ఇంత పెద్ద సువిశాల భారతదేశం గురించి గాంధీజీ ఓసారి భారతదేశం అంటే పల్లెలు, వ్యవసాయం అన్నారు. అలాంటి పల్లెల్లో ఒక పల్లె గ్రామం మా ఊరు, ఈ ర...
ఇంత పెద్ద సువిశాల భారతదేశం గురించి గాంధీజీ ఓసారి భారతదేశం అంటే పల్లెలు, వ్యవసాయం అన్నారు. అలాంటి పల్లెల్లో ఒక పల్లె గ్రామం మా ఊరు, ఈ రోజు మాఊరు గురించి తెలుసుకుందాం, మాదీ మారేపల్లి, కృష్ణా జిల్లా లోని ఓ ట్రైబల్ మండలం అయిన ఏ.కొండూరు మండలం పరిదిలో 1200 మంది వోటర్లు కలిగి 2000 జనాభా ఉన్న రెండు చిన్న చిన్న గ్రామాలు గున్నచింతలపాడు కలిసి మా పంచాయతీ. సరిహద్దు గ్రామాలు పల్లెర్లమూడి, గానుగపాడు, కోడూరు మరియు పోలిశెట్టిపాడు మధ్యన ఉన్న ఓ అందమైన, సుందరమైన నందనవనం మా ఊరు.
నేను సుందరమైన నందనవనం అని ఎందుకన్నానంటే మా గ్రామం లో ఎటుచూసినా మామిడి తోటలు, పచ్చని పొలాలతో అందరినీ పలుకరిస్తూ స్వాగతం పలుకుతుంది అందుకే అలా అన్నాను. ముఖ్యంగా ఈ పల్లెకు ఆదారం వ్యవసాయం, వ్యవసాయ కూలీలూ ఉన్నారు. వ్యవసాయం లో వరి, పత్తి, మిరప ఎక్కువగా పండిస్తారు. వీటన్నిటికన్నా ముఖ్యమైనది కూరగాయల పంటలు ప్రతి ఇంటిలో పండిస్తారు, మేమూ పండిస్తాము. పశ్చిమ కృష్ణా జిల్లాలోని సగానికి పైన గ్రామాలకు మా ఊరు నుండి కూరగాయలు వెళతాయి, వేకువ జామునే లేచి ఊరి పొలిమెర్లలో నిలబడితే సుమారు వంద సైకిళ్ళకు పైగా కూరగాయల తట్టలతో బయలుదేరతారు వీళ్ళంతా తిరువూరు, కల్లూరు, బంజర వెళ్తారు, కొంతమంది క్వింటాళ్ళ బరువుతో సైకిళ్ళు తొక్కుతారు ఈ మద్య కొంతమంది మోటార్ సైకిళ్ళు ఉపయోగిస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాల వాళ్ళు మావూరి కూరగాయల సైకిళ్ళు ఎప్పుడొస్తాయా అని తాజా కూరగాయలకోసం ఎదురుచూడని రోజంటూ ఉండదు అది మావూరికి ఉన్న ప్రత్యేకత.
అలాగే కొన్ని పంటలు పండించాలంటే నారు కావాలి మిరప, వంగ, టమాటో ఇలా ఏ నారు కావాలన్నా సుమారు వందా నూటయాబై కిలోమీటర్ల నుండి కూడా వచ్చి మా ఊరు లో కొనుక్కుపోతారు. అదీ మా వూరి మరో ప్రత్యేకత ఇకపోతే మా వూరి నుండి పెద్ద పెద్ద ఇంజినీర్లు 1980ల్లోనే చదివారు, అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, దుబాయ్ దేశాలు మాకు హైదరాబాదు కన్నా దగ్గరా అన్నట్లు పదుల సంఖ్య లో ఆయా దేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఏవండోయ్ అమెరికా వెళ్ళినా లండన్ వెళ్ళినా కూడా ఆ కూరగాయల పంటమీద మాకు మక్కువే ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు ఆ పంటలు పండిస్తూనే ఉంటారు ఎందుకంటే అదేమాకు కడుపు నింపేది.
ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మావూరిలో హెవీ వెహికల్ డ్రైవర్ లు అత్యధికంగా ఉన్నారు, వీళ్ళంతా దేశం అంతా లారీ, కార్గో లారీ డ్రైవర్ లుగా జీవనం సాగిస్తున్నారు. బ్రతుకుపోరాటంలో అనేక రాష్ట్రాలు వెళ్ళొస్తుంటారు. ఇంకా వరిపంటకోతకు ఉపయోగించే హార్వెస్టర్లు, ట్రాక్టర్లు ద్వారా లక్షల్లో సంపాదించే రైతులు, యజమానులు ఉన్నారు. వరిపంట సమయంలో పచ్చదనం ఎలా ఉంటుదో కోత సమయంలో బంగారు వర్ణం తో పొలాలు కనిపిస్తాయి కోతసమయంలో. చూడటానికి ఎంతో కనువిందు చేస్తాయి, వ్యవసాయానికి వాడే నీరు రెండు పెద్ద చెరువుల ద్వారా నల్లచెరువు, ఎర్రచెరువు పేర్లతో అలాగే బోరు బావులద్వారా వేలాది ఎకరాలు పంటపండుతాయి. అలాగే వాగుద్వారా ప్రవహించే నీటికి చెక్ డ్యామ్ ల ద్వారా నిల్వచేసి పంటలు పండిస్తారు. మామిడి తోటలు ఈ మధ్య అంత ఆశాజనకంగా లేవు ఈ విషయంలో మామిడి రైతులు చాలానష్టాల భారినపడుతున్నారనే చెప్పాలి. ఇక వ్యవసాయ కూలీలు అందుబాటులోనే ఉంటారు, అందరూ కలిసి కొన్ని ముఠాలుగా ఏర్పడి ఒకరి తరువాత ఒకరి పంటలు సాగుబడికి తక్కువ కూలీ ధరకే పనిచేసే కర్షక కార్మికులు మాఊరి రైతాంగానికి అదృష్టం అనే చెప్పాలి, ఇదండీ మా ఊరి వ్యవసాయ వివరాలు.
ఇకపోతే అనేక కులాల కలయిక మావూరు అందరూ వాళ్ళ వాళ్ళకుల సమూహాలతో కూడిన నివాసాలు ఎప్పటినుండో ఉన్న విధంగానే ఎటువంటి కులభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి సద్బావనతో బందుభావన మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో అందరూ జీవిస్తున్నారు, ఎటువంటి గొడవలకు తావు లేకుండా ఊరుపెద్దలు, కుల పెద్దలు అంతా చర్చలు చేస్తూ సమీక్షలు నిర్వహించుకుంటూ ఆనందం పంచుతారు ప్రజలందరికీ.
ఇకపోతే మతానికి సంభందిత విషయాలు చర్చిలు ఉన్నాయి, గుడులు ఉన్నాయి, అన్ని పండుగలు అందరూ కలిసే జరుపుకుంటారు. ముఖ్యంగా శ్రీ రామ కళ్యాణం బాగా జరుగుతుంది, పదేళ్ళ క్రితం మంచిగా కొత్తగా రామాలయం ఊరిప్రజలందరూ కలిసి నిర్మించుకోవటం జరిగింది, మా ఊరిలో రాముడంటే కేవలం హిందువులకే సంబంధించిన వాడు కాదు అన్ని కులాల వారు మతాల వారికి ప్రవేశం కల్పించడం జరిగింది, మా వూరి రాముడు అందరివాడు, అలాగే మావూరి ప్రజలంతా సంతోషంగా, ఆనందం గా ఉండటానికి కారణం మావూరి ఆంజనేయస్వామి అని అందరూ విశ్వసిస్తారు, గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది మావూరి ఆంజనేయస్వామి ని దర్శనం చేసుకుంటే.
ఇంకామావూరి గురించి చెప్పాలంటే ఒకే ఒక వ్యవస్థ చాలా దుర్బరంగా ఉంది అది ఏంటంటే మా వూరి మంచి నీటి వ్యవస్థ, నీరు అసలు బాగోవు తాగలేము, కేవలం వ్యవసాయం కు, నిత్యవసర వినియోగానికి తప్ప తాగటానికి అసలు పనికిరావు. కొన్ని బోర్లు ద్వారా అందిస్తున్నప్పటికీ అవి అందరికీ చేరడం లేదు. విధ్యుత్ వ్యవస్థ చాలా బావుంది, ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు ఉన్నవి, రోడ్లు కొంతమేరకు పర్వాలేదు. మా ఊరు కి గొప్ప అదృష్టం ఏమిటంటే స్పందించే నాయకులు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారు, ఏ పార్టీ వారైనా సరే గ్రామ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తారు. నాయకులంతా కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకుని ముందుకెళతారు.
హడావిడిలో మర్చిపోయాను మా ఊరు లో ప్రాథమిక విధ్య వరకు ప్రభుత్వ పాఠశాల మాత్రమే ఉంది, మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, అలాగే మంచి విధ్య లభిస్తుంది. ఉన్నత పాఠశాల కొరకు కోడూరు, పోలిశెట్టిపాడు పదవతరగతి వరకు సైకిళ్ళ పై వెళతారు. పిల్లలంతా బాగా చదువుతారు కూడా అలా చదివిన వాళ్ళే ఆస్ట్రేలియాలు వెళ్ళారు అలాగే మద్రాస్ ఐ ఐ టి లలో చదివిన విధ్యార్థులూ ఉన్నారు, ఉపాధ్యాయులు, జర్నలిస్టు లూ, లాయర్లు, ఇతర నగరాలకు వెళ్ళి అక్కడ రాజకీయ నాయకులుగా స్థిరపడ్డ వారూ ఉన్నారు. ఆటపాటలతో మంచి సందడితో పిల్లలంతా కలిసి ఉంటారు. ఇదండీ మావూరి గురించి నాకు నచ్చినట్లుగా వ్రాశాను, మీకూ మీ ఊరి గురించి నాలా చెప్పాలనిపిస్తే మీరు మీ ఊరి గురించి నాకు వాట్సాప్ చేయండి. మీ రాజశేఖర్ నన్నపనేని.
Avunu vuru pachadanam to chala baga vundi
ReplyDelete