Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మహిళలు అందంగా ఉండటానికి ఇవే కారణాలు - These are the reasons why women are beautiful

చేతినిండా గాజులు, కాలికి పట్టీలు-మెట్టెలు, ముఖానికి బొట్టు, చక్కని తలకట్టు, తలలో పూలు పెట్టుకుని లక్షణంగా ఒక మహిళ ఎదురైతే అందరూ ఆమెను చూ...

చేతినిండా గాజులు, కాలికి పట్టీలు-మెట్టెలు, ముఖానికి బొట్టు, చక్కని తలకట్టు, తలలో పూలు పెట్టుకుని లక్షణంగా ఒక మహిళ ఎదురైతే అందరూ ఆమెను చూసి తప్పక నమస్కరిస్తారు. ఇదీ మన భారతీయ సంస్కృతికి ఉన్న గొప్ప విలువ. ఇటువంటి విలువైన సంప్రదాయాలు, ఆచారాలతో మనం ప్రపంచంలోని ఇతరుల కన్నా విభిన్నంగా గౌరవాదరాలకు నోచుకుంటున్నాం. కానీ ప్రస్తుతం పాశ్చాత్య విషసంస్కృతి ప్రభావం వల్ల భారతీయులు నాగరికతవైపు మొగ్గు చూపుతున్నామనే భ్రమలో పడి భారతీయ సంస్కృతిని విస్మరిస్తున్నారు. భారతీయ సంస్కృతిలో ప్రతి ఆచారానికి శాస్త్రీయ పరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి అసలు ఇవెందుకు ధరిస్తారు, వీటి వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటో తెలుసుకుందాం !
గాజులను సంస్కృతంలో ‘కంకణ్‌’, హిందీలో ‘చిడియ’, ‘చుడ’ అంటారు. పంజాబ్‌లో వధువులు పెళ్లికి 21 రోజుల ముందు నుండి కాని లేదా పెళ్లి తర్వాత సంవత్సరం వరకూ కాని ఏనుగు దంతంతో చేసిన గాజులను ధరించడం సంప్రదాయం. ఉత్తరప్రదేశ్‌లో పెళ్లికూతురు ఎర్రచీర, ఎర్ర గాజులు ధరించడం శుభధాయకమని నమ్ముతారు. మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రలలో పెళ్లికూతురు పచ్చ గాజులు ధరించడం ఆనవాయితీ. పశ్చిమ బెంగాల్‌లో చిన్న గవ్వలు లేదా ఎర్ర పగడాలతో చేసిన గాజులను చేతులకు వేసుకోవడం ఇప్పటికీ కనిపిస్తుంది. దక్షిణ భారతంలో స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ‘శ్రీమంతం’ అనే శుభకార్యం నిర్వహిస్తారు. ఈ సమయంలో ఒక చేతికి 21 గాజులు, మరో చేతికి 22 గాజులు తొడుగుతారు.
ప్రాచీనకాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ గాజులు ధరించేవారు. కేవలం అందమే గాజుల ప్రయోజనం కాదని వాదిస్తారు కొందరు. గర్భాశయ నాడులను ఉద్దీపనం (చురుకుతనం పెంచడం) చేయడానికి ఉద్దేశించినవే గాజులు. మహిళల్లో వారి మణికట్టుకు ముంజేతికి మధ్య ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయి. మణికట్టు నాడులు స్వల్పంగా ఒత్తిడికి లోనవుతుంటే గర్భాశయ నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమవుతాయి. దాంతో గర్భాశయం పనితీరు, కండరాల కదలికలు సవ్యంగా జరుగుతుంటాయి. కాబట్టి ఒకరకంగా అలంకరణకు, ఆరోగ్య సాధనకు ఉపకరించే విధంగా గాజులు ఉపయోగ పడతాయి. అదేవిధంగా గర్భవతిగా ఉన్న మహిళలు గాజులు ధరించడం వల్ల వాటి నుంచి వచ్చే శబ్దం లోపల ఉన్న బిడ్డలో కదలికలు తీసుకురావడానికి ఉపయోగపడతుంది. బిడ్డతో అనుసంధానం అవ్వడానికి తల్లికి గాజులుకూడా ఉపయోగపడతాయి.
నుదుట సింధూరం: భారతదేశం తప్ప ప్రపంచంలోని మిగతా ఏ దేశాల్లోనూ ముఖాన తిలకం బొట్టు పెట్టుకునే ఆచారం లేదు. భారత స్త్రీలు స్నానం చేసిన వెంటనే ముఖాన సింధూరం పెట్టుకుని, ఇక ఆ బొట్టు రోజంతా ఉండేలా జాగ్రత్త పడతారు. చెమట పట్టి, లేదా ఇతర ఏ కారణం చేతనైనా నుదుట కుంకుమ చెరిగిపోతే, వెంటనే అప్రమత్తమై మళ్లీ బొట్టు పెట్టుకుంటారు. ముఖాన సింధూరం లేకపోతే అశుభం అని, నుదుట కుంకుమ ధరించిన స్త్రీలకి సౌభాగ్యం కలుగుతుందని అంటారు. పెళ్లిళ్లు, పేరంటాలు లాంటి శుభకార్యాలకు కుంకుమ బొట్టు పెట్టి ఆహ్వానించడం ఆచారంగా, ఆనవాయితీగా వస్తోంది. ఏ శుభ కార్యానికైనా సింధూరం నాంది. కుంకుమతో ఆహ్వానించడాన్ని శుభసూచకంగా భావిస్తారు. ఇంట్లో ఏ శుభం జరిగినా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు తీర్చిదిద్దుతారు. ఖరీదైన దుస్తులు లేకపోవచ్చు.. కానీ చిటికెడు కుంకుమ లేని ఇళ్లు ఉండవు. ఆ కుంకుమే అమూల్యమైంది. అపూర్వ కళను తెచ్చిపెడుతుంది.
పద్మపురాణం, ఆగ్నేయ పురాణం, పరమేశ్వర సంహితలోనూ నుదుటి బొట్టు ప్రస్తావన కనిపిస్తుంది. శరీరంలోని అన్ని నాడులనూ కలుపుతూ, మెదడుకు సంకేతస్థానమై, ఎప్పుడూ చైతన్యంగా ఉండే అతి కీలకమైన నాడి ‘సుషుమ్న’ నాడి. దాని కేంద్రం ఉండేది లలాటం మీదే. అంటే కనుబొమ్మల నుండి పైన పాపిడి వరకు. ఆ స్థలంలోనే శివునికి మూడో నేత్రం ఉంటుంది. దీనినే ‘జ్ఞాననేత్రం’ అంటారు. శివునికే కాదు, అందరికీ ఉంటుంది. అది చెప్పటానికే దానిని శివునిలో చూపించారు మన ఋషులు. ఈ జ్ఞాననేత్రానికి ఇతరుల దృష్టి సోకకుండా, సూర్యతాపం దానిమీద పడకుండా కాపాడేందుకు మన ఋషులు సింధూరం పెట్టుకునే ఆచారం పెట్టారు. అదేవిధంగా బొట్టు పెట్టుకునే చోటు పీనియల్‌ గ్రంథి స్థానమని, ఇది మానసిక ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్లని పెంపొందించి ఒత్తిళ్లను దూరం చేస్తుందనీ, మంచి ఆలోచనలు కలిగించేందుకు తోడ్పడుతుందనీ చెబుతారు. అందుకే నుదుట బొట్టు వల్ల పీనియల్‌ గ్రంథికి రక్షణ కలుగుతుంది కూడా. అందుకే నుదుటిన కిందనుండి పైదాకా బొట్టు పెట్టుకునే సాధువులు వంటివారు ఎప్పుడూ శాంతంగా ప్రవర్తిస్తుంటారు.
తలలో పూలు ఎందుకంటే: పువ్వులంటే ఇష్టపడని మహిళలు ఉండరేమో. తలలో పూలు పెట్టుకోవడం మన సంప్రదాయాల్లో ఒకటి. పూల నుండి సుగంధ పరిమళం వస్తుంది. ఆ పరిమళాన్ని పీల్చడం వలన ఆస్త్మా వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. అందుకే మల్లె, జాజి, గులాబి వంటి సుగంధపరిమళాలు వెదజల్లే పూలను తలలో ధరించడం మన ఆచారమైంది. అలాగే అన్ని నరాల వ్యాధులకు సంబంధించిన రోగాలను ఈ పూలు నయం చేస్తాయి. ఒక్కొక్క పూవు ఒక్కోరకంగా ఉపయోగపడుతుంది. అందుకే అనేక ఔషధాలలో ఈ పూలను వాడుతుంటారు. వాటిని మహిళ ధరించిన సమయంలో ఆమె దగ్గరగా ఉండేవారిని కూడా ఆ సుగంధ పరిమళాలు చేరి వారిని అనేక అనారోగ్యకర ఇబ్బందుల నుంచి దూరం చేస్తాయి. అంతేకాదు, సువాసన భరిత పరిమళాలు భార్యా భర్తలను దగ్గర చేస్తాయని అనేక రకాల పరిశోధనల ద్వారా నిరూపితమైంది. ఈ విషయాన్ని మన భారతీయ సంస్కృతి ఏనాడో గమనించింది. అందుకే పూర్వకాలంలోనూ, ఇప్పటికీ భర్త సాన్నిహిత్యంలో స్త్రీ రకరకాల సుగంధ పుష్పాలను ధరిస్తుంది. దీనివల్ల వారి మనసు సంతోషంగా ఉండి వారి దాంపత్య జీవితం ఆనందంగా గడుస్తుంది.
ముక్కుకి ముక్కెర:ముక్కుకి ముక్కెరను ధరించడం అనాదిగా వస్తోన్న ఆచారం. కొందరు వివాహ సమయంలో ముక్కు పుడక పెట్టుకుంటే మరింకొందరేమో చిన్నవయసులోనే ముక్కు కుట్టించుకుంటారు. ముక్కుపుడక కూడా సౌభాగ్యానికి సూచనగా చెబుతుంటారు. ముక్కుపుడక ధారణలో కూడా శాస్త్రీయత దాగి ఉంది. కుడివైపున సూర్యనాడి ఉంటుంది. కుడివైపు ముక్కుకు మండలాకారమైన ఒకరాయి ధరించాలని శాస్త్రాలు చెపుతున్నాయి. అలాగే ఎడమవైపున చంద్రనాడి ఉంటుంది. అందువల్ల ముక్కుకు ఎడమవైపున అర్ధ చంద్రా కారంలో ముక్కు పుడక ధరించాలని పండితులు చెప్తున్నారు. దీనివలన మహిళలకు గర్భకోశవ్యాధులు దరిచేరవట. పురుటి నొప్పులు ఎక్కువగా రాకుండా సుఖ ప్రసవం అవడానికి సహకరిస్తుందట. కన్ను, చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటా యట. చెవికి సంబంధించిన వ్యాధులు అనగా చెవిపోటు, చెవుడు వంటివి కలుగకుండా ముక్కు పుడక సహాయపడుతుంది. అంతేకాదు దీన్ని ధరించడం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు ధరిచేరవు. ప్రత్యుత్పత్తి మెరుగుపడుతుందని నేటి వైద్యులు చెప్తున్నారు.
కాలి వేళ్లకు వెండి మెట్టెలు ఎందుకంటే: మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అయిన స్త్రీలు కాళ్లకు వెండి పట్టీలు, మెట్టెలు ధరిస్తారు. పట్టీలు చిన్నప్పటినుంచే ధరిస్తారు. వివాహ సమయంలో మెట్టెల ధారణ జరుగుతుంది. ఒక మహిళకు వివాహం అయింది అని తెలుసుకోవడానికి మెడలో మంగళసూత్రం మొదటి గుర్తుగా తీసుకుంటే కాలి మెట్టెలను రెండో గుర్తుగా తీసుకుంటారు. సాధారణంగా వివాహమైన స్త్రీలు కాలి రెండవ వేలికి మెట్టెలు ధరిస్తారు. దీనివెనుక ఓ శాస్త్రీయత దాగి ఉంది. కాలి రెండవ వేలి నుండి ఓ ప్రత్యేక నరం ప్రారంభమై గర్భాశయానికి సంధి చేయబడి గుండె వరకు వెళుతుంది. ఈ వేలికి మెట్టె పెట్టుకోవడం వల్ల గర్భాశయం ధృఢపడుతుంది. ఇది రక్తప్రసరణను నియంత్రించి రుతుచక్రం సక్రమంగా నడుస్తూ గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వెండి చక్కటి ఉష్ణ వాహకం కావడం వల్ల.. భూమి నుండి ధనావేశాలను గ్రహించి శరీరానికి ప్రసరింపజేస్తుంది. అందుకే వెండితో చేసిన మెట్టెలను మన భారతీయ స్త్రీలు కాలి రెండవ వేలుకు ధరిస్తారు. అదేవిధంగా కాలికి గజ్జెలు లేక పట్టీలు ధరించడం వల్ల కూడా శరీరంలో ఉండే అతి వేడి తగ్గుతుంది.
మంగళకరం మంగళసూత్రం: వివాహ సమయంలో ‘మాంగల్యం తంతునానేన’ అంటూ మంగళవాయిద్యాల మధ్య ‘నా జీవితాన్ని రమ్యం చేయ’మంటూ పురుషుడు స్త్రీ మెడలో తాళి కట్టే ఆ సన్నివేశం ఎంత శోభాయమానంగా ఉంటుందో కదా ! వేదపండితుల సాక్షిగా పెళ్లి చేసుకుని ఒక్కటైన నూతన వధూవరులను ముక్కోటి దేవత లందరూ నిండుగా దీవిస్తారని నమ్మకం. అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళ సూత్రాలను పక్కనబెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే మితిమీరుతున్న ఆధునికత వెర్రిలో మంగళసూత్రం పవిత్రతనే ప్రశ్నిస్తున్నారు.
భార్యాభర్తల అనుబంధానికి ప్రతీకగా ‘మంగళ సూత్రాన్ని’ భావిస్తాం. ‘మంగళ’ అంటే శుభప్రదం, శోభాయమానం. ‘సూత్రం’ అంటే తాడు, ఆధారమని అర్థం. మన దక్షిణాదిన మంగళసూత్రాన్ని ‘తాళి’గా పలుకుతున్నారు. నలుపు, బంగారువర్ణంలో ఉండే మంగళసూత్రంలో పార్వతి పరమేశ్వరులు కొలువై ఉంటారట. ఈ మంగళసూత్రంలో రెండు సూత్రా లతో పాటు ముత్యం, పగడం నల్లపూసలు వంటివి ఉంటాయి. ఇందులో ఉండే ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహసౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందానికి, అన్యోన్య దాంపత్యానికి కారకుడు. అలాగే శారీరకంగా కళ్లు, కొవ్వు, గ్రంధులు, సిరలు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయవాలు, నరములు, ఇంద్రియాలు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు. మంగళ సూత్రంలో ఉండే పగడం కుజగ్రహ కారకం. అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యం, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుతయములు, పరదూషణ, కామవాంఛలు, దృష్టి దోషము ఇత్యాదులు మరియు శారీకంగా ఉదరము, గర్భసంచి, ఋతుక్రియ మొదలైన వాటిని ఇది ప్రభావితం చేస్తుంది. ఈ ముత్యం, పగడాలు స్త్రీకి ఎలా ఉపయోగపడతాయంటే ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారం గావించి 28వ రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం. దీని అర్ధం ఆరోగ్యవంతురాలైన స్త్రీకి 28 రోజులకు ఋతుదర్శన మవాలి. సాధారణంగా వివాహం తర్వాత మగువ శరీరంలోని అనేక హార్మోన్ల మార్పుల వల్ల నెలసరి సమస్యలు రావచ్చు. ఈ సమస్యలను నివారించ డానికే మంగళసూత్రంలో ముత్యం, పగడం, నల్లపూసలు వేస్తారు. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీలలోని అన్ని నాడీ కేంద్రాలను ఉత్తేజపరచి శరీరకంగా, మానసికంగా స్త్రీలలో వచ్చే దోషాలను తొలగిస్తాయి. ఇదే మంగళసూత్రంలో ఉన్న శాస్త్రీయత. – సంతోషలక్ష్మి దహగాం. జాగృతి వారపత్రిక నుండి సేకరణ.

No comments