ప్రతివారూ కాంక్షించేది సఫలమైన దాన్నే. పాశ్చాత్యం ఇప్పుడు ప్రగతికి, విజయానికి చిహ్నంగా మారింది. అందుకనే, ఇక్కడ మన దేశంలో 38 డిగ్రీల ఉష్ణో...
ప్రతివారూ కాంక్షించేది సఫలమైన దాన్నే. పాశ్చాత్యం ఇప్పుడు ప్రగతికి, విజయానికి చిహ్నంగా మారింది. అందుకనే, ఇక్కడ మన దేశంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా, మనం కుడా టై ధరిస్తున్నాం. దురదృష్టవశాత్తు ఈ రోజున ప్రజల దృష్టిలో ప్రగతి అంటే కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే తప్ప మరేమీ కాదు. దానితో పెనుగులాట అనవసరం. దానిని మనం అర్థం చేసుకుని దానిని మన అధీనంలోకి తెచ్చుకోవాలి. భారత దేశం ఆర్ధికంగా విజయవంతమైతే, భారతదేశ విషయాలు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటాయి.
వెనకటి తరాలు, ముఖ్యంగా గత రెండు మూడు తరాలు, తమ తరవాతి తరాలకు తమ వారసత్వపు విలువ తెలియజేయడంలో విఫలమయ్యాయి. ఎందుకంటే, వాళ్ల వారసత్వాన్ని వాళ్లే సరిగ్గా స్పృశించి చూసిన వాళ్లు కాదు. మనం దాన్ని మన జీవితంలో అనుసరించటం లేదు. మనం పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించడం గురించి మాట్లాడుతున్నాము కదా, ఈ క్షణంలో మనం అనుసరిస్తున్నవి మాత్రం అన్నీ పాశ్చాత్య పద్ధతులు కాదా? మన షర్టు పాశ్చాత్యం. మన ప్యాంట్ పాశ్చాత్యం. మన తలకట్టు పాశ్చాత్యం. మనకు ధైర్యం చాలినంత వరకూ మనం పాశ్చాత్య రీతులనే అనుసరించాము. వాళ్లు మరో నాలుగడుగులు ముందుకు పోతున్నారు. ధైర్యం చాలక మనం వేయలేకపోయిన ముందడుగు, మన తరవాతి తరాల వారు వేయాల్సిందే. అది లోక సహజం. మన భారతీయత ఏపాటిది? బహుశా మనం ఆహారం విషయంలో మాత్రం భారతీయ సంప్రదాయం అనుసరిస్తారేమో! వాళ్ళు 'చెత్త తిండి' (జంక్ ఫుడ్) ని అభిమానించటం మొదలుపెట్టారు. వాళ్లకు 'మెక్ డానల్డ్స్' రుచిస్తుంది, మనమో సాంబారు ఇష్టపడతాము. ఇంతకంటే గొప్ప తేడా ఏముంది?
అందుచేత, మనం మన సంస్కృతిని చక్కగా పరిశీలించుకొని, అందులో విలువైన అంశాలను వెలికి తీయాలి. అమెరికాలో ఉన్న రెండోతరం భారతీయులలో యువత కొందరు ఇప్పుడు మన భారతీయు మార్గానికి తిరిగి వస్తున్నారు. వాళ్ళకి అందులో గొప్ప విలువ కనిపిస్తున్నది. వాళ్ళకు ఆ విలువ చూపించండి. వాళ్లనేదో మార్చి వేసేందుకు ప్రయత్నించద్దు. మనం చెప్పే దానిలో ఉన్న విలువ వాళ్లకు ఎలా మనసుకెక్కించాలో మనకు తెలియకపోతే, వాళ్లు ఎలాగూ మారరు. 'నువ్వు పిజ్జా తినద్దు. దోస తిను!' అని చెప్పి ప్రయోజనం లేదు. వాళ్లు పిజ్జానే తింటారు!
అన్నింటి కన్నా ముఖ్యంగా తెలుసుకోవలిసింది ఏమిటంటే, దేశం అంటే పటం మీద గీసిన ఒక గీత కాదు. అది ప్రజల మనస్సులలో ప్రతిధ్వనించ వలసిన ఆలోచన. అది ప్రజల హృదయాలలో గర్వంతో ప్రజ్వలించాలి. దేశం గురించి గొప్ప భావనలు మనలో నిర్మించబడాలంటే, అందుకు ఒక చరిత్ర కావాలి. మన దేశానికున్నంత చరిత్ర మరి ఏ దేశానికీ లేదు. ఉదాహరణకి, తమిళ రాజులూ ఆంగ్కోర్ లో గొప్ప దేవాలయాలయాలు నిర్మించారు. అయితే ఏ తమిళ విద్యార్ధి కనీసం దాని గురించి ఒక పంక్తి కూడా చదవడు. మనం గర్వపడాల్సిన విషయాలను మనం తెలుసుకోవడం లేదు.
గర్వపడే విషయం ఎక్కడో ఆకాశం నుంచి ఊడి పడదు. మనం గతం లో చేసిన గొప్ప విషయాలు మనం బహిర్గతం చేయాలి, ముఖ్యంగా యువతకి. మనం అక్కడ అక్కడా తప్పులు చేసి ఉండవచ్చు. కానీ మన గత వైభవాన్ని తిరిగి సాధించే సమయం ఆసన్నమయ్యింది.
ధన్యవాదములు జీ
ReplyDelete