సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. సకల ప్రాణికోటి క్షేమం ఆలోచించిన మన పూర్వీకులు మనిషిని మహర్షిగా మార్చేందుకు క...
సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. సకల ప్రాణికోటి క్షేమం ఆలోచించిన మన పూర్వీకులు మనిషిని మహర్షిగా మార్చేందుకు కావాల్సిన నియమాలు ఏర్పరిచారు. మన పూర్వీకులు అలా జీవించారు. విశ్వకళ్యాణాన్ని కాంక్షించారు.
మనిషి సంఘజీవి అని చెప్తారు కానీ ఆధునిక ప్రపంచంలో ప్రాపంచిక సుఖాల మోజులో పడి కేవలం నేను బాగుంటే చాలు అని అనుకునే శాతం ఎక్కువ అవుతుంది. నేను-నా వరకే ఆలోచన ఆగితే అత్యంత ప్రమాదకరం. నేను బ్రతకటానికి ఆధారం సమాజం అనే కనీస స్పృహ ప్రతి ఒక్కరికి ఉండాలి.అది లేకపోతే మనిషికి పశువుకి ఏం తేడా ఉండదు. మనిషిని పశువు నుండి వేరు చేసే ధర్మం అనేది ఒక్కటి అధికంగా ఉంది అని శాస్త్రాలు చెప్పాయి. ఆహార సంపాదన,నిద్ర,భయం సంతానోత్పత్తి విషయంలో మనిషి పశువులకి తేడా లేదు. కానీ "ధర్మ"చింతన మనిషికి ఉండాలి.
సమాజ & వ్యక్తి ఉన్నతికి అత్యంత సరళంగా మనకి పతంజలి మహర్షి కొన్ని నియమాలు అందించారు. అందరు ఇవి అనుసరిస్తే సహజంగానే సమాజం బాగుపడుతుంది. పతంజలి అష్టాదశ యోగసూత్రాల్లోని మొదటి రెండయిన యమ, నియమ లని పాటిస్తే చాలు అని నా అభిప్రాయం.
యమ అనగా అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్య, అపరిగ్రహం. ఈ ఐదింటిని పాటించటం వల్ల సమాజ శాంతి,సంక్షేమం సాధ్యమవుతుంది.
1.అహింస ని జీవన సూత్రంగా అలవర్చుకుంటే నేటి హత్యలు,దాడులు,కొట్లాటలు, గొడవలు ఏవి ఉండవు కదా!
2.సత్యం పాటించటం వల్ల సమాజంలో అవినీతి, అన్యాయం ఉండవు కదా!
3.అస్తేయం అనగా దొంగతనం చేయకుండటం. ఇది అవలంబిస్తే దోపిడీ,దొంగతనాలు లేకుండా సమాజం ప్రశాంతంగా ఉంటుంది కదా!
4.బ్రహ్మచర్యం అంటే వివాహం చేసుకోకుండా అని కాదు అర్ధం. వివాహం అయినప్పటికీ తన భార్య పట్లనే కాక అందరి స్త్రీలని మాతృస్వరూపంగా భావించమని అర్ధం. ఈ దృష్టితో చుస్తే సమాజంలో అత్యాచారాలు, యాసిడ్ దాడులు, నిర్భయ చట్టాలు ఉండవు కదా!
5.అపరిగ్రహం అంటే ఇతరుల వస్తువు కావాలని మనసులో కూడా కోరుకోకపోవటం. ఎంత గొప్ప ఆలోచన. ఇలా ప్రతి ఒక్కరు భావిస్తే అక్రమ సంపాదన, లంచగొండితనం,అవినీతి అన్నీ దూరమవుతాయి కదా!
నియమ అనగా శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణీదానం. ఈ ఐదింటిని పాటించడం వల్ల వైయక్తిక శాంతి, సుఖం సాధ్యమవుతుంది.
1.శౌచం అనగా శుచి. కేవలం శారీరకంగానే కాదు, మానసిక శుభ్రత కూడా పాటించాలి, అంటే వ్యక్తి ఆలోచనల్లో కూడా స్వచ్ఛత అవసరం అని నొక్కిచెప్పటం . ఆలోచల్ని బట్టి మన మాటలు, మాటల్ని బట్టి మన పనులు కదా! కాబట్టి ఆలోచనలు పవిత్రంగా ఉండాలనే వ్యక్తి నియమం ఇది.
2.సంతోషం అంటే ఆనందంగా ఉండాలి అని అర్ధం. ఉన్నదానితో సంతృప్తి చెందితే జీవితం ఆనందమయం. స్వీయ ఆనందం వాళ్ళ ఇతరుల ఆనందాన్ని కూడా మనిషి కోరుతాడు.
3.తపస్సు అంటే ముక్కుమూసుకొని ధ్యానం చెయ్యమని కాదు అర్ధం. ప్రతి పనిని ఏకాగ్రతతో చేయటమే తపస్సు. అంతమాత్రమే కాదు శారీరిక, మానసిక, వాచిక తపస్సుల గూర్చి కూడా భగవద్గీత లో చెప్పబడింది.
4.స్వాధ్యాయం అంటే సత్గ్రంధ పఠనం. మంచి సాహిత్యం చదవటం వల్ల వ్యక్తిత్వ వికాసం అలవడుతుంది. ఎప్పుడూ చైతన్యంతో మనిషి ఉండవచ్చు
5.ఈశ్వరప్రణిధానం అంటే నీ ప్రతి ఆలోచనని, ప్రతి కర్మని భగవంతుని అర్పణగా భావిస్తూ చెయ్యటం. సర్వస్వం భగవంతునిదే అనే భావన వల్ల అహంకారం తొలగి మనిషి త్యాగ భావనతో జీవిస్తాడు. తద్వారా మానవుడు మోక్షాన్ని పొందవచ్చు.
పైన చెప్పబడిన సామాజిక నియమావళి(5) వ్యక్తి నియమావళి(5) అనుసరిస్తే సామాజిక ఉన్నతి సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరు వీటిని అనుసరిస్తూ జీవితాల్ని సుఖమయం చేసుకోవాలి. మన సమాజాన్ని శాంతియుతంగా చేసుకోవాలి. ఆ విధమైన మార్పులో అందరం భాగస్వామ్యులు అవ్వాలని కోరుకుంటాను. -సామల కిరణ్.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments