ని థైరాయిడ్ సమస్య (థైరాయిడ్ డిసార్డర్స్) అంటారు. ఇందులో ముఖ్యంగా
1. హైపో థైరాయిడిజమ్ (Hypo Thyroidism)
2. హైపర్ థైరాయిడిజమ్ (Hyper Thyroidism)
హైపో థైరాయిడిజమ్
థైరాయిడ్ గ్రంథి సాధారణం కంటే తక్కువ మోతాదులో హర్మోన్ స్రవించడాన్ని హైపో థైరాయిడిజం అంటారు. ఈ హైపో థైరాయిడిజం సమస్య ఇటీవల బాగా పెరుగుతున్నది.
లక్షణాలు
– జీవ క్రియలు మందగిస్తాయి (స్లో అవుతాయి). దీనివలన బరువు పెరుగుతుంది.
– శ్వాస క్రియలో ఇబ్బందులు
– ఊరికే అలసిపోవటం
– చిరాకు, జుట్టు రాలటం
– జ్ఞాపకశక్తి తగ్గటం
– మహిళల్లో ఋతు సమస్యలు
– ముఖం ఉబ్బరించటం
– మలబద్ధకం
– మానసిక కుంగుబాటు
– ఆకలి తక్కువ, చెమటలు పట్టటం తక్కువ
హైపర్ థైరాయిడిజమ్
థైరాయిడ్ గ్రంథి సాధారణం కంటే ఎక్కువ మోతాదులో హార్మోన్స్ స్రవించడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు.
లక్షణాలు
– జీవక్రియల వేగం పెరిగిపోతుంది. బాగా ఆకలి వేస్తుంది. ఎంత తిన్నా ఖర్చయిపోతుంది. సన్నగా అవుతారు.
– ఎక్కువగా అలసట
– ఎక్కువగా చెమటలు
– గుండె వేగం బాగా పెరుగుతుంది
– మహిళలలో ఋతు సమస్యలు
– కోపం, ఆందోళన పెరుగుతాయి
యోగ చికిత్స
హైపర్ థైరాయిడిజం లేదా హైపో థైరాయిడిజం రెండిట్లో ఏ సమస్య అయినా మందులు వాడుతూ సమగ్ర యోగ చికిత్స తీసుకుంటే సమస్య తగ్గుతుంది. నెమ్మదిగా మందులు మానివేయవచ్చు.
థైరాయిడిజం సమస్యకు కారణాలు
– ఎక్కువ కాలం మందులు వాడటం వలన
– ఆటో ఇమ్యూనిటీ తగ్గటం వలన
– మానసిక సమస్యల వలన
– అయోడిన్ లోపం వలన
– పిట్యూటరీ గ్రంథి పెరుగుదల
– గర్భధారణ తరువాత
– వంశపారంపర్యం
– సూర్యరశ్మి శరీరానికి తగలక పోవటం వలన
యోగ చికిత్స
యోగ చికిత్స అనగా కేవలం ఆసనాలు, ప్రాణాయామం మాత్రమే కాదు. పంచకోశ స్థాయిలో సమగ్ర చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు.
ధైరాయిడిజానికి సరైన కారణాన్ని గుర్తించి, ఆ కారణాన్ని పూర్తిగా నిర్మూలించగలిగితే సమస్యను త్వరగా అధిగమించవచ్చు. ఒక్కోసారి కారణం ఒక్కటే కాకుండా 2, 3 కూడా ఉండవచ్చు. కాబట్టి అన్ని రకాల కారణాలను సమగ్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆహారం
– అయోడిన్ ఉప్పు వాడటం (అయోడిన్ లోపం ఉందని తేలినప్పుడు)
– కూరగాయలు, ఆకు కూరలు బాగా తీసుకోవాలి
– ఆహారం బాగా నమిలి మ్రింగాలి
– పీచు పదార్థం కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి
– సైంధవ లవణం వాడటం చాలా మంచిది
– మంచి నీరు కనీసం 4 నుంచి 5 లీటర్లు నిత్యం త్రాగాలి
– జంక్ ఫుడ్స్ తినకూడదు
– తృణ ధాన్యాలు బాగా తినాలి
– ప్రొటీన్ కలిగిన ఆహార పదార్థాలు నిత్యం తీసుకోవాలి
– సూర్యరశ్మి గ్రంథులపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నిత్యం సూర్యరశ్మి శరీరానికి తగిలే విధంగా వ్యాయామం చేయాలి లేదా నడవాలి
వ్యాయామం
– సూక్ష్మ వ్యాయామం
మింగటం (గుటక వేయటం). మెడను పైకి, కిందకు, పక్కలకు (కుడి, ఎడమలకు) వంచుతూ, అదే స్థితిలో 3 సార్లు మింగటం (గుటక వేయటం) చేయాలి. ఈ పని ఉదయం, సాయంత్రం చేయాలి.
– సూర్యనమస్కారాలు
వయసు సామర్థ్యం బట్టి 2 నుండి 10 వరకు చేయవచ్చు.
– ఆసనాలు
1. త్రికోణాసన్
స్థితి : ఇది నిలబడి చేసే అసనం. నిటారుగా నిలబడి ఉండాలి. రెండు పాదాలు కలిపి ఉంచాలి, రెండు చేతులు శరీరానికి పక్కనే కిందకు చాపి ఉంచాలి. చూపు ముందుకు.
1. ఎగురుతూ లేదా రెండు పాదాలను రెండు పక్కలకు జరుపుతూ రెండు పాదాల మధ్య ఒక మీటరు దూరము పెంచాలి. రెండు చేతులను ప్రక్కలకు, నేలకు సమాంతరంగా ఉంచాలి. అరచేతులు కిందకు.
2. కుడిపక్కకు వంగుతూ కుడిచేతి వేళ్ళను కుడి పాదము వేళ్ళకు తాకించాలి. వంగే సమయంలో ఎడమ చేయి పైకి ఎత్తి, సాచి ఉంచాలి. మెడ, తలను పైకి తిప్పి ఎడమచేతి వేళ్ళను చూడాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
3. రెండు చేతుల్ని భూమికి సమాంతరంగా తెస్తూ 1వ స్థితికి రావాలి.
4. కాళ్ళు దగ్గరకు, చేతులను క్రిందికి తెచ్చి (స్థితికి) విశ్రాంతి తీసుకోవాలి.
ఇదేవిధంగా ఎడమ వైపుకు వంగుతూ చేయాలి.
లాభాలు : మొత్తం శరీరం సాగుతుంది, వెన్ను కండరాలు సాగుతాయి. తొడలు, భుజాలు, రొమ్ము, కాలేయం, ప్లీహం, మూత్రపిండాలకు శక్తి వస్తుంది. పిరుదులు, నడుములోని కొవ్వు తగ్గుతుంది. చక్కెర, బిపి, శ్వాసకోశ, మూత్ర సంబంధ వ్యాధులు, మలబద్ధకం తగ్గుతాయి.
సూచన : మెడ, వెన్ను నొప్పి ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి.
2. సర్వాంగాసన్
స్థితి : వెల్లకిల పడుకోవాలి. రెండు కాళ్లు కలిపి నెమ్మదిగా పైకెత్తాలి. నడుమును రెండు చేతుల ఆధారంతో పైకి లేపాలి. మొత్తం శరీరం మెడ ఆధారంతో నిలబడుతుంది. పాదాలను పైకి లేపి వాటి వ్రేళ్లు ఆకాశం వైపు చూస్తున్నట్టు గుంజి పెట్టాలి. గడ్డాన్ని మెడ మీద ఉంచాలి. శ్వాస క్రియ మామూలుగా జరగాలి. ఈ ఆననంలో 1-10 నిమిషాల వరకు ఉండే ప్రయత్నం చేయాలి. అలసట కలిగే వరకు ఈ ఆసనంలో ఉండకూడదు. ఈ ఆసనంలో ఉండి కాళ్ళను వెనక్కు, ముందుకి, పక్కలకు కదలించ వచ్చు. పద్మాసన స్థితిలోకి కూడ రావచ్చు.
లాభాలు : మెడ నరాలు, గ్రంథులు శక్తివంత మౌతాయి. శరీరం నుండి వ్యాధి దూరమై అది చురుకుదనం పొందుతుంది. గొంతు గ్రంథుల దోషాలున్న వాళ్లు అవి నయం చేసుకున్న తర్వాతనే ఈ ఆసనం వేయాలి. దీనివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. ముఖం, గొంతు, మూత్రాశయం, మూత్రపిండాలు అన్నీ బాగుపడతాయి. మొలలు, అండ వృద్ధి, స్త్రీలకు వచ్చే తెల్లబట్ట లాంటి వ్యాధులు తగ్గుతాయి. అన్ని ఆసనాలకు సర్వాంగాసనం రాజులాంటిది. శీర్షాసనం చేయకపోయినా దానివల్ల కలిగే లాభాలన్నీ దీంతోనే కలుగుతాయి. బలహీనులు, వ్యాధిగ్రస్తులు తప్ప మిగతా అందరు ఈ ఆసనం చేయవచ్చు.
సూచన : మెడ దగ్గర ఉండే వెన్నెముకలో నొప్పి ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేయరాదు.
3. హలాసన్
వెల్లకిలా పడుకుని చేసే ఆసనం. హలం అంటే నాగలి. ఈ ఆసనం చివరి భంగిమలో శరీరం నాగలివలె ఉంటుంది. శవాసనం నుంచి స్థితికి రావాలి. అనగా చేతులు తలకి ఇరువైపులా నేరుగా వెనక్కి వుండాలి. ఎనిమిది విభాగాలలో ఆసనం వేయాలి.
1. ఊపిరి పీలుస్తూ, రెండు కాళ్ళను నేలకు 45 డిగ్రీల కోణంలో పైకి ఎత్తాలి.
2. ఇలా పైకి 90 డిగ్రీల కోణంలోకి కాళ్ళను లేపాలి. చేతులను శరీరం పక్కగా తీసుకురావాలి.
3. శ్వాసను వదులుతూ, పిరుదులకి అరచేతులు ఆనించి, మోచేతుల బలంతో నడుమును ఇంకొంచెంపైకి లేపాలి. గడ్డమును కంఠ కూపములో స్థితమగునట్లుగా ఉంచుతూ, కాళ్ళు నేలకు సమాంతరముగా ఉండేలా ఉంచాలి.
4 శ్వాసను వదులుతూ, ఇంకా వెనక్కి వంగుతూ, కాలివేళ్ళతో తల వెనుకవైపున నేలను తాకాలి. పాదాలను బాగా చాచి వుంచాలి. సాధారణ శ్వాసతో నిముషం వరకు ఆసన స్థితిలో వుండాలి.
5. శ్వాస తీసుకుంటూ, 3వ భంగిమలోకి రావాలి.
6. 2వ భంగిమలోకి రావాలి.
7. ఒకటవ భంగిమలోకి రావాలి.
8. కాళ్ళను నేలమీదికి తీసుకువచ్చి, శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.
గమనికలు : చివరి ఆసన స్థితిలో మోకాళ్ళు చక్కగా నిటారుగా వుండాలి.
లాభాలు : నడుము, వీపు కండరాలు, తుంటి సాగి, బలమవుతాయి. ఉదరభాగపు కండరాలు బలపడుతాయి. మెడకి, ఛాతికి రక్తప్రసరణ జరిగి, థైరాయిడ్ గ్రంథి చక్కబడుతుంది. అజీర్ణం, మలబద్ధకం నివారిస్తుంది.
సూచనలు : వెన్నెముక, గుండెకి సంబంధించిన సమస్యలు కలవారు, హైపర్ టెన్షన్ కలవారు ఈ ఆసనం వేయరాదు.
4. మత్స్యాసన్
ఇది కూర్చుని అభ్యాసం చేసే ఆసనం.
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1. పద్మాసనం భంగిమలో వలె రెండు కాళ్ళను ఒకదాని తొడలపైకి మరొక దానిని తేవాలి.
2. ఆ స్థితిలో వెనక్కు వాలి నేలపై పడుకోవాలి.
3. అరచేతులు నేలపై అదుముతూ, తల, ఛాతీ పైకి లేపాలి. ఈ స్థితిలో వెన్ను విల్లులా అవుతుంది.
4. చేతులు నేలపై నుంచి తీసి చూపుడు వేళ్ళతో కాలిబొటన వ్రేళ్ళను కొక్కెంలా చుట్టి పట్టుకోవాలి. మోచేతులు నేలకు ఆని ఉంటాయి. శరీర బరువు మోచేతులపై పడుతుంది. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
5. కాలి వేళ్ళను వదిలి, చేతులను నేలపై మోపి, వాటి ఆధారంగా ఛాతీని, తలను నేలకు దించాలి.
6. వెనక్కు వాలి పడుకున్న స్థితి నుండి లేచి కూర్చోవాలి. కాళ్ళు పద్మాసన భంగిమలోనే ఉంటాయి.
7. పద్మాసన భంగిమ నుండి కాళ్ళను విడదీసి, ముందుకు చాపి, విశ్రాంతి పొందాలి. ఇదే విధంగా రెండవ కాలితో ప్రారంభించి చేయాలి.
లాభాలు : మెదడుకు రక్తప్రసరణ జరిగి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుంది. శరీరం, మనసు తేలికవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
సూచన : శరీరం బరువు వెన్ను, మెడపై కాకుండా మోచేతులపై ఉంచాలి. రక్తపోటు వున్నవారు ఈ ఆసనం చేయరాదు.
5. భుజంగాసన్
స్థితి : మెత్తటి దుప్పటిపై బోర్లా పడుకుని చేతులు సాధారణంగా శరీరం పక్కనే చాచి ఉంచాలి. కాళ్ళు కూడా చాపి, పక్కపక్కనే ఉంటాయి.
1. రెండు చేతులనూ వంచి, అరచేతులను పక్కటెముకల పక్కన ఉంచాలి.
2. నెమ్మదిగా తలను, ఛాతిని కొద్దిగా పైకిలేపి ఉంచాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
3. ఛాతి, తలను కిందికి తెచ్చి, గడ్డాన్ని నేలకు ఆనించాలి.
4. చేతుల్ని చాచి, స్థితికి రావాలి. కాళ్ళ మధ్య దూరం పెంచి విశ్రాంతి పొందాలి.
లాభాలు : మెడ కండరాలు, వెన్నునరాలు వదులయి, బలంగా అవుతాయి. మెడ, వీపు నొప్పి, జీర్ణవ్యాధులు, పొట్టలోని కొవ్వు తగ్గుతాయి.
సూచన : హెర్నియా, రక్తపోటు వున్నవారు ఈ ఆసనం వేయరాదు.
6. శలభాసన్
ఇది కూడా బోర్లా పడుకుని అభ్యాసం చేసే ఆసనం.
స్థితి : మెత్తటి దుప్పటిపై బోర్లా పడుకుని చేతులు సాధారణంగా శరీరం పక్కనే చాచి ఉంచాలి. కాళ్ళు కూడా చాపి, పక్కపక్కనే ఉంటాయి.
1. బొటన వేళ్ళను లోపల ఉంచి, చేతి పిడికిళ్ళను మూసి పొత్తికడుపు కింద ఉంచాలి.
2. శ్వాస తీస్తూ, మోకాళ్ళను వంచకుండా రెండు కాళ్ళను కలిపి నెమ్మదిగా పైకి ఎత్తాలి. ఈ స్థితిలో నడుం పైభాగం నుండి తల వరకు నేలకు ఆనే ఉంటుంది. గడ్డం నేలకు ఆని ఉంటుంది. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో ఒక నిముషం వరకు ఉండే ప్రయత్నం చేయాలి.
3. శ్వాస వదులుతూ, నెమ్మదిగా కాళ్ళను కిందికి దించాలి.
4. చేతి పిడికిళ్ళు సడలించి, కాళ్ళ మధ్య దూరం పెంచి, విశ్రాంతి పొందాలి.
లాభాలు : వీపుకు, మెడ కండరాలకు, పిరుదులు, తుంటి, కడుపు, తొడలు, కాళ్ళు మరియు మూత్ర పిండాలకు శక్తి వస్తుంది. శరీరం తేలికయి, చురుగ్గా వుంటుంది. మనోనిగ్రహం పెరుగుతుంది.
సూచన : మూత్రవ్యాధులు, హెర్నియా లాంటివి ఉన్నవారు ఈ ఆసనం చేయరాదు.
7. శశాంకాసన్
ఇది వజ్రాసనంలో కూర్చుని అభ్యసించే ఆసనం స్థితి :
1. కుడికాలును మడిచి కుడి తుంటి భాగం కింద వుంచాలి.
2. అదేవిధంగా ఎడమకాలును మడిచి ఎడమ తుంటి భాగం క్రింద మంచి వజ్రాసన స్థితిలో కూర్చోవాలి.
3. కుడిచేయి పిడికిలి బిగించి, వెనక్కి వుంచి, ఎడమ చేయితో కుడిచేయి మణికట్టు భాగాన్ని పట్టుకోవాలి.
4. శ్వాస తీసుకుంటూ నడుము భాగం నుండి పైభాగమును కొంత వెనక్కి వంచి, పూర్తి శ్వాసను ఒదులుతూ ముందుకు వంగాలి.
ఈ స్థితిలో నుదురు నేలకు తాకించి వుంచాలి. సాధారణ శ్వాసతో ఒక నిమిషంపాటు విశ్రాంతిగా వుండాలి.
5. శ్వాస పీల్చుకుంటూ పైకి నెమ్మదిగా లేచి నిటారుగా కూర్చోవాలి. కనులు తెరవకూడదు. మూసి వుంచాలి.
6. చేతులను వెనుక నుండి విడదీసి తొడల ప్రక్కగా అరచేతులు నేలపై నిటారుగా వుండేలా కూర్చోవాలి.
7. నెమ్మదిగా ఎడమకాలును ఎడమ తుంటి క్రింద నుండి తీసి ముందుకు చాచి వుంచాలి.
8. అదేవిధంగా కుడికాలును కూడా కుడి తుంటి భాగం నుండి తీసి ముందుకు చాపి వుంచాలి.
లాభాలు: తలలోకి రక్త ప్రసరణ అధికం అగును కనుక మెదడు ప్రేరేపించబడును. దీనివలన మంచి నిద్ర పడుతుంది. జుట్టురాలకుండా ఉంటుంది. వెన్నుముక, చీల మండలం, మోకాళ్ళకు వంచబడు లక్షణం అధిక మగును. శ్వాస సంబంధిత రుగ్మతలకు సరైన ఆసనం ఇది.
సూచనలు : గ్యాస్ట్రైటిస్ మరియు జీర్ణాశయంలో పుండ్లతో బాధపడువారు ఈ ఆసనంను వేయరాదు.
ముఖ్యాంశాలు : శ్వాసను పూర్తిగా తీసుకుని, ఛాతి విశాలం చేసి ముందుకు వంగుటవలన నుదురు తేలికగా నేలకు ఆనుతుంది.
8. గోముఖాసన్
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1. కుడి కాలిని వంచి ఎడమ తొడకు పక్కన ఉంచాలి.
2. ఎడమ కాలిని వంచి కుడికాలి కింద నుండి తెచ్చి, తొడ ప్రక్కకు పెట్టాలి. అప్పుడు ఎడమ కాలిపై కుడి తొడ వస్తుంది.
3. ఎడమ చేతిని పైనుంచి వీపు మీదకు తీసుకోవాలి.
4. కుడిచేతిని క్రిందనుండి వీపు మీదకు తీసుకొని ఎడమచేతి వ్రేళ్ళతో కుడి చేతి వేళ్ళని కలపాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
5. తరువాత వరుసగా కుడి చేయి, ఎడమ చేయి, ఎడమ కాలు, కుడి కాలు వెనక్కు తెచ్చి స్థితిలోకి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. ఇదే విధంగా ఎడమ కాలితో ప్రారంభించి చేయాలి.
లాభాలు : నాడీ మండల వ్యవస్థ మీద ప్రభావం ఉండటం వలన మనస్సు ప్రశాంతమవుతుంది. దానితో చక్కటి నిద్ర పడుతుంది. బి.పి. అదుపులో ఉంటుంది. భావోద్వేగాల నియంత్రణ అలవడుతుంది. మధుమేహం, వీపు నొప్పి, మూత్ర పిండాల వ్యాధి తగ్గుతాయి.
9. అర్థ చక్రాసన్
ఇది నిలబడి చేసే ఆసనం.
స్థితి : నిటారుగా నిలబడి ఉండాలి. రెండు పాదాలు కలిపి ఉంచాలి, రెండు చేతులు శరీరానికి పక్కనే కిందకు చాపి ఉంచాలి. చూపు ముందుకు.
1. రెండు చేతులను నడుముకు వెనుక వైపున పిరుదుల పైన ఉంచాలి. నడుం వద్ద అరచేతు లతో పట్టి ఉంచి, చేతివేళ్ళు ముందుకు చాపాలి.
2. తల, మెడ, నడుము వెనక్కి వంచాలి. మోకాళ్ళు వంచరాదు. శరీర భారం పిరుదులపై ఉన్న చేతులపై పడుతుంది. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
3. తల, మెడ, నడుము ముందుకు తెచ్చి నిటారుగా ఉంచాలి.
4. చేతుల్ని కిందికి తెచ్చి స్థితికి రావాలి. విశ్రాంతి పొందాలి.
లాభాలు : వెన్నెముకలోని నరాలు వదులయి, సులువుగా వంగే స్థితి వస్తుంది. తలలోకి రక్తప్రసరణ వృద్ధి అవుతుంది. మెడ కండరాలు దృఢమవుతాయి. ఛాతి మరియు భుజములను విశాలపరుచును. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
సూచన : గుండె వ్యాధులు కలవారు, తల తిరుగు బాధలు ఉన్నవారు, ఇటీవల కడుపుకు శస్త్రచికిత్స చేయించుకున్నవారు ఈ ఆసన వేయరాదు.
10. వజ్రాసన్
ఇది కూర్చుని అభ్యాసం చేసే ఆసనం.
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1. కుడి కాలును మడిచి కుడి తొడ క్రింద ఉంచాలి. మడిమ వెనుకకు చూస్తుంది.
2. ఎడమ కాలును కూడా మడిచి, ఎడమ తొడ క్రిందకు తేవాలి. ఈ స్థితిలో రెండు కాళ్ళ మడిమలపై కూర్చుంటాము.
3. రెండు చేతులు తొడలపై పెట్టాలి. ఈ స్థితిలో శరీరం నిటారుగా అవుతుంది.
4. ఎడమకాలును ఎడమ తొడ కింద నుండి నెమ్మదిగా తీసి ముందుకు చాపాలి.
5. కుడికాలును కూడా కుడి తొడ నుండి నెమ్మదిగా తీసి ముందుకు చాపాలి. విశ్రాంతి పొందాలి.
లాభాలు : వెన్నుముకను నిటారుగా చేయడం వలన బద్ధకం వదులుతుంది. మడిమలు, పిక్క కండరాలలో నొప్పులు తగ్గుతాయి. పాదాల కండరాలు వదులయి, పాదాలు వంగలేని స్థితి నివారణ అవుతుంది. తిన్న తరువాత కూడా వేసే ఏకైక ఆసనం వజ్రాసనం. దీర్ఘ శ్వాసలు బాగా చేయటం వలన ఊపిరి తిత్తులు విశాలం అవుతాయి. దానితో వాటి బలం పెరగటంతోపాటు ఆక్సిజన్‌తో కూడిన రక్తం శరీరంలో పెరుగుతుంది.
11. ఉష్ట్రాసన్
ఇది కూడా కూర్చుని అభ్యాసం చేసే ఆసనమే.
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1. కుడికాలిని వంచి, పాదాన్ని పిరుదుల కిందకి తేవాలి.
2. ఎడమకాలిని వంచి, పాదాన్ని పిరుదుల కిందికి తెచ్చి వజ్రాసన స్థితిలో ఉండాలి.
3. శరీరాన్ని నిటారు చేస్తూ మోకాళ్ళపై నిలబడాలి.
4. శ్వాస వదులుతూ, నెమ్మదిగా వెనక్కి వంగుతూ, అరచేతులతో వెనుక ఉన్న పాదాలని పట్టుకోవాలి. దృష్టి వెనక్కు ఉంటుంది. మోకాళ్ళు దగ్గరగానే ఉండాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో ఒక నిముషం వరకు ఉండే ప్రయత్నం చేయాలి.
లాభాలు : శ్వాస సమస్యలు తొలగిపోతాయి. ఛాతి విశాలం అవుతుంది. నడుము దగ్గర కొవ్వు తగ్గి బలంగా తయారవుతుంది. ఊపిరితిత్తులు బాగా విశాలం అయ్యి వాటి సామర్థ్యం పెరుగుతుంది. కీళ్ళు అన్ని బలంగా తయారవుతాయి. థైరాయిడ్ సమస్య తగ్గుతుంది.
12. శవాసన్ లేదా అమృతాసన్
(5-10 నిమిషాలు దీర్ఘ విశ్రాంతి నివ్వాలి)
మెత్తటి దుప్పటిపై వెల్లకిలా పడుకుని, కళ్ళు మూసుకుని, కాళ్ళు, చేతులూ దూరంగా ఉంచి శవం మాదిరిగా ఉండాలి. తల ఒక పక్కకు వాలి ఉండాలి. శరీరంలోని అన్ని అవయవాలను శిథిలం (స్పర్శ లేని స్థితి) చేయాలి. దీర్ఘ శ్వాస, నిశ్వాసలు చేస్తూ ఉండాలి. నిద్ర పోకూడదు. ఈ ఆసనంలో 10 నుండి 30 నిముషాల వరకు ఉండవచ్చు. అన్ని ఆసనాలు చేసిన తరువాత చివరిలో ఈ ఆసనం వేయాలి.
లాభాలు : శవాసన్ లేదా అమృతాసన్ అని పిలిచే ఈ ఆసనంలో శరీరానికి, మనస్సుకు మంచి విశ్రాంతి లభిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలు తేలికవుతాయి. మనస్సు తేలికవుతుంది. రక్తప్రసరణ, గుండె కొట్టుకునే వేగం బాగా తగ్గుతుంది. అన్ని అవయవాలకు చక్కటి విశ్రాంతి లభించి, కొత్త శక్తిని సంతరించుకుంటాయి. వత్తిడితో వచ్చే అధిక రక్తపోటు, తలపోటు వంటివి ఉపశమిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే శరీరానికి అమృతం లభిస్తే ఎంత హాయిగా ఉంటుందో ఈ ఆసనం వేసిన తరువాత అంత హాయిగా, తేలికగా ఉంటుంది. అందుకే దీనిని అమృతాసన్ అని కూడా అంటారు.
సూచన : ఈ ఆసనాన్ని అన్ని వయసుల వారు, చేయవచ్చు.
– ప్రాణాయామం
కపాలభాతి
విభాగ శ్వాసక్రియ
అనులోమ, విలోమ
ఉజ్జాయి
– ముద్రలు
శంఖముద్ర
ఆక్యుప్రెషర్
బొట్టు పెట్టుకొనే ప్రదేశంలో (ఐబ్రిసెంటర్) ఉంగరం వ్రేలితో 21 సార్లు ఒత్తిడి కలిగించాలి.
అరచేతులలో థైరాయిడ్ పాయింట్‌ను ఒత్తాలి.
– ధ్యానం
నాద అనుసంధాన
శ్వాసమీద ధ్యాస
– క్రియలు
జల నేతి
సూత్ర నేతి
వమన ధౌతి
ముఖ్య సూచన : పైన సూచించిన యోగ సాధన అంతా మొదట యోగ గురువు పర్యవేక్షణలోనే ప్రారంభించాలి. ఇలా నెల లేదా రెండు నెలలు యోగ సాధన చేసిన తరువాత యోగ గురువు అనుమతితో సొంతంగా అభ్యాసం చేయవచ్చు.
Very good and informative
ReplyDeleteIt's very important for me..thank you...
ReplyDelete