రావీనది ఉరుకులతో ప్రవహిస్తోంది. మొదట నలుసులా కనిపించిన పడవ క్రమంగా పెద్దదై ఒడ్డుకొచ్చి ఆగింది. ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురు యువకు...
రావీనది ఉరుకులతో ప్రవహిస్తోంది. మొదట నలుసులా కనిపించిన పడవ క్రమంగా పెద్దదై ఒడ్డుకొచ్చి ఆగింది. ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురు యువకులు దిగారు పడవ నుంచి. అది మే నెల, 1930వ సంవత్సరం. మధ్యాహ్న భానుడు నిప్పులు చెరిగేస్తున్నాడు. అతనందించే వేడికి పోటీపడి వాయు దేవుడు విజృంభించి వడగాలి ఆ ప్రాంతాన్నంతా ఊపేస్తున్నాడు. పడవ దిగిన యువకులు చెదిరే జుట్టును సర్దుకుని ముఖాలోసారి చేత్తో తుడుచుకుని అవతలి గట్టు వైపు దృష్టి సారించారు కళ్ళు చికిలిస్తూ. వాళ్ళ మూడు సైకిళ్ళూ అవతలి గట్టుమీద పడివున్నాయి. ఎంతటి వాళ్ళకైనా వడదెబ్బ కొట్టే ఆ వాతావరణంలో ఎక్కడా జన సంచారం లేదు. వడదెబ్బ తట్టుకోవటానికి వాళ్ళ దగ్గర ఒక పుచ్చకాయ, కొన్ని నారింజలు వున్నాయి.
వడగాలిలోనే అడ్డంపడి ముందుకు సాగారు. వాళ్ళ ముఖాల్లో ప్రసన్నతే కానీ అలసట, విసుగు లేనేలేవు. ఆ ముగ్గురే భగవతీ చరణ్ వోరా, సుఖదేవ్ రాజ్, విశ్వనాథ వైశంపాయనుడు. ముగ్గురూ క్రాంతికారీ యువకులే. వీళ్ళ మీద ఒక పెద్ద బాధ్యత వుంది. వీళ్ళ స్నేహితులు భగత్ సింగ్, బటుకేశ్వరదత్, రాజగురు, సుఖదేవ్ నలుగురూ పట్టుబడ్డారు. వాళ్ళను ఎలాగైనా విడిపించాలి. ఆ పనికి మంచి యోజన తయారు చేసుకున్నారు వీళ్ళు ముగ్గురూ ఆపాటికే. ఆ పనికి బాంబులు ప్రయోగించాల్సిన అవసరం వుంది. బాంబులు ఎలా పేల్చాలో అందులో ఎవ్వరికీ తెలీదు. తాము ఉపయోగించబొయ్యే బాంబు పరీక్షించటానికే ఆ ముగ్గురూ అంతటి మిట్టమధ్యాహ్నం మండుటెండలో ఆ నిర్జన ప్రదేశానికి వచ్చారు.
ఆ ముగ్గురులో భగవతీచరణ వివాహితుడు. భార్య దుర్గావతి దేవి, తండ్రి కూడా అయ్యాడు. మిగతా ఇద్దరూ క్రాంతి పథం చేబట్టాక పెళ్ళేమిటని ఆ జోలికి వెళ్ళలేదు అలా నది ఒడ్డున నడుస్తూ ముగ్గురూ ఒక కందకం దగ్గర ఆగారు. సుఖదేవరాజ్ జోలిలోంచి ఒక బాంబును బయటకు తీశారు. తమకు చూచాయగా అందిన శిక్షణ పరిజ్ఞానంతో దాన్ని పరిశీలించి చూచి దీని పిన్ను వదులుగా వుంది అన్నాడు. పిన్ను వదులుగా వుంటే బాంబు పేలొచ్చు. చాలా ప్రమాదం భగవతీ చరణ్ అతని చేతిలోంచి బాంబు తీసుకున్నారు. పరీక్షిస్తూ మీరిద్దరూ దూరంగా వెళ్ళండి. నేను పేలుస్తాను దీన్ని అన్నారు. వెంటనే వైశంపాయనుడన్నాడు. అరే భాయ్! మమ్మల్ని పేల్చనీ.
జరగండి, దూరంగా పొండి అని కేకలేస్తూ పిన్నులాగేసి బాంబు విసరటానికి చెయ్యి వెనక్కీ ఊపాడు భగవతి చరణ్. బాంబు చేతిలోనే పేలిపోయింది. ఎవరు ఎక్కడ పడ్డారో తెలీలేదు, పొగ, దుమ్ము అణిగాక గానీ జరిగిన ఘోరం కనిపించలేదు. భగవతీ చరణ్ నేలమీద పడి ఉన్నాడు. బాంబు ప్రేలుడుకు అతని చెయ్యి తెగి గాలిలో ఎగిరి ఎక్కడో పడిపోయింది. పొట్ట విచ్చుకుని పేగులు బయటకొచ్చాయి. ఒళ్ళంతా రక్తమయం.
తేరుకున్న ఇద్దరు మిత్రులూ అతని దగ్గరకు పరుగెత్తారు, బట్టలు చింపి గాయాలకు కట్టుకట్టడం మొదలెట్టారు. వాళ్ళకూ దెబ్బలు తగిలి రక్తం ఓడుతోంది. అయినా మిత్రుడ్ని ఎలా రక్షించుకోవాలో అన్నదే వాళ్ళ తపన. కొన ఊపిరితో వున్న భగవతీచరణ్ ఆందోళనతో వగురుస్తూ అరుస్తున్నాడు.
పొండి! మీరు వెళ్ళిపోండి! బాంబు పేలి ఇంత పెద్ద శబ్దం అయింది గదా, పోలీసులు ఏ క్షణాన్నైనా రావచ్చు. భగత్ సింహుడ్ని విడిపించాల్సిన బృహత్కార్యం మీ ముందుంది. మీరు పట్టుబడితే మన యోజన విఫలమవుతుంది. పొండి! నన్నొదిలి పొండి గిలా కొట్టుకొంటూ అరుస్తూనే వున్నాడు భగవతీ చరణ్. ధన్యజీవి అతను, ఆఖరి క్షణాల్లో, ఇంతటి బాధలో కూడా కర్తవ్యం గుర్తుందతనికి. భార్య, కొడుకు, కుటుంబం, ఆస్తిపాస్తులు, మరేమీ గుర్తులేదు. ఆఖరుకు తన అవస్థ, బాధకూడా గుర్తులేవు. గుర్తున్నది ఒక్కటే కర్తవ్యం క్రాంతి పథం, దేశం, తమ యోజన.. ఇవే అతని మస్తిష్కం నిండా తిరిగే ఆలోచనలు.
మిత్రులు హుటాహుటిగా అతన్ని దగ్గరున్న అడవిలోకి మోసుకెళ్ళారు. ఆఖరి క్షణాలు వచ్చేశాయి. కళ్ళు మూతలు పడుతున్నాయి. అయినా పెదవులు కదులుతూనే వున్నాయి. మిత్రులు చెవి ఒగ్గి విన్నారు. ఏం చెప్తున్నాడోనని. మళ్ళీ అవే మాటలు. పొండి. మీరు వెళ్ళిపొండి. ఇక్కడుంటే ప్రమాదం. పోలీసులు వచ్చేస్తారు. మీరు పట్టుబడతారు. పోండి!. ఇవే భగవతీచరణ్ ఆఖరి మాటలు. ఆఖరి శ్వాసలో కూడా కర్తవ్యం. అతను మరణించలేదు. జీవించాడు. జీవితం అంటే అదే.
స్వాతంత్ర్య సమరయోధుల గురించి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇలా అన్నారు. మరణ తుహు మమ శ్యామ సమాన (మరణమా నువ్వు నా మాదవుడి లాంటి దానివి), లక్షలాది మంది యువకులు ఈ దేశం కోసం నవ్వుతూ మరణాన్ని స్వీకరించారే తప్ప బానిస బ్రతుక బ్రతకలేదు ఎదురించి నిలిచి పోరాడితే తుపాకి గొట్టం నుంచి వచ్చిన స్వాతంత్ర్యం ఇది. కాబట్టి దేశమే ప్రధమంగా జీవిస్తూ, స్వేచ్ఛను హక్కుగా కాకుండా బాధ్యత గా జీవిస్తూ దేశం అభివృద్ధి కి పాటు పడదాము.. జై హింద్.
No comments