కేంద్ర ప్రభుత్వం 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో అత్యున్నత ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను వ...
కేంద్ర ప్రభుత్వం 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో అత్యున్నత ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలు చేసిన వారికి నాలుగో అత్యున్నత పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. వారిలో జగదీష్ లాల్ అహుజా ఒకరు.
జగదీష్ లాల్ అహుజా జన్మించింది పాకిస్థాన్‌లోని పెషావర్‌లో. అప్పటికింకా పాకిస్థాన్ భారత్‌లోనే కలిసి ఉండేది. దేశానికి స్వాతంత్ర్యం రాలేదు. కాగా 1947 లో భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించాక వారి కుటుంబం పాటియాలాకు వలస వచ్చింది. అప్పుడు జగదీష్‌కు 12 ఏళ్లు. అనంతరం వారు చండీగఢ్‌కు మారారు. అక్కడే జగదీష్ విద్యాభ్యాసం కూడా ముగిసింది. కాగా జగదీష్ ఉద్యోగం చేయకుండా స్థానిక మార్కెట్‌లో పండ్లు, కూరగాయలను టోకున అమ్మే వర్తకుడిగా వ్యాపారం ప్రారంభించాడు. అనతి కాలంలోనే అది బాగా వృద్ధి చెందడంతో అతనికి సంపద కూడా చేకూరింది. ఈ క్రమంలో జగదీష్‌కు ‘బనానా కింగ్’ అనే పేరును కూడా స్థానిక వర్తకులు పెట్టేశారు. అంతలా అతని వ్యాపారం వృద్ధి చెందింది మరి. కానీ జగదీష్ మాత్రం తనకు కలిగిన సంపదనంతా పేదల కోసమే ఖర్చు చేసే వాడు. ఈ క్రమంలో గత 15 ఏళ్ల కిందట ఓ రోజు చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) వద్ద ఉన్న హాస్పిటల్ ఆవరణలో ఆకలితో అల్లాడిపోతున్న పేదలను అతను గమనించాడు. వారిని చూసిన జగదీష్ హృదయం చలించిపోయింది. అంతే, వెంటనే వారికి ఉచితంగా భోజనం పెట్టించాడు.
ఆ తరువాత నుంచి తానే ఇంటి వద్ద వంటలు చేయించి వాటిని కారులోకి ఎక్కించి మరీ ఆ పీజీఐఎంఈఆర్ హాస్పిటల్ వద్ద ఉన్న పేదలకు ఆహారాన్ని అందించడం మొదలు పెట్టాడు. ఒక్కొక్కరికి మూడు చపాతీలు, ఆలూ చనా కూర, హల్వా, ఒక అరటి పండు, స్వీట్లు, బిస్కట్లు ఇవ్వడం ప్రారంభించాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్పిటల్ వద్దకు వచ్చే పేదలకు కూడా జగదీష్ ఉచితంగా భోజనాన్ని అందించడం మొదలు పెట్టాడు. అలా అతను ఆ రెండు హాస్పిటల్స్‌లోనూ గత 15 ఏళ్లుగా పేదలకు భోజనం పెడుతూ వస్తున్నాడు. అయితే అప్పుడప్పుడు వారికి బ్లాంకెట్లు, స్వెటర్లు, దుస్తులను కూడా జగదీష్ పంచుతుంటాడు. ఈ నేపథ్యంలో తనకు వ్యాపారం ద్వారా వచ్చిన పలు ఖరీదైన భవనాలను కూడా అతను పేదల కోసం అమ్మేశాడు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతోనే అన్నార్థులకు భోజనం పెడుతున్నాడు. ఇప్పుడు జగదీష్ వయస్సు 80 సంవత్సరాలు. అయినా ఆయన ఇప్పటికీ స్వయంగా వచ్చి పేదలకు భోజనం వడ్డిస్తుంటాడు. దీని గురించి ఆయన్ని ప్రశ్నిస్తే తన ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఆ సేవ ఆగదని చెబుతున్నాడు. నిజంగా పేదలకు పట్టెడన్నం పెట్టాలని ఆయన పడుతున్న తాపత్రయం, తపన చూస్తే ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పేదల కోసం తన ఆస్తులను కూడా లెక్కచేయకుండా సేవకే అంకితమైన ఆయనకు అభినందనలు తెలపాల్సిందే.
సమాజంకోసం ఏదన్న చేయాలి అంటే ముందుగా డబ్బు, హోదా, పరపతి ఇవేవి అవసరంలేదు కేవలం మనకు సమాజం పట్ల సదాభిప్రాయం కలిగివుండి మనమున్న పరిదిలో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుకుతూ రోజూ ఎంతోకొంత సమయం ఇస్తే దేశం బాగుపడుతుంది అలాగే దేశం అభివృద్ది చెందుతుంది.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments