మానవహితంకోసం మరచెంబు పునరుద్దరణ: మన ముందుతరాల పద్దతులను కొన్నిటిని మనం విస్మరించాం. వాటిని పాతకాలం అలవాట్లుగా బూజుపట్టిన ఆచారాలుగా పరి...
మానవహితంకోసం మరచెంబు పునరుద్దరణ:
మన ముందుతరాల పద్దతులను కొన్నిటిని మనం విస్మరించాం. వాటిని పాతకాలం అలవాట్లుగా బూజుపట్టిన ఆచారాలుగా పరిగణించాం. ఆధునికయుగ సంకేతాలుగా కొన్నిటిని చేపట్టినాం. ప్లాస్టిక్ సీసాలలో మినరల్ వాటర్ పేరుతోనో మరో పేరుతోనో అమ్మబడుతున్న నీరు శుద్దమైనదిగా భావించి సేవించడానికి అలవాటు పడ్డాం.
విమానాశ్రయాలలో , రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో అవి అందుబాటులొ ఉంటున్నందున , డబ్బు లెక్కలేనందున వాటిని కొంటున్నాం. ఎంతో కొంత నీరు త్రాగి ఆపైన ఎక్కడో విసిరేస్తున్నాం, లేదా వదిలేస్తున్నాం. అయితే ఇప్పుడు రెండు విషయాలు స్పష్టంగా తెలియ వస్తున్నవి. ప్లాస్టిక్ సీసాల లోని నీరు కేన్సరుకు, కీళ్ల నొప్పులకు, నపుంసకత్వానికీ దారి తీస్తున్నది. వాడి వదిలేసిన ప్లాస్టిక్ సీసాలు గుట్టలుగా ప్రోగుబడి దశాబ్దాలు గడిచినా విచ్ఛిన్నం కాక, మట్టిలో కలవక, కాలుష్యానికి కారణ మవుతున్నవి. కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డుపడి చిన్న వర్షాలకే నగరాలలో వరదలు సృష్టిస్తున్నవి. ఇంతప్రమాదాన్ని చేజేతులా మనం ఎందుకు కొని తెచ్చుకోవాలి? దీనికి క్షేమదాయకమైన ప్రత్యామ్నాయం లేదా?
ఎందుకు లేదు, తప్పక ఉంటుంది. Search, You Will Find అని డా. సి వి రామన్ గారు చెప్పేవారట. అలా చూసినపుడు మన ముందు తరాలవారు ఉపయోగిస్తూ వచ్చిన ఇత్తడి మరచెంబులు మన దృష్టికి రాకుండా ఉండవు. మన ఇంట్లో అటక మీదనో, పాత భోషాణమ్లోనో ఉండి ఉంటాయి. వాటిని వెలికి తీయండి. ఒకటికి రెండుసార్లు చింతపండుతో తోమించండి. మీకు ప్రయాణాల్లో చక్కగా ఉపయోగపడుతుంది. ఒక చేతిలో సూట్ కేసు, మరో చేతిలో మరచెంబుతో నాలుగు ఫొటోలు తీసుకుని ఫేస్ బుక్ లో పెట్టండి. ఇలా పదిమంది ఫొటోలు పోస్ట్ చేస్తే నెలరోజుల్లో మార్కెట్ లో ఎక్కడబడితే అక్కడ కొత్త కొత్త నమూనాల్లో మరచెంబులు ప్రత్యక్ష మవుతాయి.
మరచెంబులో నీరు పోసిన తర్వాత మూత పెట్టుతాం, కాబట్టి నీరు శుభ్రంగా ఉంటుంది. చేతితో పట్టుకొని పోడానికి అనువుగా ఉంటుంది. కాదు, భుజానికి వ్రేలాడ దీసుకుందామని ఆలోచన వస్తే ఆ ఏర్పాటు కష్టమేమీ కాదు. మరచెంబు లో చిన్న చషకం ( గ్లాసు) ఉంటుంది. దాని సాయంతో పిల్లలకు కూడా సులభంగా త్రాగించవచ్చు.
ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రణాళికకు మీరు చెప్పగల అభ్యంతరం ఏమిటో నేను ఊహించ గలను. రోజు చింతపండు పెట్టి శుభ్రం చేయటం శ్రమ కదా, దాన్ని తప్పించే మార్గం లేదా? ఇక్కడ మనం గుర్తుచేసుకోవలసిం దేమిటంటే పని ముద్దు, కాని సంపద ముద్దు కాదు అని మన పెద్దలు చెప్పిన సామెత. మీరు ఎంతగా పని చేస్తే అంతగా ఆరోగ్యవంతు లవుతారు. అంతగా భాగ్యవంతులూ అవుతారు.
ఇంకెందుకు ఆలస్యం, మరచెంబు పునరుద్దరణ మహత్కార్యంలో అడుగు ముందుకు వేయండి. జయోస్తు. -వడ్డి విజయసారధి.
No comments