మనిషి పుట్టినప్పటి నుంచి గిట్టేదాక, అతడి జీవితంలో అవిభాజ్యమై ఉండేది కాలం. పుట్టినప్పుడు ఉన్నకాలం పెరుగుతున్నప్పుడు మారిపోతుంది....
మనిషి పుట్టినప్పటి నుంచి గిట్టేదాక, అతడి జీవితంలో అవిభాజ్యమై ఉండేది కాలం. పుట్టినప్పుడు ఉన్నకాలం పెరుగుతున్నప్పుడు మారిపోతుంది. పెరిగినంత కాలం ఉండే కాలం తరిగిపోతున్నప్పుడు మాయమైపోతుంది. లిప్తలిప్తకు జారిపోయే కాలం పాదరసంలాంటిది. పట్టుకుంటే దొరకదు. అది నిరంతరం కరిగిపోతూనే ఉంటుంది. అనంతమైన కాలవాహినిలో మానవుడి బాల్య, యౌవన, వార్ధక్యాలు చిన్నబిందువులవలె కనిపిస్తాయి. నూరేళ్ల జీవితం వేగంగా గడిచిపోతుంది.
కాలం పక్షపాతి కాదు. ఒకరి మీద అవ్యాజమైన ప్రేమను చూపదు. మరొకరిమీద అకారణమైన ద్వేషాన్ని కనబరచదు. రాజు, పేద, పండితుడు, పామరుడు ఎవరైనా ఒకటే. ఎవరి మీదైనా సమదృష్టే. బాల్య, కౌమార, యౌవన వృద్ధాప్యాలను అందరికీ వర్తింపజేస్తుంది. అలాగే మరణాన్నీ! మరిన్ని ప్రాణులకు ఊపిరిపోస్తుంది. రాగద్వేషాలకతీతంగా ఉంటూ తన సుదీర్ఘ ప్రయాణాన్ని సాగిస్తూనే ఉంటుంది. ఎవరికైనా అవే గంటలు, అవే నిమిషాలు. సరైన యోచనతో విభాగించుకుని మనకు, ఇతరులకు ఎంతెంత వినియోగించుకోవాలో నిర్ణయించుకోవాలి.
మనుషులు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దినచర్యను చక్కగా అవలంబించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ వేళ ఏ పనిచేయాలో, ఆ వేళ ఆ పని చేయడమే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమని గుర్తించాలి. కాలం కలిసివచ్చినప్పుడు స్పందించకపోతే, మనిషి కోసం కాలం ఆగదు. నీటి ప్రవాహం సాగిపోయిన తరవాత ఆ నీటిని పట్టుకోవడం సాధ్యమా? కానే కాదు. కాలం మనిషికి ఎన్నో సదవకాశాలను ప్రసాదిస్తోంది. వాటిని అందుకోకుండా జాప్యం చేస్తే భవిష్యత్తు శూన్యమే అవుతుంది. నిన్నటి పని మొన్ననే చేసి ఉండటం, నేటి పనిని నిన్ననే పూర్తిచేయడం, రేపటి పనిని నేడే పూరించడం కార్యసాధకుడి లక్షణం.
వర్తమాన కాలంలో కార్యనిమగ్నుడైనప్పుడే సామాన్యుడు సైతం సమర్థుడు కాగలడు. లక్ష్యసాధనకోసం కృషి చేసేవారందరూ వర్తమానంలో చురుగ్గా ఉంటారు. రేపటి గురించి ఆలోచనను మనసులోకి రానీయకుండా జాగ్రత్త పడతారు.
రేపు చేయవలసిన పనిని ఈ రోజే చెయ్యి. ఈ రోజు చేయవలసిన పనిని ఇప్పుడే చెయ్యి. ఏ క్షణం లోనైనా ప్రళయం సంభవించవచ్చు! అంటాడు సంత్ కబీర్. కార్యసాధకులు కబీర్ మాటలను అక్షరాలా అమలు చేస్తారు. గమ్యం నిర్ధారించుకున్నాక గమనం నిర్దేశించుకుంటారు. అలసత్వాన్ని ఏమాత్రం దరిచేరనీయరు... తమ శక్తిని వివేకాన్ని ఆధారంగా చేసుకుని లక్ష్యాలను సాధిస్తారు.
మీకొక ఉదారణ వివరిస్తాను మీకిది ఉపయోగపడవచ్చు... నెపోలియన్ గాఢంగా నిద్రపోతున్నప్పుడు సైన్యాధిపతి పరుగెత్తుకుంటూ ఆయన వద్దకు వచ్చి ‘శత్రుసైన్యం దక్షిణ దిక్కునుంచి చొచ్చుకు వస్తోంది’ అని తెలిపాడు. నిద్రలోనుంచి నెపోలియన్ చటుక్కున లేచి ‘అయితే ఆ గోడమీద రాసిన 64వ నంబరు పద్ధతిలో శత్రువుల్ని ఎదుర్కోండి’ అన్నాడు. శత్రువులు ఎటువైపునుంచి దాడిచేస్తే ఎలా ఎదుర్కోవాలో నెపోలియన్ ముందుగానే ఆ పద్ధతిని సిద్ధం చేసుకొని ఉన్నాడు! ఇలాంటి వ్యక్తి ఆత్మస్థైర్యం ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కుచెదరదు.
ఇనుప కండరాలు, ఉక్కు నరాలు సంతరించుకొని ఆత్మవిశ్వాస సంభూతులై జీవన సమరాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మార్గ నిర్దేశం చేసిన స్వామి వివేకానందుడి పాత్ర యువతను కలత నిదుర నుంచి లేపి జీవితంలో అజేయులై నిలిచేందుకు తోడ్పడుతుంది జయోస్తు....
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments