చిన్న పిల్లలు అల్లరి చేయడమన్నది వారి సహజ స్వభావం. వారి ఆటపాటలనూ, అల్లరినీ చూసీ చూడనట్లుగా వదిలేయాలి. బాల్యం పిల్లలకు మధుర మైన జ్ఞాపకంగా...
- పిల్లల అల్లరిని భరించలేకపోయినప్పుడు, మరీ మితిమీరుతున్నప్పుడు మందలించడం అవసరమే కానీ, ప్రతీ చిన్న విషయానికీ, అయినదానికీ, కానిదానికీ చీవాట్లేయకూడదు.
- కొంతమంది అతిగారాబంతో పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నా ఆ అల్లరిని పట్టించుకోరు. వారి తప్పులను సరిదిద్దాలనుకోరు. ఇంకొంతమంది పెద్దలు ఇంట్లో మిలిటరీ క్రమశిక్షణను పాటిస్తూ, ప్రతి స్వల్ప విషయాన్నీ పట్టించుకుంటూ, పిల్లల మీద అధికారం చెలాయిస్తూ, వారిని దండన ద్వారా, శిక్షల ద్వారా తమ చెప్పుచేతల్లో ఉంచు కుంటారు. తమ మాట శిరసావహించాలంటూ అతిక్రమశిక్షణతో పెంచుతారు. అతిగారాబం, అతి క్రమశిక్షణ పిల్లలను పెంచడంలో మంచి పద్ధతులు కావని పిల్లల మనస్తత్వ నిపుణులు చెప్తున్నారు.
- పిల్లలు అల్లరితోపాటు తప్పులు, పొరపాట్లు చేస్తారు. తాము చేస్తున్నది తప్పని పిల్లలకు తెలియదు. మంచేమిటో, చెడేమిటో అన్న విచక్షణా జ్ఞానమూ వారికి ఉండదు. అందువల్ల తల్లిదండ్రులే తమ పిల్లలకు మంచి, చెడు బాల్యం నుంచే బోధించాలి. తప్పు చేసినప్పుడు వారి తప్పును సరిదిద్దుతూ, ఆ తప్పు చేయడంవల్ల ఏర్పడే పరిణామాలేమిటో పిల్లలకు వివరించి చెప్పాలి.
- పిల్లలను సవ్యమైన మార్గంలోకి నడిపించటానికి భయపెట్టడం, అరవడం, దండించడం అన్నది సరైన పద్ధతి కాదు. చిన్న పిల్లలకూ మనసుంటుంది. వారి లేత మనసులను గాయ పరచకుండా సక్రమ మార్గంలోకి వారిని మళ్ళించాలి.
- అతిగా భయపెట్టడం, చేయి చేసుకోవటంవల్ల బాల్యంలో భయపడినా, వయస్సు పెరుగుతూంటే, తమ వెంట పడి వేధించే పెద్దల పట్ల నిరసన భావం, అయిష్టత, నిర్లక్ష్యం, వ్యతిరేకత ఏర్పడు తాయి. ఆ విషయాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. మొండిగా మారి, అసలు తల్లి దండ్రుల మాటలనే పట్టించుకోరు లేదా ఎదురు తిరిగి మాట్లాడుతారు. ఎందుకంటే పెద్దల దురుసుతనం వల్ల పిల్లలు పెద్దల పట్ల విముఖ తను పెంచుకుంటారు. పిల్లలు ఆ విధంగా తయారవకుండా ఉండాలంటే, వాళ్ళను తీర్చిదిద్దే విషయంలో పెద్దలు సౌమ్యంగానూ, కొంత సంయమనంతోనూ ప్రవర్తించాలి.
- పిల్లలకు బాల్యమే పునాది. ఆ పునాది బీటలు వారకుండా స్థిరంగా, దృఢంగా ఉండటానికి పిల్లల ప్రవర్తన, మాటలు సరిదిద్దుతూ పెంచాలి. వారికి కొంత స్వేచ్ఛ నివ్వాలి. అయితే, ఆ స్వేచ్ఛను వారు దుర్వినియోగ పరచకుండా చూసు కుంటూండాలి.
- కొంతమంది పెద్దలు తమ పనులలో మునిగి పోయి, పిల్లలను అలక్ష్యం చేస్తూ వారిని అసలు పట్టించుకోరు. తల్లి దండ్రులు తమను పట్టించుకోక పోవడంవల్ల పిల్లలు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ఏ విధంగా నడుచుకోవాలన్నదీ పెద్దలు పిల్లలకు శిక్షణ ఇవ్వకపోవడంవల్ల పిల్లలు చేయిజారి పోతారు. అలా కాకుండా ఉండాలంటే, పెద్దలు తమ పిల్లలతో ప్రతిరోజూ కొంత సమయం గడుపుతూ, వారికి ఆప్యాయతానురాగాలు అందించాలి.
- పిల్లల ఆలోచనలను, అభిప్రాయాలను పెద్దలు వినాలి. వారి ఆలోచనలలోని పొరపాట్లను వారికి సున్నితంగా తెలియజెప్పాలి. అప్పుడు వారంతట వారే తమ ఆలోచనలను సరిదిద్దుకో గలుగుతారు. తమ మనసులోని మాటలను పెద్దలతో చెప్పగలుగుతారు. తమ ఆలోచనలు, నిర్ణయాలు సరైనవేనా అని తల్లిదండ్రులను సలహా అడుగుతారు. పిల్లలకు తగిన సలహాలను అందిస్తూ, వారికి మార్గనిర్దేశం చేసినట్లయితే వారు మంచేమిటో, చెడేమిటో తెలుసుకో గలుగుతారు.
- పిల్లలు సరైన పద్ధతిలో పెరిగేలాగా, వారికి మానసిక ఎదుగుదల పెంపొందేలా, వారికి పెద్దలు ఇచ్చే స్వేచ్ఛను దుర్వినియోగ పరచకుండా, వారిని తీర్చిదిద్దటమన్నది పెద్దలు పెంచే తీరులోనే ఉంటుంది.
- ఈనాటి పిల్లలను క్రమరీతిలో పెంచడం, సరైన విధంగా తీర్చిదిద్దడం అన్నది నిజంగా ఒక కళ, అంతేకాకుండా గురుతరమైన బాధ్యత కూడా. పిల్లలకూ, పెద్దలకూ మధ్య సాన్నిహిత్యం ఉండాలి. వారు పెద్దల మీద ప్రతి విషయానికీ ఆధారపడకుండా, కొంత స్వేచ్ఛను కలిగిస్తూ, వారి మాటలకూ, ఆలోచనలకూ విలువనిస్తూ పెంచాలి.
- తల్లిదండ్రులు పిల్లలకు మార్గదర్శకులు కావాలి. తల్లిదండ్రులనుంచే పిల్లలు ఎన్నెన్నో విషయాలను నేర్చుకుంటారు. అనుకరణ, పరిశీలనా శక్తి పిల్లలలో అధికంగా ఉంటాయి. – కౌత నిర్మల
నమస్తే ఒక తండిగ్రా కొన్ని విషయాలు పెద్దలనుండి సేకరించి మీ అందరికీ అందిస్తున్నాను మనం తల్లి తండ్రులుగా ఈ విషయాలను పాటిస్తే మన ఇళ్ళనుండే కలాం లు తయారవుతారు.. అబ్దుల్ కలాంగారు రాష్ట్రపతిగా ఉన్నంత కాలం పిల్లల్నే కలిశారు, తల్లి తండ్రులు సక్రమంగా ఉంటే దేశం అభివృద్ది చెందుతుందని భావించారు. -రాజశేఖర్ నన్నపనేని.
No comments