గురు హరగోవిందుని బలిదానం: (1595-1645) గురు అర్జున్ దేవ్ పుత్రుడు గురుహరగోవిందుడు ఆరవ గురువయ్యాడు. అప్పుడతని వయసు పదకొండేళ్లు...
గురు హరగోవిందుని బలిదానం: (1595-1645) గురు అర్జున్ దేవ్ పుత్రుడు గురుహరగోవిందుడు ఆరవ గురువయ్యాడు. అప్పుడతని వయసు పదకొండేళ్లు మాత్రమే. ఆయన తన తండ్రిని పాశవికంగా హింసించి వధించడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. సిక్కులందరికి క్షాత్రధర్మదీక్ష ఇచ్చాడు. ఆయన స్వయంగా ద్వి ఖడ్గధారణ నారంభించాడు. ఒకటి ఆధ్యాత్మిక శక్తి ప్రతీక కాగా రెండవది క్షాత్ర శక్తి ప్రతీక. త్వరలోనే ఆయన సైన్యాన్ని నిర్మాణం చేయ పూనుకున్నాడు. 300 మంది అశ్విక యోధులను, 60మంది తుపాకీ యోధులను సిద్ధం చేశారు, అమృతసర్ ఒక కోటను నిర్మాణం చేశాడు. దానికి 'లోహగఢ్' అనే పేరు పెట్టారు, 1609లో హర్మందిర్ ముందు 'అకాల తఖ్' అనే పీఠాన్ని ఏర్పాటు చేశాడు. అలా ఒక రాజకీయ వ్యవస్థను ఏర్పాటుచేసి తాను రాజుగా వ్యవహరించసాగినాడు.
సిక్కు యువకులందరికి గుర్రపు స్వారీ, ఖడ్గ చాలనము వంటి క్షాత్ర విధ్యను నేర్పించాడు, సిక్కు మతం లో వచ్చిన ఈ మార్పును చూసి ఢిల్లీ పాదుషా జహంగీరు కోపగించాడు. గురు హరగోవింద్ రెండేళ్లపాటు గ్వాలియర్ కోటలో నిర్బంధించాడు. జహంగీర్ 1612లో గురువును బంధవిముక్తుని గావించాడు. ఒకవేయి మన్సబ్దారీ పదవినిచ్చాడు. ఇలా గురువును లొంగదీసుకోజూశాడు. అయితే గురుహరగోవిందుడు మొగలు పాదుషాకు లొంగిఉండగలడా ? లేదు ? ఒకసారి గురువుగారు అమృతసర్ నుంచి లాహోర్ వరకు పర్యటనకు వెళ్లాడు. అక్కడ గొడవ జరిగింది. అప్పటికి జహంగీరు చనిపోయి షాహ్ జహాన్ ఢిల్లీ మొగలు పీఠమెక్కినాడు. మొగలు సేనలు గురు హరగోవిందుని బంధింపజూశాయి. గురువు వెంటనున్న సిక్కు వీరులు మొగలు సైన్యాలను తరిమి వేశారు. షాహజహాన్ కోపంతో అమృతసర్ పైకి సైన్యాన్ని పంపించాడు. సిక్కు సైన్యాలు సంగ్రాణావద్ద మొగలు సైన్యాల నెదుర్కొని తరిమికొట్టింది.
ఒకసారి గురువుపుత్రిక పెళ్లి సందర్భంలో కూడా మొగలు సైన్యాలు దాడిచేసినవి. పెళ్లికి వేలాదిగా బంధువులు (సిక్కులు) వచ్చారు. మిఠాయి (థేర్సారీ) సిద్దం చేయబడింది. భోజనాలు సిద్ధమవుతుండగా దాడి జరిగింది. సిక్కు వీరులు మొగలు సైన్యాలను ఎదుర్కొన్నారు. కొంతమంది బంధువులు రాగా 12 కి.మీ. దూరంలో ఝాకల్ అనే చోట పెళ్లి నిర్విఘ్నంగా జరిగింది. అక్కడ పెళ్లి మంటపంవద్ద మొగలు సైన్యం మిఠాయిలకోసం ఎగబడ్డాయి. మిఠాయిల్ని బాగా ఆరగించిన మొగలు సేనలు మత్తులో మునిగినవి. సరిగ్గా అప్పుడే మొగలు సేనలపై సిక్కు వీరులు విరుచుకు పడ్డారు. మొగలు సేనాపతి ముఖలిసఖాన్ యుద్ధంలో మరణించాడు. భారీ సంఖ్యలో మొగలు సైన్యం మరణించింది.
1631లో గురు హరగోవిందుడు హరగోవిందపురంలో ఉన్నపుడు మొగలు సైన్యాలు చుట్టుముట్టినవి. గురువుగారు చాకచక్యంగా భటిండావైపు వెళ్లిపోయారు. ఇది గమనించి కొందరు మొగలు సైనికులు గురువును వెంటాడినారు. గురువుగారి వెంట కొందరు సిక్కు వీరులు అంగరక్షకులుగా ఉన్నారు. వారంతా భటిండావైపు పారిపోతూ హఠాత్తుగా ఆగి వెనుదిరిగి మొగలుసేనలపై భయంకరంగా దాడి చేశారు. మొగలు సేనాపతిని చంపివేశారు. చావగా మిగిలిన మొగలు సైన్యం పారిపోయింది. గురు హరగోవిందుడు అక్కడినుండి కర్తాపూర్ చేరుకున్నాడు. అక్కడ సిక్కులు సమక్షంలో సురక్షితంగా ఉన్నాడు.
1634లో షాహజహాన్ బడే ఖాన్-పైదా ఖాన్ అనే ఇరువురు సేనాపతులను భారీ సైన్యంతో కర్తార్ పూర్ పైకి దాడికి పంపినాడు, జాలంధర్‌లోని మొగలు సైన్యం కూడా ఈ సైన్యంతో కలిసింది. సిక్కు సైన్యం కేవలం ఐదువేలు మాత్రమే ఉంది. భయంకర మైన యుద్ధం జరిగింది. ఒక్కొక్క సిక్కు సైనికుడు అనేకమంది మొగలు సైనికులతో తలపడి హతమారుస్తున్నారు. మొగలు సేనాపతులు ఇద్దరూ యుద్ధంలో చనిపోయారు. మొగలు సైనికుడొకడు గురువు కత్తివేటు వేయబోయాడు. గురువు నవ్వుతూ నవ్వుతూ వాడిని తిప్పి కొట్టినాడు, అప్పుడు గురువు ఇలా అన్నాడు. "అరే! కత్తివేటు వేయడం అలాకాదు. ఇలా !" అంటూ మొగలు సైనికుని తల తెగనరికాడు. మొగలు సైన్యమంతా ప్రాణభయంతో చెల్లాచెదరై పోయింది
గురు హరగోవిందుడు తనకున్న కొద్దిపాటి సాధనాసంపత్తులతోనే బలమైన మొగలులతో పోరాటం సాగించినాడు. పంజాబు ప్రజలలో నవ చైతన్యం జాగృతమైంది. చివరి నాలుగైదేళ్లపాటు గురువు ధర్మప్రచారంలోనే గడిపాడు. ముస్లిం మతంలోకి మార్చబడిన హిందువులు మళ్లీ హిందువులుగా పునరాగమనం గావించాడు. 1645లో గురు హరగోవిందుడు మరణించాడు. తర్వాత గురు హరరాయ్ (1629-1661) ఏడవ గురువయ్యాడు. ఆయన చాలా శాంత స్వభావి. ఎనిమిదవ గురువు గురు హరికిషన్ రాయ్ (1656-1664) బాధ్యత స్వీకరించిన కొద్ది కాలానికే మరణించాడు. గురు హరగోవింద్ భారత దేశ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి మొఘలులకు మన దమ్ముని చూపించాడు ఇవే కాక అనేక సందర్బాలలో శతృవులకు కత్తి రుచి చూపించాడు, రక్తం ఏరులైపారింది, తండ్రి యొక్క క్షాత్ర పరంపరను పుత్రులకీ అందించాడు తొమ్మిదవ గురువు గురు తేగ్ బహదూర్ కూడా హరగోవింద్ కుమారుడే.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
సేకరణ: హిందూ దేశం పై ముస్లింల దండయాత్రలకు అవిస్మరణీయ ప్రతిఘటనా పరంపర. పుస్తకం నుండి సేకరణ పుస్తకం దొరుకు నిలయం.
ప్రతులకు : సాహిత్యనికేతన్
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్ – 500 027
ఫోన్ : 040-27563236,
సాహిత్యనికేతన్, ఏలూరు రోడ్,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్ : 9440643348.
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్ – 500 027
ఫోన్ : 040-27563236,
సాహిత్యనికేతన్, ఏలూరు రోడ్,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్ : 9440643348.
No comments