1956 విజయదశమినాడు నాగపూర్ లోని దీక్షాభూమిలో బౌద్ధమతాన్ని స్వీకరిస్తూ డా. బాబాసాహబ్ ఆంబేడ్కర్ చేసిన ఉపన్యాసం.(సంక్షిప్తంగా తెలుగు అనువాదం...
1956 విజయదశమినాడు నాగపూర్ లోని దీక్షాభూమిలో బౌద్ధమతాన్ని స్వీకరిస్తూ డా. బాబాసాహబ్ ఆంబేడ్కర్ చేసిన ఉపన్యాసం.(సంక్షిప్తంగా తెలుగు అనువాదం): ఈ నగరం ఆర్.ఎస్.ఎస్. కార్యకలాపాలకు కేంద్రంకావటం వల్ల వారికళ్ల ముందు బ్రహ్మాండమైన పని ఏదో చేసిచూపాలని నేను అనుకొని కావాలనే ఈస్థలాన్ని నిర్ణయంచేశానని కొందరనుకొంటున్నారు. కాని ఇది నిజంకాదు. నాకలాంటి ఉద్దేశమేదీ లేదు... నాగపూర్ లో ఇదే రోజున రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం వారు ఊరేగింపు ఒకటి జరిపిస్తున్నారు కాబట్టి నేను ఇదే స్థలాన్ని, ఇదేసమయాన్ని దీక్షగైకొనడానికై ఎంచుకొనడానికి మరో కారణమని, అంత బ్రహ్మాండంగా దీక్షోత్సవం జరిపి, ఎదురుదెబ్బతీయాలని ఉద్దేశ పడ్డానని కొందరు అనుకొంటున్నారు. కాని, అది నిజంకాదు. అర్ధాంతరంగా మనం ఆర్. ఎస్.ఎస్.తో మనం ఎందుకు పోట్లాడాలి? నా భుజస్కంధాల మీద పెట్టుకున్నఈ మహత్కార్యం ఎంత ముఖ్యమైన దంటే, గడచిపోయే ప్రతినిమిషమూ నాకెంతో అమూల్యమైనదవుతున్నది. ఈ చారిత్రాత్మకమైన ఉత్సవానికి ఈ స్థలాన్ని ఎంపికచేయటంలో ఆర్.ఎస్.ఎస్. మాట నాకు తట్టనే లేదు.
మనకోసం శాసనసభలలో కొన్నిసీట్లు కేటాయించారు గదా, వాటిని అనవసరంగా ఎందుకు వదులుకుంటారని కొందరు అడుగుతున్నారు. ఏవో నాలుగు డబ్బులు సంపాదించటం కంటే ఆత్మగౌరవం చాలా ముఖ్యం. మన పోరాటం మర్యాదకోసం. ఆత్మగౌరవం కోసం. కేవలం ఆర్థికమైనపురోగతి ఒక్కదాని కోసమే కాదు.
బొంబాయిలో వ్యభిచారిణులు, వేశ్యలూ నివసించే ప్రాంతం ఒకటి ఉంది. శరీరాలు అమ్ముకొనే ఆ స్త్రీలు ఉదయం ఎనిమిది గంటలకు లేచి, మొహల్లాలో ఉండే చౌకబారు ఫలహారశాలల్లో పనిచేసే ముస్లిం కుర్రవాళ్ళను పిలుస్తారు. "ఓ సులేమాన్, ఓ సులేమాన్" అని కేకవేసి "ఖైమా రొట్టి తీసికొని రా" అంటారు. మరి మాస్త్రీలకు ఖైమారొట్టీ దొరకవు. ఇక్కడకు వచ్చిన స్త్రీలలో చాలామందికి రోజూ ఒకపూటైనా అన్నమే దొరకదు. మామూలు రొట్టీ, చట్నీతిని సంతృప్తి పడవలసిందే. కావాలనుకుంటే వారూ అటువంటి కళంకితమైన, పాపభూయిష్ఠమైన జీవితాన్ని గడుపుతూ ఐశ్వర్యం సంపాదించగలరు. కానీ, వీరంతా మర్యాద, పరువు, ఆత్మగౌరవం ఎక్కువగా చూసుకుంటారు. మర్యాద,ఆత్మగౌరవం కోసమే మేము పోరాటం సల్పుతున్నాం.
గౌరవప్రదమైన జీవితాన్ని గడపటం మానవునికి పుట్టుకతో వచ్చిన హక్కు. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం మేము చేయగలిగింది చేయాలి. ఇంతవరకు హిందువులు మాకు లేకుండా చేసిన మానవ మర్యాద కోసం మేము పెనగులాడుతున్నాం.
బౌద్ధాన్ని స్వీకరిస్తున్నపుడు ఎన్నో విషయాలను మనం త్యాగం చేయవలసివస్తుంది. అయితే సీట్ల కేటాయింపు మొదలైన సౌకర్యాలను, హక్కులనూ పొందగలిగిన సమర్థత, ఉన్నవాటిని నిలుపుకొనే శక్తీ నాకున్నాయి. పరిస్థితిని ఎదుర్కొనడానికి నేను సిద్ధమై ఉన్నాను. మానవాళి పురోగతికి మతం - మరీ స్పష్టంగా చెప్పా లంటే ధర్మం ఎంతో అవసరం. కార్ల మార్క్స్ అనుయాయులు కొందరు మతం నల్లమందు లాంటిదని నమ్ముతారు. "తిను, త్రాగు, ఆనందించు" అనే సూక్తిని అనుసరిస్తారు. వారికి కావలసిందల్లా ఉదయం చద్దిసమయానికి వెన్న,రొట్టె. మధ్యాహ్నం కోడికూరతో కూడిన భోజనం, హాయిగా పవళించడానికి మెత్తని పరుపు, కాలక్షేపానికి సినిమా. వారి జీవితాలలో మతానికి, ధర్మానికీ తావులేదు. వారితో నేను ఏకీభవించలేను. నాతండ్రి పేదరికం కారణంగా ఈ భోగాల ననుభవించే అవకాశం నాకు లేక పోయింది. జీవితంలో చాలాభాగం గడిచిపోయేవరకు నేనెన్నో బాధలు పడ్డాను. ఎంతో పరిశ్రమించాను. కానీ ఇవేవీ నన్ను మత రహితునిగా చేయలేదు.
మనిషికీ జంతువుకీ మధ్య తేడా ఉంది. జంతువుకు బ్రతకడానికి తిండి తప్పించి మరేమీ అక్కర్లేదు. కాని మనిషికి శరీరంతోపాటే చైతన్యవంతమైన మనస్సు కూడా ఉంది. ఈ రెండింటినీ అతడు పోషించాలి. ప్రతిఒక్కరూ గుర్తుంచు కోవలసినదేమిటంటే, రోగాలు రాకుండా మనకు ఆరోగ్య వంతమైన శరీరం ఎలా ఉండాలో, శరీరం ఆరోగ్యంగా ఉండటంకోసం జాగృతి కల మనస్సునీ అభివృద్ధి చేసుకోవాలి.
"ఓహో వీడా, మాలకుఱ్ఱవాడా! వీడుతరగతిలో మొదటిస్థానం ఎలా సంపాదించుకొంటాడు? తరగతిలో మొదటిస్థానం సంపాదించుకోవలసిన అవసరం వీడికేముందసలు? బ్రాహ్మణులకొక్కరికే ఆ హక్కు ఉంది" అని పాఠశాలలో ఉపాధ్యాయు డన్నాడనుకోండి. అటువంటి పరిస్థితులలో మాల కుఱ్ఱవాడికి ఉత్సాహం ఏమిఉంటుంది? ఉత్తేజం ఏమిఉంటుంది? ఆశ ఏముంటుంది? జీవితంలో ఎలా ముందుకు వెళ్లగలడు?
ఒకసారి గాంధీగారిని చూడడానికి వెళ్లాను. చాతుర్వర్ణ విధానంలో తనకు నమ్మకముందని ఆయన నాతో అన్నారు. చిటికిన వ్రేలు క్రిందపెట్టి బొటన వ్రేలు పైన ఉండేలా, నాచేయి చూపిస్తూ, "ఏ రకమైన చాతుర్వర్ణ్యం?" అని అడిగాను. మళ్ళీ బల్లమీద అరచేయి పరచి, ఒకవ్రేలు ప్రక్కన మరో వ్రేలు పరచి ఉండేలా పెట్టి, "చాతుర్వర్ణ్యం అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి? ఎక్కడ మొదలవుతుంది? ఎక్కడ అంతమవుతుంది?" అని అడిగాను. గాంధీ గారు సంతృప్తికరమైన సమాధాన మివ్వలేక పోయారు. ఈ చాతుర్వర్ణ్య సూత్రం ప్రకారం క్షత్రియులొక్కరే యుద్ధం చేయడానికి తగుదురు. క్షత్రియులు హతమార్చబడితే మరెవరినీ సమాయత్త పరచడం గాని, సైన్యంలో చేర్చుకొనడంగానీ జరిగేది కాదు. ఇందువల్లే దేశం ఎన్నోసార్లు దాస్య శృంఖలాబద్ధమైంది. ఆయుధాలు ధరించేహక్కును మననుండి హరించకుండా ఉన్నట్లయితే, ఈదేశం స్వాతంత్ర్యం పోగొట్టుకొని ఉండేది కాదు. దండయాత్రలలో ఎవరూ దీనిని జయించి ఉండేవారు కాదు.
మనం ఎంచుకున్న మార్గంవెంట జంకులేకుండా ముందుకు పోదాం. ఒక క్రొత్త జీవన విధానాన్ని కనుగొన్నాం. దాన్ని అనుసరించి వెళ్దాం. ఈ మార్గం ప్రగతికి దారి తీస్తుంది. నిజానికి ఈ మార్గం క్రొత్తదేమీ కాదు. బయటనుండి అరువు తెచ్చుకొన్నదీ కాదు. బౌద్ధమతం ఇక్కడ తొలగిపోవడానికి ముఖ్యకారణం భారతదేశానికి ముస్లింలు దండెత్తిరావటం, వారు వేలాది విగ్రహాలను విరుగగొట్టి నాశనం చేశారు. విహారాలను అపవిత్రం చేశారు. లక్షలాది భిక్షువులను నరికివేశారు. ఈ పైశాచిక అకృత్యాలకు భయపడి భిక్షువులు పొరుగుదేశాలకు పారిపోయారు.
వేదనను తొలగించివేయడానికి హేతుబద్ధమైన మార్గమే బౌద్ధమతం యొక్క నిజమైన ప్రాతిపదిక వేదన పడుతున్న మానవాళికి విముక్తి కలిగించటమే బౌద్ధమతం యొక్క ముఖ్యోద్దేశం. అటువంటప్పుడు 'దాస్ కేపిటల్' యొక్క అవసరం ఏమిటి? అనే ప్రశ్న వస్తుంది. బుద్ధునికంటే కార్ల్ మార్క్స్ ఎంతో వెనుకబడి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే, మార్క్స్ పుట్టక ముందు సుమారు రెండువేల నాలుగు వందల ఏళ్లక్రిందట బుద్ధుడు ప్రవచించిన దానికంటే క్రొత్తగా మార్క్స్ ఏదీ చెప్పలేదు. ప్రపంచ పరిస్థితులలో ముఖ్యంగా ఈ తరుణంలో ప్రపంచశాంతికి బౌద్ధమతం తప్పనిసరి అవుతుంది.
నేను శాంతికి వ్యతిరేకినని కొందరు చెప్పుతుంటారు. కాని అది నిజంకాదు. నేను శాంతిని కోరేవాడిని. అయితే నేను కోరేది ధర్మంమీద ఆధారపడిన శాంతినే గాని స్మశాన వాటికలో తాండవించే శాంతి కాదు. ధర్మాన్ని మన్నించనంతకాలం ఈ ప్రపంచంలో శాంతి లేదు.
ఈ గొప్ప మతాన్ని ప్రచారంలోకి తేవడానికి మనకు డబ్బు అవసరమౌతుంది. ఏదేశాన్నిగాని ఆర్థిక సహాయం అడిగే ఉద్దేశ్యం నాకు లేదు. ఈ ధర్మం ప్రచారంకోసం మీ మీ ఆదాయాలలో ఇరవయ్యవ వంతు విరాళంగా ఇవ్వడానికి సిద్ధపడాలి. బుద్ధుని సందేశం తీసుకుని ముందుకు సాగిపోండి. జనావళిని విముక్తులను చేయడానికి సాగిపోండి". (డా౹౹అంబేడ్కర్ ను ఎందుకు గౌరవించాలి? ఎలా అనుసరించాలి? గ్రంథం నుండి)
No comments