ప్ర : శ్రీ రాముడిని హిందువులంతా దేవుడిగా ఎందుకు పూజిస్తారు? జ: హిందూ సంప్రదాయం ప్రకారం, శ్రీ రాముడు శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారం....
- ప్ర : శ్రీ రాముడిని హిందువులంతా దేవుడిగా ఎందుకు పూజిస్తారు?
జ: హిందూ సంప్రదాయం ప్రకారం, శ్రీ రాముడు శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారం. నాలుగు యుగాలలో రెండవదైన త్రేతాయుగంలో 3000 సంవత్సరాల క్రితం శ్రీ మహా విష్ణువు ధర్మాన్ని రక్షించడానికి శ్రీ రాముడిగా జన్మించారని హిందువులు నమ్ముతారు. భారతదేశంలోనే కాదు, అనేక దక్షిణాసియా దేశాలే కాక, ప్రపంచంలోని దక్షిణ వైపు చాలా ప్రాంతాలలో, అనేక మంది శ్రీ రాముడిని పురాణ పురుషుడిగా, విష్ణువు ప్రతిరూపంగా నమ్ముతారు. పురావస్తు ఆధారాలు కూడా, శ్రీ రాముడి జీవితంలోని అనేక ముఖ్యమైన అంశాలను ధృవీకరించాయి. హిందూ సాహిత్యంలోని పవిత్ర పుస్తకం రామాయణం కూడా శ్రీరాముడి ప్రాచీనతను నిర్ధారించడానికి తగిన సాక్ష్యాలను అందిస్తుంది. ఇటీవల తవ్వకాలలో బయటపడ్డ ద్వారకా నగరం కూడా శ్రీ రాముడి ఉనికిని ధృవీకరిస్తుంది.
- ప్ర: ఆ ప్రదేశమే శ్రీ రామజన్మభూమి అనడానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా?
జ: 1975-80లో, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరపున, ప్రొఫెసర్ బి బి లాల్ నేతృత్వంలోని బృందం రామాయణంలో పేర్కొన్న వివిధ ప్రదేశాలను ధృవీకరించడానికి అయోధ్యలో విస్తృతమైన తవ్వకాలు జరిపింది. శ్రీ రామ జన్మభూమిని క్రీస్తుపూర్వం 7 వ శతాబ్దానికి ముందే ఆక్రమించారని ఈ బృందం నిర్ధారించారు. బాబ్రీ కట్టడం దగ్గర తవ్విన రెండు గుంతలు, ధ్వంసం చేసిన ఆలయం స్తంభాల పునాదులను కనుగొనటానికి ఉపయోగపడ్డాయి. ఇవి బాబ్రీ నిర్మాణంలో ఉపయోగించిన పద్నాలుగు కసౌటి-రాతి స్తంభాలతో పోలి ఉన్నాయి. ఈ స్తంభాలపై 12 వ శతాబ్దానికి చెందిన హిందూ శిల్పాలు ఉన్నాయి. అంతే కాక 1528 లో ధ్వంసం చేసిన మందిరపు శిధిలాలు కూడా కనుగొన్నారు. వాటిలో ముఖ్యమైనది నాగరిలిపిలో 20 పంక్తులను చెక్కి ఉన్న 1.10 × 0.56 మీటర్లు ఉన్న ఒక పలక. ఇక్కడ అందమైన విష్ణు – హరి ఆలయం ఉండేదని ఆ పంక్తులు పేర్కొంటున్నాయి.
- ప్ర: క్రీ.శ. 1528 లో రామ మందిరం ధ్వంసం చేయబడిందని చెప్పడానికిఆధారాలేమైనా ఉన్నాయా ?
జ: భవ్యమైన ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ముస్లిం రికార్డులు ధృవీకరిస్తున్నాయి. బ్రిటిష్ పాలన ప్రారంభం కావడానికి ముందు ఇక్కడకు వచ్చిన యూరోపియన్ సందర్శకులు కూడా ఈ విధ్వంసం జరిగిందని పేర్కొన్నారు. పురావస్తు అధ్యయనాలు బాబ్రీ నిర్మాణానికి ముందు ఆలయం ఉండేదని నిర్ధారిస్తున్నాయి. బ్రిటిష్ వారు నిర్వహించిన భూ ఆదాయ రికార్డులలో ఆ స్థలాన్ని శ్రీరామజన్మ భూమిగా గుర్తించారు. 1886 నాటి ఒక తీర్పులో కూడా హిందువులకు పవిత్రమైన ఆ స్థలంలోనే బాబ్రీ నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు.
- ప్ర: అయోధ్యలో రామ మందిరాన్ని బాబర్ ధ్వంసం చేసాడని ఎలా చెప్పగలరు?
జ: బాబర్ పెర్షియన్ డైరీ ‘బాబర్ నామా’ ఆంగ్ల అనువాదంలో అన్నెట్ సుసన్నా బెవెరిడ్జ్ ప్రత్యేకంగా శ్రీ రామ మందిర ధ్వంసాన్ని ప్రస్తావించారు. శ్రీ రామ జన్మభూమి వద్ద ఉన్న ఈ పురాతన హిందూ మందిరపు ఠీవి, పవిత్రత బాబర్ ను ఎంతో ఆకట్టుకున్నాయని ఆమె వ్రాశారు. మొహమ్మద్ కు విధేయుడైన అనుచరుడిగా ఒక మసీదును ఆలయానికి ప్రత్యామ్నాయంగా నిర్మించడం ముఖ్యమైన పనిగా బాబర్ భావించాడని ఆమె పేర్కొంది. ఆలయం ధ్వంసం చేసినప్పుడు బాబర్ అయోధ్య చుట్టుపక్కలలోనే ఉన్నాడనడానికి బాబర్ నామాలో అనేక ఆధారాలున్నాయి. హిందువులను కాస్త శాంతింపచేయడానికి 50 సంవత్సరాల తరువాత, అక్బర్ యధాస్థానంలో సీతా కి రసోయి, గర్భగుడి సమీపంలో రామ్ చాబూతార్ నిర్మాణాన్ని పూర్తి చేసాడు. 1700 నుండి ఈ ప్రదేశంలో శ్రీ రామ నవమిని జరుపుకున్నారనే వాస్తవం అనేక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
- ప్ర. శ్రీ రామ జన్మ భూమిని పాత కాలంలోనే ఎందుకు స్వాధీనం చేసుకోలేదు ?
జ: శ్రీ రామ జన్మభూమి ఆలయ రక్షణ కోసం పదివేల మంది ప్రజలు తమ ప్రాణాలను అర్పించారు. ఈ ప్రాంతంలో బలమైన ఇస్లామిక్ పాలన ఉన్నప్పటికీ, హిందూ రాజులు ఈ స్థలాన్ని విముక్తం చేయడానికి చాలా ప్రయత్నించారు. 1947 కు ముందు, శ్రీ రామ జన్మభూమిని, ముస్లింల నుండి తిరిగి పొందడానికి 77 ప్రయత్నాలు జరిగాయని రికార్డులలో ఉంది.
- ప్ర: బ్రిటీష్ పాలనలో శ్రీ రామ జన్మభూమిని తిరిగి పొందటానికి హిందువులు ఏదైనా ప్రయత్నం చేశారా?
జ:హిందువులు 1885 లో ఒక కేసు ద్వారా న్యాయస్థానం తలుపులు తట్టారు. 1886 లో కోర్ట్ ఇచ్చిన తీర్పు ముఖ్యమైన భాగం ఈ విధంగా ఉంది. “హిందువులకు పవిత్రంగా భావించే స్థలంలో మసీదు నిర్మించబడటం చాలా దురదృష్టకరం. కాని ఈ సంఘటన 356 సంవత్సరాల క్రితం జరిగినందున ఈ సమస్యను పరిష్కారించడం సాధ్యంకాదు. యథాతథ స్థితిని కొనసాగించడమే ఏకైక మార్గం. ఇప్పుడు ఇతరత్రా ఏదైనా చర్యలకు పూనుకుంటే వాటివల్ల తాభంకంటే నష్టం ఎక్కువగా జరుగుతుంది."
- ప్ర: స్వాతంత్య్రానంతరం ఏవైనా ప్రయత్నాలు జరిగాయా?
జ: డిసెంబర్ 1949 తరువాత, బాబ్రీ కట్టడంలో శ్రీ రాముని విగ్రహాలు కనిపించినప్పుడు హిందువులు నిరంతర పూజలను జరుపుకోవడానికి కోర్టులు అనుమతించాయి. విగ్రహాల తొలగింపును కోర్టులు తిరస్కరించడమే కాక విగ్రహాలకు 200 అడుగుల దూరం వరకు రాకుండా ముస్లింలను నిషేధించాయి. ఫిబ్రవరి 1986 లో కోర్టు ఆదేశాల మేరకు, శ్రీ రామ జన్మభూమికి వేసి ఉన్న తాళాలను తొలగించి, శ్రీ రామ్ లల్లాను ఆరాధించడానికి హిందువులకు పూర్తి అవకాశం కల్పించారు. ముగ్గురు ప్రధానమంత్రుల పాలనలో – శ్రీ వి పి సింగ్, శ్రీ చంద్రశేఖర్, శ్రీ నర్సింహారావు- ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. శ్రీ చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న కాలంలో అత్యంత వ్యవస్థీకృతమైన, పటిష్టమైన ప్రయత్నం జరిగింది.
- ప్ర: శ్రీ రామ జన్మభూమి ఆలయాన్ని పునర్నిర్మించినట్లయితే, ఇది మరింత మత విభజనకు దారితీయదా?
జ: పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలోనేకాదు భారత్ లో కూడా శ్రీ రామ జన్మభూమి ఉద్యమానికి ముందు అనేక హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దారుణాలను ‘లజ్జ’ అనే నవల వివరించింది. 1986 లో కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాద ప్రారంభ రోజుల్లో అనేక హిందూ దేవాలయాలపై దాడి చేసి, ధ్వంసం చేశారు. శ్రీ రామ జన్మభూమి ఆలయ స్థలంలో హిందువులు చట్టబద్ధమైన హక్కును కలిగి ఉన్నారు. చట్టబద్ధత ఉన్నందున, హిందువులు తమ వాదనను వివరించడం, ఇతరులు దానిని ఆ విధంగానే అర్ధంచేసుకోవడం తప్పనిసరి అయింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి హిందువులు హృదయపూర్వక ప్రయత్నాలు ఎన్ని చేసినా ఆ ప్రయత్నాలు ఎన్నోసార్లు విఫలమయ్యాయి.
- ప్ర: శ్రీ రామ జన్మభూమి, సోమనాథ్ దేవాలయాల మధ్య ఏదైనా పోలిక ఉందా?
జ: రెండు దేవాలయాలు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయబడ్డాయి. హిందువుల దృష్టిలో దేవాలయాలకు మాత్రమే కాకుండా ఆయా స్థలాలకు కూడా ఎంతో ప్రత్యేకత, పవిత్రత ఉంటాయి. అందుకనే ఆ స్థలాలను తిరిగి పొందడానికి శాంతియుత ప్రయత్నాలు అనేకం చేశారు. అయితే సోమనాధ దేవాలయం విషయంలో ఉన్న ఒకేఒక్క వ్యత్యాసం ఏమిటంటే అక్కడ ధ్వంసమైన ఆలయ శిధిలాలపై మరే ఇతర మతపరమైన కట్టడం నిర్మించలేదు. అయితే పురాతన హిందూ ప్రార్థనా స్థలం శిధిలాల పక్కన, ఆలయ ఆవరణలోనే ఒక చిన్న మసీదు మాత్రం నిర్మించబడింది.
- ప్ర: బాబ్రీ కట్టడాన్ని ముస్లిం ప్రార్థనా స్థలంగా ఉపయోగించారా?
జ: 1930 నుంచి ముస్లింలు శ్రీ రామ జన్మభూమి స్థలంలో నమాజ్ చేయడం మానేశారని రికార్డులు చెపుతున్నాయి. అదే సమయంలో, బాబ్రీ కట్టడపు ఆవరణలో ఉన్న రామ్ చబూతర్, సీతా-కి-రసోయి వద్ద హిందువులు పూజలు కొనసాగించారు. ఇది 16 వ శతాబ్దం చివరి నుండి నిరంతరం కొనసాగుతోంది. డిసెంబర్ 1949 నుండి హిందువులు కట్టడంలో రామ్ లల్లా (బాలరాముడు) కు పూజలు చేయడం ప్రారంభించారు. ఈ పూజలు న్యాయవ్యవస్థ పూర్తి అనుమతితోనే సాగాయి. ఆ విధంగా అది నిరంతర పూజలు జరిగే ఆలయంగానే ఉంది. అయితే ఇప్పుడు శ్రీ రాముని కీర్తిని పూర్తిగా ప్రతిబింబించేలా ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టడమే మిగిలింది.
Source: VSKTelangana
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments