ప్రతిజ్ఞ రూపశిల్పి: పైడిమర్రి వెంకట సుబ్బారావు జూన్10,1916న నల్లగొండ జిల్లా అన్నెపర్తిలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా నల్ల...
ప్రతిజ్ఞ రూపశిల్పి: పైడిమర్రి వెంకట సుబ్బారావు జూన్10,1916న నల్లగొండ జిల్లా అన్నెపర్తిలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా నల్లగొండ జిల్లాలోనే సాగింది. ఆయనకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లిషు, అరబిక్ భాషల్లో ప్రావీణ్యం ఉంది. హైదరాబాద్ ట్రెజరీ శాఖలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన పైడిమర్రి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఖమ్మం, నిజామాబాద్, నెల్లూరు తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 1962లో భారత్-చైనా యుద్ధం సందర్భంగా తమ దేశంలోని పిల్లలందరికీ ప్రాథమిక దశ నుంచే దేశభక్తిని పెంపొందించాలని చైనా నిర్ణయించింది. ఆ విషయాన్ని గుర్తించిన పైడిమర్రి మన దేశ బాలలందరి గుండెల్లో దేశ భక్తిని నింపాలన్న కాంక్షతో భారత దేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ రాశారు. ఆ రచనను చదివి ఉప్పొంగిన సాహితీవేత్త తెన్నేటి విశ్వనాథం, ఆ విషయాన్ని నాటి విద్యాశాఖ మంత్రి పీవీజీ రాజు దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రతిజ్ఞ ఔన్నత్యాన్ని వివరిస్తూ రాతప్రతిని అందజేశారు. ఆ తర్వాత బెంగళూరు వేదికగా జరిగిన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో దాన్ని జాతీయ ప్రతిజ్ఞగా గుర్తించారు. దేశంలోని 9 భాషల్లో అనువదించి అన్ని పాఠశాలల్లో ఆ ప్రతిజ్ఞను పిల్లలతో నిత్యం చదివించాలని ఆదేశాలు జారీ చేశారు. జనవరి 26, 1965 నుంచి ప్రతి పాఠశాలలో విద్యార్థులతో ఆ ప్రతిజ్ఞ చేయించడం అధికారికంగా మొదలైంది.
రచనా ప్రస్థానం: పైడిమర్రి వెంకటసుబ్బారావు తన 18వ ఏట ‘కాలభైరవుడు’ నవల రాశారు. ‘దేవదత్తుడు’, ‘తులసీదాసు’, ‘త్యాగరాజు’ మొదలైన పద్యకావ్యాలు రచించారు. ‘బ్రహ్మచర్యం’ వంటి పలు నాటకాలతోపాటు వెట్టిచాకిరీని నిరసిస్తూ ఎన్నో కథలు ఆయన కలం నుంచి జాలువారాయి. ‘గోలకొండ’, ‘సుజాత’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆనందవాణి’ తదితర పతిక్రల్లో పైడిమర్రి రచనలు ప్రచురితమయ్యాయి. 1945లోనే ‘ఉషస్సు కథలు’ సంపుటిని రచించి తొలి తరం కథారచయితగా నిలిచారు. పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞ అన్ని భారతీయ భాషల్లో అనువాదమైనా.. ఆయన పేరు ఎక్కడా ప్రచురించకపోవడం గమనార్హం. పొరుగు రాష్ట్రాల వారు గుర్తించకపోయినా... ఇప్పుడు స్వరాష్ట్రంలో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక పునర్నిర్మాణ దిశలో పాఠ్యపుస్తకాల్లో రచయిత పరిచయం చేశారు. రచయిత జీవితాన్ని తీసుకురావటంలో శ్రీ రాంప్రదీప్ గారి చొరవ చాల ఉంది.
కొస మెరుపు: ఇంతగొప్పప్రతిజ్ఞని తెలంగాణలోని కొన్నిపాఠశాలల్లో పాడటంలేదు.
No comments