Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సోదరి నివేదిత జీవిత చరిత్ర - About Sodari Nivedita in Telugu - Margaret Elizabeth Noble

స్వామి వివేకానందుని ఉపన్యాసాలకు, హైందవ తత్వ శాస్త్రానికీ ముగ్ధులైన అనేకమంది విదేశీయులు స్వామిజీకి శిష్యులైనారు. వారిలో ప్రముఖులు ‘సోదరి ...

స్వామి వివేకానందుని ఉపన్యాసాలకు, హైందవ తత్వ శాస్త్రానికీ ముగ్ధులైన అనేకమంది విదేశీయులు స్వామిజీకి శిష్యులైనారు. వారిలో ప్రముఖులు ‘సోదరి నివేదిత’. మిస్ మార్గరెట్ నోబుల్‌గా స్వామిజీ ఆహ్వానంపై భారతదేశానికి వచ్చారు.
సోదరి నివేదిత ఉత్తర ఐర్లాండ్‌లోని డంగనాన్ అనే చిన్న పట్టణంలో 28 అక్టోబర్, 1867న శ్రీ సామ్యూల్ రిచ్‌మండ్ నోబుల్, శ్రీమతి మేరీ ఇసాబెల్ నోబుల్ దంపతులకు జన్మించింది. ‘మార్గరెట్’ చిన్నతనం నుంచి మంచి కుశాగ్రబుద్ధి కల్గి ఉండేది. తండ్రి అకాలమరణంతో కుటుంబ పోషణ కోసం పదిహేడేళ్ళ మార్గరెట్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టింది. మంచి బోధకురాలిగా పేరు, ప్రతిష్ఠలను పొందింది. పత్రికా వ్యాసంగం ఆ చిరువయస్సులోనే అబ్బింది. పాఠశాలలో పనిచేస్తూనే అక్కడి స్థానిక చర్చితో సంబంధం పెట్టుకుంది. చివరకు ‘నన్’గా దైవానికి తన జీవితాన్ని నివేదించుకోవాలని నిర్ణయం చు కొని, క్రైస్తవం లోని అన్ని శాఖలవారికి తేడా లేకుండా సేవచేయటం స్థానిక చర్చి అధికారులకు నచ్చలేదు. చర్చి అధికారుల సంకుచిత మనస్తత్వానికి ఆమె ఖిన్నురాలైంది. చర్చికి పోవటం తగ్గించివేసింది. ఆమెలో ఏర్పడిన వెలితిని బుద్ధుని ప్రవచనాలు పూరించగలిగాయి. బౌద్ధంపై అధ్యయనం సాగించింది. తర్వాత‘వెల్ష్‌మేన్’ అనే ఓ ఇంజనీరును వివాహం చేసుకొని ఆధ్యాత్మిక అధ్యయనం చేద్దామనుకొనే సమయానికి ఆ యువకుని మరణం - ఆమెకు కృంగదీసింది. ఆ విషాదాన్ని తట్టుకోవడానికి రెక్స్‌హోమ్ నుండి బదిలీ చేయించుకొని చెస్ట్‌ర్ చేరుకొన్నది. అక్కడ రిస్క్‌న్ స్కూలు స్థాపించి విద్యాబోధన చేస్తూనే లండన్, పట్టణంలో సాహితీ విమర్శకురాలిగా, విద్యావేత్తగా పేరు సంపాదించింది.
అది 1893 సంవత్సరం. మార్గరెట్ స్నేహితురాలు ఇసాబెల్ ఇంటికి స్వామి వివేకానం దుడిని ఆహ్వానించారు. మార్గరెట్ కూడా ఆయన్ను చూడటం అదే తొలిసారి. ఆత్మ, పరమాత్మ, పునర్జన్మ జన్మరాహిత్యం మొదలైన పదాలన్నింటికి అర్థాలను ఆయనను అడిగి తెలుసుకొంది. ఆయన సమాధానాలు ఆమె నెంతగానో ప్రభావితం చేసాయి. ‘మార్గరెట్’ స్వామిజీకి భక్తురాలై పోయింది. స్వామిజీ వెంటనే ఉంటూ ఆయన పర్యటించిన చోట ఉపన్యాసాలను శ్రద్ధతో వ్రాసుకొన్నది. ఈనాడు మనకి లభిస్తున్న వివేకానందవాణి అక్షర మవటానికి కారణభూతురాలైంది. స్వామిజీ నుంచి 1897 జూలైలో ఆమెకు పిలుపు వచ్చింది. 1898వ సంవత్సరం జనవరి 28వ తేదీన మార్గరెట్ కలకత్తా రేవుకి చేరుకొంది. స్వామిజీ స్వయంగా స్వాగతం పలికారు. 1898 మార్చి 11వ తేదీన కలకత్తా స్టార్ థియేటర్‌లో ఏర్పాటైన రామకృష్ణమఠ ప్రారంభ సభలో స్వామిజీ ఆమెను సభాముఖంగా పరిచయం చేశారు. 1898 మార్చి 17వ తేదీన శారదామాతను కలుసుకొంది. శారదామాత ఆమెతో కలిసి ఫలహారం చేసింది. ఆమెను పుత్రికగా స్వీకరించింది.అది 1998 మార్చి 25వ తేదీ మార్గరెట్ జీవితంలో ఒక సువర్ణపుటం - బేలూర్‌లో నిలాంబర ముఖర్జీ ఇంటిలోని దైవమందిరం - ‘అసతోమా సద్గమయా’ అనే ప్రార్థనతో మారుమ్రోగుతున్న మంటపం - స్వామిజీ తంబూరా తీసుకొని ‘శివపార్వతీస్తవం’ గానం చేశారు. మార్గరెట్ నుదుట ‘విభూతి’ని ఉంచారు స్వామిజీ. మార్గరెట్ ఈ రోజు నుంచి ‘నివేదిత’గా పిలువబడుతుంది’’ అని ప్రకటించారు స్వామిజీ. తర్వాత ‘‘నివేదితా అదిగో గంగ అవతల నీవు ఓ బాలికల పాఠశాల ప్రారంభించు’’ అని సూచించారు. 25-03-1899 తేదీ స్వామిజీ నివేదితకు బ్రహ్మచారిణికి ఇచ్చే అంతిమ దీక్ష ఇచ్చారు. 1898 నవంబర్ 11న కతన ఇంట్లోనే నివేదిత ఓ బాలికల విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది.
స్త్రీ విద్యావంతురాలైతే సంస్కారాలు పొంది పుట్టింటికి, మెట్టినింటికి గౌరవాన్ని తీసుకొచ్చి తన కుటుంబంలో సంస్కారాలు నింపడం ద్వారా జాతి భవిష్యత్తుకు పునాది వేయగలదని భావించిన వివేకానందుని ఆజ్ఞతో స్త్రీ విద్య ఉద్యమానికి ఎంతో దూరదృష్టితో శ్రీకారం చుట్టిన మహాత్మురాలు సోదరి నివేదిత. ఆమె భగవత్‌ సంకల్పంగా భావించి చేసిన కార్యం ద్వారా భారతీయ ఆత్మ మేలుకొన్నదని నిస్సందేహంగా చెప్పవచ్చు.
సోదరి నివేదిత తన జీవితాన్ని భారతమాత సేవలో సమర్పించాలని నిర్ణయం చేసుకొన్న తర్వాత స్త్రీ విద్య ద్వారా స్త్రీ జనోద్ధరణకు నడుం కట్టారు. దీనదుఃఖితులను కన్నతల్లి వలె సేవిస్తూ భారతీయాత్మను మేలుకొలపడానికి అన్ని జీవన రంగాలకు జీవం పోశారు. క్రైస్తవ మత సంస్థలు భారత్‌ గురించి పాశ్చాత్య దేశాలలో దుష్టప్రచారం చేయడానికి కారణం భారత్‌ బానిస దేశంగా ఉండటమే అని ఆమె భావించారు. ఇంగ్లాండ్‌లో జగదీశ్‌చంద్రబోస్‌ (జె.సి.బోస్‌) కు అవమానం జరిగింది. జమ్‌షెడ్‌జీ టాటా భారతీయ విశ్వ విద్యాలయాన్ని, అనిబిసెంట్‌ కాశిలో హిందు కళాశాలను ప్రారంభించాలని పెట్టుకొన్న అర్జీలను బ్రిటీష్‌ ప్రభుత్వం తిరస్కరించింది. ఇవన్నీ నివేదితకు దిగ్భ్రాంతిని కలిగించాయి. వీటన్నిటితోబాటు వారి అరాచక పాలన ఆమెకు ఆగ్రహం కల్గించింది. విదేశీయుల దాస్య శృంఖలాలలో ఉన్న ఏ దేశమైనా జాతీయ పునరుజ్జీవనాన్ని కలలోనైనా ఊహించలేదని ఆమె నిర్ణయించుకొన్నది.
దేశభక్తులకు అండగా..
యుగాంతర పత్రిక ఉపసంపాదకుడు, వివేకానంద సోదరుడైన భూపేంద్రనాథ దత్త, బారిష్‌ ఘోష్‌ మొదలైన విప్లవవీరులు ఆమెను తమ గురువుగా భావించారు. పులిన్‌ బిహారీ ప్రారంభించిన ప్రసిద్ధ విప్లవ సంస్థ ‘అనుశీలన సమితి’కి ఆమె మార్గదర్శనం చేశారు. అరెస్టు అయిన విప్లవ వీరులను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేవారు. బ్రిటిష్‌ రాక్షస పాలనను చీల్చి చెండాడుతూ అనేక పత్రికలకు వ్యాసాలు వ్రాసేవారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెపై బ్రిటిష్‌ ప్రభుత్వం నిఘా ఉంచింది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడైన అరవింద మహర్షి బరోడాలో కళాశాల అధ్యాపకునిగా పనిచేస్తున్నప్పుడు ఆయనకు నివేదిత ‘నీ సేవ నీ జన్మభూమికి చాలా అవసరం’ అని ప్రబోధించారు. స్వదేశీ- స్వభాష- స్వభాష పట్ల చాలా పట్టుదలతో భారతీయులకు మార్గదర్శనం చేశారు. స్వదేశీ వస్తు వినియోగాన్ని చాటిచెప్పే విధంగా ఆమె స్వయంగా స్వదేశీ వస్తువులను తోపుడు బండిపై పెట్టుకొని అమ్మారు.
మాతృభాష మరవొద్దు
ఒకసారి నివేదిత రవీంద్రనాథ ఠాగూర్‌ ఇంటికెళ్ళినపుడు ‘తన కుమార్తెలకు ఆంగ్ల యువతులు నేర్చుకొనే పద్ధతిలోనే ఆంగ్లం నేర్పమ’ ని అడిగారు ఠాగూర్‌. దానికి ఆమె అంగీకరించకుండా భారతీయ బాలల మీద విదేశీ ఆదర్శాలను రుద్దరాదని చెప్పారు. అందుకే ఆమె కష్టపడి బెంగాలీ భాష నేర్చుకొని ఉపాధ్యాయుల కొరత ఉన్న బాలికల పాఠశాలలో తానే స్వయంగా బెంగాలీలో బోధించి చూపారు. నేడు మనం మాతృభాషను తృణీకరిస్తున్న కారణంగా జాతీయ ప్రమాణాలు లేని విద్య నేర్చుకుంటున్నాం. ఆ దుష్పరిణామాలను చూస్తున్నాం.
పరిశోధకులకు ప్రోత్సాహం
నివేదిత ఇన్ని కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నా సగటు భారతీయుని ఆత్మ దెబ్బతినకుండా కాపాడేవారు. ఒకసారి జె.సి.బోస్‌ ఆవిష్కరించిన పరిశోధనలు బ్రిటన్‌లో అవమానానికి గురైనప్పుడు నివేదిత ఆయన వైపు నిలబడ్డారు. అంతేగాదు ఆయన పరిశోధన వ్యాసాలు ముద్రణకు నోచుకోకుండా అడ్డు తగులుతుంటే 5 సంవత్సరాలపాటు నిరంతరం ఆయన వ్యాసాలను సరిదిద్దే పని పెట్టుకుని ప్రచురింపజేశారు. అలాగే కొత్త పుస్తకాలను రచించమని ప్రోత్సహించి, వాటి ముద్రణకు కావలసిన ధన సహాయాన్ని కూడా అందించారు. భారతీయ పరిశోధకు (శాస్త్రవేత్త) లను ప్రోత్సహించి ప్రపంచం ముందు తలెత్తుకొని నిలబడేలా చేసే విధంగా, కలకత్తాలో ఒక పరిశోధనా కేంద్రాన్ని స్థాపించాలని జె.సి.బోస్‌తో చర్చించేవారు. అయితే 1917లో జె.సి.బోస్‌ చొరవతో అది రూపొందుకొనే నాటికి ఆమె లేకపోవడం ఆయనకు చాలా బాధ కల్గించింది. ఆ విధంగా మన శాస్త్రవేత్తలలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఆమె వేసిన బీజం ఈనాడు ప్రపంచంలో విజ్ఞాన రంగంలో మనం ముందుండేట్లు చేసిందనడంలో అతిశయోక్తి లేదు.
కళలకు ప్రాణం
భారతీయ కళలకు ప్రాణం పోయడంలో నివేదిత చేసిన విశేష కృషిని మనం మరువలేం. భారతదేశం లోని కళలు ప్రాచీనమైనవని, గ్రీకు నుండి ఉద్భవించినవి కావని చెప్పిన విదేశీయులలో హావెల్‌ ప్రథముడు. కళల గురించి ఆయన రచించిన పుస్తకాలన్నిటిలోను భారతీయ కళలు గ్రీకు నుండి ఉద్భవించాయన్న వాదనను ఖండించారు. హావెల్‌ను ఆ విధంగా ప్రభావితం చేసిన వ్యక్తి నివేదిత. అయితే హావెల్‌ తన వైఖరి వలన ఆంగ్లో ఇండియన్‌ అధికారుల చేతిలో నానా కష్టాలు పడాల్సి వచ్చింది. విదేశీ కళలను అనుసరించడం మానేసి దేశీయ కళలను ఎంచుకోవడం ద్వారా భారత్‌లో కళల ఉద్యమానికి ఊపిరిపోస్తున్న కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ అయిన అబనీంద్ర ఠాగూర్‌ను విదేశీ భావాల నుండి పూర్తిగా మరల్చిన గొప్ప జాతీయవాది నివేదిత. యువకళాకారులను ప్రోత్సహించడం కోసం వారి చిత్రాలలోని తప్పులను సరిచేసి, పత్రికలలో ముద్రింపచేసి, వాటి గురించి సమీక్ష కూడా రాసేవారు. ఒకసారి చిత్రకళ ప్రదర్శనను తిలకించిన తర్వాత ‘చారిత్రక, జాతీయ అంశాలలో శౌర్య పరాక్రమాలను పరిఢవిల్లచేసే భారతీయ కళాశైలికి చెందిన ఈ కుడ్యచిత్రాలు భవిష్య మాతృభూమికి మనం సమర్పించే కానుకలు. కలలు సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదన్న అనుభూతిని పొందాను’ అని నివేదిత సందర్శకుల పుస్తకంలో వ్రాశారు.
జాతీయ కవులను కూడా ఆమె ప్రభావితం చేశారు. ఆమె మరణానంతరం కూడా ఆమె పేరును తలచుకోగానే నాకు శక్తి కలుగుతున్నదని విశ్వకవి రవీంద్ర నాథ ఠాగూర్‌ అన్నారు. ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్యభారతి నివేదితను తన ఆధ్యాత్మిక గురువుగా కొనియాడారు. ఆమె తన శైలిలో అనేక పుస్తకాలను రచించారు. అలాగే అనేక పత్రికలకు జాతీయ భావాలతో వ్యాసాలు వ్రాసేవారు. ఆమె రాసిన రచనలలో ‘నా దృష్టిలో నా గురుదేవులు’ (ది మాస్టర్‌ యాజ్‌ ఐ సా హిమ్‌) అనే పేరుతో ఆంగ్లంలో వ్రాసిన వివేకానంద జీవితచరిత్ర, భారత ప్రజల ఆంతరంగిక జీవితాల గొప్పతనాన్ని శాస్త్రబద్ధంగా వెలుగులోకి తేవడానికి చేసిన ప్రయత్నంగా ఎంతోమందిని ఆకర్షించిన ‘భారత జాతీయ జీవ జాలం’ (ది వెబ్‌ ఆఫ్‌ ఇండియన్‌ లైఫ్‌)’ మరియు ‘ఒక ప్రాచ్య గృహంలో చేసిన అధ్యయనాలు (స్టడీస్‌ ఫ్రమ్‌ ఎన్‌ ఈస్టరన్‌ ¬మ్‌)’ అనే పుస్తకాలు ముఖ్యమైనవి.
తమ గృహాలలో దాగివున్న ప్రేమానురాగాల పెన్నిధులను భారతీయులకే ఆశ్చర్యం గొలిపే పద్ధతిలో తన రచనల ద్వారా వెలికి తెచ్చారు నివేదిత. ఈ పుస్తకాలలోని ప్రతి వాక్యంలోను నివేదితకు భారతదేశం మీద గల ప్రేమ, కరుణ, దయ పతాక స్థాయిలో సజీవంగా తొణికిసలాడటం విశేషం. భారతీయ జీవజాలం అనే పుస్తకం ముద్రించిన తర్వాత ‘ఒకవేళ ఈ పుస్తకాన్ని నా గురుదేవులు వివేకానంద రాసి ఉంటే అందులో ఏం చెప్పి ఉండేవారో అదే నేను రాసి ఉంటానని అనుకొంటు న్నాను’ అని చెపుతూ వివేకానందుని పట్ల తన భక్తి విశ్వాసాలను ప్రదర్శించారు. 1904లో ఈ పుస్తకం ముద్రితమైన కొద్ది రోజులలోనే ప్రపంచ ఖ్యాతిని గడించిన పుస్తకంగా పేరు పొందింది. భారత్‌తో సహా ఇంగ్లాండ్‌, అమెరికా దేశాలలో గల అన్ని ప్రసిద్ధ వార్తాపత్రికలు సద్విమర్శ చేస్తూ ఈ పుస్తకం గొప్పతనం గురించి కీర్తించాయి. భారతీయ సోదరీమణుల గురించి తెలుసుకోవాలని వివిధ పుస్తకాలు చదివే పశ్చిమదేశాల స్త్రీలందరూ నివేదిత రాసిన ఈ పుస్తకాన్ని చదివి, తర్వాత వారి అభిప్రాయం మార్చుకోక తప్పదని లండన్‌ పత్రిక ‘క్వీన్‌’ ఆగష్టు 24,1904లో రాసింది.
తన జీవితంలో చెరగని ముద్రవేసిన నివేదితను పూర్తిగా అర్థం చేసుకొన్న అనంతరం ఆమె గురించి అరవిందులు వర్ణిస్తూ ‘ఆమె ఒక అగ్నిశిఖలా మన దేశంలోని అన్ని జీవన రంగాలలో వ్యాపించారు’ అన్నారు.
తాను ఈ భూమికి సేవ చేయడం తన అదృష్టం అనే భావంతోను, భారత్‌ ఉత్థానం ద్వారా ప్రపంచం మేలుకొంటుందనే ప్రగాఢ విశ్వాసంతోను నివేదిత ఈ పనంతా చేశారు. ఈ భూమి బిడ్డలందరినీ హిందూ జీవన విలువలతోనే చైతన్యపరచాలని నివేదిత ఆకాంక్షించారు. తాను చేపట్టిన పనులను హృదయపూర్వకంగా సంకల్ప శక్తిని జోడించి చేశారు. అందువలన ఆమె ప్రయత్నాలు వృథా కాలేదు. ఆమె భగవత్‌ సంకల్పంగా భావించి చేసిన కార్యం ద్వారా భారతీయ ఆత్మ మేలుకొన్నదని నిస్సందే హంగా చెప్పవచ్చు. హిందూజాతిలో మమేకమై తన సర్వశక్తులను అర్పించిన మహనీయురాలు సోదరి నివేదిత 1911 అక్టోబర్‌ 13న పరమపదించినప్పటికీ జాతీయవాదు లైన మనందరి ఆత్మలలో దేదీప్యంగా వెలుగుతోంది.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


1 comment