Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

గాందారము ఆఫ్ఘనిస్తాన్ రణబలుడు - Afghanistan 650 to 870 Years History in Telugu - MegaMinds

గాందారము: ఇప్పటి ఆఫ్ఘనిస్థాన్ అప్పటి గాంధారము. ఉపగణస్థానం పేరుతో అనేక చిన్న గణ రాజకీయాలు (రిపబ్లిక్ స్టేట్స్) ఉన్న ప్రాంతం. ...



గాందారము:ఇప్పటి ఆఫ్ఘనిస్థాన్ అప్పటి గాంధారము. ఉపగణస్థానం పేరుతో అనేక చిన్న గణ రాజకీయాలు (రిపబ్లిక్ స్టేట్స్) ఉన్న ప్రాంతం. భారతదేశానికి వాయవ్య సరిహద్దులో ఉంది. కాబుల్, కందహార్ (గాంధారశబ్దమే కాందహార్‌గా మారింది.) సీస్థాన్, గజనీ, గోరనీ (ఘోర్) వంటి ప్రాంతాల సమూహం గాంధారం. విశ్వవిఖ్యాత నగరాలు తక్షశిల, రావల్పిండి, కపిశా (ఇప్పుడు జనావాసంగా లేదు), పురుషపురం (పెషావర్), పుష్కలావతి మొదలగునవి గాంధారంలోనే ఉన్నవి. కపిశ నగరం కొంతకాలం రాజధానిగా ఉండినది. క్రీ.పూ. నాల్గవ శతాబ్ది గ్రీకులు దురాక్రమణ చేసినపుడు తక్షశిల గాంధార రాజధానిగా ఉండినది. అరబ్బులు, తురకలు దాడి చేసినప్పుడు గాంధారానికి కాబుల్ రాజధానిగా ఉండినది. మూడు నదులు, కుర్రం, టోచీ, గుమల్ నదులు తూర్పు దిశగా ప్రయాణించి సింధునదిలో కలిసిపోతాయి. భారత గాంధారాల మధ్య రాకపోకలకు ఈనదుల ప్రవాహ మార్గాలైన కైబర్, కుర్రం, టోచీ కనుమలు ఉపయోగపడేవి. గాంధార ప్రాంతమంతా పర్వత మయం. కొన్ని పర్వతాలు 12వేల నుండి 20 వేల అడుగుల ఎత్తువరకు ఉంటాయి. పర్వత ప్రాంతమైనందున, సులభమైన రవాణా మార్గాలు లేకున్నా కూడా భారత-గాంధారాలు మధ్య నిరంతర ప్రయాణాలు సాగుతుండేవి.
క్రీ.శ. 7వ శతాబ్దంలో ఇస్లాం ఆవిర్భవించింది. అరబ్బులు ఇరాన్ ను జయించి భారత సరిహద్దు అనగా గాంధారము చేరుకున్నారు. సువిశాల ఇస్లాం సామ్రాజ్య వ్యాప్తికి వారికి కేవలం పది సంవత్సరాల కాలం పట్టింది. అయితే గాంధార ప్రాంతం వారిని ముందుకు సాగనివ్వకుండా మూడు శతాబ్దాలు ప్రతిఘటించింది. గాంధార ప్రాంతం పర్వతరాజులు అడుగడుగునా అరబ్బుల నెదిరించారు. 650లో బస్రా (ఇరాక్)లో ఉన్న ఖలీఫా అబ్దుల్లా ఇబ్న్ భారత్ అమీర్ అర్ ఇబ్న్ జియాద్ అనుసేనాపతిని భారత్ పై దాడికి ప్రయత్నించుటకు నియమించాడు. అప్పుడు కాబుల్ లో టర్కీ వంశస్థుల రాజ్యముంటుంది. వీరు టిబెట్టు ప్రాంతం నుండి వచ్చినవారు. కనిష్కుని తమ వంశంలోని ప్రముఖ పూర్వజునిగా భావించేవారు.
వీర రణబలుడు:
కాబూల్ దక్షిణ పశ్చిమదిశలో సీస్థాన్ అనే రాజ్యముంది. జరంగ్ నగరం దాని రాజధాని. రణబలుడు అనే వీరుని ఏలుబడిలో ఆ రాజ్యముంది. ఖలీఫా సేనాపతి జియాద్ జరంగ్ నగరంపై దాడి చేశాడు. రణబలుని నాయకత్వంలో హిందూసైన్యాలు అరబ్బులను తిప్పికొట్టి సరిహద్దు దాటించినవి, అదే రణబలుడు చేసిన తప్పు.
అరబ్బులు సైన్యాన్ని సమకూర్చుకుని మళ్ళీ మళ్ళీ
దాడి చేశారు. జయించిన ప్రతిసారీ రణబలుడు అరబ్బులను తరిమికొట్టిన గాని మళ్లీ మళ్లీ రాకుండా శిక్షించిందీ సంహరించిందీలేదు. చివరగా అర్ ఇబ్న్ జియాద్ పట్టువదలకుండా పెద్ద సేనతో వచ్చి జరంగ్ నగరాన్ని జయించి విధ్వంసం సృష్టించాడు. అయితే రణబలుడు పర్వతాలు ఆశ్రయించుకొని తప్పించుకున్నాడు. సైన్యాలను సమకూర్చుకున్నాడు, తనరాజధాని జరంగ్ నగరాన్ని అనతికాలంలోనే మళ్లీ స్వాధీనం చేసుకున్నాడు. మళ్లీ తిరిగిరాని రీతిలో జియాదు -అరబ్బు సైన్యాలను గట్టిగా బుద్ది చెప్పి తరిమివేశారు. అలా జియాద్ కాబూల్ లోని సీస్థాన్ ను జయించకుండానే తనదేశం వెళ్ళిపోయాడు.
మూడు సంవత్సరాల తర్వాత అబ్దుర్ రహమాన్ అను సేనాని భారీ సైన్యంతో వచ్చి సీస్థాన్ రాజధాని జరంగ్ ను దొంగచాటుగా దాడి చేసి ఆక్రమించాడు. అతడు ఇరాన్ పాలకుని దాయాది. వీరరణబలుడు జరంగ్ లో లేని కారణంగా ఇది సాధ్యమయింది. అక్కడినుండి అరబ్బు సైన్యాలు భారత్ వైపు ముందుకు నడచినవి. పర్వతాల మధ్యలో హేలమందనది ప్రవహిస్తున్నది. నదీతీరంలో జూరా అనే పర్వతశిఖరంపై జూరాదేవి మందిరముంది. దేవీ విగ్రహం బరువైన విలువైన సువర్ణ విగ్రహం. అనేకమంది పర్వతరాజులకు జూరాదేవి ఆరాధ్య దైవం. దేవికి నిత్య పూజలు చేసే పూజారితోబాటు కొద్దిమంది ప్రజలతో ఒక చిన్న గ్రామం మాత్రమే అక్కడుండినది. సేనాని రెహమాన్ కంటికి నలుసులా ఆ మందిరం కనిపించింది. అరబ్బులు నదిని దాటి మందిరాన్ని ధ్వంసం చేసి సువర్ణ విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. దేవి విగ్రహ సంరక్షణలో పూజారి, గ్రామస్థులంతా బలిదానమయ్యారు. సువర్ణవిగ్రహంతో వెనక్కు రావలసిందిగా ఖలీఫా ఆజ్ఞనందుకున్న రెహమాన్ వెనుకకు వెళ్లిపోయాడు.
ఇలా కాబూల్-సీస్టాన్ ప్రాంతాలలో అరబ్బులు శాశ్వతంగా రాజ్యం ఏర్పాటు చేసుకోలేకపోయారు. తర్వాత ఖలీఫాగా వచ్చిన ముఆవియా (661-670) ఎలాగైనా సంస్థాన్ ను స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. సేనాని అబ్దుర్రహ్మాన్ ను పెద్ద సైన్యమిచ్చి సీస్థాన్ పైకి పంపించాడు. సీస్థాన్ ఆక్రమించిన రెహమాన్ కాబూల్ చుట్టుముట్టినాడు. ఒక నెలరోజులపాటు కాబుల్ దుర్గరక్షకులు ముస్లిములను ఎదిరించారు. కాని దుర్గంలో వారికి లోపల ఆహారాది నంభారాలు అయిపోవచ్చినవి. బయటనుండి సాయం అందే అవకాశం లేదు. దుర్గాన్ని చుట్టుముట్టిన భారీ ముస్లిం సైన్యాలను తరిమికొట్టే శక్తి కాబుల్ రాజుకు లేదు. వ్యూహాత్మకంగా దుర్గాన్ని ముస్లిములకు విడిచి పెట్టి దుర్గరక్షకులు బయటపడ్డారు. రెహ్మాన్ సైన్యాలు దుర్గం చేరినవి. కాబుల్ రాజు సమీప రాజ్యాల భారతీయ యోధులకు పిలుపునిచ్చాడు. ముస్లిం సేనల్ని కాబూల్ నుండి తరిమివేయుటకు సహకరించమని కోరినాడు. ఈ పిలుపు విన్న భారత రాజులు-సేనానులు-యోధులు, చిన్న చిన్న బృందాలు అంతా ఒక్కటై కాబూల్ రాజు నాయకత్వంలో ముస్లిం నెదిరించారు. కోట లోపల-బయట ముస్లిం సైన్యాలు విడిది చేసియున్నవి. వారిపై హిందూసైన్యాలు హఠాత్తుగా దాడి చేసినవి. ముస్లిం సైన్యం భయంతో చెల్లాచెదురయ్యారు, భయంకరమైన యుద్ధం జరిగింది. ముస్లిం సైనికులు రక్తంతో కాబూల్ నేలలు ఎర్రబారినవి. కాబూల్ ను విడిచి పారిపోయి రహమాన్ సీస్థాన్ లో రక్షణ పొందినాడు.
673లో సేనాని రహమాన్ స్థానంలో యాజిద్ ఇబ్న్ జియాద్ సిస్థాన్ పాలకునిగా వచ్చాడు. అదను చూసి సీస్థాన్ రాజు రణబలుడు పర్వతాలనుండి పొంచి పొంచి వచ్చి సింహంలా యాజిద్ సేనలపై దూకినాడు. హేలమందనదీ తీరంలో ఎక్కడైతే ముస్లిములు మందిర విధ్వంసం చేశారో అక్కడే జుంఝా అనేచోట రణబలుడు యాజిద్ ను చక్రబంధంలో ఇరికించాడు. రణబలుని సేనలకు ఆ పర్వత ప్రాంతమంతా సుపరిచితం- ముస్లిం సైన్యాలు చెల్లాచెదరైపోయినవి. గుంపులు గుంపులుగా ఎవరికి తోచినవైపువారు పారిపోయారు. ఎటుపోయినా వారికి రణబలుని సైన్యాలు ఎదురుపడుతూనే ఉండినవి. ముస్లిం సైన్యం యమపురికి పంపబడినవి. సేనాని యాజిద్ కూడా చచ్చాడు. రణబలుడు ముస్లిమ్ లను పూర్తిగా తరిమి స్వాధీనం చేసుకున్నాడు. జరంగ్ నగరంలో ప్రవేశించాడు. హేలమందనదీతీరంలో మళ్లీ వైభవంగా మందిర పునఃప్రతిష్ఠ గావించాడు.
అరబ్బు సైన్యాలు మరో సేనాని అబూ ఉబైద్ నాయకత్వంలోనూ బయలుదేరినవి. వేగంగా వచ్చి జరంగ్ నగరం పై దాడి చేశారు. రాజా రణబలుడు నిరంతర యుద్ధాలకు గాయపడి ఉన్నాడు. అయినా సైన్యాన్ని ఉత్సాహపరిచి అబూ ఉబైద్ సైన్యాలను మట్టికరిపించాడు. ముస్లిం సేనాని అబూ ఉబైద్ హిందూ సైన్యాలు బంధించగా రాజా రణబలుడు మానవీయతతో చంపకుండా నిర్బంధించాడు. ఐదు లక్షల దిర్హములు (అరబ్బు రూ||లు) ఖలీఫా నుండి వసూలుచేసి అబూ ఉజైద్ ను బ్రతుకుపో-అంటూ విడిచి పెట్టాడు. ముస్లిం ధనంతోనే ముస్లింలు ధ్వంసం చేసిన మందిర పునర్నిర్మాణం గావించి సువర్ణ విగ్రహ ప్రతిష్ఠ గావించాడు. స్వరాజ్య సాధనకోసం అహోరాత్రాలు పర్వతాలలో తిరుగాడుతూ, అనేకసార్లు పోరాటాలు సాగించిన కారణంగా, విజయం ప్రాప్తించిన పిదప దేవాలయ ప్రతిష్ట గురించి తృప్తిగా కన్ను మూసినాడు.


రెండవ రణబలుడు:
రాజా రణబలుని తర్వాత అతని పుత్రుడు సీస్థాన్ రాజైనాడు. రెండవ రణబలుని పేరుతో అతడు చరిత్ర ప్రసిద్ధుడైనాడు. మొదటి రణబలుని మృత్యువార్త విన్న ఖలీఫా అబ్దుల్ మలిక్ ఆనందంతో గంతులేశాడు. ఇప్పుడే సీస్థాను స్వాధీనం చేసుకోవాలని ఆలోచించాడు. అబ్దుల్లా అనువాని నాయకత్వంలో పెద్ద సైన్యాన్ని సీస్థాన్ పైకి పంపినాడు. రణబలుడు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ముస్లిం సైన్యాలు సునాయాసంగా కాబూల్ కొండలలోకి వచ్చేలా వ్యూహం పన్నినాడు.
కొండల ఇరుకుదారులలో తన సైన్యాన్ని అనేకచోట్ల బృందాలుగా మోహరించాడు, తండ్రి చనిపోయాడు, కొడుకు భయపడి దాక్కున్నాడని భావించి ముస్లిం సైన్యాలు వేగంగా ముందుకు చొచ్చుకువచ్చినవి. కాబూల్ కొండల్లో తమకు తిరుగులేదన్నట్లు ఇరుకుదారిలో బారులు తీరి ముందుకుసాగారు. బాగా ఇరుకుగా ఉన్న దారిగుండా సైన్యాలు చొచ్చుకువచ్చినవి. రణబలుని సైన్యాలు గుంపులు గుంపులుగా ముస్లిం సైన్యాలపై విరుచుకుపడ్డారు. ముస్లిం సైన్యాలు ముందుకు వచ్చిన కొద్దీ రణబలుని సైన్యాలు సులభంగా వారి తలకాయల్ని సొరకాయలు నరికినట్లు నరికేశారు. కొండదారిలో ఇరుక్కున్న సైన్యాలు హాహాకారాలు చేస్తూ హతమైపోతున్నారు. ముందుకు పోలేరు, వెనకకు రాలేరు. చావగా బ్రతికున్నవాళ్లు కనుమలలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్నారు. రణబలుడు ముస్లిం సేనాపతికి హెచ్చరిస్తూ సందేశం పంపించాడు.
ముస్లిం సైన్యాలు ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్లీ మళ్లీ వస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక్కరు కూడా బ్రతికిపోలేరు. బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఎప్పుడూ మా భారత సరిహద్దులలోకి రాబోకండి! మీ దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు, విగ్రహ విధ్వంసాలు సహించేది లేదు. వెనుదిరిగి వెళ్ళిపోవడానికి అవకాశమిస్తున్నాం. దారిలో ఆహారాదులకోసం దారిబత్తెమిచ్చి మరీ పంపుతున్నాం- వెళ్ళండి! తిరిగి భారత్ వైపు కన్నెత్తి చూడకండి అంటూ రణబలుడు ముస్లిం సైన్యాలు వెనుకకు వెళ్ళిపోవడానికి
అవకాశమిచ్చాడు. ముస్లిం సేనాని అబ్దుల్లాకు వేరే మార్గం లేదు- బ్రతికి పోయామంటూ తన సైన్యాల్ని తీసుకొని వెనుకకు వెళ్ళిపోయాడు.
అక్కడ ముస్లిం అధిపతి ఖలీఫాకు ఈ వార్త తెలిసి అవమానంతో అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. అబ్దుల్లాను తనవద్దకు పిలిపించుకున్నాడు. ఎందరు సేనానుల్ని ఎంత సైన్యమిచ్చి పంపినా ఈ ఓటమి ఏమిటి ? అంటూ ఎలాగైనా భారత సరిహద్దులు దాటి లోనికి పోవాల్సిందేననే పట్టుదల పెరిగింది. యావత్ ఇస్లాం మతాధిపతి ఖలీఫా ఇరాన్ రాజుతో సంప్రదింపులు జరిపాడు. ఇస్లాం మతసామ్రాజ్యంలో ఈనాడు ఇరాన్ రాజ్యమే బలమైనది. ఖలీఫా కేంద్రం కూడా అక్కడే- యావత్ ఇస్లామిక్ సామ్రాజ్యం ఖలీఫా ఆధీనంలో ఉంది. అప్పుడు ఇరాన్ రాజ్యపాలకుడు అల్ హజ్జాజ్, మహాబలశాలి. విశాలమైన సైన్యము-సిరిసంపదలు అతని అధీనంలో ఉంది. ఖలీఫా ఆదేశంతో అల్ హజ్జాజ్ భారీ సైన్యాన్నినిచ్చి అల్ ఉబైదుల్లా అను సేనాపతిని కాబుల్- సీస్థాన్ పైకి పంపినాడు. ముస్లిములను నమ్మని రణబలుడు (రెండవ) తగిన జాగ్రత్తలో ఉండి సరిహద్దులవద్ద పటిష్టమైన రక్షణ ఏర్పాటు చేశాడు. కాబుల్ వద్దకు రాకుండానే ఉబైదుల్లాను రణబలుడు ఆపివేశాడు. భీకరయుద్ధం జరిగింది. తగిన తయారీతో ఉన్నందున రణబలుడు సునాయాసంగా మళ్లీ ముస్లిం సేనలను ఓడించాడు.
ఉబైదుల్లా ముగ్గురు కుమారులు రణబలునికి బందీలుగా చిక్కారు. ససైన్యంగా వెనుదిరిగిపొమ్మని రణబలుడు ఉబైదుల్లాను ఆదేశించాడు. ఉబైదుల్లా గత్యంతరం లేక తాను సీస్థాన్ అధిపతిగా ఉన్నంతవరకు రణబలునితో యుద్ధానికి దిగనని హామీఇచ్చి, తన సైన్యాలను వెనుదిరుగుడన్నాడు. కొందరు ముస్లిం సేనాపతులకు వెనుదిరగడం ఇష్టం లేదు. అదనుచూసి మళ్లీ దాడి చేయాలన్నది వారి వ్యూహం. ఈ విషయం రణబలునికి తెలిసింది. ముస్లిం సైన్యాలను చక్రవ్యూహంలో బంధించాడు. ఉబైదుల్లా మొదలే తోకముడిచాడు. ఇప్పుడు మిగిలిన ముస్లిం సేనానులకు కూడా పారిపోక తప్పనిస్థితి. అయితే ఇప్పుడదంతా సులభంగా లేదు. పారిపోతూ ముస్లిం సేనాని రణబలుని సేనల చేతిలో చనిపోయాడు. ముస్లిం సేనలు హాహాకారాలు చేస్తూ ఎడారి మార్గంవైపు పారిపోయారు. ఎడారిలో దారి దొరకక ఆకలి దప్పులతో ముస్లిం సైన్యమంతా దాదాపుగా మరణించింది.
మరల మరల రణబలుల చేతితో ఓడిపోవడంతో ఇరాన్ పాలకుడు హజ్జాజ్ అహం దెబ్బతిన్నది. అవమానంతో క్రుంగిపోయాడు. తన బలహీనతను ఆసరాచేసుకొని తన సేనాని అబ్దుల్ రహమాన్ గద్దెనెక్క చూస్తున్నాడు. హజ్జాజ్ అబుల్ రహమాన్ పిలిచి మంతనాలాడినాడు. 40వేల సేననిచ్చి ఎలాగైనా రణబలుని హతం చేస్తే కాబుల్, సిస్థాన్ ప్రాంతమంతటికి అధిపతిని చేస్తానని ఆశ చూపాడు. రణబలుని ఓడించి కాబూలను వశం చేసుకుంటే ఇరాక్ గద్దెపైకెక్కడం సులువు అవుతుందని భావించాడు. రణబలుని చేతిలో అబ్దుల్ రహమాన్ ఓడినా- చచ్చినా తన పదవి బలపడుతుందని హజ్జాజ్ భావించాడు. ఎవరి వ్యూహాలు -ఆశలు వారికున్నవి. అబ్దుర్ రహమాన్ సీస్థాన్ శాసకుని హెూదాలో రణబలుని పైకి వెళ్ళాడు. అయినా రణబలుని శౌర్యం ముందు తాను ఓడిపోతానేమో, చచ్చిపోతానేమో అనుమానం ఉంది. వేగులద్వారా రణబలుడు హజ్జాజ్, రహమాన్ ఇరువురి వ్యూహాలను గ్రహించాడు. ఆత్మవిశ్వాసంతో అరబ్బు సేనల్ని నిలువరించారు
రహమాన్ తో స్నేహం చేసి హజ్జాజ్ కు వ్యతిరేకంగా విద్రోహం చేయడానికి పురికొల్పాడు. రహమాన్ హజ్జాజ్ కు ఎదురుతిరిగి రణబలుని వద్ద ఆశ్రయం పొందాడు. హజ్జాజ్ రణబలునిపై కోపంతో సైన్యాలను స్వయంగా నడిపించాడు. రహమాన్ ను అప్పగిస్తే యుద్ధం అపేస్తానన్నాడు. రణబలుడు రహమాన్ ను వదిలిపెట్టాడు. ఫలితంగా రహమాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. హజ్జాజ్ దిగివచ్చి రణబలునితో సంధి చేసుకున్నాడు. దీనితో ఇరాక్ అధినేతనే ఎదిరించి గెలిచిన రణబలుని పరాక్రమ గాథలు ఇస్లాం సామ్రాజ్యమంతటా మారుమ్రోగినవి. అరబ్బుల నెదిరించి గెలిచిన వీరునిగా హిందూధర్మ సంరక్షకునిగా, ఇస్లాం సామ్రాజ్యపు ఉప్పెనకు అడ్డుకట్టవేసిన వీరయోధునిగా రణబలుని పేరు ప్రపంచ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఖలీఫా అబ్బసిద్ (754-775) తన పాలనాకాలంలో కాబుల్ ను వశపరచుకోవాలన్న దృష్టితో మరలమరల సేనలను పంపించాడు. కాని ప్రతిసారీ పరాజయమే చవిచూడవలసి వచ్చింది. ఇస్లాం కోరిక నెరవేరకుండా రణబలుడు అంతిమశ్వాస వరకు విజయవంతంగా పోరాటం సాగించాడు. 870లో యాకూబ్ లయీస్ జబుల్ పై దండయాత్ర చేసినప్పుడు తన వద్దనున్న ఒక ముస్లిం సేనాని చేసిన నమ్మక ద్రోహంతో రణబలుడు ముస్లిములకు బందీగా చిక్కి పోరాడుతూ వీరస్వర్గం అలంకరించాడు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments