జంతూనాం నరజన్మ దుర్లభం అని అంటారు. సృష్టిలోని అన్ని ప్రాణుల కంటే దుర్లభమైనది( దొరకటం చాల కష్టం) మానవ జన్మ. 84 లక్షల జీవరాశులలో అత్యంత శ్...
జంతూనాం నరజన్మ దుర్లభం అని అంటారు. సృష్టిలోని అన్ని ప్రాణుల కంటే దుర్లభమైనది( దొరకటం చాల కష్టం) మానవ జన్మ. 84 లక్షల జీవరాశులలో అత్యంత శ్రేష్టమైనది,మోక్షం సాధించుటకు ఆధారమైనది మానవ జన్మయే. సృష్టిలోని ఏ ప్రాణికి దాని లక్షణాల్ని,గుణాల్ని గుర్తు చేయాల్సిన అవసరం రావట్లేదు.రాదు కూడాను. కేవలం మనిషికి మాత్రమే నువ్వు మనిషిలా జీవించు అనాల్సివస్తుంది.
అత్యంత ప్రాచీన శ్రేష్ఠమైన జీవనవిధానం కల భారతభూమిలో మనం జన్మించాము. ఋషి సంప్రదాయం మనది. ఆర్ష జీవన విలువలు మనవి. మానవ జీవితంలో సాధించాల్సినవి కూడా ఏనాడో మన పూర్వికులు గ్రంథాల్లో పొందుపరిచారు, ఆచరణలో అందించారు. అవే చతుర్విధ పురుషార్ధాలు. పురుషుడు అంటే ఇక్కడ మానవుడు(స్త్రీ/పురుష) అని అర్ధం. ఆ మానవుడు సాధించాల్సిన నాలుగు వరుసగా ధర్మం, అర్ధం, కామం, మోక్షం.
ఆలయానికి వెళ్లిన ప్రతి సందర్భంలోనూ అర్చక స్వామి ధర్మార్ధకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని అంటారు. కాని చాలా మంది అవి ఏమిటో తెలిసుకునే ప్రయత్నం చేయరు. కొందరు ఆధ్యాత్మిక వాసనలు ఉన్నవారు తప్ప. ప్రతి ఒక్కరు వరుసగా ఆ నాల్గింటిని సాధించాలి మరి. అందులో మొట్టమొదటిదే ధర్మం. ఆ ధర్మానికి ముడిపడి ఉన్నవే అర్ధ(సంపద), కామము(కోరిక)లు. ధర్మబద్ధమైన సంపదల వల్ల, ధర్మబద్ధమైన కోరికల వల్ల మానవ జన్మకి కలిగే విడుదలయే మోక్షం.
మనిషి ధర్మాన్ని పట్టుకోవాలి. అర్ధ,కామాల్ని నియంత్రించుకోవాలి. ధర్మబద్ధ జీవితం వల్ల మోక్షం దానంతట అదే వస్తుంది. అర్ధ,కామములు నది ప్రవాహంలోని వరదల వంటి వేగం కలవి. రెండు వైపులా వరదల వేగాన్ని నియంత్రించే నదీ తీరాలే ధర్మ,మోక్షాలు.
ఆధునిక మనోకాలుష్య ప్రపంచంలో ధార్మిక జీవనానికి స్థానమేది? చతుర్విధ పురుషార్ధాల ఆలోచనేది? హడావుడి, ఆడంబర భక్తి పెరిగింది తప్ప ధర్మబద్ధ జీవనం, ఆధ్యాత్మికత, ధర్మం అన్నదే లేదు. అధికాధిక డబ్బు సంపాదన, తరతరాలకి తరగని ఆస్తులు,భూములు కూడబెట్టటం తప్ప ధర్మబద్ధమైన ఆర్ధిక ప్రణాళిక, దానధర్మాలకి తావు లేదు. మితిమీరిన, తీరలేని, విలాసవంతమైన భౌతిక సుఖాలు కోరికల వెంట పరుగెత్తటం తప్ప, ధర్మబద్ధమైన తృప్తి ఎక్కడ?
పాశ్చాత్య జీవన శైలి కి అలవాటుపడ్డ భౌతిక మానవుడు భౌతిక సుఖాల వెంట పరుగెత్తుతూ, మానవ జీవిత లక్ష్యాన్ని విస్మరిస్తున్నాడు. ప్రపంచ దేశాలన్నీ భౌతిక వాదంతో ప్రకృతిని కొల్లగొట్టి, ప్రమాదకర పరిస్థితుల్లోకి భూగోళాన్నే నెట్టేశారు. అనుభవించటమే జీవనసూత్రంగా పెట్టుకున్న దేశాలు, ఆయా దేశాల్లోని ప్రజలు తిరిగి ఆనందం, సుఖశాంతుల కోసం మన భారతీయ సాంస్కృతిక జీవన విధానం వైపు మరలుతున్నారు. ఈ క్రమంలో భారతీయులుగా ధార్మికతకి పట్టం కడదాం. పురుషార్థమయమైన జీవితాల్ని గడుపుదాం. మన వైభవోపేతమైన సాంస్కృతిక జీవన విలువల్ని పునస్థాపిద్దాం. - సాకి-9949394688
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
చతుర్విధ పురుషార్ధాలు గురించి చాలా బాగా వివరించారు
ReplyDelete