Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ప్రేమికుల దినోత్సవం పేరుతో శృంగార దినోత్సవం - valentine's day history in telugu

వాగ్దాన దినోత్సవం వచ్చిపడింది. వలెంటైన్ దినోత్సవం వలెంటైన్ వారోత్సవం గా మారి, వేడుకల కాలవ్యవధి విస్తరించడం ఈ వాగ్దాన దినోత్సవం- ప్రామి...


వాగ్దాన దినోత్సవం వచ్చిపడింది. వలెంటైన్ దినోత్సవం వలెంటైన్ వారోత్సవం గా మారి, వేడుకల కాలవ్యవధి విస్తరించడం ఈ వాగ్దాన దినోత్సవం- ప్రామిస్ డే- వచ్చిపడడానికి నేపథ్యం. ఫిబ్రవరి పదునాలుగవ తేదీన దాదాపు రెండు దశాబ్దులుగా వలెంటైన్ దినోత్సవం- వలెంటైన్ డే- జరుగుతోంది. ఈ వలెంటైన్ డే జరుపరాదని బజరంగదళ్ వంటి జాతీయ సంస్థలు ఉద్యమాలు చేస్తుండడం సమాంతర పరిణామం. పంటలను ఆవహించి ఆకులను పువ్వులను పిందెలను కాండాన్ని భోంచేస్తున్న క్రిముల నివారణకు క్రిమిసంహారక ఔషధాలను పిచ్చికారీ చేస్తున్నారు. ఔషధ ప్రయోగ తీవ్రత పెరిగినకొద్దీ కొత్త కొత్త పురుగులు, వింత వింత రంగుల ఈగలు పుట్టుకొని వస్తున్నాయి.

మీరు ఎన్ని మందులను వాడినా ప్రయోజనం లేదు, ఆ మందులను మింగి మేము మరింత బలాన్ని పొంది కొత్త కొత్త రూపాలతో విస్తరించిపోగలం..అని సస్యనాశక క్రిమికీటకాలు ఢంకా బజాయించి పొలాల్లోకి చొరబడుతున్నాయి. స్వజాతీయ సంస్థల తాటాకు చప్పుళ్లకు మేము బెదరము- అని విదేశీయ దినోత్సవాలను దిగుమతి చేసుకుంటున్న వివాహ పూర్వ లైంగిక శృంగార విస్తరణకు కృషిచేస్తున్న రసజ్ఞులు అంటున్నారు. ఈ రసజ్ఞుల లక్ష్యం స్వజాతీయ సంస్కార సమాహార వికసనానికి ప్రాతిపదిక అయిన కుటుంబ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకలించి వేయడం. కుటుంబ వ్యవస్థకు మూలసూత్రం వివాహవ్యవస్థ! వివాహవ్యవస్థను వెక్కిరించడం ధిక్కరించడం దిగుమతి అవుతున్న దినోత్సవాల లక్ష్యమైపోయింది.

వివాహం జరిగిన తరువాత జరుగవలసిన లైంగిక శృంగార కలాపాలను వివాహం జరుగకముందే జరపడం జరిపించడం విదేశాల నుంచి వచ్చిపడిన వలెంటైన్ డే స్ఫూర్తి, సంవత్సరానికి ఒక రోజున ఇలా ఈ స్ఫూర్తిని సంస్మరించుకొనడం చాలదట! భార్యాభర్తలు కాని, పెళ్లికాని, పెళ్లితో సంబంధం లేని, చట్టం ప్రకారం పెళ్లీడుకు రాని యువతీ యువకులు బరితెగించి బహిరంగ శృంగార కలాపాలకు పాల్పడే ఉత్సవం కేవలం ఒక్కరోజున జరుపడం సరిపోదట! అందువల్ల వలెంటైన్ డేను వలెంటైన్ వారంగా విస్తరించారట! ఈ విస్తరణలో భాగంగా ఫిబ్రవరి పదునాలుగవ తేదీకి ముందు వారం రోజులపాటు వివిధ విచిత్ర వికృత నామధేయాలతో వివాహ పూర్వ శృంగార ఉత్సవాలను జరిపిస్తున్నారట! వీటిలోకొన్ని.. వాగ్దాన దినోత్సవం- ప్రామిస్ డే-, ఆలింగన దినోత్సవం లేదా కౌగిలింతల దినోత్సవం- హగ్గింగ్ డే, హగ్ డే- చుంబన దినోత్సవం లేదా ముద్దుల దినోత్సవం - కిస్ డే.. కిస్సింగ్ డే- వంటివి! వీటిని గురించి దృశ్య మాధ్యమాలలో ఆర్భాటంగా చక్కగా సిగ్గులేకుండా ప్రచారం చేస్తున్నారు.


ఇంతవరకు ఈ విచిత్ర దినోత్సవాల గురించి వినని అమాయక అనభిజ్ఞ బాలబాలికలు సైతం ఈ గొప్ప సంగతుల ను తెలిసికోగలరు. కృతయుగంలో దుర్గాదేవి మహిష దనుజునితో పోరాడింది. గాయపడిన రాక్షసుని రక్తం చుక్కల నుంచి అనేకమంది కొత్త రాక్షసులు పుట్టుకొని వచ్చారు. ఇలా వివిధ రకాల దినోత్సవాలు దిగుమతి అవుతుండడం భారత జాతీయ సంస్కృతిపై ప్రపంచీకరణ చేస్తున్న దురాక్రమణకు అద్దం. ఈ అద్దంలో పరమ వికృతంగా ఈ దినోత్సవాలు ఆవిష్కృతవౌతున్నాయి. దిగుమతులు పెరగడం ఎగుమతులు తగ్గిపోవడం స్వజాతీయ శక్తి సన్నగిల్లిపోతోందనడానికి నిదర్శనం. వాణిజ్య రంగంలో ఎగుమతులు, దిగుమతులు వస్తువుల వినిమయానికి మాధ్యమాలు. సాంస్కృతిక రంగంలో ఈ ఎగుమతులు దిగుమతులు భావ వినిమయానికి మాధ్యమాలు. వాణిజ్య రంగంలో ఎగుమతులు పెరగడం, దిగుమతులు తగ్గడం ఆర్థిక పరిపుష్టికి నిదర్శనం. దీనికి వ్యతిరేకంగా జరగడం దేశంలో నెలకొన్న ఆర్థిక బలహీనతకు ప్రతిబింబం!


సాంస్కృతిక రంగంలో భారతీయ సంస్కారాలు ఇతర దేశాలకు విస్తరించడం- ఎగుమతులు పెరగడం- మన సాంస్కృతిక పరిపుష్టికి నిదర్శనం. ఇతర దేశాల నుంచి నాగరిక రీతుల పేరుతో వికృత విలాసాలు మన దేశంలోకి చొరబడడం- దిగుమతులు పెరగడం- మన సాంస్కృతిక పతనానికి నిదర్శనం! పరిపుష్టి మనం ఇతర దేశాలను ప్రభావితం చేస్తున్నామన్న వాస్తవానికి నిదర్శనం. ఇతర దేశాల వికృతులతో ప్రభావితం కావడం పతనానికి చిహ్నం. క్రీస్తుశకం పదిహేడవ శతాబ్ది చివరి నాటికి ప్రపంచంలోని మొత్తం ఎగుమతులలో భారత్ వాటా దాదాపు నలబయి శాతం, ప్రస్తుతం మన ఈ వాణిజ్య భాగస్వామ్యం నాలుగు శాతం కంటె తక్కువ. పాశ్చాత్య ఆర్థిక దురాక్రమణ ఫలితం ఇది. ప్రపంచీకరణ ఈ దుస్థితిని మరింత దుర్భరం చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షల విద్యార్థులు భారతదేశానికి వచ్చి విద్యలను వినయాన్ని సంస్కారాలను సౌశీల్యాన్ని నేర్చుకొని వెళ్లారు. భారతీయ సముత్కర్ష సంస్కారాలు ప్రపంచ ప్రజలను ప్రభావితం చేసిన చరిత్ర సుదీర్ఘకాలం కొనసాగింది. వసుధైవ కుటుంబ- ప్రపంచమే ఒక కుటుంబం- వాస్తవం ఇది, భరతమాత విశ్వగురువుగా విరాజిల్లిన చరిత్ర ఇది.


ఈ కుటుంబ వ్యవస్థను బద్దలుకొట్టడానికై విదేశీయ వికృతులు విరుచుకొని పడుతున్న వర్తమాన సాంస్కృతిక పతనానికి కారణం పాశ్చాత్య దురాక్రమణ, వాణిజ్య ప్రపంచీకరణ. వలెంటైన్ వారం అలాంటి వికృతి! వికృత రీతులతో ప్రభావితం అవుతుండడం మన స్వభావ పతనం. ఏదీ విశ్వగురుత్వం? ఇవికాక, ఇప్పటికే పాశ్చాత్య దేశాల నుంచి స్నేహ దినోత్సవం- ఫ్రెండ్‌షిప్ డే-, మాతృ దినోత్సవం- మదర్స్ డే-, పితృ దినోత్సవం- ఫాదర్స్ డే- వంటివి దిగుమతి అయి ఉన్నాయి. ఉత్సవం ప్రతీక, స్వరూపం, ఉత్సవ నిర్వహణలో నిహితమై ఉన్న సంస్కారం జీవన స్వభావం! ఉత్సవ నిర్వహణ మాధ్యమం మాత్రమే, లక్ష్యం కాదు, కారాదు. లక్ష్యం ఉత్సవంలో నిహితమై ఉన్న సంస్కారాలను పరిరక్షించి పెంపొందించుకోవడం!


ఈ దినోత్సవాల సంస్కారాలను అంధానుకరణ బుద్ధితోకాక ఆత్మగత స్వభావానికి అనుగుణంగా విశ్లేషించుకోవడం ప్రధానం. పాశ్చాత్య దేశాల్లో పెళ్లిళ్లు పెటాకులై పోతున్నందున పిల్లలు తల్లివద్దనో లేదా తండ్రివద్దనో పెరుగుతున్నారు తల్లికి మాత్రమే పరిమితమైన పిల్లలు ఏడాదికొకసారైనా తండ్రిని కలుసుకొనడానికి వీలుగా ఈ పితృ దినోత్సవం పుట్టుకొచ్చింది. తండ్రికి మాత్రమే పరిమితమైనవారు సంవత్సరంలో కనీసం ఒక్కసారి తల్లిని చూడడానికి వీలుగా మాతృ దినోత్సవం పుట్టింది. కానీ మన దేశంలో ఇప్పటికీ తొంబయిఐదు శాతం కంటె ఎక్కువమంది పిల్లలు తల్లిదండ్రులవద్ద పెరుగుతున్నారు. కుటుంబం పదిలంగా ఉండడం ఇక్కడ సాధారణ జీవన రీతి. పెళ్లి పెటాకులై కుటుంబం విచ్ఛిన్నం కావడం కేవలం అపవాదం.


అందువల్ల కుటుంబ విచ్ఛిత్తిని స్ఫురింపచేస్తున్న మదర్స్ డేని, ఫాదర్స్ డే ని మన దేశంలో ఎందుకు జరుపుకోవాలి? జరుపుకుంటున్నవారు పాశ్చాత్య వికృతితో ప్రభావితమవుతున్న భావదాస్య నిబద్ధులు కాదా?? స్నేహేచమాతా- స్నేహంలో భార్య తల్లితో సమానం- అన్నది సనాతన జీవన సూత్రం. తల్లి స్నేహానికి ప్రతీక ఈ మాతృప్రేమ నుంచి భ్రాతృప్రేమ, భగినీ మమకారం వంటివి విస్తరించాయి. ఈ స్నేహం విస్తృతమైనది, సమాజ సమష్టికి సంబంధించినది. ఈ విస్తృత స్నేహానికి ప్రతీక రక్షాబంధన్, గరుడ పంచమి, 
భగిని హస్త భోజనం వంటి ఉత్సవాలు అనాదిగా ఈ దేశంలో జరుగుతున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి వ్యాపించిన స్నేహ దినోత్సవం కేవలం పెళ్లికాని యువతీ యువకుల మధ్య లైంగిక పారవశ్యాన్ని పెంపొందించే వైయక్తిక కలాపం! విస్తృత స్నేహానికి సంబంధించిన రక్షాబంధన్ వంటి ఉత్సవాలకు లేని ప్రాధాన్యం ఈ వైయక్తిక - కేవల ద్వైపాక్షిక- స్నేహ దినోత్సవానికి ఏర్పడిపోయింది! ప్రపంచంలోని అన్ని మంగళకరమైన పద్ధతులు ఇక్కడికి వచ్చుగాక- ఆనోభద్రాక్రతువోయన్తు విశ్వతః-అని అనాదిగా ఆకాంక్షించిన భారతీయులకు విదేశాల్లోని సంస్కారాల పట్ల విముఖత లేదు.


కానీ సంస్కారాల పేరుతో విదేశీయ వికృతులు స్వజాతీయ సమాజాన్ని ముంచెత్తుతున్నాయి. సృష్టి ఆరంభ సమయంలో పార్వతీ పరమేశ్వరులకు పెళ్లిచేసినవాడు మన్మధుడు. కాలి బూడిదైనప్పటికీ తన ధ్యేయనిష్ఠను సడలనివ్వని కుల పాల ప్రణయ రసాధి దేవత మన్మధుడు. కుల పాల ప్రణయం భార్యాభర్తల మధ్యగల ప్రేమ. మన్మధుడిని పూజించే వసంత ఉత్సవాలను జరుపుకొనడం జాతీయ సంప్రదాయం. మంచి భర్త కావాలన్న, మంచి భార్య కావాలన్న ఆకాంక్షకు ప్రతీక అయిన వసంతోత్సవం జాతీయ సంస్కృతి. వలెంటైన్ డే విదేశీయ వికృతి.
- శ్రీ హెబ్బార్ నాగేశ్వర రావు12 February 2019, ఆంధ్రభూమి పత్రిక నుండి సేకరణ.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


1 comment