Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

యువత పైనే నా విశ్వసం స్వామి వివేకానంద - about swami vivekananda in telugu

లెండి.. మేల్కొనండి.. గమ్యం చేరేదాకా ఆగవద్దు… – యువతకు వివేకానంద మార్గదర్శనం ఆయన పేరు వింటేనే నరనరాల్లో ఉత్తేజం అలుముకుంటుంది. ఆయ...


లెండి.. మేల్కొనండి..
గమ్యం చేరేదాకా ఆగవద్దు…
– యువతకు వివేకానంద మార్గదర్శనం
ఆయన పేరు వింటేనే నరనరాల్లో ఉత్తేజం అలుముకుంటుంది. ఆయన గురించి ఆలోచిస్తేనే కర్తవ్యనిష్ఠ తొణికిసలాడుతుంది. ఆయన ఆశయాలను తలచుకుంటే చాలు వజ్ర సంకల్పం తోడవుతుంది. ఆయనే స్వామి వివేకానంద. భారత యువతకు స్ఫూర్తి ప్రదాత. ఆధునిక భారతం ప్రపంచంలోనే మహోన్నత శక్తిగా ఎదిగేందుకు పటిష్టమైన పునాది వేశారాయన. బ్రిటిష్‌ వారి దాస్య శంఖలాల్లో మగ్గుతున్న భారతదేశం స్వాతంత్య్రం సాధించడం కోసం, దేశం.. విద్యా, వైజ్ఞానిక రంగాల్లో విశేష పురోభివద్ధి సాధించడం కోసం గట్టి పునాది వేశారు.
పరిస్థితుల ఔపోసన :
వివేకానందుడి కాలంలో.. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ‘తాము తక్కువ వాళ్లం’ అని ఆనాడు భారతీయుల్లో నిక్షిప్తమైన భావనను తొలగించడానికి స్వామీజీ ఎంతగానో కషి చేశారు. సామాన్య, అట్టడుగు జనాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే భారతదేశం పతనం అంచుకు చేరిందని విశ్లేషించారు వివేకానంద. ఆ కారణం వల్లే దేశం విదేశీయుల పాలనలో మగ్గిపోతోందని హెచ్చరించారు. దేశ ప్రజలను చైతన్యవంతులను, జ్ఞానవంతులను, ఆరోగ్యవంతులను చేయడం కోసం ఎంతగానో కషి చేశారు.
మార్గదర్శి :
వివేకానందుడు నేరుగా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకపోయినా.. పోరాటంలో మమేకమైన గాంధీజీ, బాల గంగాధర్‌ తిలక్‌ వంటి ఎందరో నాయకులపై ఆయన ఆలోచనల ప్రభావాన్ని గమనించవచ్చు. దేశంలో బ్రిటిష్‌ పాలన కొనసాగుతున్న సమయంలోనే ఆయన ఒక ఏడాది పాటు ఇంగ్లండ్‌లో గడిపారు. అక్కడి ప్రజల్లో భారతీయ తత్వచింతనపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. పాశ్చాత్య ప్రపంచానికి అనుభవం లోకి రాని అనేక తాత్విక అంశాలపై ఐదేళ్లపాటు ప్రపంచమంతా తిరిగి బోధించారు. ప్రజ్ఞలో, మేధా సంపత్తిలో భారతీయులు ఎవరికీ తక్కువ కాదని నిరూపించారు. భారతీయ ఆధ్యాత్మిక శక్తి ఎంత గొప్పదో ఖండాంతరాలకు చాటి చెప్పారు. ప్రపంచ యువతకే ప్రేరణ నిచ్చారు. భారతదేశం అంటే ఏమిటో చాటి చెప్పారు. సమస్త జనావళికీ ఆశాదీపంగా నిలిచారు. ఆధునిక యుగ ఆధ్యాత్మికతకు కర్తగా మిగిలిపోయారు. లోకోద్ధరణకు మార్గదర్శి, స్ఫూర్తి దాత అయ్యారు. విదేశీ పర్యటన ముగించుకొని భారత భూమిపై అడుగు పెట్టగానే తన ఒంటికి నేల మీది మట్టి పూసుకుని పొర్లాడారు. పాశ్చాత్య భూమిపై తన శరీరం అపవిత్రమైందనీ, తనను తిరిగి పవిత్రుణ్ని చేయమనీ కోరారు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అని అందరూ గుర్తించాల్సిన అవసరాన్ని చాటారు. అంతకుముందు భారతదేశం మొత్తం కలియదిరిగి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఔపోసన పట్టారు. దేశంలోని సాధారణ పౌరుల్లో, ముఖ్యంగా యువతరంలో చైతన్యం నింపడానికి, పేదల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం అవిరళ కషి సల్పారు. అనేకమంది జమీందారులు, మహారాజులను కలసి వారి సంపదను పేద ప్రజల కోసం, జనానికి విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఎలా వినియోగించాలో మార్గదర్శనం చేశారు. జంషెడ్‌ జి.టాటాను కలిసి దేశంలో శాస్త్రీయ పరిశోధనలకు కషి చేయాలని సూచించారు. ప్రస్తుత టాటా మౌలిక పరిశోధనా సంస్థ నాడు వివేకానందుడి స్ఫూర్తితో టాటా ప్రారంభించినదే.
సర్వం త్యజించిన యోగి :
వివేకానందుడిలో ఉన్న విశేష ప్రజ్ఞను గ్రహించిన హార్వర్డ్‌ యూనివర్సిటీ అధికారులు తమ విశ్వ విద్యాలయంలో ఆసియా మత అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తామని, దానికి డైరెక్టర్‌గా ఉండాలని స్వామీజీని కోరారు. మరెన్నో అవకాశాలు కూడా వివేకానందుడిని పలకరించాయి. కానీ వాటన్నింటినీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. సామాన్య ప్రజలను చైతన్యవంతులను చేయడమే తన కర్తవ్యమని, అందుకోసం దేశమంతటా నిరంతరం పర్యటిస్తానని చెప్పారు. పర్యటించారు కూడా. తన పేరుతో సహా భౌతిక సంపదలన్నీ త్యజించిన స్వామి వివేకానంద భారతదేశం, ప్రధానంగా యువతే తన సంపదగా భావించారు.
చికాగో సదస్సు – కీలక మలుపు :
1893 సెప్టెంబర్‌ 11వ తేదీ. చికాగోలోని పార్లమెంట్‌ ఆఫ్‌ రిలీజియన్స్‌లో జరిగిన సదస్సు పాశ్చాత్య దేశాలలో భారత సాంస్క తిక బంధాన్ని నెలకొల్పడానికి శ్రీకారంగా చెప్పవచ్చు. ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన ప్రఖ్యాతుల మధ్య 30యేళ్ల వయసున్న స్వామి వివేకానంద కూడా ఉన్నారు. చికాగో ఉపన్యాసం స్వామీజీ జీవితంలో ప్రధాన భూమికగా చెప్పవచ్చు. ఓవైపు ఆయన విశ్వరూపం ఆ ప్రసంగంలో చూపించడంతో పాటు భారతదేశ కీర్తిని ఇనుమడింపజేశారు. అమెరికా వంటి దేశాలకు చెందిన వారిలో హిందూమతం అంటే ఒక మూఢ నమ్మకాల అంధకారమనే అభిప్రాయం నాటుకొని ఉన్న పరిస్థితుల్లో, అప్పటికే ప్రముఖులుగా పేరొందిన వారిమధ్య తనను తాను ఉన్నతంగా ప్రతిష్టించుకోవడంతో పాటు, భారతదేశం మ¬న్నత సంస్క తిని చాటి చెప్పారు. తన ప్రసంగం ద్వారా భారతదేశ ఔన్నత్యాన్ని, హిందూమతం గొప్పతనాన్ని, భారతీయ సంస్క తి ప్రత్యేకతను పాశ్చాత్య గడ్డపై వినిపించడం ద్వారా ప్రపంచ దేశాల్లో అప్పటిదాకా భారత్‌పై ఉన్న చిన్నచూపును సమీక్షించుకునేలా చేశారు. తన ప్రసంగంతో ప్రపంచాన్నే ఒక కుదుపు కుదిపారు. ఆయన ప్రసంగాన్ని విన్నవారంతా, ఆయన వాక్బటిమకూ, మేధో సంపత్తికీ వందనాలు అర్పించారు.
మోకరిల్లిన పాశ్చాత్య పత్రికలు :
చికాగో మహా సభల తర్వాత న్యూయార్క్‌ హెరాల్డ్‌ పత్రిక వెల్లడించిన కథనం ఇప్పటికీ మనం తెలుసుకోదగ్గదే. ”ప్రపంచ మత సమ్మేళనంలో అత్యంత విశిష్టతనూ, ప్రజాదరణనూ పొందిన గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద అని అనడంలో ఎలాటి సందేహమూ లేదు. అంత గొప్ప మహనీయు నికి జన్మను ఇచ్చిన, ఉన్నత సంస్కతి కల్గిన ఆ భారతదేశానికా మేం మిషనరీలను పంపుతున్నది. ఇంతకన్నా తెలివితక్కువ పని మరొకటి ఉండదు” అన్న 120 ఏళ్ల నాటి ఈ వార్తా వ్యాఖ్య ఇప్పటికీ అత్యంత విలువైనదే.
యువతే ప్రగతి :
భారతీయ యువతరం శక్తి సామర్థ్యాలపై వివేకానందుడికి అచంచలమైన విశ్వాసం ఉండేది. ”ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన కొంతమంది యువకులను తనకు అప్పగిస్తే ఈ దేశం స్వరూపాన్నే మార్చేస్తాను” అని స్వామీజీ తరచూ అనేవారు. నేడు ప్రపంచంలో ఎక్కడా.. ఆధునిక విశేష పరిశోధనలు, నైపుణ్యంగల ఉత్పత్తులు భారతీయ యువత ప్రాతినిధ్యం లేకుండా జరగడం లేదు. గణిత శాస్త్రంలో అమెరికాలో జరిగే పోటీలలో తరచూ భారత సంతతికి చెందిన యువతే మొదటి మూడు బహుమతులూ పొందుతూండటం వివేకానందుడికి మనం ఇచ్చే నివాళిగా చెప్పుకోవచ్చు. ఐటీ, అంతరిక్ష విజ్ఞానం, సూపర్‌ కంప్యూటర్‌ రంగాల్లోనూ భారతీయులు ముందువరుసలో ఉంటున్నారు. ఐరోపాలో పలు ప్రముఖ కంపెనీలు భారతీయులు, ప్రవాస భారతీయుల యాజమాన్యంలో ఉన్నాయి. భారతీయ యువత మేధస్సు ఇందుకు దోహదం చేస్తున్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. స్వామి వివేకానందుడి స్ఫూర్తితో భారతీయ యువత చైతన్యవంతమైతే దేశ స్వరూపం మార్చడమే కాదు, ప్రపంచ వికాసంలోనే ముందడుగు వేయగలం.
అసలుపేరు నరేంద్రుడు ః
స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్ర నాథ్‌ దత్తా. ఆయన 1863 జనవరి 12వ తేదీన కలకత్తాలో జన్మించారు. ఎవరెస్టు శిఖరాన్నే తలదన్నే మ¬న్నత లక్ష్యాలు, ఆశయాలు కలిగి వాటివైపు వడివడిగా దూసుకెళ్తున్న వేళ.. తన 39వ యేట 1902 జూలై 4వ తేదీన వివేకానంద నిర్యాణం చెందారు. ఆయన బేలూరు మఠం, రామకష్ణ మఠం, రామకష్ణ మిషన్‌ను స్థాపించారు. రామకష్ణ మిషన్‌ ఆయన అత్యున్నత ఆశయాలను నెరవేర్చడంలో యువతకు మార్గనిర్దేశం చేయడంలో విశేష కషి చేస్తోంది. వివేకానంద రచించిన రాజయోగ, కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగాలు భారతీయుల్లో ముఖ్యంగా భారతీయ యువతలో విజ్ఞానాన్ని, కర్తవ్యదీక్షను, ఉక్కు సంకల్పాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
ఇదీ భారత యువత సత్తా :
1998లో పోఖ్రాన్‌ అణుప్రయోగం తర్వాత అమెరికా భారత్‌పై అనేక ఆంక్షలు విధించింది. భారత్‌ శరవేగంగా ఎదగడం ఇష్టంలేని అగ్రరాజ్యం భారతీయ యువతకు వీసాలే నిలిపివేసింది. అయితే ఐటీ దిగ్గజం బిల్‌గేట్స్‌ తనకు ప్రతియేడాది సుమారు 80వేల మంది ఐటీ నిపుణులు భారతదేశం నుంచి కావాలని, లేకపోతే తన వ్యాపార సామ్రాజ్యమే ప్రమాదంలో పడిపోతుందని నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌కు తేల్చి చెప్పారు. పాకిస్తాన్‌ వంటి అనేక ఆసియా దేశాల్లో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వవచ్చు కదా అని ప్రశ్నించిన క్లింటన్‌కు, బిల్‌గేట్స్‌ దిమ్మదిరిగిపోయే సమాధానం ఇచ్చారు. భారతీయ యువతకు ఉన్న మేధా సంపత్తి మిగతా ఏ ఆసియా దేశాల్లోని యువతకూ ఉండదని బదులిచ్చారు బిల్‌గేట్స్‌. దీంతో క్రమంగా అగ్రరాజ్యం దిగిరాక తప్పలేదు. భారతదేశం అభివద్ధి చెందడం కేవలం భారతీయ ప్రజల అభివద్ధికే కాక, మొత్తం ప్రపంచమే శాంతి సౌభాగ్యాలతో పురోగతి సాధించడానికి దోహద పడుతుందని ఆనాడే స్వామి వివేకానంద ప్రపంచానికి సందేశం ఇచ్చారు.
బాటలో పయనిద్దాం :
వివేకానందుని పేరు తలిస్తేనే ఒళ్ళు పులకరిస్తుంది. స్వామి వివేకానందను దర్శిస్తే, భారతీయుల ఔన్నత్యం ద్యోతకమౌతుంది. ఆయన ఉపన్యాసాలన్నీ ఉపనిషత్‌ల సారాంశం, వేదాంశ సారమే. జ్ఞానమనే వెలుగులో జీవించే వారే భారతీయులు అని చాటిన వివేకానందుడి జన్మదినమైన జనవరి 12వ తేదీని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ”ఉత్తిష్ఠత – జాగ్రత – ప్రాప్య పరాన్ని బోధత”… ‘లెండి.. మేల్కొనండి… గమ్యం చేరేదాకా ఆగవద్దు’ అన్న నినాదంతో యువతకు బలమైన మార్గనిర్దేశనం చేసిన స్వామి వివేకానంద.. నిరంతర చైతన్య స్ఫూర్తి. అయితే ఆయన జీవితం చూపిన స్ఫూర్తిని నేటి యువత అందుకోవాల్సిన అవసరం ఉంది.
– జి.సప్తగిరి, 98850 86126

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments