అంటరానితనం ఎలా వచ్చింది?: భారతీయ సమాజం, ధర్మం, సంప్రదాయాలు ప్రాతినిధ్యం వహించే విలువలకు, ఆదర్శాలకు మూర్తీభవించిన వ్యక్తి శ్రీరామ...
అంటరానితనం ఎలా వచ్చింది?:
భారతీయ సమాజం, ధర్మం, సంప్రదాయాలు ప్రాతినిధ్యం వహించే విలువలకు, ఆదర్శాలకు మూర్తీభవించిన వ్యక్తి శ్రీరాముడు. రామాయణమనే ఆదికావ్యాన్ని రచించటం ద్వారా వాల్మీకి మహర్షి రాముని జీవితంలోని ఆదర్శాలను ఎల్లకాలాలకు ప్రజలకు తెలియజెప్పారు. రామనామం వల్ల అతి సాధారణ మానవుడు కూడా అందరికీ దారి చూపే దీపంగా ఎలా మారగలడో చెప్పడానికి వాల్మీకి జీవితమే నిదర్శనం. అయితే విచిత్రమేమంటే, ఆ వాల్మీకి మహాముని వారసులైన వాల్మీకి కులజులను అంటరానివారిగా చూసే దౌర్భాగ్య పరిస్థితి నేడు ఏర్పడింది. ఇది ఎలా జరిగింది?
నిజానికి వాల్మీకి సమాజానికి చెందినవారు స్వతహాగా క్షాత్రవృత్తిలోని వారు. చరిత్రకారులు కొందరు చెప్తున్న ప్రకారంగా ఏదో ఒక యుద్ధంలో మహమ్మదీయులది పై చేయి అయినపుడు తమ అధీనంలోకి వచ్చిన హిందూ యోధులకు రెండు ప్రత్యామ్నాయాలు చెప్పి ఏదో ఒకటి ఎంచుకొనే విధంగా బలవంతపెట్టారు. ఒకటి ఇస్లాంను అనుసరిస్తూ వారితో కలసిపోవటం, రెండవది పాకీ పనివారుగా మరుగుదొడ్లను శుభ్రం చేయటం. అటువంటప్పుడు చాలామంది ఉన్నత కులాలవారు ఇస్లాం స్వీకరించగా, తమ ధర్మాన్ని పరిత్యజించడానికి ఇష్టపడని యోధులనేకులు ఇలాంటి వృత్తులు చేయడానికి సిద్ధపడవలసి వచ్చేది. మొహంజోదారో, హరప్పా, కాళి బంగన్, లోథాల్ మొదలైన ప్రాచీన నాగరికతా శిథిలాలలో మనకు అనేక భవనాలు, స్నానఘట్టాలు, రహదారులు, మైదానాలు వాటి అవశేషాలు కనిపిస్తాయేగాని, ఎక్కడా నిర్మాణం చేసిన మరుగుదొడ్ల అవశేషాలు కనిపించవు. ఎందుకంటే ఆ రోజులలో ఇంటినుండి గ్రామానికి దూరంగా దగ్గరలో ఉండే అడవిలో లేదా తోటలలోకి బహిర్భూమికి వెళ్ళటమే అలవాటుగా ఉండేది. ముస్లిం స్త్రీలు అంతః పురాలను, ఇండ్లను దాటి బయటకు రాని విధంగా ఘోషా పద్ధతి అమలులో ఉన్న కారణంగా మహమ్మదీయుల పాలనా కాలంలోనే మరుగుదొడ్లను శుభ్రపరచి మలాన్ని ఎత్తి బయటకు తీసికొనిపోయే పద్ధతి వచ్చింది.
ధర్మరక్షణకై అలా అగచాట్లు పడిన వారిపట్ల ఉన్నతమైన గౌరవాన్ని చూపవలసి ఉండగా, హిందూ సమాజం వారిని నికృష్టులుగా చూడనారంభించటం చాలా శోచనీయం.
నేటి వాల్మీకులలోని కొన్ని వంశనామాలు, ఉన్నత కులస్థులలో ఉండే వంశ నామాలతో సరిపోవటాన్ని దీనికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఉదా - చౌహాన్, గెలాట్, కచ్చవాయ రాజపూత్, చందేల్, పవార్, వైద్య వగైరా... కనీసం ఇప్పుడైనా మానవ మలాన్ని నెత్తిన మోసే పద్ధతులకు స్వస్తి చెప్పవలసి ఉంది. యాంత్రిక వ్యవస్థల ద్వారా ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రవేశపెట్టి, ఆ పనులను చేసేవారిని సాంకేతిక వృత్తి నిపుణులుగా గుర్తించాలి. సేకరణ: హిందూ నగారా మాస పత్రిక
No comments