భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో బోస్ అనితర సాధ్యమైన వ్యక్తిత్వం కలవానిగా దర్శనమిస్తారు. చాలామంది స్వాతంత్య్రోద్యమ నేతలను దేశ...
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో బోస్ అనితర సాధ్యమైన వ్యక్తిత్వం కలవానిగా దర్శనమిస్తారు. చాలామంది స్వాతంత్య్రోద్యమ నేతలను దేశం మరచి పోతోంది. వారి త్యాగం గాల్లో కలసిపోతోంది. కానీ భారత సంక్షుభిత, పోరాట కాలంలో బోస్ నిర్వహించిన పాత్రను ఈనాటి తరం మరచిపోవడం లేదు. చరిత్రలో ఆయనకు దక్కిన ఆ స్థానం ప్రభుత్వాలు కల్పిస్తే వచ్చినది మాత్రం కాదు.
‘జైహింద్’ అన్న గొప్ప నినాదాన్ని దేశానికి ఇచ్చిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్. ‘నాకు రక్తం ఇవ్వండి, నేను స్వాతంత్య్రం ఇస్తాను’ అని నినదించిన వాడు. బ్రిటిష్ జాతి నుంచి భారతాన్ని విముక్తం చేయడానికి ఆయన ఇచ్చిన మరో రణగర్జన ‘చలో ఢిల్లీ’.
ఇవన్నీ గాంధీ సిద్ధాంతానికి వ్యతిరేకమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆధునిక చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతం ఒక నెత్తుటి మరక, బ్రిటిష్ జాత్యహంకారానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటి జాతి మీద సాగించే పోరాటం అహింసా పథంలో సాగదని నమ్మిన వారిలో బోస్ ఒకరు. ఏ కోణం నుంచి చూసినా భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో బోస్ అనితర సాధ్యమైన వ్యక్తిత్వం కలవానిగా దర్శనమిస్తారు. చాలామంది స్వాతంత్య్రోద్యమ నేతలను దేశం మరచి పోతోంది. వారి త్యాగం గాల్లో కలసిపోతోంది. కానీ భారత సంక్షుభిత, పోరాట కాలంలో బోస్ నిర్వహించిన పాత్రను ఈనాటి తరం మరచిపోవడం లేదు. చరిత్రలో ఆయనకు దక్కిన ఆ స్థానం ప్రభుత్వాలు కల్పిస్తే వచ్చినది మాత్రం కాదు. ఆయన దేశం కోసం పోరాడడం ఒక ఎత్తు, తను నమ్మిన సిద్ధాంతాన్ని అమలు చేయడానికి చేసిన పోరాటం మరొక ఎత్తు. ఎన్నో వ్యతిరేకతల మధ్య దాదాపు ఒంటరి పోరాటం చూసి, బోస్ చరిత్రలో చెరగని స్థానాన్ని కల్పించుకోగలిగారు.
సామర్థం నిరూపించుకున్నారు
సుభాస్ చంద్రబోస్ (జనవరి 23, 1897 – ఆగస్ట్ 18, 1945) కటక్‌లో జన్మించారు. తండ్రి జానకీనాథ్ బోస్ (తల్లి ప్రభావతి దేవి) ప్రముఖ న్యాయవాది. రాజబహదూర్ బిరుదాంకితులు. అంటే ఆయన బ్రిటిష్ అనుకూలుడే. కొడుకును సివిల్ సర్వీసెస్ చదివించాలని ఇంగ్లండ్ పంపించాడు. ఆ పరీక్షలో బోస్ ఉత్తీర్ణుడై తన సామర్థ్యం నిరూపించు కున్నారు. కాని తన జాతిని బానిసలను చేసి పాలిస్తున్న బ్రిటిష్ వారి సర్వెంట్‌గా పని చేయడం ఇష్టం లేక బోస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. బోస్ చూసిన భారతదేశం, ప్రపంచం కూడా సంక్షోభాలతో కూడుకున్నది. ఆయనకు జ్ఞానమార్గం స్వామి వివేకానందుల ప్రవచనాల నుంచి లభించింది. రాజకీయ దష్టి చిత్తరంజన్ దాస్ నుంచి వచ్చింది. ఆయన పోరాట దక్పథం వాస్తవికమైనది. మొత్తంగా ఆయన ఆలోచనలనీ, అడుగులనీ నిర్దేశించినది మూత్రం అంతర్జాతీయ పరిస్థితులే.
కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు
దాదాపు 1920 దశకం నుంచి బోస్ స్వాతంత్య్ర పోరాటంలో ఉన్నారు. చిత్తరంజన్ దాస్ కలకత్తా మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు, బోస్ సిఇఒ గా పనిచేశారు. తరువాత జాతీయ స్థాయికి ఎదిగారు. కానీ బోస్ పేరు ఒక ప్రభంజనంలా దేశాన్ని తాకినది మాత్రం 1938 లోనే. త్రిపుర కాంగ్రెస్ మహాసభలలో ఆయన పార్టీ అధ్యక్ష స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఆయన ప్రత్యర్థి భోగరాజు పట్టాభిసీతారామయ్య ఓడిపోయారు. పట్టాభికి మద్దతిచ్చింది గాంధీగారే. అందుకే ‘పట్టాభి ఓటమి తన ఓటమే’ అని అప్పుడే గాంధీజీ ప్రకటించారు. అంతకు ముందు నెహ్రూతో సహా అందరూ బోస్ అభిప్రాయాలను సమర్థించిన వారు తరువాత సహాయ నిరాకరణ ఆరంభించారు. అనివార్య పరిస్థితులలో బోస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
యుద్ధమే మార్గం
మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలలో గాంధీజీ అనుసరించిన వైఖరిని దేశంలో చాలామంది వ్యతిరేకిం చారు. గాంధీజీ మాటను వేదవాక్కుగా భావించేవారు, వ్యతిరేకత ఉన్నా మౌనం దాల్చారు. బ్రిటిష్ ప్రభుత్వం యుద్ధంలో మునిగి తేలుతూండగానే దేశంలో పోరాటాన్ని ఉధతం చేయాలని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి ప్రయోజనాలు సాధించుకోవాలని చాలామంది అభి ప్రాయంగా ఉంది. భారత సైన్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించుకోదలిస్తే అందుకు ప్రతిగా దేశానికి స్వయం ప్రతిపత్తి ఇస్తారో లేదో తెలుసుకోవాలని మహమ్మదలీ జిన్నా వంటి వారు కూడా గట్టిగా గళం ఎత్తారు. కానీ అహింసా సిద్దాంత ప్రవక్త గాంధీజీ ఎలాంటి షరతులు లేకుండానే యుద్ధం చేస్తున్న బ్రిటన్ వెనకాల నిలబడాలని కోరుకున్నారు. అనిబిసెంట్, చిత్తరంజన్‌దాస్, జిన్నా, మోతీలాల్ వంటి వారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తీవ్ర జాతీయవాదుల అభిప్రాయం కూడా అదే. అలాంటి వ్యతిరేకత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా వచ్చింది. ఇంగ్లండ్ యుద్ధంలో ఉండగానే దేశాన్ని విముక్తం చేయడం కోసం ఒత్తిడి పెంచాలని భావించిన వారు ఎందరో. అందులో ముఖ్యుడు బోస్. కానీ గాంధీ పంథా నుంచి బయటకు రావడానికి ఇష్టపడని రాజకీయ వాతావరణం నాటి భారతదేశంలో చాలా ఉండేది. ఫలితంగా బోస్ ఈ దేశాన్ని వదిలి, బయట నుంచి ఇంగ్లండ్ ప్రభుత్వం మీద దాడి చేయాలనీ, దేశాన్ని విముక్తం చేయాలని వాంఛించారు. అప్పటికే అంతర్జాతీయంగా పలు సంస్థలు, అందులోని భారతీయులు ఇదే బాటలో ఉన్నారు కూడా. అందుకే 1939లో బోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇంగ్లండ్‌ను ఇరుకున పెట్టాలన్న యోజనను ప్రచారం చేసినందుకు బోస్‌ను జైలుకు పంపారు. అక్కడ బోస్ ఆమరణ నిరశనకు కూర్చోవడంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీనితో ఆయనను విడుదల చేసి, హౌస్ అరెస్టు చేశారు. ఇది 1940లో జరిగింది. ఆ మరుసటి సంవత్సరమే ఆయన మాయమైన సంగతిని బ్రిటిష్ ప్రభుత్వం గమనించింది. కలకత్తాలో మాయమైన బోస్ 1941 నవంబర్‌లో జర్మనీ రేడియోలో ఆయన ప్రసంగించేంత వరకు ఆయన ఆచూకీ కూడా ఎవరూ పట్టుకోలేకపోయారు.
రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నాయకత్వంలోని కూటమి, అమెరికా-బ్రిటన్ నాయకత్వంలోని మిత్ర రాజ్యాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. అలాంటి సమయంలో పాశ్చాత్య దేశాలకు వెళితే, అక్కడ అరెస్టయ్యి బోస్ కచ్చితంగా ఇంగ్లిష్ వారి బందీగా ఉండిపోయేవాడే. కానీ ఆయన జర్మనీ నాయకత్వరలోని కూటమిని ఆశ్రయించారు. జర్మనీ, జపాన్ కూడా బోస్‌కు సాయం అందించడానికి ముందుకు వచ్చాయి. జపాన్ సాయంతోనే సింగపూర్, ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు చెందిన 40 వేల మంది భారతీయులతో బోస్ సైన్యాన్ని నిర్మించుకున్నారు. అదే ‘ఆజాద్ హింద్ ఫౌజ్’. ఇందులో మహిళా విభాగం కూడా ఉండడం బహుశా ప్రపంచ రికార్డు. ఆ విభాగం పేరు ఝాన్సీ లక్ష్మీబాయి సేన. ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ సేనతో భారత భూభాగాలను ఆక్రమించడం బోస్ ఉద్దేశం. అక్టోబర్ 21, 1943న అండమాన్ నికోబార్ ద్వీపాలను బోస్ స్వాధీనం చేసుకున్నారు. వాటికి స్వరాజ్, షహీద్ అని పేర్లు పెట్టాడు. తరువాత 1945 మార్చి 18 నాటికి బర్మా దాకా వచ్చారు. కానీ అప్పటికి పరిస్థితులు మారిపోయాయి. జర్మనీ కూటమి ఓటమి పాలైంది. హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద అణుబాంబు దాడితో జపాన్ లొంగిపోయింది. ఇది బోస్ పాలిట శరాఘాతమైంది. ఆయన ప్రయాణిస్తున్న యుద్ధ విమానం (జపాన్‌ది) ఆగస్ట్ 18, 1945న జపాన్ అధీనంలో ఉన్న ఫార్మోసా (నేటి తైవాన్)లో కూలిపోయిం దని, ఆయన ఈ లోకాన్ని వీడిపోయారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయన బతికే ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. మొత్తానికి ఈ విషయంలో స్పష్టత లేకపోవటం, మిస్టరీగా మిగిలిపోవటం దురదృష్టకరం.
ఇప్పటికీ స్ఫూర్తే
దేశాన్ని త్వరితగతిన వలసపాలన నుంచి విముక్తం చేయాలని ఒక గొప్ప జాతీయవాది కన్న కల అలా భగ్నమైంది. వాస్తవ పరిస్థితులను గమనించ కుండా, గాంధీ మీద విపరీత భక్తితో జాతీయ కాంగ్రెస్ వాదులు బోస్‌ను దూరంగా పెట్టారు. కమ్యూనిస్టులు మరో అడుగు ముందుకు వేసి ఆయనకు దేశద్రోహం అంటగట్టారు. సోవియెట్ రష్యాను గడగడలాడించిన హిట్లర్‌తో ఆయన (భారతదేశ విముక్తి కోసమే అయినా) చెలిమి చేసినందుకు కొన్ని దశాబ్దాల పాటు నీచంగా చిత్రించారు. (1997లో బోస్ శతజయంతికి ఇందుకు కమ్యూనిస్టులు క్షమాపణలు చెప్పారు) అంటే స్వరాజ్య సమరంలో గాంధీని వ్యతిరేకించిన వారికి పుట్టగతులు లేవు. స్వతంత్ర భారతంలో కమ్యూనిస్టులకు నచ్చని వాళ్ల చిరునామా చరిత్రలో కనిపించదు. ఇలాంటి దారుణమైన కాలమాన పరిస్థితుల నుంచి ఎదిగిన వ్యక్తిత్వం బోస్ సొంతం. ఆయన స్ఫూర్తి ఏనాటికైనా భారతదేశానికి అవసరమే.
– లోపాముద్ర. సేకరణ జాగృతి వార పత్రిక 2018 జనవరి.
Tqu
ReplyDelete