ప్రపంచ ప్రజల్ని కరోనా మహమ్మారి కబళిస్తున్న వేళ, లక్షల సంఖ్యలో మానవాళి కూలిపోతున్న వేళ, ఆకలి కేకలు ఆకాశాన్నంటుతున్న వేళ, ప్రజల...
ప్రపంచ ప్రజల్ని కరోనా మహమ్మారి కబళిస్తున్న వేళ, లక్షల సంఖ్యలో మానవాళి కూలిపోతున్న వేళ, ఆకలి కేకలు ఆకాశాన్నంటుతున్న వేళ, ప్రజల ఆర్తనాదాలు భగవంతుడికి చేరుతున్నాయి. లాక్ డౌన్ ప్రకటించగా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోయి బందీలుగా మారిపోయి కనీస సౌకర్యాలు లేక కుటుంబాలతో కలిసి లేక నానా కష్టాలు పడుతున్నారు. కరోనాసోకే కష్టము దేవుడెరుగు ఆకలితో ఆలమటిస్తూ ప్రాణాలు పోయేట్లున్నాయి.
ప్రభుత్వాలు మరియు స్వచ్ఛంద సంస్థలు చేసే సహాయం ఎంతోగొప్పగా ఉన్నప్పటికీ భూగోళం పైన దేశదేశాలలో నివాసముంటున్న ప్రజా సమూహాల కుటుంబాలన్నీ నడవడానికి సరిపోయేంత సహాయం ఎవరైనా చేయలేరు కదా.! కోట్ల కొద్దీ ప్రజలను ఇంట్లో కూర్చో బెట్టి నెలకు నెలలు ఏ ప్రభుత్వం సాకగలదు.!
పాతకాలం సామెత మాదిరిగా ముందే కరువు, కరువు కాలంలో తిన్నది కూడా వాంతికి చేసుకున్నాడట పాపం అన్నట్లుగా.. కరోనా కష్టాలు ఇట్లుండగా ఇప్పుడు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కూడా దక్కించుకోలేక పోయే పరిస్థితి నెలకొన్నది. మానవజాతికి మిడతల దండు రూపంలో మరో ముప్పు ముంచుకు వచ్చింది.
మిడతల దండు: మానవాళికి మరో కష్టాన్ని తెచ్చిపెట్టింది మిడతల దండు. మనదేశంలో 30 సంవత్సరాల క్రితం వచ్చినట్టు చెబుతున్నారు. సరిగ్గా అప్పుడు కూడా రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ లోని కొన్ని జిల్లాలు పంజాబ్ రాష్ట్రంలోని పంట పొలాలన్నింటిని మిడతల దండు వచ్చి మొత్తానికి మొత్తంగా తిని వేశాయి అని అప్పటి కష్టాలను నష్టాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
సినిమా యాక్టర్ ధర్మేంద్ర కూడా పాతకాలపు విషయాలను గుర్తు తెచ్చుకుని తన అభిమానులను హెచ్చరించాడు. నేను పదవ తరగతి చదువుతుండగా నాతోపాటు హైస్కూల్ లో చదువుతున్న నాతోటి మిత్రులందరినీ మిడతల దండుని చంపడం కోసం పొలాల్లోకి పంపిస్తే అందరం వెళ్లి పొలాలలో నానా ఇబ్బందులు పడ్డాము అంటూ చెప్పుకొచ్చాడు.
ఇలా మనకు చరిత్రలో కూడా కొన్ని సంఘటనలు కనబడతాయి ముఖ్యంగా ధనవంతుడైన శ్రీనాథుడు అనేక భోగాలను అనుభవించి కరువు మరియు భోగాల కారణంగా పేదవాడుగా మారిపోయాడు ఆ విషయాలను శ్రీనాథుడు తన నైషధము అనే గొప్ప రచనలో ఆనాటి కరువు రోజులలో పేదరికాన్ని వర్ణిస్తూ చెప్పాడు.
కర్ణాటక ప్రభువుల భూములను కౌలుకు తీసుకొని దుక్కిదున్ని వ్యవసాయం చేసి పంట వేశాడు. ఆ పంట కూడా మిడతల దండు వచ్చి తిని వేశాయని కౌలు కట్టే పరిస్థితి లేదని దయనీయమైన స్థితిని చెప్పుకుంటూ నన్ను కావవే కన్నడ రాజ్య లక్ష్మి నేను శ్రీనాథుడన్ అంటూ స్తుతించాడు.
అటువంటి ఘోరమైన పరిస్థితి మళ్లీ ఈనాడు మనదేశంలో దాపురించిందీ. కేంద్ర వ్యవసాయ శాఖ సమాచారం ప్రకారం రాజస్థాన్ లో 20 జిల్లాలు మధ్యప్రదేశ్ లో 9 జిల్లాలు గుజరాత్ లో రెండు జిల్లాలు ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలోని ఒక్కొక్క జిల్లాలో మిడతల దండు ప్రభావం 47,000 ఎకరాలలో కంటే ఎక్కువగా ఉన్నట్లు దీనిని ఆపడం కోసం గాను 300 కేంద్రాల్లో రకరకాల రసాయనాలను వెదజల్లడానికి ప్రభుత్వం పూనుకున్నట్లు ప్రకటించింది.
గత సంవత్సరం మిడతల దండు పాకిస్థాన్లో ప్రవేశించి అనేక పంటపొలాలను మరుభూమిగా మారుస్తున్న సమయంలో అక్కడి సింధ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మహమ్మద్ ఇస్మాయిల్ మిడతల దండును ఎదుర్కోవడం సాధ్యం కావడంలేదు కనుక ప్రజలందరూ మిడతలతో బిర్యానీలు చేసుకుని తినండి అంటూ వివాదాస్పదమైన ప్రకటన చేయగా ప్రపంచ ప్రజలందరూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హేళన చేశారు, చీత్కరించారు.
ప్రత్యేకమైన ఈ మిడతలు ప్రశాంతమైన ఇసుక ఎడారుల ప్రాంతాలలో పుడతాయి. సాధారణంగా వీటి బ్రీడింగ్ కాలం జూన్ జూలై నుండి అక్టోబర్ నవంబర్ వరకు ఉంటుంది.FAO సంస్థ చెబుతున్నట్లుగా ఒక మిడుత ఒకసారి 150కిపైగా గుడ్ల నిస్తుంది , ఇలా దాని తర్వాత మొదటి తరం 16 రెట్లుగా రెండవ తరం 400 రెట్లుగా, మూడవ తరం పదహారు వేల రెట్లుగా, సంతానోత్పత్తి పెంచుకుంటాయి. ఎడారి ఇసుక భూముల నుండి బయలుదేరి వచ్చిన ఈ మిడతల దండు గాలివాటంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఎగురుతూ రోజుకు 100-150 కిలోమీటర్లు పైగా ప్రయాణం చేస్తాయి. ఒక కిలో మీటర్ కు పైగా విస్తీర్ణం కలిగిన ఒక దండులో 15 కోట్లకు పైగా మిడతలు ఉంటాయి, ఇవి 35 వేల మంది ప్రజలు తినే ఆహారాన్ని క్షణాల్లో తినేస్తాయి. ఒక్కొక్కసారి ఈ మిడతల దండు ఒక్క కిలోమీటర్ నుండి వందల వేల కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన దండుగా కూడా బయలుదేరి వస్తాయి.
ఉదాహరణకు 1875వ సంవత్సరం అమెరికా దేశంలో ఐదు లక్షల, పన్నెండు వేల,ఎనమిదివందల,పదహేడు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన మిడతల దండు వచ్చి పడింది. ఇది ఎంత పెద్ద విస్తీర్ణం అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కంటే రెండింతలు పెద్దది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క వైశాల్యం రెండు లక్షల 46 వేల 286 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే.
ఈసారి మిడతల దండు రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ హర్యానా రాష్ట్రాల మీదుగా ఢిల్లీ వరకు చేరుకుంటున్నాయి, గ్రీన్ కవర్ 22 శాతం మాత్రమే కలిగిన ఢిల్లీ మహానగరాన్ని మిడతల దండు చేరుకుంటే చాలా ప్రమాదమనీ, ఇసుక ఎడారుల ప్రాంతాలనుండి వచ్చిన ఈ మిడతల వలన మరింత ప్రమాదం ఉంటుందని యునైటెడ్ నేషన్ కు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(FAO) హెచ్చరిస్తున్నది.
కేవలం మూడు నుండి ఐదు గ్రాములు బరువు ఉండే ఒక్కొక్క మిడత తన బరువంత ఆహారాన్ని తింటుంది. కొద్ది సమయంలోనే లక్షలాదిగా, కోట్లాదిగా వచ్చే మిడతలు పచ్చని పంట పొలాలను మరు భూములుగా మార్చేస్తాయి, ఇటువంటి ఈ మిడతలను చైనావంటి కొన్ని దేశాలలో భోజనంలోకి వేయించుకొని నంజుకు తింటారు.
ఈ మిడుతలలో ఫైటోస్టిరాల్ అనే గుండెకు బలాన్నిచ్చే పదార్థం పుష్కలంగా ఉంటుందని, అంతేకాక రక్తంలోని కొలెస్టరాల్ ను లేకుండా చేస్తుందని అంటున్నారు. చాలా దేశాల్లో మిడుతలతో బిర్యానీలే కాక అనేక రకాల కూరలు చేసుకొని తింటారు. ఈ సమయంలో కొందరు పర్యావరణవేత్తలుగా చెప్పుకుంటున్న వారు కూడా మహమ్మద్ ఇస్మాయిల్ సలహాలనే ఇస్తుండడం గమనార్హం.
నివారణ చర్యలు : పంటలను ధ్వంసం చేస్తూ కోట్లాదిగా తరలివచ్చే మిడతల దండును ఎదుర్కోవడమెలా?రసాయనాలను వాడి చంపడం, రసాయనాలను చల్లి వాటి ప్రత్యుత్పత్తి జరగకుండా చూడడం,దేశీయంగా మనవాళ్ళ ఆలోచన. చేనుగట్ల పక్కన మట్టిని తవ్వి దానిని నీటిలో కలిపి పలుచగా చేసి వడగట్టి ఆ మట్టిని పంటలపై పిచికారి చేయవలెను. జీర్ణాశయ వ్యవస్థ కాలేయం లేని మిడుత మట్టితో కూడుకున్న ఆకులు తిని జీర్ణించుకోలేక చచ్చి పడిపోతుంది అని శాస్త్రజ్ఞులు నివారణోపాయాలు చెబుతున్నారు.
ఏదేమైనా ప్రకృతి సహజంగా క్రిమికీటకాలను, మిడుతలనూ ఆహారంగా తీసుకునే పక్షి జాతి సమూహాలు అంతరించి పోవడానికి మానవజాతి రసాయనాల వాడకము మరియు సెల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రభావం కూడా ఉంది అనేది మరిచిపోలేని సత్యం.
కనుక మానవజాతి రసాయన,ఎలక్ట్రానిక్ వంటి కృత్రిమ వస్తువులకు దూరంగా ప్రకృతికి దగ్గరగా జీవించగలడా.?
మళ్ళీ తన సహజ జీవన మూలాలకు చేరుకోగలడా అనేది ఆలోచనా పరులకు కొరుకుడు పడని ప్రశ్నగానే మిగిలిపోతుందా.? -ఆకారపు కేశవరాజు, రాంచీ.
No comments