Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హిందూదేశంలో 1920లో నడయాడిన మహామహులు అరవై మందిని స్మరించుకుందాం- megaminds

హిందూదేశంలో 1920లో నడయాడిన మహామహులు: కాకినాడ నివాసి, నివృత్త ఆంధ్రోపన్యాసకులు అయిన శ్రీ దేవరకొండశేషగిరిరావు గారు ప్రజ్ఞానిధులు,...

హిందూదేశంలో 1920లో నడయాడిన మహామహులు: కాకినాడ నివాసి, నివృత్త ఆంధ్రోపన్యాసకులు అయిన శ్రీ దేవరకొండశేషగిరిరావు గారు ప్రజ్ఞానిధులు, త్యాగధనులూనైన మనదేశభక్తులు అనే పేరుతో 2018 లో ఒక గ్రంథం వెలువరించారు. అందులో నయాన ఆంగ్లేయులను ఒప్పించి హిందూదేశానికి స్వాతంత్ర్యం సాధించదలచిన అరవై మంది ప్రముఖుల గురించిన కలం చిత్రాలు పొందు పరిచారు, ఒకసారి స్మరించుకుందాం.

భారతదేశ వయోవృద్ధ నాయక శ్రేష్ఠులలో ప్రముఖుడైన దాదాభాయినౌరోజి కాంగ్రెసు సంస్థ స్థాపకులలో ముఖ్యుడు. అలాగే కాంగ్రెసు లో ప్రముఖ పాత్ర వహించిన పనప్పాకం ఆనందాచార్యులు 1908లోనే దివంగతుడైనాడు. 1920 నాటికి డా౹౹అనీబిసెంట్ వయస్సు 73 సం.లు. అప్పటికే 1917లో ఒకసారి కాంగ్రెసు వార్షికమహాసభలకు అధ్యక్షతవహించిన వయోవృద్ధ.(ఈమె 86సం.ల వయస్సులో1933లో మరణించింది).

స్వరాజ్యం నాజన్మహక్కు, నేను సాధించి తీరుతాను అనిగర్జించి, 'భారతదేశంలో అశాంతికి జనకుని'గా వర్ణింపబడిన బాలగంగాధర తిలక్ 1920 ఆగస్టు 3న కన్నుమూశాడు. ఆయన అధ్యక్షతన నాగపూర్ లో కాంగ్రెసు వార్షిక మహాసభలు జరుగవలసి ఉన్నవి. హఠాత్తుగా ఆయన మరణించటంతో ఆయన స్థానాన్ని భర్తీచేయడానికి నాగపూర్ నుండి ఇరువురు ప్రముఖులు డా౹౹బాలకృష్ణ శివరామ్ మూంజే, డా౹౹కేశవ బలిరాం హెడగేవార్ పుదుచ్చేరిలో ఉన్న అరవింద మహర్షిని దర్శించి నాగపూర్లో ఏర్పడిన ఆహ్వాన సంఘం తరఫున ఆహ్వాన మందించారు. తాను ఆందోళన రాజకీయాల నుండి విరమించు కొన్నానని, ఆధ్యాత్మిక సాధనలో వ్యస్తమైయున్నాననీ అరవిందయోగి జవాబిచ్చారు. 

అరవిందయోగి తన మార్గాన్ని మార్చుకొనడానికి సిద్ధపడకపోవటంతో వార్షిక మహాసభలకు అధ్యక్షతవహించే భాగ్యం విజయ రాఘవాచారి గారికి లభించింది. నాయక త్రయంగా దేశమంతటా ప్రసిద్ధులైనవారిలో తిలక్ గతించగా, 1920 నాటికి లాలా లాజపతి రాయ్ 55సం.ల వయస్సులో ఉన్నాడు. కార్మి కోద్యమాలలో తలమునకలుగా ఉంటూ మధ్యమధ్య కారాగార యాత్రలు చేస్తూ ఉన్నాడు. బిపిన్ చంద్రపాల్ అప్పటికి 62 సం.ల వయస్సులో ఉన్నాడు. అప్పటి ప్రమాణాలప్రకారం వృద్ధుడైనట్లే.(ఈయన 1932లో మరణించాడు. చివరి పది సంవత్సరాలలో ప్రజాజీవితంలో చురుకుగా లేడు. ఒకవిధంగా విస్మరణకు గురియైనాడు. పదేండ్లు ముందుగా పోయిఉంటే ఇప్పటికంటే ఎక్కువ కీర్తిసంపాదించు కొనేవాడుగదా అన్నవారు లేకపోలేదు).

మోక్షగుండం విశ్వేశ్వరయ్య 60 సం. వయస్సులో ఉన్నాడు. తన సాంకేతిక జ్ఞానాన్ని వినియోగించి ఏవిధంగా సేవల నందించగలనా...అన్నదానిపై ఆయన దృష్టికేంద్రీకృతమై ఉంది. కాబట్టి ఆయనకూడా ఆందోళన రాజకీయాలలో అడుగు పెట్టలేదు.

మదనమోహన మాలవ్యా 59సం.ల వయస్సులో ఉన్నాడు. అప్పటికీ వారణాశిలోని హిందూకళాశాల బాధ్యతలు స్వీకరించి దానిని విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దటంలో నిమగ్నమై యున్నాడు. మరొక ముఖ్యమైన వయోవృద్ధనేత సురేంద్రనాథ్ బెనర్జీ 72 సం.ల వాడు. అప్పటికి ఏవో కారణాలతో కాంగ్రెసు కు దూరమైనాడు. ఆతర్వాత సం 1921లో బ్రిటీషు వారు ఆయనను కొలకతా ప్రెసిడెన్సీ ప్రభుత్వంలో మంత్రిని చేశారు.

గాంధీగారి కంటే వయస్సులో పెద్దవారైన ఆంధ్రులు ఇద్దరున్నారు. ఒకరు ఆంధ్ర భీష్మ అని ఖ్యాతిగాంచిన న్యాపతి సుబ్బారావు. ఆయనకు అప్పుడు 63సం.లు. చెన్నపట్నం నివాసం. హిందూ పత్రిక స్థాపనలో ప్రముఖ పాత్ర వహించినవాడు. రాజమండ్రిలో హిందూ సమాజం స్థాపకుడు కూడా. రెండవవారు కొండ వెంకటప్పయ్య. ఆయన 54 సం.ల వాడు. ఈయన 1923లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు ఆహ్వాన సంఘాధ్యక్షునిగా ఉన్నాడు. ఈవిధంగా గాంధీగారికంటే పెద్దలైన వారందరూ వృద్దులుగా భావింపబడినారని అనుకోవచ్చు.

గాంధీగారికి సమవయస్కుడు రైట్ ఆనరబుల్ శ్రీనివాస శాస్త్రి. అప్పటికి ఒక హైస్కూలు ప్రధానోపా ధ్యాయునిగా ఉన్నాడు. (ఆతర్వాత రోజులలో అన్నామలై విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ అయినారు) అప్పటికి రాజకీయాలలో అంత చురుకుగా లేడు. గాంధీగారికంటే వయస్సులో చిన్నవారైనా అసాధారణ ప్రతిభా పాటవాలుకల్గినవారిని మనం తప్పక గమనించవలసి వుంది.

హరిసింగ్ గౌర్ 50సం.ల వాడు. అప్పటికి నాగపూర్ మునిసిపల్ చైర్మన్. ఆ తర్వాత కేంద్ర శాసనసభ ఉపాధ్యక్షుడు. సాగర్ విశ్వవిద్యాలయం స్థాపకుడు. టంగుటూరి ప్రకాశం పంతులు వయస్సు 48సం.లు. అప్పటికి న్యాయవాదవృత్తి. తర్వాత రోజులలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి,1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికీ ముఖ్యమంత్రి.

విఠల్ భాయి పటేల్. 49 సం.లు. బొంబాయిమేయర్.తర్వాతరోజుల్లో కేంద్ర శాసనసభకు సభాపతి. సర్దార్ వల్లభ్ భాయి పటేల్ వయస్సు 45సం.లు. న్యాయవాదవృత్తి. తర్వాతరోజుల్లో గుజరాత్ రైతుల ఆందోళనకు సేనాధిపతి. స్వతంత్ర భారత ప్రభుత్వంలో ఉపప్రధాని.

ముకుందరావ్ జయకర్.47సం.లు. న్యాయవాది. అనీబిసెంట్ తో కలసి పనిచేసినవాడు. తర్వాత రోజుల్లో బొంబాయి శాసనసభ సభ్యుడు.

ఎం.ఎస్ ఆణే. 40సం.లు న్యాయవాది. మధ్య ప్రాంతాల కాంగ్రెస్ ఆధ్యక్షుడు. 1924 నుండి కేంద్ర శాసనసభ సభ్యుడు. 1967 వరకు లోకసభసభ్యుడు.

భోగరాజు పట్టాభి సీతారామయ్య. 40సం.లు. బందరు జాతీయకళాశాల, కృష్ణాపత్రికల నిర్వహణ లో నిమగ్నమై యున్నాడు. అనంతర కాలంలో ఆంధ్రా బ్యాంకు,ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపన. స్వతంత్రంవచ్చినతర్వాత కాంగ్రెసు అధ్యక్షుడు. మధ్యప్రదేశ్ గవర్నరు.

డా౹౹బిధాన్ చంద్ర రాయ్ 38సం.లు అప్పటికి వైద్య కళాశాల అధ్యాపకునిగా ఉన్నాడు. అనంతర కాలంలో కొలకతా శాసనసభ సభ్యుడు. స్వతంత్ర భారతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి.

పింగళి వెంకయ్య 41 సం.లు. ఈయన 1906 నుండి కాంగ్రెస్ సభల్లో పాల్గొంటున్నాడు.1920 నాటికి బందరులోని జాతీయకళాశాల అధ్యాపకుడు.

కే.ఎం మున్షీ 33సం.లు అప్పటికి అనీబిసెంట్ నేతృత్వంలో హోం రూల్ ఉద్యమంలో పాల్గొన్న అనుభవం.1930 ఉప్పుసత్యాగ్రహంలో ప్రముఖ పాత్ర. భారతీయ విద్యాభవన్ స్థాపనలో,సోమనాథ ఆలయ పునర్నిర్మాణంలో ప్రముఖ పాత్ర.

జె.బి కృపలానీ 32సం.లు. కాశీ హిందూ విశ్వ విద్యాలయం లో ఆచార్యుడు. అనంతర కాలంలో ఒక దశాబదంపాటు కాంగ్రెస్ కార్యదర్శి. 1977లో జనతాపార్టీ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర.

సత్యమూర్తి. 33సం.లు.1906 నుండి కాంగ్రెస్ కార్య కలాపాల్లో వాలెంటీర్ తర్వాతరోజుల్లో మద్రాసు మేయర్. గొప్పవక్తగా పేరుపొందినవాడు.

కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు. 44సం.లు. ఆంధ్ర పత్రిక సంపాదకత్వం.

శ్రీమతి సరోజినీ నాయుడు 41సం. విఖ్యాత కవయిత్రి. 1925లో కాంగ్రెస్ అధ్యక్షపీఠ మధిష్ఠించింది. స్వాతంత్ర్యానంతరం ఉత్తరప్రదేశ గవర్నర్.

డా౹౹అన్సారీ 40సం.లు. 1918లో ముస్లిం లీగ్ వార్షిక మహాసభ అధ్యక్షుడు. అనంతర కాలంలో 1927 లో కాంగ్రెస్ అధ్యక్షుడైనాడు.

అనంతశయనం అయ్యంగార్ 29సం.లు. హోంరూల్ ఉద్యమంలో చురుకైన పాత్ర. 1934 నుండి కేంద్ర శాసనసభ సభ్యుడు. స్వాతంత్ర్యానంతరం లోకసభకు ఉపసభాపతి, సభాపతి బాధ్యతలు నిర్వహించారు.

డా౹౹కేశవ బలిరాం హెడ్గేవార్. 31సం.లు. నాగపూర్ కాంగ్రెసు సభల నిర్వహణలో చురుకైన పాత్ర. 1921 లో కారాగారవాసం. విచారణ సందర్భంగా దేశాలు స్వతంత్రంగా ఎందుకుండాలో, ప్రజలుఎలా వ్యవహరించాలో వివరిస్తూ అనర్గళంగా ఉపన్యసించిన మేధావి.1925లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపన.

ఈడ్పుగంటి రాఘవేంద్రరావు 31సం.లు. బిలాసపూర్ పురపాలక సంఘాధ్యక్షుడు. అనంతరకాలంలో మధ్యప్రాంతాల ముఖ్యమంత్రి. గాంధీటోపీధరించిన గవర్నరుగా విఖ్యాతుడు.

శ్రీ ప్రకాశ. 30సం.లు. కాశీ విశ్వవిద్యాలయం అధ్యాపకుడు. అనంతరకాలంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర గవర్నర్.
సురవరం ప్రతాపరెడ్డి 24 సం.లు. న్యాయవాది. గోల్కొండపత్రిక సంపాదకుడు.

జయప్రకాశ నారాయణ్ 18సం.లు 1920 నాటికే వివాహమైంది. ఇతని భార్య ప్రభావతికూడా గాంధీగారి శిష్యురాలే. జయప్రకాశ్ ఉన్నతవిద్యకై అమెరికావెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు.

డా౹౹రామ మనోహర్ లోహియా 10 సం.లవాడు. అప్పటికే గాంధీగారిని దర్శించాడు 1923లో గయలో జరిగిన కాంగ్రెసు సభల్లో వాలెంటీరుగా పనిచేశాడు. స్వాతంత్ర్యానంతరం సోషలిస్టుపార్టీ నాయకునిగా, లోకసభలో ప్రముఖ పాత్రవహించాడు.

జవహరలాల్ నెహ్రూ 31 సం.లు. న్యాయవాదపట్టా పొందాడు. స్వాతంత్ర్యానంతరం తొలి ప్రధాని.

హైదరాబాద్ నిజాం వ్యతిరేకపోరాటంలో ప్రముఖ పాత్రవహించిన వందేమాతరం రామచంద్రరావు మూడేళ్ళ వాడు.

గోవా విముక్తి ఉద్యమంలో ప్రముఖ పాత్రవహించిన జగన్నాథరావు జోషీ 1920 లోనే జన్మించాడు.

చిత్తరంజన్ దాస్ 1920 నాటికి 50 సం.ల వయస్సువాడు. కొలకతాలో న్యాయవాది. అప్పటికి కొన్ని సం.లుగా కాంగ్రెస్ కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. 1917 కాంగ్రెసు మహాసభలకు అనీబిసెంట్ అధ్యక్షత వహించాలని పట్టుబట్టి రప్పించినవాడు ఈయనే. ఉత్తరోత్తరా జాదవ్ పూర్ విశ్వవిద్యాలయంగా ప్రసిద్దిలోకి వచ్చిన విద్యాసంస్థ స్థాపకుడు. సుభాస్ చంద్రబోస్ రాజకీయగురువు.

శ్రీపాద దామోదర సాత్వలేకర్ 53సం.ల వయస్సు. 1914 నుండి కాంగ్రెస్ మహాసభల్లో భాగస్వామి. లాహోర్ నుండివైదిక ధర్మ అనే మాసపత్రిక నడుపుతుండేవాడు. మంచి చిత్రకారుడు. కొంత కాలం పిఠాపురంలో, భాగ్యనగర్లో గడిపిన వాడు. ఔంధ్ సంస్థానానికి దివాన్ గా పని చేశాడు. 101 సం.లు జీవించి వేదమూర్తిగా ఖ్యాతి గాంచిన వ్యక్తి.

మోచర్ల రామచంద్రరావు 52 సం.ల వయస్సు. చెన్న పట్నంలో న్యాపతి సుబ్బారావువద్ద జూనియర్ గా పని చేసి ఏలూరులో స్థిరపడ్డాడు ఆంధ్ర గోఖలేగా ప్రసిద్ధుడు. తర్వాత కాలంలో కేంద్ర శాసనసభ సభ్యుడు.

సి.పి రామస్వామి అయ్యర్ 41 సంల వయస్సు. మద్రాసు అడ్వొకేట్ జనరల్ గా ఉండేవాడు. అంతకు ముందుకాలంలో మద్రాసు ప్రెసిడెన్సీ కౌన్సిల్ సభ్యుడు. తర్వాతకాలంలో తిరువాన్కూరు-కొచ్చిన్ దివాన్ గా పనిచేస్తూ హరిజనులకు దేవాలయప్రవేశం కల్పించిన ధీశాలి.

పి. వి.కాణే 40 సం.ల వయస్సు. సంస్కృత పండితుడు, న్యాయవాది. 'ధర్మశాస్త్రముల చరిత్ర' గ్రంథాన్ని ఆంగ్లంలో రచించాడు.

గాడిచర్ల హరిసర్వోత్తమరావు. 37 సం.ల వయస్సు.స్వరాజ్య పత్రిక సంపాదకునిగా ఉన్నాడు. హోం రూల్ లీగ్, ఆంధ్రప్రాంత కార్యదర్శి. గ్రంథాలయోద్యమ పితామహునిగా ప్రసిద్ధుడు.

వినాయక దామోదర సావర్కర్ 37 సం.ల వయస్సు. అంతకు ముందు లండన్ లో ఉండగా సాయుధ విప్లవ వీరులకు శిక్షణ ఇచ్చి 50సం. ల కఠిన కారాగార- ద్వీపాంతరవాస శిక్షను అండమాన లోని సెల్యులర్ జైలులో గడుపుతున్నాడు.1925లో అనేక షరతులతో రత్నగిరికి తరలించారు.1937లో కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడినపుడు ఆ నిర్బంధాలు సడలించారు. హిందూమహాసభ ద్వారా జన చైతన్యం సాధించేందుకు కృషిచేశాడు. కవి, రచయిత. హిందూ దేశచరిత్రలో ఆరుస్వర్ణ పత్రములు, అండమాన్ లో ఆజన్మాంతం, హిందూ పద పాదుషాహి, హిందుత్వ ముఖ్య రచనలు.

బాబూ రాజేంద్రప్రసాద్.36సం.ల వయస్సు. 1906 నుండి కాంగ్రెసు లో చురుకుగా ఉన్నాడు. న్యాయవాది. పాట్నా నివాసం. అనంతర కాలంలో కాంగ్రెసు అధ్యక్షుడు. రాజ్యాంగ సభ అధ్యక్షుడు. స్వతంత్ర భారతదేశ తొలి రాష్ట్రపతి. రాష్ట్రపతిగా రెండుసార్లు ఎన్నికైన ఏకైక వ్యక్తి.

మహర్షి బులుసు సాంబమూర్తి. 34సం.ల వయస్సు. కాకినాడలో ప్లీడరు. 1923 కాకినాడ కాంగ్రెస్ మహాసభలకు కార్యదర్శి. స్వాతంత్ర్యం వచ్చేవరకు చొక్కా తొడగని భీష్ముడు.1952 లో మద్రాసు శాసన సభకు ప్రజాపార్టీ అభ్యర్థిగా ఎన్నికైన సర్వస్వం త్యజించిన త్యాగమూర్తి.

డా౹౹భీమరావ్ రాంజీరావ్ అంబేడ్కర్ 29 సం.ల వాడు. అప్పటికి విదేశాల్లో విద్యనభ్యసిస్తున్నాడు. తిరిగివచ్చిన తర్వాత మూకనాయక్, బహిష్కృత భారత్ పత్రికలు నడిపి షెడ్యూల్డ కులాల హక్కులకై ఆందోళన నడిపించాడు. స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని రూపొందించటంలో ప్రముఖపాత్ర వహించాడు. అన్ని ఆందోళనలనూ అహింసాత్మకంగానే నడిపిన వ్యూహనిపుణుడు.

సి.వై. చింతామణి 40 సం.వయస్సు. ఈయనది పత్రికారంగం. విజయనగరంలో ఉండేవాడు.

హెచ్ ఎన్. కుంజ్రూ. 33సం.ల వయస్సు. బొంబాయి నివాసి. గాంధీటోపీ ధరించి న్యాయస్థానంలో వాదన వినిపించేవాడు. రాజ్యాంగ సభలో, రాజ్యసభలో సభ్యుడు.

జమ్నాలాల్ బజాజ్. 32సం.వయస్సు.1920లో నాగపూర్ లో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు ఆహ్వాన సంఘాధ్యక్షుడు. గాంధీజీకి ఆర్థికంగా సహకరించిన వ్యక్తి.

సుభాసచంద్రబోస్ 23సం.ల వాడు. అప్పటికి విద్యార్థిగా ఉన్నాడు. ఐ సి ఎస్ కి రాజీనామా చేసిన స్వాభిమాని. గాంధీజీ ని ఎదిరించి కాంగ్రెసు అధ్యక్షునిగా గెలిచి నేతాజీగా ప్రజాహృదయాలను చూరగొన్నవ్యక్తి. అజాద్ హింద్ ప్రవాస ప్రభుత్వంలో ప్రధానమంత్రి. జైహింద్ మంత్ర ప్రదాత.

హరికృష్ణజోషి 23 సం.ల వాడు వర్ధా నగర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి. అమృతసర్ కాంగ్రెసు సభల్లో పాల్గొనిన అనుభవం. తర్వాత జమ్నాలాల్ బజాజ్ కుడిభుజంగా ఉంటూ అన్నికార్యకలాపాలలో వర్ధా జిల్లాను అగ్రగామిగా నిలిపిన సంఘటనా చతురుడు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సర్ కార్యవాహగా పనిచేసిన నిలకడకల్గిన కార్యకర్త.

వినోబా భావే కి 25 సం.ల వయస్సు. 1916 నుండి గాంధీగారి అంతేవాసి. స్వతంత్ర భారతంలో సర్వోదయ ఉద్యమంలో, భూదానోద్యమంలో ప్రధాన పాత్ర. భగవద్గీతకు వ్యాఖ్యానం రచించారు.

డా౹౹శ్యామా ప్రసాద్ ముఖర్జీ 19 సం.వయస్సు . 1929 లో శాసన సభ్యుడు,1934లో కొలకతా విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్. 1943 లో హిందూ మహాసభ అధ్యక్షుడు. స్వతంత్ర భారత దేశపు తొలిమంత్రివర్గంలో పరిశ్రమల మంత్రి. భారతీయ జనసంఘ్ స్థాపకుడు. లయన్ ఆఫ్ పార్లమెంట్ అని ఖ్యాతిగాంచిన ప్రతిపక్ష నాయకుడు.

లాల్ బహాదుర్ శాస్త్రి వయస్సు16 సం.లు.చాలాకాలం కాంగ్రెస్ కార్యదర్శి. నెహ్రూ అనంతరం ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నిక. 1962 లో చైనా దండయాత్ర పరాభవంతో కుములుతున్న భారతీయులకు 1965లో పాకిస్తాన్ తో సంభవించిన యుద్ధంలో విజయం సాధించి చూపిన గట్టిమనిషి.

దుర్గాబాయి దేశ్ ముఖ్ వయస్సు 11 సం.లు. అప్పటికి బాలవితంతువు. 1923 కాకినాడ కాంగ్రెస్ మహాసభలకు వాలెంటీరుగా పనిచేసింది. రాజ్యాంగ సభ సభ్యరాలు. 1953లో చింతామణి దేశముఖ్ తో వివాహం. సోషల్ వెల్ఫేర్ బోర్డ్ అధ్యక్షురాలిగా పనిచేసింది. చెన్నపట్నం, హైదరాబాదులలోని ఆంధ్రమహిళాసభ స్థాపకురాలు.

జె.సి.కుమారప్ప 28 సం.అప్పటికి లండన్ లో ఉద్యోగం చేస్తుండేవాడు.1929 ల గాంధీజీకి చేరువై గుజరాత్ విద్యాపీఠ అధ్యాపకునిగా, యంగ్ ఇండియా పత్రిక సంపాదకునిగా పనిచేశాడు. గాంధీ ఆర్థిక సిద్ధాంతాలకు భాష్యకారుడు. గ్రామోద్యోగ్ పత్రిక నడిపినాడు.

ఇలా మనం ఒక విహంగవీక్షణం చేసినపుడు 1920 సంవత్సరం ఎంతమంది జీవితాలలో కీలకపాత్ర వహించిందో, మన దేశచరిత్రను ఎటువంటి మలుపులు త్రిప్పిందో అవగతమౌతుంది. మొదట్లో చెప్పినవిధంగా దేశస్వాతంత్ర్యసాధనలో కవుల, కళాకారుల పాత్ర కూడా ఎంతో ఉంది. గురుదేవుడు రవీంద్రనాథటాగూరు, రాయప్రోలుసుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, వేదుల సత్యనారాయణ శాస్త్రి వంటివారు గొంతెత్తి పౌరుషాన్ని నూరిపోస్తున్న సమయమది. వంద సంవత్సరాల తర్వాత కూడా ఆ స్మృతులనుండి మనం ప్రేరణ పొందగలము.

హిందూ దేశం స్వాతంత్ర్యం సాధించటం వెనుక ఇలా ఎందరో త్యాగమూర్తులకృషి ఉంది. కొంచెం లోతుగా పరిశీలిస్తే గాంధీ, నెహ్రూలను మినహాయించి ఎవరూకూడా మనం ఈరోజు సెక్యులరిజం పేరున ఎటువంటి మాటలు వింటున్నామో అటువంటి ఆలోచనలు కలిగినవారు కారు. అందరూ భారతమాత పునర్వైభవాన్ని కాంక్షించి తమ జీవితాలను చందనంగా సమర్పించినవారే. దివికేగిన మన దేశ భక్తుల అడుగు జాడలే అనుసరింపవలెనోయీ... శ్రీ వడ్డి విజయసారధి.

జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:
ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments