Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు రెండు సూచనలు - Dear Parents and Teachers Please think about students future - megamind

దో టూక్ బాత్ - మీతో రెండు ముక్కలు చెప్పనివ్వండి (విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేకం) మన ఉపాధ్యాయులు చాలామంది పుస్తకంలో...


దో టూక్ బాత్ - మీతో రెండు ముక్కలు చెప్పనివ్వండి (విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేకం)
మన ఉపాధ్యాయులు చాలామంది పుస్తకంలో ఉన్నది చెప్పటమే తమ పని అనుకుంటారు. కాని మంచిపేరు తెచ్చుకున్న ఉపాధ్యాయుల పనితీరును పరిశీలిస్తే Text is only a pretext అనీ, Teach as if you are teaching nothing అనీ రెండు గొప్పసూత్రాలను అమలుచేసినవారని గ్రహించ గల్గుతాం.

మొదటివిషయం: పాఠ్యపుస్తక రచయిత తన సౌలభ్యాన్ని అనుసరించి వ్రాసిన విషయాలను మనం ఆకళించుకోవటమేగాక, వాటిని మన విద్యార్థుల స్థాయికి, వాతావరణానికీ తగినట్లుగా అనువదించు కోవాలి. ముప్పైమంది ఉన్న తరగతికి పాఠం చెప్పటం గాక తరగతిలోని ముప్పై మందిలో ప్రతి ఒక్కనికీ అర్థమయ్యేలా చెప్పాలి. వారిలో పొడసూపే సందేహాలు తీరాలి. మీరు విషయాన్ని వివరించిన తర్వాత వారిలో అంతర్మథనం జరగాలి. వారికి ఇప్పటివరకు తెలిసి ఉన్నవిషయాలకు, ఇప్పుడు మీరు చెప్పుతున్న విషయానికీ తేడా ఉన్నట్లుగా తోచినట్లయితే ఏవిద్యార్థి ఐనాసరే లేచి ప్రశ్నించే స్వేచ్ఛ ఉండాలి.

ఒక్కొక్కసారి వారు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు, అక్కడికక్కడే మీరు జవాబు చెప్పలేకపోవచ్చు.(అదేమీ తప్పుకాదు, మీరు కించపడనక్కరలేదు) ఆ విద్యార్థి సందేహాన్ని మరునాడైనా తీర్చడానికి ఎంత అధ్యయనం చేయాలో అంత చేయాలి. గ్రంథాలను‌, తోటి ఉపాధ్యాయులను సంప్రదించవచ్చు. ఒక్కొక్కసారి మీకంటే ఎక్కువ చదివినవారు, ఎక్కువ అనుభవం ఉన్నవారు మరెవరూ మీ గ్రామంలో లేనిస్థితి ఉండవచ్చు. అయినా దొరికినవారితో చర్చించండి. సమస్య ఏమిటో వారికి వివరించే ప్రయత్నంలో మీ సమస్యకు సమాధానం మీకే స్ఫురిస్తుంది. ఈవిధంగా పరీక్షలలో అడిగే ప్రశ్నలకే పరిమితం కాకుండా విద్యార్థులకు వివిధ విషయాలను గూర్చి లోతుగా తెలియపరిచేందుకు మీరు కృషిచేస్తే మిమ్ములను మీ విద్యార్థులెవరూ జీవితంలో మరచిపోవటం ఉండదు. మీ తరగతి విద్యార్థులు అనుత్తీర్ణులు కావటమూ ఉండదు.

రెండవ విషయం: చాలామంది విద్యార్థులకు పాఠ్యవిషయాలపై ఆసక్తి ఉండదు. తల్లిదండ్రుల పోరు భరించలేక బడికి వస్తుంటారు. వారు పరీక్షలలో ఉత్తీర్ణులు కావటమే లక్ష్యంగా మీరు బోధించదలిస్తే వారు భరించలేరు. నీటి కుళాయి క్రింద కుండను బోర్లించి పెట్టితే ఫలితం మన ఊహకు అందనిది కాదుగదా! ఒక్క చుక్క కూడా కుండలో చేరదు. మీ విద్యార్థులను అటు వంటి దుర్భరస్థితికి పోనీయవద్దు. పంచతంత్రం రచించిన విష్ణుశర్మ చదువు పట్ల ఏమాత్రం ఆసక్తిలేని రాజకుమారులను ఏవిధంగా రాజనీతి విశారదులను చేశాడో ఆ నమూనాను మనం ఎన్నటికీ విస్మరించరాదు. ఆరోజున దేశంలోనో, గ్రామంలోనో జరిగిన ఒక సంఘటనతో మొదలుపెట్టి కబుర్లు చెప్పటం మొదలు పెట్టవచ్చు. లేదా వారు అంతగా విని ఉండని, పొడుపు కథతోనో, సామెత తోనో మొదలుపెట్టవచ్చు. ఆసక్తి రగిలించటమూ, ఆలోచింపచేయటమూ అనివార్యంగా జరగాలి. విద్యార్థులు అహమహమిక (నేనంటే నేను అంటూ) తో ముందుకు త్రోసుకు వచ్చేస్థితి నిర్మాణం కావాలి. అప్పుడు మీరుచెప్పేవిషయాన్ని శ్రద్ధగా వింటారు. బుర్రకెక్కించుకుంటారు. ఆ జ్ఞానాన్ని ఎప్పుడు వినియోగిద్దామా అని ఎదురు చూస్తుంటారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తన తండ్రి (వారిపేరు యోగి గారు) గురించి ఒకమాట వ్రాశారు. "ఒరేయ్, కూర్చుని చదువుకోరా" అని ఆయన ఎన్నడూ అనలేదట. "పోయి ఆడుకో నాన్న!" అనేవారట. సృజనశక్తిని పెంచే విధానం అది. ఈ దిశలో ఆలోచించండి. మనదేశంలో విద్యా వ్యవస్థ వైఫల్యాలకు ఎన్నెన్నో కారణాలు, కారకులూ ఉంటే ఉండనివ్వండి. కాని అలా కారకులౌతున్న వారిలో నీవు (స్పష్టతకోసం ఏకవచనం వాడుతున్నాను- మీరు అనటమే నా స్వభావమైనా) ఉండకూడదని గట్టిగా సంకల్పించుకోండి. డా|| వడ్డి విజయసారధి.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments