పావురాలు రోగాల రాయబారులు ప్రజారోగ్యానికి పావురాల చేటు ఇన్‌ఫెక్షన్లకు వాహకాలు శ్వాస సమస్యలతో జనం ఉక్కిరిబిక్కిరి రోగనిరోధకశక్తి...
పావురాలు రోగాల రాయబారులు
ప్రజారోగ్యానికి పావురాల చేటు
ఇన్‌ఫెక్షన్లకు వాహకాలు
శ్వాస సమస్యలతో జనం ఉక్కిరిబిక్కిరి
రోగనిరోధకశక్తి తగ్గినవారిపై మరింత దుష్ప్రభావం
హైదరాబాద్ సహా పలు నగరాల్లో వీటి ఉద్ధృతి
పెంచి పోషించొద్దు అంటున్న నిపుణులు
హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ తరచూ దగ్గు, శ్వాస సమస్యలతో ఇబ్బందులు పడుతూ వైద్యున్ని సంప్రదించారు. వైద్యులు యాంటీబయాటిక్స్ ఇచ్చినా ఫలితం లేదు. చివరకు శ్వాసకోశ నిపుణులను సంప్రదించగా రోగ చరిత్రను ఆమూలాగ్రం పరిశీలించారు. ఆమె ఇంటి గోడలపైనా, ఏసీ బిగించిన చోటా పావురాలు కూర్చుంటాయని, అక్కడే దుస్తులు ఆరేస్తుంటారనే అంశాలు వెలుగులోకి వచ్చాయి. వైద్యుడి సలహా మేరకు పావురాలు రాకుండా ఇనుప జల్లెడలు అమర్చారు. దీంతో స్వల్పకాలంలోనే ఆమెకు దగ్గు, ఆయాసం తగ్గుముఖం పట్టాయి.
ఒకప్పుడు సమాచారాన్ని చేరవేసి రాయబారుల పాత్ర పోషించిన పావురాలు ఇప్పుడు ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తికి వాహకాలుగా పనిచేస్తున్నాయి. పాతికేళ్ల కిందట హైదరాబాద్‌లో పావురాలంటే మక్కామసీదు వద్దే ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్ తదితర ప్రధాన నగరాల్లోనూ కపోతాల ఉద్ధృతి విపరీతంగా పెరిగిపోయింది. వీటి జీవితకాలం 10-12 ఏళ్లు. మూణ్నాలుగు నెలలకోసారి గుడ్లు పెట్టేస్తాయి. ఏ ప్రదేశంలోనైనా పొదగగలవు. ఒక జంట పావురాలు ఏడాదిలో మరో 18 పావురాలకు జన్మనిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
వ్యాధుల వ్యాప్తిలోనూ..
కపోతాల్లో ప్రత్యేకంగా మూత్రకోశం ఉండదు. అందువల్ల దీని విసర్జనలోనే మలమూత్రాలు రెండు ఉంటాయి.
పావురాల విసర్జకం అత్యంత ప్రమాదకరమైంది. ఎండిన రెట్ట నుంచి ఇన్‌ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు గాల్లో కలిసిపోయి, శ్వాస ద్వారా మనుషుల్లో చేరిపోతాయి. అందుకే వీటిని సానుభూతితోనో, సరదాకో చేరదీస్తే ప్రజారోగ్యానికి చేటే.
వీటి రెక్కల నుంచి ఈకల ద్వారా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఏసీల్లోకి చేరతాయి. ఆ గాలిని పీల్చుకోవడం ద్వారా వ్యాధిగ్రస్తులవుతున్నారు.
కపోతాల రెక్కల నుంచి సన్నని పేనును వ్యాపింపజేస్తాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా పావురాల రెక్కలు, రెట్టల్ని తాకకూడదు. ఇలా తాకినప్పుడు చేతులు కడుక్కోకుండా ముక్కు, జననేంద్రియాలు.. ఇలా అవయవాల దగ్గర తాకితే అక్కడ కూడా ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి.
చేతికి తొడుగులు, ముక్కుకి అచ్చాదన ధరించి మాత్రమే తొలగించాలి.
ఎక్కువ బాధితులు ఎవరంటే?
ఏసీలు ఉపయోగించేవారు, మరమ్మతు చేసేవారు
పాత భవనాలను కూల్చివేసే కార్మికులు, తోటమాలీలు
హెచ్‌ఐవీ, మధుమేహం, తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అవయవ మార్పిడి చేయించుకున్నవారు, స్టెరాయిడ్లు తీసుకునేవారు. జబ్బును గుర్తించడం ముఖ్యం. -డాక్టర్ శుభాకర్, శ్వాసకోస వ్యాధుల నిపుణులు
సాధారణంగా దగ్గు, తలనొప్పి, బాగా నీరసంగా ఉండడం, జ్వరం వంటి న్యుమోనియా లక్షణాలతో కనిపిస్తారు. బ్యాక్టీరియా కారక న్యుమోనియా అనుకొని చికిత్స చేస్తుంటారు. కానీ తగ్గదు. ఇలాంటప్పుడే పావురాల ఫంగస్ కారక న్యుమోనియా అయి ఉండవచ్చేమోనని అనుమానించాలి. ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలే కాకుండా కన్ను, మెదడు, నోరు, జీర్ణాశయ, కామెర్లు, జననేంద్రియ సమస్యలూ, బర్డ్‌ఫ్లూ వంటి ప్రమాదకర ఇన్‌ఫెక్షన్లూ పావురాల ద్వారా వ్యాప్తి చెందే ప్రమాదముంది. జీవవైవిధ్యంలో అసమతుల్యత. -డాక్టర్ హంపయ్య, జీవవైవిధ్య మండలి మాజీ ఛైర్మన్
ఇతర పక్షులు తినే ఆహారాన్ని కూడా పావురాలే తింటున్నాయి. దీంతో పిచ్చుకలు, చిలకలు, కాకులు, కోయిలలు వంటి ఇతర పక్షి జాతులకు ఆహారం లభించడం లేదు. మంద బలమున్న పావురాలు ఇతర పక్షిజాతులు కనిపిస్తే వాటిని తరిమి కొడతాయి. ఈ పరిస్థితుల్లో జీవవైవిధ్యంలోనూ అసమతౌల్యం ఏర్పడుతోంది. ఇది పర్యావరణానికి ప్రమాదమే. ఈనాడు లో వచ్చిన ప్రత్యేక కథనం ఇది చాలా పాతది, ఈ పావురాల వలన చాలా సమస్యలు ఉన్నాయని చెప్పడం కోసం కొన్ని మార్పులతో మీకందించడం జరిగింది. అయితే ఇది వచ్చి సుమారు 5 ఏళ్ళపైన అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మహా నగరాలలో కోట్ల సంఖ్య లో పావురాలు పెరిగాయి. అధికారులు దిక్కుతోచక ప్రస్తుతం పావురాలకు ఫ్యామిలీ ప్లానింగ్ చేసే దిశలో ఉన్నారు. మన దేశీయ పిట్టల్ని కాపాడుకోవాలంటే ఈ పావురాలను తరిమికొట్టాలి అప్పుడే మన ఆరోగ్యానికి మంచిది. ఆలోచన చేయండి, పావురాలకు నీళ్ళు పెట్టకండి పక్షులు వాటి నీరు ఆహారం అవే వెతుక్కుంటాయి. నేను చెప్పేది మీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ అదే వాస్తవం. రాజశేఖర్ నన్నపనేని.
మంచి సమాచారం అందించారు
ReplyDelete