అయోధ్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు అయోధ్య శ్రీ రామజన్మభూమి కేసుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ చరిత్రాత్మక...
అయోధ్య శ్రీ రామజన్మభూమి కేసుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. వివాదిత స్థలం హిందువులకు అప్పగిస్తూ, సున్ని వక్ఫ్ బోర్డు కోసం అయోధ్యలోనే విడిగా స్థలం కేటాయించింది. నిర్మొహి అఖాడాకు ఆ స్థలంపై ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది. అలాగే శ్రీ రామజన్మభూమి స్థలాన్ని మూడుగా విభజించి శ్రీ రామ్ లలా , సున్నీ బోర్డ్, నిర్మొహి అఖాడాలకు పంచాలని గతంలో అల్హబాద్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఐదుగురు సభ్యులున్న ప్రత్యేక బెంచ్ ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి ప్రకటించారు.
వివాదిత స్థలంలో రెండు భాగాలు ఉన్నాయని బయటి ఆవరణ(చబుత్రా, సీతా కీ రసోయి వంటివి ఉన్న ప్రదేశం) ఎప్పుడు హిందువుల ఆధీనంలోనే ఉందని, లోపలి ఆవరణపైనే వివాదం నెలకొందని కోర్ట్ పేర్కొంది. శ్రీ రాముడు అయోధ్యలోనే జన్మించాడన్నది హిందువుల విశ్వాసమని, దానికి అనేక ఆధారాలు కూడా ఉన్నాయని కోర్ట్ అభిప్రాయపడింది. అక్కడే 12వ శతాబ్దం నుంచి మందిరం ఉండేదని, దాని శిధిలాలపైనే బాబ్రీ కట్టడం నిర్మించారని పురావస్తు పరిశోధనల్లో తేలిందని కోర్ట్ పేర్కొంది. విదేశీ యాత్రికుల కధనాలు కూడా హిందువుల విశ్వాసాలనే ధృవీకరిస్తున్నాయని, హిందువులు అక్కడ నిరంతరం పూజలు నిర్వహించారనడానికి ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.
వివాదిత స్థలంలో ముస్లింలు నమాజు నిరంతరం నిర్వహించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్న కోర్ట్ సున్నీ వక్ఫ్ బోర్డ్ తన వాదనను తరుచూ మార్చిందని పేర్కొంది.
వివాదిత స్థలాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నామని, అక్కడ రామమందిర నిర్మాణానికై ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని కోర్ట్ పేర్కొంది. నిర్మాణ కార్యం కోసం ప్రభుత్వం ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తుందని స్పష్టంచేసింది. అలాగే అయోధ్యలోనే మరెక్కడైనా మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలాన్ని ముస్లింలకు కేటాయించవలసిందిగా కోర్ట్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ ప్రక్రియను 3నెలల్లో పూర్తిచేయాలని సూచించింది.
Source: VSKTelangana
No comments