Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పతంజలి మహర్షి అష్టాంగ యోగా గురించి పూర్తి వివరాలు - What is Ashtanga Yoga in Telugu - MegaMinds

యోగ దర్శన సూత్రకారుడు మహర్షి పతంజలి. పూర్వం హిరణ్యగర్భుడు, యాజ్ఞవల్క్యుడు వంటి యోగశాస్త్ర ప్రవర్తకులు ఎందరో ప్రవచించిన విషయాలను ...

యోగ దర్శన సూత్రకారుడు మహర్షి పతంజలి. పూర్వం హిరణ్యగర్భుడు, యాజ్ఞవల్క్యుడు వంటి యోగశాస్త్ర ప్రవర్తకులు ఎందరో ప్రవచించిన విషయాలను క్రమపద్ధతిలో సూత్రబద్ధం చేయటం వలన ఈ దర్శనానికి పతంజలి యోగదర్శనం అనే పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది. క్రీస్తుపూర్వం 200-150 ప్రాంతం నాటి పతంజలి ఆదిశేషుని అవతారమని, సర్వజ్ఞుడయిన ఆయనకు అందరూ అంజలి ఘటించి నమస్కరించేవారు. ‘‘పతన్తి అజ్ఞలయ అస్మిన్‌’’ అనే విగ్రహవాక్యం చేత ‘‘అందరి దోసిళ్లూ ఈయన మీద పడుతున్నాయి’’ అని పతంజలి శబ్దానికి అర్థం.

పతంజలి మహర్షి అష్టాంగ యోగా గురించి వివరించారు, అంటే యోగాకు సంభందించిన 8 అంగాలు ఇవన్నీ మనం చేసినట్లయితే ఒక మనిషి ఎన్ని ఇబ్బందులను అయినా ఎదుర్కొని ఆనందం గా జీవిస్తాడు.
1. యమ, 2. నియమ, 3. ఆసన, 4. ప్రాణాయామ, 5. ప్రత్యాహార, 6. ధారణ, 7. ధ్యాన, 8. సమాధి
ఇందులో శరీరమాలిన్యం పోవటానికి ఆసనాలు, శ్వాసకి సంబంధించిన మాలిన్యం పోవటానికి ప్రాణాయామాలు, నడవడిలోని మాలిన్యం పోవటానికి యమ, నియమ, ప్రత్య హారాలు, మనోమాలిన్యం పోవటానికి ధారణ, ధ్యాన, సమాధులని పతంజలి వివరించారు.

శరీర మాలిన్యం పోవడానికి ఆసనాలు: ఆసనాలు శారీరక వ్యాయామాలని భావించరాదు. యోగం అంటే ప్రాథమిక స్థాయిలో కలయిక. అంటే శరీర, శ్వాస, మనసుల కలయిక. యోగ అంగాలన్నీ ఒకదానికొకటి అనుసంధానించే ఉండేవే. విడువడి ఉన్నవి కావు. ఈ కలయిక అనేది ఆసనాలలో కూడా నిబిడీకృతమై ఉన్నది. అది మరచి ఆసనాలను కూడా వ్యాయామంలాగా చేయడం వలన ఉపయోగం ఉండదు. అవసరం మేరకు శక్తినుపయోగించి తద్వారా మనసుకు ప్రశాంతతను కలిగించేవే ఆసనాలు. అవి కేవల భంగిమలు కావు. ప్రతి ఆసనానికి విన్యాసం, అంటే కొన్ని స్టెప్స్ ఉం‌టాయి. వాటికి శ్వాస అనుసంధానించి ఉంటుంది. తద్వరా స్థిరమయిన ఆసన స్థితి ఏర్పడుతుంది. అటువంటి అభ్యాసంతో మనసు ప్రశాంతతకు చేరుకుంటుంది. స్ట్రెస్‌ ‌హార్మోన్సు రక్తంలో ఎక్కువగా విడుదల కావు. శరీరానికి స్థిరత్వం, మనసుకు సుఖం కలుగుతాయి. కొన్ని వారాల అభ్యాసం వ్యక్తి ప్రవర్తనలో మార్పుని తీసుకు వస్తుంది. వైద్యశాస్త్రాలకి సైతం లొంగని రోగాల భారి నుంచి కాపాడుతుంది. అత్యంత సంక్లిష్టమయిన మానవ శరీర నిర్మాణం లోని వ్యవస్థల మధ్యనున్న వికృతులను, అత్యంత నేర్పుతో సరిచేసి, వాటి లక్షణాలను తిరిగి పెంపొం దించటంలో ప్రముఖ పాత్ర వహించేవే ఆసనాలు.

వ్యాయామంలో బ్లడ్‌ ‌షంటింగ్‌ అనేది ఇన్‌వాలంటీర్‌గా జరుగుతుంది. అదే ఆసన అభ్యా సంలో ఆ ఆసన స్థితిని అనుసరించి Conscious గా జరుగుతుంది. ఈ ప్రత్యేకత వలననే, ఆసనాలు శరీరావయవ ప్రవర్తనల్లో చోటుచేసుకొన్న వికృతు లను తొలగించి, ఆరోగ్యకరమయిన సంస్కృతిని ఆ అవయవానికి కలగచేస్తాయి.

శ్వాసకి సంబంధించిన మాలిన్యం పోవటానికి ప్రాణాయామాలు: ప్రాణాయామాన్ని శ్వాస ప్రవాహ నియంత్రణ అని అంటారు. మన శరీరంలోని వ్యవస్థలలో శ్వాసక్రియ వ్యవస్థకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది ‘Dual nature’ కలిగినది. శ్వాసను మన ప్రమేయం లేకుండానే పీల్చుకుంటాం. దీనిని ఇన్‌వాలంటరీ అంటారు. శ్వాసని మనం వాలంటరీగా కూడా తీసుకోవచ్చు. అందుకనే బాగా దీర్ఘంగా కూడా శ్వాసని పీల్చగలం. కనుకనే శ్వాసపక్రియ వ్యవస్థ (వాలంటరీ / ఇన్‌వాలంటరీ) Dual nature ని కలిగి ఉన్నది అని అంటారు. ఈ సౌకర్యం వల్లనే మనం ప్రాణాయామం చేయగలం.

శ్వాస ద్వారా మనం గ్రహించే ఆక్సిజన్‌ ‌తక్కువ ఉండటంవల్ల జీవక్రియలు మందగిస్తాయి. ప్రాణాయామంలోని దీర్ఘ శ్వాసక్రియ వలన అవి చైతన్యవంతమవుతాయి. నిమిషానికి 16 నుంచి 18సార్లు తీసుకునే సాధారణ శ్వాసక్రియ ప్రాణాయామ అభ్యాసం వల్ల క్రమంగా తగ్గి ఆక్సిజన్‌ ‌వినియోగం పెరుగుతుంది.

దీనివలన వంద ట్రిలియన్‌ ‌జీవకణాలకి జరుగవలసిన ఆహారపదార్థాల సరఫరా, టాక్సిన్ల సేకరణ చక్కగా జరిగి Aging Process నిదానమవుతుంది. దీనివలన వ్యక్తి చురుకుగా, ఆరోగ్యంగా ఉంటాడు. ఒత్తిడిలేని దీర్ఘశ్వాసల ద్వారా చేసే ఈ ప్రాణాయామం వలన శరీరంలో నిరంతరం పేరుకుపోతూ ఉండే మాలిన్యాలు బయటకు పోతాయి. కొన్ని చెమటరూపంలో, కొన్ని బహిశ్వాసతోపాటు తొలగిపోతాయి. శ్వాస గతి స్థిరంగాను, నిలకడగానూ ఉంటుంది. అంతేగాక ఈ ప్రాణాయామం ప్రత్యక్షంగా న్యూరో హార్మోనల్‌ ‌వ్యవస్థలపైన పనిచేసి వాటికి తగిన విశ్రాంతిని కలుగజేస్తుంది.

నడవడిలోని మాలిన్యం పోవటానికి యమ, నియమ, ప్రత్య హారాలు: నడవడిలో మాలిన్యాన్ని తొలగించుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దానికి పతంజలి సూచించిన మార్గాలే యమ, నియమ, ప్రత్యాహారాలు.

యమ: ఈ అంగంలో ఐదు రకాలయిన వ్రతాలను పాటించాలని పతంజలి సూచిం చారు.అవి:
1. అహింస : భయం, క్రోధం, వీటికి మూలాలు. వీటిని వదిలివేసినట్లయితే హింసా ప్రవృత్తి మనసు నుండి వైదొలగి వ్యక్తి ఆరోగ్య వంతుడవుతాడు.
2. సత్యం : సాధ్యమయినంతవరకు సత్యాన్నే చెప్పడం వలన వ్యక్తికి బలం చేకూరుతుంది. సత్యాన్ని పలకటం అంటే, తన అభిప్రాయాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు మాటలో మోసం కాని, భ్రాంతి కాని, అర్థంకాకుండా ఉండటం కానీ ఉండకపోవటం.
3. అస్తేయం : ఇతరుల వస్తువులను తీసుకోకపోవటం, వాటి మీద ఆసక్తి లేకపోవటం.
4. బ్రహ్మచర్యం : అంటే మైథునంను త్యజించటం.
మనసు, వాక్కుల ద్వారా జరిగే సమస్త మైథునాలను త్యజించటం. ఇది వీర్య రక్షణ చేస్తుంది. కామోద్దీపనం కలిగించే ఆహారం తీసుకోకూడదు. కామ ప్రకోపాన్ని కలిగించే దృశ్యాలు చూడరాదు. అటువంటి మాటలు వినరాదు. అటువంటి సాహిత్యం చదవకుండా ఉండటం. ఆ విధమయిన భావాలు మనసులో రాకుండా ఉండటం బ్రహ్మచర్యమవుతుంది.
5. అపరిగ్రహం : ఆరాటపడటం, కావలసినదానికంటే ఎక్కువగా కూడ బెట్టడం, ఈ ఒక్క దానిపట్ల నియంత్రణ లేక నేడు అధికశాతం మానవులు అనారోగ్యం పాలవుతున్నారు.

నియమాలు : ఈ అంగంలో ఐదు తప్పనిసరిగా పాటించవలసిన పక్రియలను చెప్పారు పతంజలి.
6. శౌచం : అంటే శుభ్రత. నేటి విపత్కర పరిస్థితులలో ఈ విషయం పట్ల మనం చూపే శ్రద్ధనే మనల్ని ‘‘కరోనా’’ వంటి రోగాల నుంచి కాపాడుతుంది. శౌచం, బాహ్య శౌచమని, అంతర శౌచమని రెండు రకాలు. బాహ్యశౌచం శరీర శుభ్రతకి సంబంధించింది. అంతఃశౌచం – రాగద్వేషాలను తొలగించుకోవటం. దీనివలన మనసు స్వచ్ఛమై అందరి ఎడల ప్రీతిని కలిగి ఉంటుంది. ఇటువంటి శౌచాన్ని పాటించటం వలన వ్యక్తి శరీరం, మనసు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి.
7. సంతోషం : తనకు లభించిన దానితో తృప్తిని కలిగి ఉండే గుణం. ఇది లేని కారణంగా నేడు మనలో అనారోగ్యం ప్రబలుతున్నది. అందరం తప్పక అలవర్చుకోవలసిన గుణం ఇది.
8. తపస్సు : ఆకలి – దప్పిక శీతలం – ఉష్ణం, స్థాన (నిలబడటం) – ఆసనాలు (కూర్చోవటం) వంటి ద్వంద్వములను సహించటం, ఈ లక్షణములు కలిగిన నాడు వ్యక్తి తాము తపించే పనిలో లీనమవుతాడు. దీనివలన విజయం కలుగుతుంది.
9. స్వాధ్యాయం : ఓంకార జపం లేదా మోక్షమార్గం చూపే శాస్త్రాల పఠనం.
10. ఈశ్వర ప్రణిధానం : మనం చేసే పనులని పరమేశ్వరునికి సమర్పించటం. ఈ భావన లేకపోవడంతోనే మనిషి అంతా తానే అయినట్టు కర్మతో అనుబంధం ఏర్పరచుకొని, ఎలా బయట పడాలో తెలియక అనారోగ్యం పాలవుతున్నాడు. దీనిని ఈశ్వరునికి అర్పించటం వల్ల వ్యక్తి తాను చేసే పనిలో నిపుణతను పెంచుకోగలడు.

ప్రత్యాహారం: ఇంద్రియాలు తమ తమ లక్షణాలతో సంబంధం కోల్పోవడమే ప్రత్యాహారం. మనకి అయిదు జ్ఞానేంద్రియాలున్నాయి. అవి, జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడే మాధ్యమాలు. రూపాలను గ్రహించడానికి కన్ను, శబ్దాలను గ్రహించటానికి చెవి, వాసనలను గ్రహించటానికి ముక్కు, రసము / రుచిని గ్రహించటానికి నాలుక, స్పర్శను గ్రహించటానికి చర్మం. ఐదు కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి. వాక్కుకి వచనం / మాట్లాడటం, పాదానికి సంచారం, హస్తానికి గ్రహణం / తీసుకోవడం, వాయువుకు జీర్ణమయిన ఆహారాన్ని విసర్జించటం, ఉపస్థకు సంతానాన్ని కలుగజేయటం.

11. చివరిది మనస్సు. ఈ పదకొండు ఇంద్రియాల ద్వారా మనిషి జీవనం సాగదీస్తుంటాడు. ఇంద్రియ కార్యకలాపాలను ధర్మంతో సరిచేసుకొంటూ నిగ్రహాన్ని కలిగి ఉండినప్పుడు మనసులో ప్రశాంతత ఉంటుంది. అది లేనినాడు కనపడిన / విన్న / తిన్న / తాకిన ప్రతి విషయం మనలని తనవైపుకు లాగి పొందేలా చేస్తుంది. బలహీనమయిన మనసు దురలవాట్లకు దారి తీస్తుంది. ఇంద్రియాలు బుద్ధి అధీనంలో ఉండాలి కానీ బుద్ధి ఇంద్రియ అధీనంలో ఉండకూడదని యోగశాస్త్రం చెబుతుంది.

మనోమాలిన్యం పోవటానికి ధారణ, ధ్యాన, సమాధి: ధారణ: ధారణ అంటే బ్రహ్మమును (ఈశ్వరుని అనుకోవచ్చు) హృదయపద్మములో ధరించుట. ఇది మనో స్థితి. ధ్యానం బ్రహ్మ ఆత్మల గురించిన గురించిన చింత . ఇది సాధన. (ప్రగతితో కూడిన గతి) .గమ్యం సమాధి. అహంబ్రహ్మ తత్త్వం అనుభవంలోనికివచ్చే స్థితి. ధ్యానము : ధ్యేయ వస్తువుపై మనసును లగ్నముచేసి, అన్య పదార్థములను గమనించక, నిశ్చలమైన మనసుతో (చిత్తముతో) ధ్యేయ వస్తువైన ఈశ్వరుని గురించిన చింతలో ఉండుటయే ధ్యానము. సాధనా పూర్వకముగా పొందిన ద్వైత రహిత స్థితి సమాధి. (జీవుని ఈశ్వరుని వేరుగా భావించుట ద్వైతము, వానిని ఒకే వస్తువుగా అనుభవైంచుట అద్వైత సిద్ధి, అదే సమాధి స్థితి. సమాధి : నిత్యమూ శుద్ధమైన బుద్ధితో కూడి, సత్యమైన ఆనందముతో కూడిన తురీయ (మెలకువ, నిద్ర, స్వప్న స్థితులకు అతీతమైన) స్థితిలో ఏకము, అక్షరము (శాశ్వతము) ఐన నేను ఉన్నాను (అహమస్మి) అనే బ్రహ్మ భావనలో అహంబ్రహ్మాస్మి (నేనే ఆ బ్రహ్మమును) అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.

పైన వివరింపబడిన అష్టాంగ యోగా సూత్రాలను పాటించినట్లయితే అందరమూ ఆనందముగా జీవించవచ్చు..‌


Why is June 21 yoga day?, ఎందుకు జూన్ 21 యోగా రోజు? International Day of Yoga

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment

  1. It is not reflecting. Patanjali yogadarsanam it is refleting

    ReplyDelete